శనివారం 06 జూన్ 2020
Sunday - May 24, 2020 , 00:04:42

కుట్టి ఇస్తిరి.. మోదుగ విస్తరి!

కుట్టి ఇస్తిరి..  మోదుగ విస్తరి!

జీవన విధానం మారింది. సహపంక్తి భోజనాలు కరువయ్యాయి. ఇప్పుడు ఆకుల్లో తింటే నామోషీ. ఆరోగ్యం సంగతి అటుంచితే.. అడవికెళ్లేదెవరు? విస్తరి కుట్టేదెవరు? ఈ గజిబిజి జీవితంలో  సులభంగా పనులు పూర్తవ్వాలంతే! ఇలాంటి సమయంలో మీ ఇంట్లో ఏ కార్యామున్నా.. మేం అడవి నుంచి ఆకులు తెచ్చి, విస్తర్లు కుట్టిస్తాం అంటున్నారు ఆదివాసీ మహిళలు.  

పూజరి సత్తెక్క, పల్ల శ్రీలత ఆదివాసీలు. అందరిలాగే కూలీకెళ్లి జీవనం సాగించేవారు. పొదుపు సంఘాల ద్వారా చిన్న పరిశ్రమల స్థాపనకు అవసరమైన శిక్షణ లభిస్తుందని తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్డీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌)లో విస్తరాకుల తయారీలో శిక్షణ పొందారు. పొదుపు సంఘంలో రుణం తీసుకొని యంత్రాలు కొనుగోలు చేశారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల 

కేంద్రంలో ‘ఆదివాసీ మోదుగాకు పరిశ్రమ’ను ప్రారంభించారు. పేపర్‌ ప్లేట్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అదే సమయంలో విపరీతమైన పోటీ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆకులతో చేసిన విస్తర్లు ఎవరు కొంటారు? శ్రీలత, సత్తెక్క  ధైర్యంచేసి పరిశ్రమనైతే ప్రారంభించారు కానీ, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలియలేదు. చుట్టుపక్కల కిరాణా దుకాణాల్లో తాము తయారు చేస్తున్న మోదుగాకు విస్తర్ల గురించి చెప్పారు. అయినా ఫలితం శూన్యం. అప్పుడే శ్రీలతకు సామాజిక మాధ్యమాల  గురించి తెలిసింది. సోషల్‌ మీడియాలో మోదుగాకు ప్రయోజనాలు, తమ విస్తరాకుల ప్రత్యేకతలు, ధర, నాణ్యత.. తదితర వివరాలు పోస్ట్‌ చేసింది. దీంతో ఆ ఆదివాసీ స్టార్టప్‌ గురించి ప్రపంచానికి తెలిసింది.  గిరాకీ కూడా పెరిగింది.

ఆకులు సేకరిస్తారిలా..

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దయ్య దేవుడి గుడి ప్రాంతంలో దట్టమైన అడవి ఉంది. పదిమంది కూలీలతో కలిసి మోదుగాకు పరిశ్రమ నిర్వాహకులు ఇక్కడికి వెళ్తారు. పొద్దంతా ఆకులు సేకరిస్తారు. ట్రాలీలో ఆ ముడిసరుకును పరిశ్రమకు తరలిస్తారు. ఇలా రెండు నెలలకోసారి వెళ్తుంటారు. ఆదివాసీల దైవమైన పెద్దయ్య దేవుడి గుడి వద్ద ప్రతి ఆదివారం, గురువారం జాతర జరుగుతుంది. వివిధ ప్రాంతాల గిరిజనులు ఆవరణలోనే వంటలు చేసుకొని తింటారు. ఇక్కడ ప్లాస్టిక్‌ నిషేధం అమలులో ఉంది. దీంతో మోదుగాకులతో చేసిన విస్తర్లనే ఎక్కువగా వాడుతుంటారు. ఆ సమయాల్లో  ఆదివాసీ పరిశ్రమ నిర్వాహకులు విస్తర్లు విక్రయిస్తుంటారు. దీంతో రోజువారీ ఖర్చులకు నాలుగురాళ్లు సమకూరతాయి. 

దారంతో కుట్టి...

సాధారణంగా విస్తర్లు చీపురు పుల్లలతో కుడుతుంటారు. కానీ వీళ్లు మాత్రం కుట్టుమిషన్లపై దారంతో కుడతారు. కింద  పేపర్‌, పైన ఆకు ఉంటాయి. దీంతో సాధారణ విస్తరి కంటే మందంగా ఉంటుంది. సహపంక్తి భోజనాలకూ, బఫేలలోనూ హాయిగా వాడుకోవచ్చు. ఒక్కో విస్తరి ధర నాలుగు రూపాయలు. మోదుగాకుతోనే కాకుండా తునికి, బాదాం, రాగి, అడ్డాకు, పారటాకులతో కూడా తయారు చేస్తుంటారు. చిన్నచిన్న ప్లేట్లు, దొప్పలు సైతం రూపొందిస్తారు. 

తయారీ ఇలా..

అడవి నుంచి ఆకులు తెచ్చాక వాటిపై నీళ్లు చల్లుతారు. ఒకదగ్గర కుప్పగా పోసి బరువు పెడతారు.  రెండ్రోజుల తర్వాత పూర్తిగా అణిగిపోతాయి. ఆ తర్వాత అట్టను కత్తిరించి  దానిపై మోదుగు, ఇతర ఆకులు వేసి కుడతారు. ఆ తర్వాత మిషన్‌లో పెట్టి అచ్చు వేస్తారు. అప్పుడు అన్ని విస్తరాకులకూ ఒకే ఆకృతి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలోని అన్ని జిల్లాలకూ పంపిణీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో  డబ్బు చెల్లిస్తే విస్తరాకుల్ని ట్రాన్స్‌పోర్ట్‌లో పంపిస్తుంటారు. సమీప ప్రాంతాలకైతే సత్తెక్క, శ్రీలత స్వయంగా వెళ్లి ఇచ్చి వస్తుంటారు. సోషల్‌ మీడియా ద్వారా కూడా ఆర్డర్లు వస్తుంటాయి. మిషన్‌పై విస్తరాకులను కుట్టడం ద్వారా మరో ఆరుగురు ఉపాధి పొందుతున్నారు. 

వివిధ రాష్ర్టాల నుంచి...

ఆదివాసీ మోదుగాకు పరిశ్రమకు వివిధ రాష్ర్టాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఇలాంటి కంపెనీని తామూ ప్రారంభిస్తామని  కేరళ, ఒడిషా, మహారాష్ట్రల నుంచి పలువురు  ఆసక్తి చూపారు. యూనిట్‌ను సందర్శించి ఫొటోలు సైతం తీసుకొని వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సైతం పేపర్‌ ప్లేట్లకు బదులుగా వీరు తయారు చేసిన విస్తరాకులనే ఎక్కువగా వాడుతున్నారు. మరిన్ని నిధులు సమకూరితే వ్యాపారాన్ని విస్తరిస్తామని సత్తెక్క, శ్రీలత చెబుతున్నారు.

ఎన్ని ప్రయోజనాలో...

మోదుగ ఆకుల్లో భోజనం చేస్తే అందులోని జిగురు కడుపులోకి వెళ్లి విరేచనాల నుంచి కాపాడుతుందని  ఆయుర్వేద వైద్యులు చెబుతారు. మోదుగను ఆయుర్వేద ఔషధాల్లో విరివిగా వాడుతుంటారు. ఈ ఆకులో వేడి అన్నం తింటే కడుపులోని ఎలాంటి క్రిమి అయినా చనిపోతుందని చెబుతుంటారు. మోదుగ,  రావి, తునికి ఆకుల్లో భోజనం చేస్తే ఆకలి పెరిగి, ఆరోగ్యం బాగుంటుందని గ్రామీణులు చెబుతున్నారు. ఈ ఆకులు తొందరగా భూమిలో కలిసిపోయి మంచి ఎరువుగా కూడా మారుతాయి. మీకూ మోదుగ, రావి, తునికి, బాదాం, అడ్డాకు, పారటాకు విస్తర్లు కావాలా? అయితే ఆదివాసీ మోదుగాకు పరిశ్రమ నిర్వాహకులకు (నం. 63007 11423).  ఫోన్‌ చేయవచ్చు.          

రుణమిప్పియుండ్రి సారు!

కష్టమో, నష్టమో విస్తరాకుల కంపెనీ పెట్టినం. నడుపుతున్నం. తీసుకున్న అప్పు తీర్చేందుకు నెలనెలా వాయిదాలు కడుతున్నం. లాక్‌డౌన్‌తోటి బాగా నష్టపోయినం. ఎక్కడి పని అక్కడ్నే ఆగిపోయింది. మాకు మరింత రుణం కావాలె. మా పరిశ్రమను పెంచుదాం అనుకుంటున్నాం. మరింత మందిని పెట్టుకొని, మిషన్లు కొనడానికి లోన్‌ ఇయ్యాలె. మేం తయారు చేసిన విస్తర్లను మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు వాహనం లేక ఇబ్బందవుతున్నది. ఎక్కువ మొత్తం వాహనానికే కిరాయి కట్టాల్సి వస్తున్నది. ఎస్టీ కార్పొరేషన్‌ కింద లోన్‌ ఇప్పిస్తే మరికొంత మందికి ఉపాధినిస్తం.

- సత్తెక్క, శ్రీలత

నిర్వాహకులు, ఆదివాసీ మోదుగాకు పరిశ్రమ  


logo