మంగళవారం 26 మే 2020
Sunday - May 17, 2020 , 01:03:37

ఓవర్ టు స్టూడియో

ఓవర్ టు స్టూడియో

ఐఏఎస్‌ కావాలన్నది ఆమె లక్ష్యం. కానీ కాలేకపోయింది. పద్దెనిమిదేండ్లకే పెండ్లి. టాప్‌-1 నుంచి బాటమ్‌లోకి వచ్చేసింది. ఏం చేస్తుందిక? ఇంట్లో అంట్లు తోముతూ కూర్చోవాలా? చదువు మళ్లీ స్టార్ట్‌ చేసి ఉద్యోగం సంపాదించాలా? కవిత లైఫ్‌ జర్నీ ఎలా సాగింది? తెలంగాణ గుండెచప్పుడు వినిపించే న్యూస్‌ ప్రజెంటర్‌ ఎలా కాగలిగింది? 

మాది యాదగిరిగుట్ట. అమ్మమ్మవాళ్లింట్లో పెరిగాను.  స్కూల్‌ ఫస్ట్‌ వస్తేగానీ నిద్రపట్టకపోయేది. అన్ని కాంపిటీషన్స్‌లో మండల.. జిల్లా స్థాయిల్లో ఫస్ట్‌ వచ్చేదాన్ని. ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలని చిన్నప్పుడే లక్ష్యం ఏర్పడింది. వ్యవసాయంలో నష్టం రావడంతో అమ్మానాన్న ఊరు వదిలేసి యాదగిరిగుట్ట వచ్చేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాం. ఇవన్నీ చూసి నాలో చదవాలనే తపన మరింత పెరిగింది. పదో తరగతి అయిపోయింది. పెద్ద మామయ్యకు రాజమండ్రి ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. అక్కడే చదివిస్తా అని నన్ను తీసుకెళ్లారు. ఒకసారి దసరా కోసం యాదగిరిగుట్ట వచ్చాం. బతుకమ్మ దగ్గర మా చుట్టాలెవరో చూసి పెండ్లి సంబంధం కోసం కబురు పంపించారు. మంచి సంబంధం. అయినా మా వాళ్లు వద్దన్నారు. రాజమండ్రి వెళ్లాను. ఇంతలోనే నాన్నకు యాక్సిడెంట్‌ అయింది. చావుదాకా వెళ్లి  వచ్చారు. మూడు నెలలు అయితే అన్‌కాన్సియస్‌లో ఉన్నారు. 

ఇదంతా జరిగిన తర్వాత పెండ్లి ప్రస్తావన మళ్లీ వచ్చింది. మామయ్యలు ఇప్పుడే వద్దని చెప్పినా అమ్మ వినలేదు. 2005లో పెళ్లయ్యింది. డిగ్రీ చేస్తానని భర్తని ఒప్పించుకున్నాను. అప్పుడు నేను ప్రెగ్నెంట్‌. ఒకసారి కళ్లు తిరిగి కిందపడిపోయాను. అప్పుడు మా అత్తయ్యవాళ్లు ‘చదువు అవసరమా ఇప్పుడు?’ అని వారించడంతో మరోసారి బ్రేక్‌ పడింది. 

ఒకసారి ఊరికి వెళ్లినప్పుడు పాత ఫ్రెండ్స్‌ కలిశారు. ‘ఐఏఎస్‌ అవుతానన్న కవిత పెండ్లి చేసుకొని.. ఇంట్లో అంట్లు తోముకుంటూ.. పాపను ఎత్తుకుంటూ తిరుగుతుంది’ అని అన్నారు. ‘మీ కోసం నా కోరికలు.. లక్ష్యం వదిలేసి వచ్చాను. నా కోసం మీరు నన్ను చదివించలేరా?’ అని అడిగా.  ఆయన అంగీకరించారు. అలా డిగ్రీ పూర్తయింది. ఉద్యోగానికి కూడా ఆయన్ని ఒప్పించాను.  అలా మొదటి ఉద్యోగం ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో. ఒకరోజు పేపర్లో ‘మయూరీ డిస్ట్రిబ్యూటర్స్‌లో జాబ్‌' యాడ్‌ కనిపించింది. ఈటీవీలో న్యూస్‌ ప్రజెంటర్‌ ఉద్యోగం. 350 మందిలో నేను టాప్‌-10లో నిలిచాను. రామోజీ ఫిల్మ్‌సిటీలో మూడు నెలలు ఉండాలి. పాప చిన్నది కాబట్టి వీలు కాలేదు. 

కానీ మనసులో అదే ఆలోచన. టాప్‌-10 వరకు వెళ్లానంటే ‘నాకు స్కిల్స్‌ ఉన్నట్టే కదా’ అనిపించింది. రోజూ వార్తలు ప్రాక్టీస్‌ చేసేదాన్ని. ఒకసారి సికింద్రాబాద్‌ వెళ్తుండగా బ్రిలియంట్‌ స్కూల్‌పై ‘న్యూస్‌ ప్రజెంటర్లు కావలెను’ అనే యాడ్‌ చూశాను. సంప్రదించాను. లైవ్‌ బులెటిన్‌ ఇచ్చేశారు. శోభానాగిరెడ్డి యాక్సిడెంట్‌లో చనిపోయారు... అనేది బ్రేకింగ్‌ న్యూస్‌. కానీ కంటెంట్‌ రైటర్‌ ఇచ్చిన దాంట్లో ‘హాస్పిటల్‌లో చికిత్స’ అని ఉంది. నేను అలాగే చదివాను. చానెల్‌ హెడ్‌ వచ్చి.. ‘ఎవ్వరు పడితే వాళ్లు న్యూస్‌ ప్రజెంటర్‌ అవుదామని వచ్చేస్తారు’ అని తిట్టేశారు. బాగా ఫీలయ్యాను. ఆ ఘటనలో నా తప్పేమీ లేదు. ఆ రోజే డిసైడ్‌ అయ్యాను. ‘ఎవ్వరు పడితే వాళ్లు వచ్చేస్తారు కాదు.. న్యూస్‌  ప్రజెంటర్‌ అంటే కవితలా ఉండాలి’ అని నిరూపించుకోవాలనుకున్నా. అప్పుడే 99 టీవీ స్టార్ట్‌ అయ్యింది. ఇంటర్వ్యూ ఇచ్చాను. 

స్టూడియో-ఎన్‌.. సీవీఆర్‌లో కూడా ఆడిషన్స్‌ ఇచ్చాను. అన్నింట్లోనూ సెలెక్ట్‌ అయ్యాను. స్టూడియో-ఎన్‌లో చేరాను. అప్పటికీ బులెటిన్స్‌ ఇవ్వలేదు. ప్రాక్టీస్‌ అని మాత్రం చెప్పారు. చాలా రోజులకు మార్నింగ్‌ బులెటిన్‌ ఇచ్చారు. పొద్దున ఆరింటికే బులెటిన్‌ స్టార్ట్‌. అంటే ఓ గంట ముందే స్టూడియోలో ఉండాలి. మేము ఉండేది ఉప్పల్‌లో. అక్కడి నుంచి స్టూడియోకు రావాలంటే తెల్లవారుజామున మూడింటికే స్టార్ట్‌ కావాలి. అవసరమా అన్నారు మా ఆయన. కానీ నేను ఒప్పించాను. మూడు నెలల పాటు ప్రతీ రోజూ పొద్దున్నే ఉప్పల్‌ నుంచి మెహిదీపట్నం డ్రాప్‌ చేసేవారు. అంత కష్టపడ్డాక  నా పనితనం ఏంటో తెలుసుకున్నారు. 

ఎవరైతే నన్ను ‘హౌజ్‌ వైఫ్‌తో సరిపెట్టుకుంది’ అన్నారో వాళ్లే ఇప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారు. ఓ దశలో,  వేధింపులు భరించలేక ఉద్యోగానికి రిజైన్‌ చేసి వచ్చేశాను. అదే సమయంలో సాక్షి టీవీలో ఖాళీలు ఉన్నాయని తెలిస్తే సంప్రదించాను. అక్కడ నాకు మంచి అవకాశం దొరికినట్లయింది. వృత్తి పట్ల సంతృప్తి చెందాను. మీడియాలో ఒకే సంస్థలో ఎక్కువకాలం ఉండలేం కదా? అందుకే టీన్యూస్‌లో అవకాశం ఉంటే వచ్చాను. ఇప్పుడు చాలా కంఫర్ట్‌గా ఉంది. ఐఏఎస్‌ కావాలి అనుకున్నా. కాలేదు. కానీ ఇంట్లో కూర్చోలేదు. అది కాకపోతే ఇంకోటి సాధించాలనే పట్టుదలతో సక్సెస్‌ఫుల్‌ న్యూస్‌ ప్రజెంటర్‌గా రాణిస్తున్నా. 


logo