మంగళవారం 26 మే 2020
Sunday - May 17, 2020 , 00:40:34

రూరల్‌ ఫ్లేవర్‌.. కొత్త పోరడు

రూరల్‌ ఫ్లేవర్‌..  కొత్త పోరడు

వరంగల్‌జిల్లా బొల్లిగుంటకు చెందిన అన్వేష్‌ మైఖేలే ఈ కొత్త పోరడు. తెలుగు సినీ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. సినిమాలపై ఆసక్తి అతడిలో కసిని పెంచింది. బాగా రాయగలడు.. నటించగలడు.. దర్శకత్వం చేయగలడు. ఇంకేముంది ఒక వెబ్‌సిరీస్‌ రూపొందించాడు. 10 ఎపిసోడ్లు.. ఒక్కటీ బోర్‌ అనిపించదు. తనకంటూ ఓ మార్కెట్‌ క్రియేట్‌ చేసుకున్నడు. మంచి ఆఫర్లు అందుకుంటున్నడు. సిటీ మెయిన్‌ సెంటర్స్‌లో కటౌట్లలో దర్శనమిస్తున్నడు. 

పల్లె వాసన గుబాలింపు 

‘కొత్త పోరడు’ చాలా చిన్న కథ. వింటే సర్వ సాధారణంగానే అనిపిస్తుంది. కానీ చూస్తే మస్తుగనిపిస్తుంది. అలా మెస్మరైజ్‌ చేశాడు అన్వేష్‌. ఏ సినిమా అయినా నేటివిటీకి ప్రాధాన్యం ఇస్తాం. ఎక్కడో న్యూయార్క్‌ సెంటర్లో జరిగిన సంఘటన కంటే, మన బస్తీ వాడకట్టు పంచాయతీపైనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అన్వేష్‌ ఈ లాజిక్‌ను క్యాచ్‌ చేసిండు. తెలంగాణ పల్లె వాసన గుబాళించేలా తీర్చిదిద్దితేనే ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతుందని దాన్నే కథావస్తువుగా ఎంచుకున్నడు. 

చెన్నైలో పుట్టిన కథ

అన్వేష్‌ చెన్నైలో సెంట్రల్‌ గవర్నమెంట్‌ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. అక్కడి అడయార్‌.. వంటి ఏరియాల్లో పోరగాళ్లు బట్టలు అమ్ముతుండేవాళ్లు. వాళ్ల జీవితాల్ని దగ్గర నుండి చూసిన వ్యక్తిగా, దాన్నే కథా వస్తువుగా ఎంచున్నడు. దానిని మన నేటివిటీకి అన్వయించిండు. ఎలాంటి పూత పూయకుండా చాలా కామన్‌గా మాట్లాడే భాషనే వాడిండు. మనలో ఒక్కడు అని ఫీల్‌ అయ్యేలా పాత్రలను తీర్చిదిద్దిండు. తెలంగాణ పల్లెదనానికి జీవం పోసినట్లుండె వెబ్‌ సిరీస్‌ రూపొందించగలిగిండు. 

మోండా మార్కెట్‌లో షురూ 

అడయార్‌లో లూనాపై తిరుగుతూ బట్టలు అమ్ముకునే వాళ్లను చూసినప్పుడు అన్వేష్‌ మైండ్‌లో మెరుపు మెరిసింది. దీనిని మన మోండా మార్కెట్‌కు సరిపోల్చుకున్నడు. ఇది తమిళ.. మలయాళ సినిమాల్లో కనిపించే రా కల్చర్‌. తెలుగులో చాలా అరుదు. తెలంగాణలో అయితే అసలు లేనే లేదు. సినిమా లైనైతే దొరికింది. కానీ అంత స్థోమత లేకుండె. ఫైనాన్షియల్‌గా సెటిల్‌ అయినంక సినిమా తీద్దామని  ఆగిండు. ఇక బతకగలను అనుకొని హైదరాబాద్‌ షిఫ్టయ్యి పని షురూ చేసిండు. 

మూలాల అధ్యయనం 

హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయినంక కథ రాసుకోవడం మొదలు పెట్టిండు. దీనికోసం 2018లో తెలంగాణ జిల్లాల్లో పర్యటించి చిందు.. యక్షగానం.. ఒగ్గుకథ.. వంటి కళా నేపథ్యం ఉన్న కుటుంబాలను కలిసిండు. కళే ప్రపంచంగా బతికిన ఆ కళాకారుల జీవితాలు ఎలా ఉన్నయి? తర్వాతి తరాలు ఆ కళలపట్ల ఎంత ఆసక్తిగా ఉన్నయి? వారి వేషభాషలేంటి? అని మూలాల్లోకి వెళ్లి అధ్యయనం చేసిండు. సినిమాల పట్ల.. కళల పట్ల.. తెలంగాణ రూరల్‌ ఫ్లేవర్‌ పట్ల అతనికున్న అభిరుచి ఆ నోటా ఈ నోటా తెలిసి మల్లేశం సినిమాలో అవకాశం వచ్చింది. 

 అసలేముంది కథలో? 

ఇస్తారయ్య ఊరూరా తిరిగి బట్టలమ్ముతడు. విలాసాలెక్కువ. ఆఖరికి ఆ విలాసానికే బలయ్యిండు. అప్పులు చేసి కొడుకు నెత్తిల మోపి పోయిండు. దినాలు కాకముందే అప్పులోళ్ల పంచాయితీ.. ‘ఎహే మీరెంత మీ పైసలెంత’ అని ఇస్తారయ్య కొడుకు రాజు అప్పులోల్ల మీద తిరగబడుడు.. అప్పు తీర్చేందుకు పట్నం పోవుడు.. మోండా మార్కెట్‌లో బట్టలమ్ముతుంటే ఓ డైరెక్టర్‌ కండ్లల్ల పడటం.. హీరోగా సెలెక్ట్‌ అవ్వడం.. హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయిన బేగంపేట సుకన్యతో ప్రేమ.. ఇంతలోనే మాజీ లవర్‌ ఎంట్రీ.. సుకన్య వేరే పెండ్లి నిశ్చితార్థం.. అప్పులోళ్లు లొల్లి.. నిర్మాత డబ్బులెగ్గొట్టడం.. చేసేదేమీ లేక హార్డ్‌డిస్క్‌లు దొంగిలించడం.. నిర్మాత కాళ్ల బేరానికి రావడం.. డబ్బు చేతికి అందటం.. వంటి మలుపులతో కూడిన కథ ఇది. 

ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌

‘మనిషికి కావాల్సింది డబ్బే కదా.. తీస్కో నీ డబ్బు’ అని సినిమా వల్ల వచ్చిన డబ్బును అప్పులోళ్ల మీద విసిరేయగా సినిమా ఎండ్‌ అవుతుంది. డబ్బు మనిషిని ఎలా తిప్పుతుందో మెసేజ్‌ ఇచ్చిండు. ప్రస్తుతం రెండు ఫీచర్‌ ఫిల్మ్స్‌కు రాస్తున్నడు. ఓ సంవత్సరం సినీఫీల్డ్‌ స్తబ్దుగానే ఉంటుందని గ్రహించి ఇంకో వెబ్‌ సిరీస్‌ ప్లాన్‌ చేస్తున్నడు. 

ఊహించని సక్సెస్‌ 

2019లో మొత్తం స్క్రిప్ట్‌పై పని చేసిండు. అందర్నీ టచ్‌చేసేలా స్క్రీన్‌ప్లే రూపొందించిండు. 2020లో 10 సిరీస్‌లుగా వెబ్‌మీదికి తీసుకొచ్చిండు. సినిమా అయితే తీసిండు కానీ ఇంత ఆదరణ వస్తుందని మాత్రం అనుకోలేదు. ఎందుకంటే మనకు ఈ ఫార్మాట్‌ అంతా కొత్తది. తెలంగాణ పల్లెదనం అది కూడా కచ్చాగా చూపించడం అంటే తెగువ ఉండాల్సిందే. అదొక సాహసం అనుకోవచ్చు. నటుడు.. దర్శకుడు.. కథా రచయిత అన్నీ అతడే. కొడితే దిమ్మతిరిగిపోద్ది అని నిరూపించుకున్న ఒక తెలంగాణ ఆణిముత్యంగా అందరి ప్రశంసలూ అదుకుంటున్నడు. logo