సోమవారం 25 మే 2020
Sunday - May 17, 2020 , 01:06:26

రవివర్మ తొలిబొమ్మ@ 150

రవివర్మ తొలిబొమ్మ@ 150

సరిగ్గా... నూటాయాభై ఏళ్ల క్రితం కృష్ణమీనన్‌ అనే పెద్దమనిషికి తమ కుటుంబ తైలవర్ణ చిత్రాన్ని గీయించుకోవాలనే ఆలోచన కలిగింది. ఆయన కాలికట్‌లో సబ్‌జడ్జి. ఆ రోజుల్లో అది చాలా పెద్దపదవి. తన పరపతిని అంతా ఉపయోగించారు. ఎంతోమందితో ప్రయత్నించారు. కానీ, ఎవరి గీతా సంతృప్తికరంగా అనిపించలేదు. రవివర్మ అనే యువ చిత్రకారుడు అయితే బాగా గీస్తాడని ఎవరో సిఫార్సు చేశారు. అదే, ప్రపంచానికి రవివర్మ అందించిన తొలి పోర్ట్రెయిట్‌. క్రమంగా వర్మ ఖ్యాతి రాచకుటుంబం వరకూ వెళ్లింది. ఆతర్వాత దేవతల చిత్రాలతో జగద్విఖ్యాతిని సాధించారు. ఆ ప్రకారంగా... రవివర్మ అభిమానులకు, 2020 సంవత్సరం ప్రత్యేకమైనదే.

చిత్రాలు పదిలం...

రవివర్మ బొమ్మలు చిత్రకళా ప్రపంచంలో చెరగని ముద్ర వేసుకున్నాయి. వాటిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరమూ ఏర్పడుతున్నది. బెంగళూర్‌కు చెందిన గణేశ్‌ శివస్వామి ఫౌండేషన్‌ ఆ బాధ్యతను తీసుకున్నది. గణేశ్‌ శివస్వామి దీని వ్యవస్థాపకుడు. శివస్వామి వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తి రీత్యా రవివర్మ వీరాభిమాని. రవివర్మ గీసిన తొలి చిత్రం నుంచి చివరి చిత్రం వరకూ సేకరించాడు. ప్రభుత్వ మ్యూజియాలు, ప్రైవేటు ఆర్ట్‌ గ్యాలరీల సాయంతో వీటిని సేకరించగలిగాడు. మలిదశలో ‘గూగుల్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌' వేదికపై డిజిటలీకరించాడు. సుమారు 300 ఫొటోలను ఈ వేదికపై పొందుపరిచాడు. artsandculture.google.com/partner/the-ganesh-shivaswamy-foundation. లింకులో వాటిని చూడొచ్చు. ఏప్రిల్‌ 29న రాజా రవివర్మ 172వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రవివర్మ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ రెండు ఎగ్జిబిషన్లను ప్రారంభించింది. గూగుల్‌లోనే ఆర్ట్‌ కల్చర్‌ ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. కేరళకు చెందిన  మను పిైళ్లె అనే రచయిత ‘ద వరల్డ్‌ ఆఫ్‌ రాజా రవివర్మ- ప్రిన్సెస్‌ అండ్‌ పాట్రన్స్‌' పుస్తకం రాశాడు. గోవాకు చెందిన ఫిల్మ్‌ మేకర్‌ వికాస్‌.. అప్పట్లో రవివర్మ ప్రింటింగ్‌ ప్రెస్‌పై డాక్యుమెంటరీని తీశాడు. 33 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ యూట్యూబ్‌లోనూ చూడొచ్చు. logo