మంగళవారం 26 మే 2020
Sunday - May 17, 2020 , 01:21:31

ముచ్చటగా మూడు పల్లెలు

ముచ్చటగా మూడు పల్లెలు

పల్లెలన్నీ మల్లెలవుతున్నయి. ప్రగతికి ఖిల్లాలవుతున్నయి. సమస్యల పరిష్కారంలో ప్రజలు.. పాలకులూ ఒక్కటై ఆదర్శంగా నిలుస్తుంటే.. అభివృద్ధిలో అంతకంతకూ ఎగబాకుతూ  పట్నాలకు స్ఫూర్తినిస్తున్నయి. ఒకప్పుడు ‘అబ్బా.. ఇవేం ఊర్లురా బాబూ’ అన్న నోళ్లే.. ఇవాళ ‘ఊర్లంటే ఇట్లా ఉండాలి’ అనేంతగా మారుతున్నయి. ఆ చైతన్యాన్ని.. ఆ అవగాహనను.. ఆ తపనను చూసి రాష్ట్రం.. దేశం గర్వ పడేలా చేస్తున్నయి. ప్రతిష్టాత్మక పురస్కారాలను పొందుతున్నయి. ఒకే మాట.. ఒకే బాట.. ఒకే నినాదంతో.. దేశం గొప్పగా చెప్పుకునే రీతిలో అభివృద్ధిని సాధిస్తూ ఆదర్శ గ్రామాలై వర్ధిల్లుతూ కేంద్ర ప్రభుత్వ జాతీయ పురస్కారాలు పొందినమూడు తెలంగాణ పల్లెల ప్రగతిమాల ఈ ముఖచిత్ర కథనం. 

1. స్వచ్ఛతబాట ఆదివారంపేట! 

అదొక మారుమూల పల్లె. పేరు ఆదివారం పేట. పెద్దపల్లి జిల్లా రామగిరికి సమీపంలో ఉన్నది.ఇప్పటిదాకా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేకతను చాటుకున్నది. ఎలా? ఒకే మాట.. ఒకే బాట.. ఒకే నినాదంతో. 

ఏంటీ ప్రత్యేకత?:  కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఆదివారంపేటకు నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామసభ పురస్కార్‌ అందజేసింది. అభివృద్ధిని.. సమస్యల పరిష్కార తీరును.. స్వచ్ఛగ్రామంగా మారిపోవడాన్ని అభినందిస్తూ కేంద్రప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపికచేసింది. ప్రోత్సాహకంగా రూ.10 లక్షల మొత్తాన్ని కూడా ఇచ్చింది. 

ఎలా సాధ్యం?:  2018లో స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవార్డు సాధించిన ఘనత ఆదివారంపేటకు ఉంది. దీని స్ఫూర్తిగా అధికారులు.. ప్రజాప్రతినిధులు.. ప్రజలు ఒక్కటై ఏ లోటూ లేకుండా మౌలిక సదుపాయాలను ఏర్పరచుకున్నారు.ఎన్ని ఎక్కువసార్లు సమావేశం పెడితే అన్ని ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయనేది వారి ఆలోచన. అందుకే ఆరు పాలకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాలకవర్గం మాత్రమే అన్నింట్లో జోక్యం చేసుకుంటూ ఒంటెద్దు పోకడ పోలేదు. ప్రజలను దీంట్లో భాగస్వాములను చేశారు. మహిళా స్వశక్తి సంఘాలను కలుపుకుపోయారు. గ్రామంలో ఎక్కడైనా చెత్త కనిపించకుండా స్వచ్ఛతా ప్రమాణం చేయించారు. 2019 ఫిబ్రవరి నుంచి పరిశుభ్రతను సీరియస్‌గా తీసుకున్నారు సర్పంచ్‌ మైదం కుమార్‌. 

తీసుకున్న చర్యలేంటి? : గ్రామాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా మార్చేందుకు 312ఇండ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. ప్రజలు నిత్యం అధికారులతో ముఖాముఖి అయ్యేలా చైతన్యం తీసుకొచ్చారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అసౌకర్యం కలగొద్దని గ్రామ పంచాయతీ నూతన భవనం నిర్మించారు. ఎక్కడా ఏ చిన్న పిచ్చిమొక్కా కనిపించకుండా పచ్చదనం పరిశుభ్రత పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇంటింటి మరుగుదొడ్డి నిర్మాణంతోపాటు పంచాయతీ కార్యాలయం వద్ద సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఇంటింటికీ ఇంకుడుగుంత తవ్వించారు. ఇంటింటా నిర్మించుకున్న కంపోస్టు పిట్‌ల నుంచి వచ్చిన ఎరువును కిచెన్‌గార్డెన్‌లు.. పొలాల్లో ఎరువుగా వాడుతున్నారు. పాలిథీన్‌ కవర్లకు బదులుగా బట్ట సంచులను మాత్రమే వాడుతున్నారు. 

మహిళా చైతన్యం: గ్రామాభివృద్ధిలో  మహిళల పాత్ర కీలకమైంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ‘సబల సానిటరీ న్యాప్కిన్స్‌'ను పంపిణీ చేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. పశువుల దాహాన్ని తీర్చేందుకు నీటితొట్లను నిర్మించారు. జీవించినంత కాలమే కాదు.. మరణానంతరం కూడా వారిని అదే ఆత్మగౌరవంతో సాగనంపాలని పల్లెప్రగతిలో భాగంగా వైకుంఠధామం నిర్మించారు. గ్రామంలోకి కోతులు రాకుండా వానరవనాన్ని సైతం ఏర్పాటు చేశారు. గ్రామ పొలిమేరల్లో గుట్టకు దగ్గరలోనే 1500ల మొక్కలు నాటి దీనిని ఏర్పాటు చేశారు. చుట్టూ కంచె వేసి పండ్ల మొక్కలను నాటారు.  సింగరేణి సంస్థ సహకారంతో ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు.  ప్రజల సహకారంతో

జిల్లా కలెక్టర్‌, అధికారుల సూచనల మేరకు పల్లె ప్రగతి పంచ సూత్రాలను పాటించడంతో పాటుగా అనేక నూతన పద్ధతులను ప్రజలు చాలా చక్కగా పాటిస్తున్నారు. అందరి సహకారంతోనే గ్రామానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అవార్డు ద్వారా వచ్చిన రూ. 10లక్షలతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఇంకా ఆదర్శంగా నిలుస్తాం. 

-మైదం కుమార్‌, సర్పంచ్‌ 


-అంకరి ప్రకాశ్‌, పెద్దపల్లి ప్రతినిధి


 2.వికసించిన ప్రగతి!

అదొక అడవిలోని  పల్లె. పేరు గంగారం. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం సమీపంలో ఉన్నది. ఇప్పటిదాకా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు  ఆ అభివృద్ధిని చూసి దేశంగర్వపడింది.  ఎలా? ఒకే మాట.. ఒకే బాట.. ఒకే నినాదంతో. 

ఏంటీ ప్రత్యేకత? : కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా పల్లె రూపురేఖలు మారిపోయాయి. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సొంతూరును అద్దంలా మార్చుకున్నారు. పల్లె ప్రగతిలో జిల్లాలోనే గుర్తింపు తెచ్చుకున్న  ‘గంగారం’ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. 

ఎలా సాధ్యం? :  సర్పంచ్‌ తెప్పల దేవేందర్‌రెడ్డి గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. గ్రామస్తుల సహకారంతో ఊరి రూపురేఖలు మార్చేశారు. అభివృద్ధిలోనే కాకుండా కూరగాయల సాగు, క్రీడల్లోనూ ఈ గ్రామం ముందంజలో ఉంది. 

ఎవరి కృషి ఎంత? : ఒకప్పుడు అంతర్గత దారులు అధ్వానంగా ఉండేవి. తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వీధి దీపాలు వెలిగేవికావు. గ్రామ పంచాయతీకి భవనంలేదు. వైద్య సౌకర్యం అందించేందుకు నిర్మించిన సబ్‌సెం

టర్‌ పిచ్చిమొక్కలతో పేరుకుపోయి ఉండేది. సర్పంచ్‌ తన పాలకవర్గంతో గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. గ్రామస్తులను... ముఖ్యంగా మహిళలను భాగస్వాములను చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను, పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రగతిబాట పట్టించారు. 

తీసుకున్న చర్యలేంటి? : ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు , ప్రతి వాడకు సీసీ రోడ్లు నిర్మించి వీధిదీపాలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని మోడల్‌ స్కూల్‌ అందంగా మారింది. వైకుంఠధామం నిర్మాణంలో ఉంది. డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటు చేశారు. తడి-పొడి చెత్త యూనిట్‌ నిర్మాణంలో ఉంది. నర్సరీకి స్థలం కేటాయించి ఏర్పాటు చేశారు. గ్రామంలో రెండు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఉండగా మిషన్‌ భగీరథ ట్యాంకు నిర్మాణం సైతం పూర్తయింది. 11 బోర్లతో తాగునీటి సమస్యను పరిష్కరించారు. గేట్‌వాల్వ్‌ల చుట్టూ మురుగు నీరు చేరకుండా కొత్తవి అమర్చి చుట్టూ కుండీలు నిర్మించారు. హెల్త్‌ సబ్‌ సెంటర్‌ను వెల్‌నెస్‌ సెంటర్‌గా మార్చారు. అందులో వైద్యంతోపాటు దివ్యాంగులకు, గ్రామస్తులకు ఫిజియోథెరపీ అందిస్తున్నారు. వ్యాయామం, ధ్యానం చేయిస్తున్నారు.  

మహిళా చైతన్యం: గంగారం గ్రామం కూరగాయల సాగులో అగ్రభాగంలో నిలిచింది. సాగులో, అమ్మకంలో ముందుండి మహిళలు తమ ఊరిని ఆదర్శంగా మార్చారు. సుమారు 300 కుటుంబాలు కూరగాయల సాగుతో లాభాలు ఆర్జిస్తున్నాయి. మంథని.. భూపాలపలి ్లప్రాంతాలకు నిత్యం ఎగుమతి చేస్తున్నారు.  ప్రజా అవసరాల కోసం గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సిద్ధం చేసి ఉంచారు. గ్రామానికి కేంద్ర పురస్కారం రావడంతో అందరి బాధ్యతా పెరిగింది. ‘ఇది తొలి అడుగు మాత్రమే, సాధించాల్సింది చాలా ఉంది’ అంటారు గ్రామ ప్రజలు.అందరి సహకారం

ప్రతి అంశం గ్రామ సభలో తీర్మానం చేస్తాం. ఏడాదికి 10 గ్రామ సభలు అదనంగా నిర్వహిస్తాం. రెండు నెలలకొకసారి మహిళలతో ప్రత్యేక సభలు నిర్వహిస్తాం. పన్నుల వసూళ్లు వందశాతం జరిగాయి. పోషకాహార దినోత్సవాలతో పాటు సీమంతాలు, ఓటర్స్‌ డే, ఉమెన్స్‌ డే లాంటి వేడుకలను నిర్వహిస్తున్నాం.  కేంద్ర పురస్కారం రావడం సంతోషంగా ఉంది.

-తెప్పల దేవేందర్‌రెడ్డి, సర్పంచ్‌


-మధుకర్‌ కానుగంటి, ఎ తిరుపతి


 3. బాలల నేస్తం.. నుస్తులాపూర్‌

అది కరీంనగర్‌ సమీపంలోని గ్రామం. పేరు నుస్తులాపూర్‌.  తిమ్మాపూర్‌ సమీపంలో ఉంటుంది. రహదారి పక్కనే కాబట్టి పరిచిత గ్రామమే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేకతను చాటుకున్నది. ఎలా? ఒకే మాట.. ఒకే బాట.. ఒకే నినాదంతో. 

ఏంటీ ప్రత్యేకత? 

బాలలు బాగుంటేనే ఆరోగ్య భారతావని ఏర్పడుతుంది అని నమ్మే గ్రామం నుస్తులాపూర్‌. అంగన్‌వాడీ.. పాఠశాల స్థాయి వరకు చిన్నారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. సీమంతాల నుంచి అన్నప్రాసన వరకు .. టీకా నుంచి పుష్టికరమైన ఆహారం వరకు అన్నీ దగ్గరుండి చూస్తున్నది. అధికారులు.. పంచాయతీ పాలకవర్గం కలిసి చేస్తున్న పనిని గుర్తించిన కేంద్రం.. ఛైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీగా ప్రకటించింది. ఎలా సాధ్యం?

చిన్నారుల సంరక్షణతోపాటు గ్రామంలో అమలవుతున్న మొత్తం 29 కార్యక్రమాలపై కేంద్రం వివరాలు సేకరించింది. ప్రధానంగా గ్రామంలో జరుగుతున్న టీకాల కార్యక్రమం, పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌, డ్రాపౌవుట్‌, రీ- ఎన్‌రోల్‌మెంట్‌, ఆంగన్‌వాడీలు అందిస్తున్న సేవలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పాఠశాలల పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలు, బాలికల పరిశుభ్రతకు అనుసరిస్తున్నమార్గాలు, మధ్యాహ్నభోజనం, పాఠశాలల్లో ఆట స్థలాలు, క్రీడల్లో విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ.. గ్రామంలో పారిశుద్ధ్యం, పిల్లల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు వంటి పలు కోణాలున్నాయి. అన్నింటిలోనూ అర్హతలను సాధించింది నుస్తులాపూర్‌. దీంతో అవార్డు  కింద ఐదు లక్షల రూపాయల ప్రోత్సాహకం లభించింది.

తీసుకున్న చర్యలేంటి? 

ఆరోగ్యలక్ష్మి కింద కమిటీ వేయడమే కాకుండా.. నెలకోసారి సమావేశమై గర్భిణులకు, బాలింతలకు అందే పౌష్టికాహారంపై చర్చించారు. ఆంగన్‌వాడీలోనే చిన్నారులను ఉత్తమంగా తీర్చిదిద్ది వారిని ఆయా పాఠశాలల్లో చేర్పించారు. ప్రస్తుతం రెండు ప్రైమరీ, ఒక ఉన్నత పాఠశాలలో కలిపి 309 మంది చదువుకొంటున్నారు. పదోతరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. స్వీయరక్షణ కోసం బాలికలకు కరాటే నేర్పుతున్నారు. 19 మంది మానసిక వైకల్యం కలిగిన చిన్నారుల కోసం ఒక పాఠశాల నడుస్తున్నది. ఎవరైనా చనిపోతే ఉచితంగా దహన సంస్కారాలు చేస్తున్నారు. రెండు రూపాయలకే 20 లీటర్ల స్వచ్ఛమైన మంచినీటిని ఇస్తున్నారు. 

మహిళా చైతన్యం

ఆరోగ్యలక్ష్మి కింద పుష్టికరమైన ఆహారం అందిస్తున్నారు. పంచాయతీ లేదా అంగన్‌వాడీ పరిధిలో సీమంతాలు నిర్వహిస్తున్నారు. బారసాల, అన్న ప్రాసన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను పంచాయతీ ప్రతినిధులతో పాటుగా ఆయా విభాగాల సిబ్బంది ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆరేళ్ల వయసు వరకు ప్రతి చిన్నారి పేరును అంగన్‌వాడీ రిజిస్టర్‌లో నమోదుచేసుకొని.. వారి బరువును, పోషణ స్థితిగతులు, ఎదుగుదలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలించి తల్లిదండ్రులకు తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ‘ఇది మా సమష్టి విజయం’ అని గర్వంగా చెబుతారు గ్రామ ప్రజలు.ముఖ్యమంత్రే స్ఫూర్తి

ఈ విషయంలో మాకు ముఖ్యమంత్రి కేసీఆరే స్ఫూర్తి. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. 2009లో గ్రామం నిర్మల్‌ పురస్కార్‌కు ఎంపికైనప్పుడు నేనే సర్పంచ్‌ని. మళ్లీ ఇప్పుడు నేనే సర్పంచ్‌ను కావడం సంతోషంగా ఉంది. 

-రావుల రమేశ్‌, సర్పంచ్‌

-కడపత్రి ప్రకాశ్‌రావు, కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి


logo