గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - May 17, 2020 , 00:31:43

మాటలే తూటాలు

మాటలే తూటాలు

‘శబ్దార్థభావాల త్రివేణి సంగమ రూపమే మాటంటే. మంచి వాక్కు మనిషికి శోభనిస్తూ  ఓ అలంకారంగా భాసిల్లుతుంది. మాట మంచులా పన్నీటి జల్లుల్ని వర్షిస్తుంది. ఒక్కోసారి మంట పుట్టిస్తుంది. ఓ మార్దవమైన మాట హృదయానికి సాంత్వనను చేకూరుస్తుంది.  మాటకు మంత్రశక్తి ఉందని చెబుతారు. సినిమా ‘మాట’కు నేడు జనబాహుళ్యంలో ఎంతో విలువ ఉంది. అర్థవంతమైన కథకు మంచి మాటలు తోడైతే ఆ సినిమా ప్రేక్షకుల జేజేలు అందుకుంటుంది’ అంటున్నారు ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా. ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘కంచె’, ‘గోపాల గోపాల’, ‘ఖైదీ నెం 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘మహానటి’ వంటి పలు విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రతిభాశీలియైన సంభాషణలకర్తగా పేరు తెచ్చుకున్నారాయన. సినిమాల్లో ‘మాట’ ముచ్చట గురించి ఆయన చెప్పిన సంగతులివి..

నాస్వస్థలం తెనాలి. అమ్మానాన్న ఇద్దరూ థియేటర్‌ ఆర్టిస్టులే.  దాంతో చిన్నతనం నుంచి నాటకాల మధ్యే పెరిగాను. నాటకాల రిహార్సల్స్‌, పద్యాల్ని ఆలపించడం, సంభాషణల్ని వల్లె వేయడం వంటి పనుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తుండేవాడిని. ఆ కారణంగా స్కూల్‌ వయసులోనే నాటకరంగం తాలూకు పరిమళాల్ని ఆఘ్రాణించే అవకాశం దక్కింది. ఆరేళ్ల వయసులోనే ‘హరిశ్చంద్ర’ నాటకంలో లోహితాసురుడు పాత్రను పోషించాను. ఆరో తరగతిలో ప్రవేశించే నాటికే నాటకాల తాలూకు ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాను. అప్పటినుంచి ప్రతి ఏడాది విధిగా నాటకాలు వేస్తుండేవాడిని.  నేను రాసిన తొలినాటిక ‘బ్రోచేవారెవరురా’ మంచి పేరు సంపాదించుకుంది. 

సినిమానే జీవితం అనుకున్నా

పాఠశాల రోజుల్లోనే  సినీరంగంలో స్థిరపడాలని, సినిమానే జీవితంగా బతకాలనే  నిర్ణయానికొచ్చాను.  ప్రముఖ మాటల రచయిత బొల్లిముంత శివరామకృష్ణగారి వద్ద శిష్యరికం నా ప్రతిభకు మెరుగులు దిద్దింది.  హైదరాబాద్‌ వచ్చిన తర్వాత తొలుత సీరియల్స్‌కు రచయితగా పనిచేశాను. దర్శకుడు క్రిష్‌ స్వీయ నిర్మాణ సంస్థ ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రూపొందించే ధారావాహికలకు మాటలు రాశాను. ‘పుత్తడి బొమ్మ’ సీరియల్‌లో నా పనితనం మెచ్చిన  క్రిష్‌ తాను దర్శకత్వం వహించిన ‘కృష్ణం వందేజగద్గురుం’ చిత్రానికి మాటల రచయితగా అవకాశమిచ్చారు. అలా సంభాషణల రచయితగా నా ప్రయాణం మొదలైంది.

రచయిత, దర్శకుడి మధ్య విభేదాలు సాధారణమే..

సినిమా 24 విభాగాల సమిష్టి కళ. ఈ ప్రయాణంలో తప్పకుండా ఆలోచనల వైరుధ్యం ఉంటుంది. సినిమా రచనను తీసుకుంటే   కొన్ని సందర్భాల్లో  దర్శకుడు, మాటల రచయిత మధ్య సృజనాత్మకమైన సంఘర్షణ అనివార్యమవుతుంది. ఒక్కోసారి దర్శకుడి భావాన్ని రచయిత పూర్తిగా ఆకళింపు చేసుకోలేకపోవచ్చు. అదే సమయంలో రచయిత మాట దర్శకుడి ఆలోచనల్ని పూర్తిగా సంతృప్తిపరచలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో  ఇద్దరి భావాల మధ్య మథనం జరగాలి. అప్పుడే సన్నివేశానికి, సందర్భానికి కావాల్సిన మంచి మాట పుడుతుంది.   సంభాషణల రచన విషయంలో దర్శకుడు, మాటల రచయిత మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ తలెత్తడం పరిశ్రమలో సర్వసాధారణం. 

అందుకే దర్శకత్వం వైపు వెళ్తున్నారు..

 నా దృష్టిలో ప్రతి రచయితలో ఓ దర్శకుడు ఉంటాడు. అదే విధంగా ప్రతి దర్శకుడిలో అంతర్లీనంగా ఓ రచయిత కనిపిస్తాడు. ఎప్పుడైతే రచయిత తన ఆత్మకు బాగా దగ్గరైన కథను తన శైలికి అనుగుణంగా చెప్పాలని భావిస్తాడో అప్పుడు దర్శకత్వం గురించి ఆలోచిస్తాడు.  చాలా మంది రచయితలు డైరెక్షన్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం అదే. మరికొంత మంది దర్శకులమవుదామని ఇండస్ట్రీకి వచ్చి రచయితలుగా కెరీర్‌ను కొనసాగిస్తుంటారు.  మంచి అవకాశం వచ్చినప్పుడు దర్శకులుగా మారతారు. 

సాహిత్య అభినివేశం ఉండితీరాలి

రచయిత కావాలనుకునేవారికి పుస్తకపఠనం మీద అనురక్తి ఉండాలి.  సినిమాల్ని బాగా చూడాలి. ఏదో యథాలాపంగా సినిమాలు చూస్తే కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతాం. అందుకు భిన్నంగా సినిమాలోని ఆత్మను పట్టుకునే కౌశలం ఉండాలి. కథలోని మంచిచెడులను విశ్లేషించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. గొప్ప సినిమాలు చూడకుండా,  పుస్తకాలు చదవకుండా రచన, దర్శకత్వం వైపు వెళ్లొద్దు. ముఖ్యంగా రచయితకు లోకజ్ఞానం, పుస్తకజానంతోపాటు సాహిత్య అభినివేశం తప్పకుండా ఉండితీరాలి. ‘తలొంచుకొని నా పని నేను చేసుకుంటా’ అనే స్వభావం ఉన్నవారు సినీరంగంలోని ఏ విభాగంలోనూ ఇమడలేరు. అన్ని దిక్కులు చూస్తూ నడవాలి. చుట్టూ  ఉన్న సమాజాన్ని అనుక్షణం పరికిస్తూ, సంఘటనలను లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తే రచయితగా, దర్శకుడిగా, కళాకారుడిగా రాణిస్తాడు.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌'తో కల నెరవేరింది

నేను ప్రస్తుతం మాటలు అందిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (‘ఆర్‌.ఆర్‌.ఆర్‌') మహాద్భుతమైన సినిమా.  రాజమౌళిగారితో  పనిచేసే అవకాశం రావడంతో నా కల నెరవేరినట్లయింది. ‘బాహుబలి’ సినిమాకు నేనే మాటలు రాయాల్సింది. అనివార్య కారణాల వల్ల అవకాశం మిస్సయింది.  ప్రస్తుతం క్రిష్‌-పవన్‌కల్యాణ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రంతో పాటు ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంభాషణల్ని అందిస్తున్నా.జీవితంలోని డ్రామాపై పట్టుండాలి

తమ శక్తియుక్తులపై అంచంచల విశ్వాసంతో సంకల్పబలాన్ని నమ్ముకొని వచ్చే ప్రతి ఒక్కరికి సినీ పరిశ్రమలో స్థానం ఉంటుంది.  మనలో ఏ కళ ఉందో ముందు దానిని పరీక్షించుకోవాలి. రాయగలిగే నేర్పు ఉందనిపిస్తే  స్వీయవిశ్లేషణతో మనలోని ప్రతిభను బేరీజు వేసుకోవాలి.  ముందు మన మనసు మాట మనం వింటేనే ప్రపంచం మన మాట వింటుంది. రాయాలనే  జిజ్ఞాస స్వాభావికంగా తమలో ఉన్నవారే రచయితలుగా రాణిస్తారు.  అయితే నాటకం, కథ,  నవల, సినిమా...ఇలా  సృజనాత్మక ప్రక్రియలో భాగమై ఉన్న వారు ఎవరైనా సరే తొలుత జీవితంలో నడిచే డ్రామాను ఒడిసిపట్టుకోగలగాలి. అప్పుడే ఆత్మసంతృప్తితో పాటు విజయాలు సాధ్యమవుతాయి.

పాత్ర ఆత్మకు ప్రతిబింబమే మాట..

సినిమాలోని పాత్రలు పలికే మాటల మీదే  సన్నివేశాల ఆర్థ్రత, భావోద్వేగాలు నిర్ణయమవుతాయి. సన్నివేశం తాలూకు భావాన్ని మాట ద్వారానే వ్యక్తం చేస్తాం. సంభాషణ ద్వారానే కథాంశం లోతు ఏమిటో ప్రేక్షకుడు తెలుసుకుంటాడు. సన్నివేశం తాలూకు ఆత్మకు రూపమే మాట అని అభివర్ణించవచ్చు. మాట బరువుగా లేకపోతే ఆత్మ వ్యక్తీకరణ పేలవంగా తయారవుతుంది.  ‘ముత్యాలముగ్గు’ చిత్రాన్ని తీసుకుంటే మాట ప్రస్తావన లేకుండా ఆ సినిమా గురించి మాట్లాడుకోలేం. ముళ్లపూడి వెంకటరమణ మాట మ్యాజిక్‌ ఏమిటో ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. పరుచూరి బ్రదర్స్‌ రాసిన ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ సినిమా గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు మొదట స్ఫురణకు వచ్చేవి మాటలే. సినిమా అనేక వర్ణాలు కలబోసి అందమైన  దృశ్యమాధ్యమం. అయితే తెరమీద దృశ్యం చెప్పలేని భావాన్ని కేవలం మాట మాత్రమే వ్యక్తీకరించగలదు. డైలాగ్‌ తక్కువగా ఉన్నా అది సూటిగా వెళ్లి హృదయాన్ని తాకగలగాలి. అలాంటి సంభాషణలే ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. సినిమా అనే అద్భుత దృశ్యకావ్యం మీద తళుక్కున మెరిసే తటిల్లత మాట అన్నది నా అభిప్రాయం. అయితే కేవలం మాటల నేర్పు వల్లే సినిమాలు ఆడవు. అదే సమయంలో విజయవంతమైన సినిమాల్లో మాట ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది.ప్రయత్నిస్తే పంచ్‌లు రావు..

ప్రస్తుతం సినిమాల్లో పంచ్‌డైలాగులు, ప్రాసయుక్తమైన మాటల కూర్పు ఎక్కువగా కనిపిస్తున్నది. సినిమా రచనకు పంచ్‌లు, ప్రాసలు అవసరమే. అయితే అవి మాటల ప్రవాహంలో ఓ ఛమక్కులా అనిపించాలి.  ఏదో పంచ్‌ రాద్దామని ప్రయత్నించి రాస్తే అది పంచ్‌డైలాగ్‌ కాలేదు. నా ఉద్ధేశ్యంలో ప్రయత్నించి రాసిన పంచ్‌లకు అంతగా స్పందన రాదు. నా దృష్టిలో పంచ్‌ అంటే ఆ సన్నివేశాన్ని క్లుప్తీకరించి తక్కువ పదాల్లో సూటిగా చెప్పిన భావమే తప్ప భాష కాదు. డైలాగ్‌లో ఉండే ఛమక్కే పంచ్‌ అవుతుంది. ప్రయత్నించి రాసిన పంచ్‌లు, ప్రాసలకు ఆ క్షణం మాత్రమే చప్పట్లు కొడతారు. ఆ తర్వాత మరచిపోతారు. హృదయాన్ని తాకిన మంచి సంభాషణ మాదిరిగా పంచ్‌ డైలాగులు కూడా ప్రేక్షకులకు గుర్త్తుండిపోవాలి. అప్పుడే వాటికి విలువ ఉంటుంది. మాటల రచయితగా నామీద ఆత్రేయ ప్రభావం ఎక్కువ. ఆయన మాట, పాట చాలా ఇష్టం. ముళ్లపూడి వెంకటరమణ, ఎం.వి.యస్‌. హరనాథరావు, గణేష్‌పాత్రో, పరుచూరి బ్రదర్స్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌...ఇలా ప్రతిభావంతులైన రచయితలందరూ నా మాటలకు స్ఫూర్తినిచ్చారు. నాటకానికి మరోరూపం సినిమా. నాటకమైనా, సినిమా అయినా సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. మానవ సమాజాల్లో వచ్చే మార్పులే కళారూపాల్లో కనిపిస్తాయి. నేటి కాలమాన పరిస్థితులు, పరిణామాలు,   సాంఘిక పోకడల్నే ఇప్పటి సినిమాల్లో చూస్తున్నాం.

-కళాధర్‌ రావు


logo