శనివారం 06 జూన్ 2020
Sunday - May 23, 2020 , 23:56:05

నమ్మదగ్గ కస్టమర్‌

నమ్మదగ్గ కస్టమర్‌

బాండ్‌ స్ట్రీట్‌లోని డిటెక్టివ్‌ మిస్‌ డాఫ్నీ ఆఫీస్‌కి వెళ్ళిన సర్‌ జాన్‌ కోల్‌స్టన్‌ ఆమెని చూసి కొద్దిగా నివ్వెరపోయాడు. ఆమె వయసు పద్దెనిమిది. ఆకర్షణీయంగా ఉన్న ఆమె తన చేతిలోని సిగరెట్‌ పీకతో ఇంకోటి అంటించుకుని అడిగింది.

“సర్‌ జాన్‌! మీకేం సహాయం చేయగలను?”

లండన్‌లోని అతి పెద్ద బ్యాంకుల్లో ఓ దాని చైర్మన్‌ అయిన సర్‌ జాన్‌ చెప్పాడు.

“నిజంగా మిస్‌ డాఫ్నీ మీరేనా?”

“నేను ఇంత చిన్నదాన్ని అవడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించచ్చు. బహుశ మీరింకా పాత కాలంలోనే జీవిస్తున్నారు. మీరు ఏవో ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. లేకపోతే ఇక్కడికి వచ్చేవారు కాదు. మీకు డిటెక్టివ్‌గా నా సహాయం కావాలనుకుంటే నా చిన్న వయసుని, నేను ఆడపిల్లనని మర్చిపోవడం మంచిది. ఈ విషయంలో మీరే మొదటి వ్యక్తి కాదు. టీనేజ్‌ ఆడపిల్లగా ఉండటం ఒక్కోసారి నా వృత్తిలో ఇబ్బందిగా ఉంటుంది.”

అతని మొహంలోని అయిష్టత, సందేహం 

మాయమయ్యాయి.

“ఐ యాం సారీ మిస్‌ డాఫ్నీ. మీరింత చిన్న వారని ఊహించలేదు కాబట్టి ఆశ్చర్యపోయాను.”

“సరే. మీరు యూనివర్సల్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ లంబార్డ్‌ స్ట్రీట్‌ చెయిర్‌మన్‌ కదా?”

“అవును. మాకో క్లయింట్‌ ఉన్నాడు. పేరు రిచర్డ్‌ గార్లెస్టన్‌.”

“ప్రింటరా?”

“నన్నిక్కడికి పంపిన మిత్రుడు చెప్పింది నిజమౌతున్నది.” ఆయన మెచ్చుకోలుగా చెప్పాడు.

“నాకు పేర్లు, వారి వృత్తులు ఓ సారి తెలిస్తే అస్సలు మర్చిపోను.”

“గత మూడేళ్ళుగా అతను మా బ్యాంక్‌ క్లయింట్‌. అతనికి తండ్రి ద్వారా యాభైవేల పౌన్లు సంక్రమించాయి. ఆ డబ్బుని మా బ్యాంక్‌లోనే దాస్తున్నాడు. ఈ వారం దాకా అతను నమ్మదగ్గ క్లయింట్‌. అతను తన ఎకౌంట్లోంచి పెద్ద మొత్తాల్లో డబ్బుని డ్రా చేసి, తిరిగి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డిపాజిట్‌ చేస్తుంటాడు. తను జూదరి అని ఎకౌంట్‌ తెరిచినప్పుడే చెప్పాడు. అనేకసార్లు అతను ఐదు వేలు, పది వేల పౌన్ల నోట్లని డిపాజిట్‌ చేసాడు. పది రోజుల క్రితం అతను బ్యాంక్‌లోని నా ప్రయివేట్‌ గదిలోకి ఎప్పటిలానే వచ్చాడు. కొత్తగా గేదె కొమ్ముతో చేసిన ఫ్రేమ్‌ గల కళ్ళజోడుని పెట్టుకున్నాడు. అంతకు మునుపు ఎన్నడూ కళ్ళజోడు పెట్టుకోకపోవడంతో నేను దాని గురించి అడిగితే, చూపు సమస్య వచ్చిందని చెప్పాడు.”

“కళ్ళ డాక్టర్‌ పేరు చెప్పాడా?”

“చెప్పాడు. జేమ్స్‌ ఎడ్వింటర్‌, క్వీన్‌ ఏన్‌ స్ట్రీట్‌.”

డాఫ్నీ నోట్‌ పేడ్‌లో అది రాసుకున్న సర్‌ జాన్‌ మళ్ళీ కొనసాగించాడు.

“అతను పాతిక వేల పౌన్లకి చెక్‌ రాస్తే వెయ్యి పౌన్ల నోట్లతో ఆ డబ్బు చెల్లించాం. ఆశ్చర్యంగా రెండు రోజుల తర్వాత అతను మళ్ళీ బ్యాంక్‌కి వచ్చి పదిహేను వేల పౌన్లకి చెక్‌ ఇచ్చాడు. అతని ఎకౌంట్లో అంత డబ్బు లేదని, రెండు రోజుల క్రితమే పాతిక వేలు డ్రా చేశారని క్యాషియర్‌ అతనితో చెప్పాడు. రిచర్డ్‌ కోపంగా తను రెండు రోజుల క్రితం బ్యాంక్‌కి రాలేదని, గత పదిహేను రోజులుగా ఊళ్ళో లేనే లేనని, దాన్ని ఋజువు చేయగలనని చెప్పాడు. ఎవరో తనలా వచ్చి నటించి దాన్ని తీసుకెళ్ళి ఉంటారని చెప్పాడు. ఈ ఉదయం అతని లాయర్నించి మాకు లీగల్‌ నోటీస్‌ వచ్చింది.”

“సంతకం? ఆ చెక్‌ మీది సంతకం రిచర్డ్‌ సంతకమే ఐతే ఇబ్బందేమిటి?”

“సమస్య అదే. ఇది అతను ఎప్పుడూ చేసే సంతకం. ఇది పేచీ వచ్చిన చెక్‌ మీది సంతకం.” రెండు చెక్కులు ఇచ్చి చెప్పాడు.

“ఈ చెక్‌ని మీరు ఎలా పాస్‌ చేసారు? ఈ రెంటి మధ్యా చాలా తేడా ఉందిగా?” డాఫ్నీ ఆ రెంటినీ పరిశీలించాక అడిగింది.

“అతను పాత క్లయింట్‌. అతను నా ముందు కూర్చుని చెక్‌ రాస్తే క్యాషియర్‌కి పంపుతాను. క్యాషియర్‌కి కూడా అతను బాగా తెలుసు. చెక్‌ రాయడం అతను, నేను చూసాం కాబట్టి అభ్యంతరం చెప్పకుండా నగదు చెల్లించాం.”

“మరి చట్టం ఇందుకు ఒప్పుకుంటుందా?”

“ఒప్పుకోదు.”

“ఇది చెప్పండి. అతను మీకు పాతిక వేల పౌన్ల చెక్‌ని ఇచ్చినప్పుడు అతను రిచర్డ్‌ కాదనే అనుమానం మీకు కొద్దిగా ఐనా కలిగిందా?”

“లేదు.”

“రెండు రోజుల తర్వాత మళ్ళీ అతను వచ్చినప్పుడు కళ్ళజోడుందా?”

“లేదు. తను జీవితంలో ఎన్నడూ కళ్ళజోడు పెట్టుకోలేదన్నాడు. డాక్టర్‌ ఎడ్వింటర్‌ పేరే ఎన్నడూ వినలేదన్నాడు.”

“అతను నిజం చెప్తున్నాడని అనిపించిందా?”

“అనిపించింది. అతను నిజంగానే అప్‌డేట్‌ అయినట్లు కనిపించాడు. తనని పోలిన మరో వ్యక్తి ఉన్నాడని తనకి తెలుసని, కాని ఎన్నడూ చూడలేదని, చెక్‌లోని సంతకంలో తేడాని గమనించి మేం దాన్ని పాస్‌ చేయకుండా ఉండాల్సిందని చెప్పాడు.”

“తను లండన్‌లో రెండు వారాలు లేడన్నారని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాడు?”

“ది గోల్డెన్‌ క్రౌన్‌, పోర్ట్‌వర్త్‌, టేవిస్‌టాక్‌లకి ట్రౌట్‌ ఫిషింగ్‌కి వెళ్ళానని చెప్పాడు. మా స్థానిక బ్రాంచ్‌ల ద్వారా విచారిస్తే అతను చెప్పిన సమయంలో అక్కడే ఉన్నాడని తెలిసింది.”

“సరే సర్‌ జాన్‌. వారంలో నేను మీకు రిపోర్ట్‌ ఇస్తాను. ఈ లోగా ఎవరికీ నన్ను సంప్రదించినట్లు చెప్పకండి.”

“అతని లాయర్‌కి ఏం చెప్పాలి?”

“మీరు ఆ పాతిక వేలు అతనికి ఇవ్వాల్సిన పని లేదని చెప్పండి” ఆమె గలగల నవ్వి చెప్పింది.

“ముత్యాలహారం దొంగని మీరు తెలివిగా కనుక్కున్నారని డచెస్‌ చెప్పింది. బ్యాంక్‌ దొంగని కూడా కనుక్కుంటారని ఆశిస్తాను” చెప్పి సర్‌ జాన్‌ లేచాడు.

డాఫ్నీ తన అసిస్టెంట్‌ రేటీని పిలిచి ఆ కేస్‌ గురించి వివరించింది.

“ఇది జాగ్రత్తగా వేసిన పథకం. రిచర్డ్‌ని పోలిన వ్యక్తి ఉన్నాడో, లేడో మనకి తెలీదు. ఆ సంతకం వేరే వ్యక్తి చేసాడా? లేక రిచర్డే తన సంతకాన్ని ఫోర్జరీ చేసాడా? ఏది ఏమైనా ఎవరొచ్చారన్నది కాదు. చివరకి కోర్ట్‌లో సంతకంలో తేడా ఉందా, లేదా అన్నదే ముఖ్యమవుతుంది. అప్పుడు బ్యాంక్‌ నష్టపోవాల్సి ఉంటుంది. వచ్చింది రిచర్డే అని ఋజువు చేయడం కష్టం. నువ్వు కళ్ళ డాక్టర్‌ ఎడ్వింటర్‌ దగ్గరకి వెళ్ళి ఆ దొంగ గురించి వాకబు చెయ్యి. రిచర్డ్‌ని పోలిన రోగిని అతను పరీక్షించాడా అని తెలుసుకుని రా.”

రేటీ గంటన్నర తర్వాత ఫోన్‌ చేసిచెప్పాడు.

“ఎడ్వింటర్‌ దగ్గరకి వచ్చిన ఆ రోగి పేరు జాన్‌ ఎల్విస్‌. ఎడ్రస్‌ 124 అన్విన్‌ స్ట్రీట్‌, బ్లూమ్స్‌బరీ. ఆ వీధిలో జాన్‌ ఎల్విస్‌ గత ఏడాదిగా ఓ సింగిల్‌ బెడ్‌ రూం అపార్ట్‌మెంట్‌లో అద్దెకి ఉంటున్నాడు. ఇంటావిడ చెప్పిన ప్రకారం అతనికి ఏం ఉద్యోగం లేదు. వారంలో ఒకటి రెండుసార్లు వచ్చి రాత్రిళ్ళు పడుకుని వెళ్తుంటాడు. ఫోర్జరీ జరిగిన రోజు అతను మధ్యాహ్నం రెండుంపావుకి వచ్చి, ఐదు నిమిషాలు ఉండి, బ్యాంక్‌కి డబ్బు డ్రా చెయ్యడానికి వెళ్తున్నానని చెప్పి, ట్యాక్సీ ఎక్కి వెళ్ళాడు. మళ్ళీ రాలేదు.”

“సరే. పోర్ట్‌వర్త్‌కి వెళ్ళి గోల్డెన్‌ క్రౌన్‌లో రిచర్డ్‌ నిజంగా బస చేసాడా అని విచారించు. అది టావిస్‌టాక్‌కి రెండు మైళ్ళ దూరంలో ఉంది.”

విచారించాక రేటీ ఆమెని కలిసి చెప్పాడు.

“ప్రతీ రోజు ఉదయం ఎనిమిదికి రిచర్డ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, టేకెవే లంచ్‌ తీసుకుని వెళ్ళి, రాత్రి పదికి తిరిగి వచ్చేవాడు. ఈ ఫోర్జరీ జరిగిన రోజు ఫిషింగ్‌కి వెళ్తున్నానని చెప్పాడు. అతనితో పాటు ఫిషింగ్‌కి వెళ్ళిన మరో వ్యక్తి రైల్వే టి.సి. ఆ రోజు తను రిచర్డ్‌ని ఉదయం తొమ్మిది పదకొండుకి లండన్‌ వెళ్ళే రైలెక్కడం చూసానని చెప్పాడు. ఆ రోజు లండన్‌కి ఒకే రిటర్న్‌ టిక్కెట్‌ అమ్ముడైంది. ఆ రాత్రి ఎప్పటి లానే రిచర్డ్‌ గోల్డెన్‌ క్రౌన్‌కి తిరిగి వచ్చాడు.”

“ఆ రోజే ఇది జరిగిందని అతను ఎలా గుర్తు పెట్టుకోగలిగాడు?” డాఫ్నీ అడిగింది.

“ఆ రోజంతా సూర్యుడు ఉన్నాడు. ఆ రోజు చేపలు పట్టిన వాళ్ళంతా చాలా చేపల్ని పట్టారు. రిచర్డ్‌ మాత్రం ఉత్త చేతులతో వచ్చాడు. కాబట్టి అందరికీ గుర్తుంది. రైళ్ళ రాకపోకల గురించి కూడా విచారించాను. ఉదయం తొమ్మిదీ పదకొండు రైలు ఒకటీ యాభై ఆరుకి లండన్‌కి చేరుతుంది. అక్కడ నించి ట్యాక్సీలో రెండుంపావుకి బ్లూమ్స్‌బరీకి చేరుకుని, బ్యాంక్‌కి రెండున్నరకి చేరుకోగలడు. పాతిక వేలు గల్లంతయింది ఆ సమయమే. మళ్ళీ మధ్యాహ్నం మూడు పదహారు నిమిషాలకు రైలెక్కితే టావిస్‌టాక్‌కి ఎనిమిదీ నలభై ఒకటికి చేరతాడు.”

“అతను ఎక్కిన ట్యాక్సీ?”

“ఆ డ్రైవర్ని పట్టుకున్నాను. సన్నగా, పొడుగ్గా గేదె కొమ్ము ఫ్రేమ్‌ ఉన్న కళ్ళజోడు ధరించిన వ్యక్తిని ముందు అన్విన్‌ స్ట్రీట్‌కి తీసుకెళ్ళి కొద్ది నిమిషాలు వేచి ఉన్నానని, తర్వాత బ్యాంక్‌ దగ్గర దింపానని చెప్పాడు.”

“సర్కమ్టేన్షియల్‌ ఎవిడెన్స్‌ కాబట్టి ఇది జ్యూరీ సభ్యుల ముందు నిలబడదు. ఐతే జాన్‌ ఎల్విస్‌ అనే వ్యక్తే అసలు లోకంలో లేడన్న సంగతి కోర్ట్‌లో ఋజువు చేయడం కష్టం. ఆ ట్యాక్సీ ఎక్కిన ప్రయాణికుడు జాన్‌ కాదని, టావిస్‌టాక్‌ నించి వచ్చిన రిచర్డ్‌ అని ఎలా ఋజువు చేయగలం? ఆ రైల్లో జాన్‌ ఎల్విస్‌ వచ్చాడని రిచర్డ్‌ లాయర్‌ వాదిస్తాడు. టి.సి. సాక్ష్యం కూడా నిలబడకపోవచ్చు. జాన్‌ని చూసి అతను రిచర్డ్‌ అని పొరబడ్డాడని కూడా వాదిస్తాడు. తనా రోజు టావిస్‌టాక్‌లోనే ఉన్నానని, ఎన్నడూ కళ్ళజోడు ధరించలేదని రిచర్డ్‌ వందమంది సాక్షులని ప్రవేశపెట్టగలడు. పైగా సంతకంలో తేడా ఒకటి. ఇది చాలా తెలివైన మోసం.” 

డాఫ్నీ కొద్దిసేపు ఆలోచించి చెప్పింది.

“నాకో పథకం తట్టింది. దీని గురించి చర్చిద్దాం.”

వెస్టెండ్‌లోని ఓ ఖరీదైన రెస్టారెంట్లో కూర్చుని లంచ్‌ తీసుకునే రిచర్డ్‌కి సంతోషంగా ఉంది. ఓ తెలివైన పథకం ద్వారా పాతిక వేల పౌన్లని సంపాదించగలిగాడు.

వెయిటర్‌కి షాంపేన్‌ని, ఖరీదైన కరోనా సిగార్‌ని తీసుకురమ్మని కోరాడు.

“నేను ఇక్కడ కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా?” బంగారు ఫ్రేమ్‌ గల కళ్ళజోడు ధరించి చూడటానికి గౌరవనీయుడిలా ఉన్న ఓ తెల్లజుట్టు వృద్ధుడు సంశయంగా అడిగాడు.

“కొద్దిగా కూడా లేదు. ఇవాళ బాగా రద్దీగా ఉంది.” రిచర్డ్‌ నవ్వుతూ ఆహ్వానించాడు.

“నాకు లండన్‌తో పెద్దగా పరిచయం లేదు. నార్త్‌ వేల్స్‌ నించి వ్యాపార పని మీద వచ్చాను. నాకున్న ఏకైక హాబీ బిలియర్డ్స్‌. అది ఎక్కడ ఆడచ్చో దయచేసి చెప్పగలరా?” కూర్చున్నాక ఆయన అడిగాడు.

“నా హాబీ కూడా అదే.”

వాళ్ళిద్దరూ బిలియర్డ్స్‌ ఆట గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఆయన తనని ప్రొఫెసర్‌ లూకాస్‌ అని పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఆయన వెయిటర్ని పిలిచి బిల్‌ అడిగాడు.

“ఇక్కడ బిలియర్డ్స్‌ రూం ఉంది. మనం కాసేపు ఆడవచ్చు.” రిచర్డ్‌ సూచించాడు. వాళ్ళిద్దరూ కొన్ని ఆటలు ఆడాక ప్రొఫెసర్‌ ఆ రాత్రి తనతో కలిసి భోజనం చేయడానికి ఆహ్వానిస్తే, రిచర్డ్‌ ఆనందంగా ఒప్పుకున్నాడు.

ఆ రాత్రి మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. భోజనంతో పాటు ఖరీదైన షాంపేన్‌ని ఆర్డర్‌ ఇచ్చాడు. భోజనం అయ్యాక తూలే రిచర్డ్‌ని ప్రొఫెసర్‌ లూకాసే కాక, ఎక్కడ నించో ప్రత్యక్షమైన మరో ముగ్గురు ట్యాక్సీలోకి ఎక్కించారు.

లూకాస్‌ ట్యాక్సీ డ్రైవర్‌కి బ్లూమ్స్‌బరీలోని 124, అన్విన్‌ స్ట్రీట్‌కి తీసుకెళ్ళమని చెప్పాడు. ఆ ముగ్గురూ కూడా ట్యాక్సీ ఎక్కి, రిచర్డ్‌ జేబులోని వస్తువులని తీసి తాగి స్పృహలో లేని అతని మొహానికి గేదె కొమ్ము ఫ్రేమ్‌ గల కళ్ళజోడుని తగిలించారు.

“ఇతను ఎప్పుడు నిద్ర లేస్తాడు?” ఒకరు అడిగారు.

“ఆ మాత్ర రేపు ఉదయం పదకొండు దాకా పని చేస్తుంది.” గంట తర్వాత ఇంటావిడ జాన్‌ ఎల్విస్‌ని మోసుకొచ్చినందుకు ఆ అపరిచితులకి తన కృతజ్ఞతలని చెప్పింది.

మర్నాడు ఉదయం రిచర్డ్‌కి మెలకువ వచ్చాక చుట్టూ చూసాడు. తర్వాత కెవ్వున కేక పెడుతూ లేచి కూర్చున్నాడు. తన ముందు కుర్చీల్లో కూర్చున్న ఇద్దరిని చూసి ఆశ్చర్యంగా అడిగాడు.

“మీరెవరు?”

“మిస్టర్‌ జాన్‌ ఎల్విస్‌. మీ ఆట కట్టింది” ఒకరు చెప్పారు.

“ఏమిటి మీరనేది? నా పేరు జాన్‌ ఎల్విస్‌ కాదు.”

“నిజంగా? ఐతే జాన్‌ ఎల్విస్‌ గదిలో అతని మంచం మీదకి ఎలా వచ్చారు? జాన్‌ ఎల్విస్‌ దుస్తుల్ని ఎందుకు వేసుకున్నారు?” ఒకడు అడిగాడు.

“జాన్‌ ఎల్విస్‌ దుస్తులా?” నివ్వెరపోతూ వాటిని చూసుకున్నాడు.

“అవును. కోట్‌మీద, షర్ట్‌ కాలర్‌మీద ఆ ఇనీషయల్సే. డ్రెసింగ్‌ టేబుల్‌ మీది విజిటింగ్‌ కార్డ్‌మీద కూడా ఆ పేరే. మీరు జాన్‌ ఎల్విస్‌ కాకపోతే ఇక్కడ ఎందుకున్నారు?”

రిచర్డ్‌ వాళ్ళ వంక చూసిన చూపు బోనులో పడ్డ ఎలుక చూపులా ఉంది.

“నా పేరు రిచర్డ్‌ గార్లెస్టన్‌. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలీదు. మీరెవరు?”

“మేము యూనివర్సల్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ తరఫు వాళ్ళం. రిచర్డ్‌ గార్లెస్టన్‌ సంతకాన్ని పాతిక వేల చెక్‌ మీద ఫోర్జరీ చేసిన జాన్‌ ఎల్విస్‌ కోసం వెతుకుతున్నాం. క్వీన్‌ ఏన్‌ స్ట్రీట్‌లోని డాక్టర్‌ ఎడ్వింటర్‌, మీ ఇంటావిడ మీరు జాన్‌ ఎల్విస్‌ అని కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్తారు.” వారిలోని పొడుగాటి అతను చెప్పాడు.

“నేను ఎల్విస్‌ అని ఋజువు చేయడం వల్ల మీరు ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు” రిచర్డ్‌ చెప్పాడు.

“మీరు ఎల్విస్‌ కాదని ఋజువు చేస్తే మీరు కూడా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. నిన్న రాత్రి బార్లో తాగి మీరు బ్యాంక్‌ని మోసం చేసి పాతికవేల పౌన్లని ఎలా దొంగిలించారో నలుగురికి చెప్పారు.”

“అబద్ధం. అది కట్టుకథ” రిచర్డ్‌ గట్టిగా చెప్పాడు.

“అది మేజిస్ట్రేట్‌కి చెప్పు. నువ్వు జైల్లో ఉండగా ఆయన రిచర్డ్‌కి కోర్ట్‌కి హాజరవమని నోటీస్‌ పంపుతాడు. నీకు, రిచర్డ్‌కి మధ్య పెద్దగా పోలిక లేకపోతే నిన్ను వదిలేస్తారు. సమస్య ఏమిటంటే నువ్వే రిచర్డ్‌. ఒకవేళ నువ్వు జాన్‌ అని ఋజువైతే ఫోర్జరీ నేరానికి శిక్ష పడుతుంది. జాన్‌ అనే వాడే లేడని తేలితే బ్యాంక్‌ని మోసం చేసినందుకు రిచర్డ్‌గా నీకు శిక్ష పడుతుంది.”

“ఇంకెందుకు ఇతనితో వాదన? ఈ బాదరబందీ మనకెందుకు? పోలీసులకి ఫోన్‌ చేయి” పొట్టి వ్యక్తి అసహనంగా చెప్పాడు. పొడుగు వ్యక్తి రిసీవర్‌ అందుకుని నంబర్‌ డయల్‌ చేస్తుండగా రిచర్డ్‌ ప్రాధేయపూర్వకంగా అడిగాడు.

“దీన్ని పోలీసుల ప్రమేయం లేకుండా మనం సెటిల్‌ చేసుకోలేమా?”

“కాని నువ్వు జాన్‌వి. రిచర్డ్‌ కూడా ఈ సెటిల్‌మెంట్‌లో ఉండాలి” పొట్టి వ్యక్తి కోపంగా చెప్పాడు.

“ఇతను రిచర్డ్‌ కూడా. నేను చెప్పే దానికి అడ్డుపడకు. జాన్‌! టావిస్‌టాక్‌ నించి ఉదయం ఎనిమిది పదకొండు రైల్లో లండన్‌కి నీ రైలు ప్రయాణం మాటేమిటి? ఇక్కడ నించి నిన్ను ట్యాక్సీలో తీసుకెళ్ళిన డ్రైవర్‌ మాటేమిటి? నువ్వు యూనివర్సల్‌ బ్యాంక్‌కి డబ్బు డ్రా చేయడానికి వెళ్తున్నావని ఇంటావిడకి చెప్పిన మాటేమిటి? బ్యాంక్‌లో దొంగతనం చేసాక మళ్ళీ మూడు పదహారు రైల్లో లండన్‌ నించి టావిస్‌టాక్‌కి వెళ్ళి, దార్లో ఫిషింగ్‌ రాడ్‌ని తీసుకుని, ఫోర్ట్‌వర్త్‌లోని నీ హోటల్‌కి వెళ్ళి చేపలు దొరకలేదని చెప్పిన మాటేమిటి? ఇవన్నీ అబద్ధాలా? తప్పు ఒప్పుకుంటావా? పోలీసుల్ని పిలవమంటావా?” పొడుగు వ్యక్తి గద్దించాడు.“తప్పు ఒప్పుకుంటాను” రిచర్డ్‌ బలహీనంగా చెప్పాడు.

మరోసారి సర్‌ జాన్‌ డాఫ్నీ ప్రైవేట్‌ రూంలో ఆమె ఎదురుగా కూర్చుని ఉన్నాడు. ఆమె ఆయనకో ఉత్తరాన్ని ఇచ్చింది. దాంట్లో రిచర్డ్‌ తను పాతిక వేల పౌన్ల చెక్‌ విషయంలో జూన్‌ 15, 1927న లండన్‌లోని యూనివర్సల్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్లో తన సంతకాన్ని తనే ఫోర్జరీ చేయడం మొదలైన అతని పథకం మొత్తం రాశాడు. కింద రిచర్డ్‌ సంతకం ఉంది. దాన్ని చదివి సర్‌ జాన్‌ ఆనందపడ్డాడు.

“అతని లాయర్‌ నుంచి మీకు రేపే కేస్‌ లేదనే ఉత్తరం కూడా వస్తుంది. ఇదంతా మర్చిపోయి మీరు అతన్ని గౌరవప్రదమైన క్లయింట్‌గానే ట్రీట్‌ చేయమని నా సలహా. ఇంకోసారి అతను ఇలాంటి తప్పు చేయడు. మీకు వ్యాపారం ముఖ్యం కూడా.”

“అది సరే. ఈ ఉత్తరాన్ని మీరు ఎలా సంపాదించగలిగారు?” ఆయన ఆసక్తిగా అడిగాడు.

“వివరాల్లోకి వెళ్ళవద్దు కాని చిన్న నాటకం ద్వారా. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే సామెత మీరు విన్నారుగా?” డాఫ్నీ నవ్వి చెప్పింది.

(ఆర్చ్‌బాల్డ్‌ పెచేయ్‌ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి


logo