మంగళవారం 26 మే 2020
Sunday - May 17, 2020 , 01:01:21

క్విజ్‌ మాంత్రికుడు!

క్విజ్‌ మాంత్రికుడు!

క్రీడలంటే సహజంగా ఇష్టపడని వారుండరు. కొందరి ఆసక్తి  పల్లెకో, బస్తీకో పరిమితం అవుతుంది. కానీ ఈ తెలంగాణ బిడ్డ మాత్రం కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో నిర్వహించిన  క్రీడాక్విజ్‌ పోటీలలో విజేతగా నిలుస్తూ  రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేస్తున్నాడు. వివిధ దేశాల్లోని దాదాపు 1.80 లక్షల మంది భారతీయులు పాల్గొన్న ప్రతిష్టాత్మక ‘ఖేలో ఇండియా’ ఆన్‌లైన్‌ స్పోర్ట్స్‌ క్విజ్‌తోపాటు ప్రపంచ కప్‌ హాకీ క్విజ్‌లో సైతం విజయభేరి మోగించాడు. స్వతహాగా ఖోఖో, రెజ్లింగ్‌ క్రీడల్లో జాతీయ పతక విజేత అయిన కరీం గత 25 ఏండ్లుగా& ఒలింపిక్‌, రెజ్లింగ్‌ సంఘాల జిల్లా బాధ్యుడిగా సేవలు అందిస్తున్నాడు. 

అంతర్జాతీయ క్రీడావేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 2018లో ‘ఖేలో ఇండియా’ అనే  పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వేయిమంది మెరికల్లాంటి యువ క్రీడాకారుల్ని గుర్తిస్తూ& వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణనిస్తూ 2024, 2028 ఒలింపిక్స్‌కు సిద్ధం చేయాలనేది ధ్యేయం. ఈ పథకానికి పూర్తిస్థాయిలో ప్రచారం కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర క్రీడలు, యువజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2018 జనవరిలో  ‘ఖేలో ఇండియా’ ఆన్‌లైన్‌ స్పోర్ట్స్‌ క్విజ్‌ను నిర్వహించింది. దేశవిదేశాల్లోని 1.80 లక్షల మంది భారతీయులు పాల్గొన్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ క్విజ్‌లో టాపర్‌గా నిలిచాడు  మహ్మద్‌ కరీం. ఆ సందర్భంగా కేంద్ర క్రీడలమంత్రితోనూ సమావేశం అయ్యాడు. ట్రోఫీతో పాటు మెడల్‌నూ అందుకున్నాడు.

వరల్డ్‌ హాకీ క్విజ్‌లో విజేతగా...

సుదీర్ఘకాలం తర్వాత భారత్‌ హాకీలో ప్రపంచకప్‌ పోటీలకు 2019 నవంబర్‌లో భువనేశ్వర్‌ వేదికగా ఆతిథ్యమిచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘హాకీ క్విజ్‌'లోనూ  కరీం విజేతగా నిలిచాడు. హాకీలో ప్రపంచ దేశాలు సాధించిన రికార్డులు, విజయాలకు సంబంధించి..  సరైన సమాధానాన్ని గుర్తించి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా భారత హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ సంతకంతో కూడిన హాకీ స్టిక్‌తోపాటు రూ.5వేల నగదును అందుకున్నాడు. ఆ మొత్తాన్ని కరీంనగర్‌ జిల్లా రెజ్లింగ్‌ అసోసియేషన్‌కు అందజేయడం అతని క్రీడాస్ఫూర్తికి నిదర్శనం.  

గ్రామీణ ప్రాంతం నుండి...

విద్యార్థి దశ నుండి ఆటలపై మక్కువ చూపిన కరీంది.. కరీంనగర్‌ జిల్లా కేశవపట్నం గ్రామం. తండ్రి పాఠశాలలో పరిచారకుడు. బదిలీల కారణంగా పలు గ్రామాల్లో విద్యాభ్యాసం కొనసాగింది. తాడికల్‌ గ్రామంలో తోటి విద్యార్థులతో సరదాగా ఆడిన ఖోఖోలో క్రమేణా రాణిస్తూ పదిసార్లు పలు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొన్నాడు. అంతేగాక 1998లో కర్ణాటకలోని యాదగిరిలో జరిగిన దక్షిణ భారత సీనియర్‌ ఖోఖో పోటీలో రాణించి రజత పతకం సాధించాడు. పిదప రెజ్లింగ్‌ను జిల్లాకు పరిచయం చేస్తూ జిల్లా నుంచి సీనియర్‌ నేషనల్స్‌లో పాల్గొన్న తొలి రెజ్లర్‌గా రికార్డు సష్టించాడు. హైదరాబాద్‌లో 2002లో జరిగిన జాతీయ క్రీడలు, 2004లో ఆఫ్రో ఏషియన్‌గేమ్స్‌, 2006లో ఇండో-పాక్‌ హాకీ సీరిస్‌ నిర్వహణలో పాల్గొన్నాడు. పలుమార్లు  జిల్లా, రాష్ట్ర జట్లకు కోచ్‌గా ఉన్నాడు.

రెజ్లింగ్‌లో తిరుగులేని విజయాలు..

రెజ్లింగ్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శిగా 2005లో బాధ్యతలు చేపట్టిన కరీం ఈ క్రీడాభివృద్ధికి విశేష కృషి చేశాడు. కరీంనగర్‌లో 2006లో స్పోర్ట్స్‌ అథారిటీ రెజ్లింగ్‌ అకాడమి ఏర్పాటు చేయించాడు. గత పదేళ్ల నుండి అన్ని కేటగిరీల్లో రాష్ట్రస్థాయిలో కరీంనగర్‌ జిల్లా రెజ్లర్లు తిరుగులేని విజయాల వెనుక కరీం సేవలు ఎనలేనివి. ఇక్కడి ఆటగాళ్లు మున్నెన్నడూలేని రీతిలో జాతీయస్థాయిలో పతకాలు సాధించడం విశేషం. కార్యదర్శిగా తన హయాంలో కరీంనగర్‌ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిల్లో పతకాలు సాధించాడు. ఎస్‌జీఎఫ్‌, సబ్‌ జూనియర్‌, జూనియర్‌ విభాగాల్లో, స్పోర్ట్స్‌ ఆథారిటీ నిర్వహించిన క్రీడల్లో గత దశాబ్ద కాలంగా కరీంనగర్‌ చాంపియన్‌గా నిలువడంలో విశేష కృషి చేశారు. 

ఉపాధ్యాయుడిగా...

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా 2002లో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి విద్యా, క్రీడాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఇటిక్యాల, గద్దపాక, వీణవంక తదితర పాఠశాలల్లో అథ్లెటిక్స్‌, ఖోఖో, రెజ్లింగ్‌, అత్యపత్య తదితర క్రీడాంశాల్లో  ఇచ్చిన శిక్షణ ఫలితంగా వందలాది మంది రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొన్నాడు. 2009లో శంకరపట్నం మండల రిసోర్స్‌ పర్సన్‌గా పలు విద్యా కార్యక్రమాలపై ఉపాధ్యాయులకు శిక్షణఇచ్చారు. ప్రభుత్వపాఠశాలలో సౌకర్యాలను తెలుసుకునేందుకై  ఉద్దేశించిన జీపీఎస్‌ కార్యక్రమం హుజురాబాద్‌ డివిజన్‌ బాధ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 2003లో జగిత్యాలలో, 2005 జమ్మికుంటలో జరిగిన విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో, 2011లో జనాభా లెక్కలవిధుల్లో పాల్గొన్నాడు. 

ఉద్యమంలో చురుకైన పాత్ర..

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా క్రీడల జేఏసీ అదనపు కన్వీనర్‌గా వ్యవహరిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. నిరసనలు, రన్‌లు, దీక్షలతో 42రోజులపాటు సాగిన సకలజనుల సమ్మెల్లో పాల్గొన్నాడు. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు కాంక్షిస్తూ రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌ దర్గాలో ప్రార్థనలు చేశాడు. 

ఇవి తెలంగాణ విజయాలు...

నా విజయాలతో దేశక్రీడా పటంలో తెలంగాణకు చోటు దక్కడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న పలు క్రీడా పథకాల గురించి నాటి క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాధోడ్‌కు వివరించే అవకాశం రావడం మధురానుభూతి. పత్రికా పఠనంలో భాగంగా నిత్యం ‘నమస్తే తెలంగాణ’లోని ‘ఆట’ పేజీని చదవడం నా విజయ రహస్యం.-మహ్మద్‌ కరీం 

-మహ్మద్‌ మన్నాన్‌, కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌


logo