శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - May 17, 2020 , 00:22:38

ప్రాక్టికల్‌ జోకర్‌

ప్రాక్టికల్‌ జోకర్‌

మార్టిన్‌ తన కొత్త క్లయింట్‌ వంక చూసాడు.“నన్ను మీరు హత్యానేరంలోంచి కాపాడాలి. మీ క్లయింట్‌ అమాయకుడని కోర్ట్‌ వదిలేస్తేనే మీరు ఫీజ్‌ తీసుకుంటారని, లేకపోతే తీసుకోరని విన్నాను. నేను విన్నది నిజమా?” క్రోవి ప్రశ్నించాడు.“అవును. నిజమే” మార్టిన్‌ ఒప్పుకున్నాడు.“అందువల్ల మీకు నష్టం రాదా?”“రాదనే అనుకుంటున్నాను. ఇందువల్ల నా దగ్గరకి చాలామంది క్లయింట్స్‌ వస్తుంటారు. గెలుస్తాననే నమ్మకం ఉంటేనే నేను కేసు తీసుకుంటాను. మీ కేసు గురించి చెప్పండి. మీ మీద హత్యానేరం ఉందా?” మార్టిన్‌ చిరునవ్వుతో ప్రశ్నించాడు.“ఇంకా లేదు.”“కాని ఇందాక మీరు...”“నన్ను హత్యానేరం లోంచి మీరు కాపాడాలి అని చెప్పా ను కానీ, ఇప్పటికే ఆ నేరం నా మీద ఆరోపించబడిందని ఎక్కడా అనలేదే” క్రోవి చెప్పాడు.

“అలాగా..? మీరు ఎవర్ని చంపారు?”

“ఎవర్నీ చంపలేదు.”

మార్టిన్‌ అతని వంక వింతగా చూసాడు.

టెరెన్స్‌ రెజినాల్డ్‌ని చంపిన నేరానికి నా మీద నేరారోపణ జరిగితే మీరు నన్ను కాపాడాలని కోరడానికి వచ్చాను.”

“టెరెన్స్‌ రెజినాల్డ్‌ ఇంకా జీవించే ఉన్నాడా?”

“అవును.”

“అతన్ని మీరు చంపదలచుకున్నారా?”

“అవును.”

“అందుకని ముందుగా మీరు నా క్లయింట్‌ అవ్వాలని వచ్చారా?”

“అవును.”

“మీ ముందుచూపు మెచ్చదగ్గది. మీరు అతన్ని ఎందుకు చంపాలని అనుకుంటున్నారు?” మార్టిన్‌ ప్రశ్నించాడు.

“నాకు పిచ్చెక్కిస్తున్నందుకు.”

“ఎలా?”

“నా మీద ట్రిక్స్‌ ప్రయోగిస్తున్నాడు.”

“ఎలాంటివి?”

“చిన్న పిల్లల ట్రిక్స్‌. క్రితం వారం అతను నగరంలోని అనేకమంది ఆడవాళ్ళకి నేను పంపినట్లుగా పూలగుత్తులని, నా క్రెడిట్‌ కార్డ్‌లని ఉపయోగించి ఆర్డర్‌ చేసి పంపాడు. నా క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు అతను ఎలా సంపాదించాడో నాకు తెలీదు.”

మార్టిన్‌ అతని వంక ఆలోచనగా చూశాడు.

“ఇది ఉదాహరణ మాత్రమే. మరోసారి అంబులెన్స్‌లు చాలా మా ఇంటికి వచ్చాయి. మరోసారి ట్యాక్సీలు. ఇంకోసారి లిమజిన్స్‌. అతను పత్రికల్లోని కూపన్స్‌ నింపి నా చిరునామాతో, క్యాష్‌ ఆన్‌ డెలివరీ పద్ధతిలో చాలా వస్తువులని ఆర్డర్‌ చేశాడు. నా పేరుని బుక్‌ క్లబ్స్‌లో, రికార్డ్‌ క్లబ్స్‌లో చేర్పించాడు. అమెరికాలోని దాదాపు అన్ని పత్రికలకి నా పేర చందా కూపన్స్‌ పంపాడు. రెడ్‌ క్రాస్‌ లాంటి సంస్థలకి నేను వంద డాలర్ల చెక్‌లని జత చేస్తున్నట్లు ఉత్తరాలు రాశాడు. వాళ్ళ నించి ‘చెక్‌ని జత చేయడం మర్చిపోయారా’ అని నా వితరణని మెచ్చుకుంటూ జవాబులు వచ్చాయి. మీకు తెలుసు. ఓ సారి ఇలాంటి ఛారిటీ సంస్థలకి చిరునామా దొరికితే ఇక ఉత్తరాల పరంపర సదా కొనసాగుతూనే ఉంటుంది. నా మెయిల్‌ బాక్స్‌ని నేను ఒక్క రోజు క్లియర్‌ చేయకపోయినా మర్నాడు ఉత్తరాలు వేయడానికి అందులో చోటుండదు” క్రోవి ఆవేదనగా చెప్పాడు.

“మీ మీద అతను వేసే ఇలాంటి ప్రాక్టికల్‌ జోక్స్‌కి మీరు అతన్ని చంపాలని అనుకుంటున్నారా?” మార్టిన్‌ అడిగాడు.

“దీనికి అంతం లేదు. రెండేళ్ళ క్రితం అతను వీటిని ఆరంభించాడు. మొదట్లో ఇది ఎవరి పనో తెలీక భయపడ్డాను. కొద్ది నెలలు విరామం ఇవ్వడంతో ఇక మానేశాడని అనుకోగానే మళ్ళీ మొదలెడతాడు.”

“మీరు అతన్ని ఎందుకిలా చేస్తున్నావని అడిగారా?” మార్టిన్‌ ప్రశ్నించాడు.

“లేదు. అతనికి ఫోన్‌ చేసినప్పుడల్లా పెద్దగా నవ్వి జవాబు చెప్పకుండా లైన్‌ కట్‌ చేసేస్తాడు.”

“అతన్ని వ్యక్తిగతంగా కలిశారా?”

“లేదు. అతను తన ఆపార్ట్‌మెంట్‌లోకి ఎవర్నీ అనుమతించడు. చిప్పెవా స్ట్రీట్‌లో ఉంటున్నాడు. అతను తన ఇంట్లోంచి బయటకి రాడు.”

“పోలీసులకి ఫిర్యాదు చేశారా?”

“చేశాను. వాళ్ళేమీ చేయలేకపోయారు. అబద్ధాలు చెప్పాడు. అది తన పని కాదని బుకాయించాడు. తన పగ చల్లారాక అతనే మానేస్తాడని, ఋజువులు లేకుండా తామేం చేయలేమని వాళ్ళు చెప్పారు.”

“మీమీద అతనికి పగ దేనికి?”

“కారణం లేదు. అసలు మా ఇద్దరికీ పరిచయం ఏమీ లేదు. అతన్ని నేను ఎన్నడూ చూడనైనా చూడలేదు. నేనో ప్రైవెట్‌ డిటెక్టివ్‌ని నియమించి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించాను. వాటిని పరిశీలించిన ఇద్దరు లాయర్లు కేసు కోర్టులో ఓడిపోతుందని చెప్పారు.”

“ఎందుకని?”

“అతను కుంటివాడు. చక్రాల కుర్చీకే పరిమితం. అతను కుంటివాడు అవడానికి కారణం నేనే అని అబద్ధమాడచ్చని. అవి అతన్ని జైలుకి పంపేంత నేరాలు కావని. వాటిని పిల్లల ప్రాక్టికల్‌ జోక్స్‌గా భావించి, అతని అంగవైకల్యానికి జాలి పడి, జ్యూరీ సభ్యులు చిన్న ఫైన్‌ని విధించి వదిలేస్తారని చెప్పారు.”

“అతను కుంటివాడు అవడానికి కారణం మీరా?” మార్టిన్‌ అడిగాడు.

“కాదు. అసలు నన్ను అతను హింసించడం ఆరంభించాక కాని అతనంటూ ఓ వ్యక్తి ఉన్నాడని నాకు తెలీదు” క్రోవి చెప్పాడు.

“దాంతో మీరు అతన్ని చంపాలని అనుకుంటున్నారా?”

“ఏమో? ఆవేశంలో నేనా పని చేసినా చేయొచ్చు. రోగం కన్నా చికిత్స హీనంగా ఉందని నాకు అనిపిస్తున్నది. మీ క్లయింట్స్‌ సాధారణంగా విచారణని ఎదుర్కోరని, మీరు కనిపెట్టే లేదా సృష్టించే హత్య ప్రమాదవశాత్తు జరిగింది లాంటి కొత్త సాక్ష్యాధారాల వల్ల అసలు మీ క్లయింట్‌ మీద నేరారోపణ జరగదని విని, మీ సహాయం కోసం వచ్చాను” క్రోవి ఆవేదనగా చెప్పాడు.

“నా ఫీజ్‌ యాభై వేలు. ఒకవేళ మీరు నిజంగా హత్యానేరంలో ఇరుక్కుంటే మళ్ళీ నా దగ్గరకి రండి. ఐనా మీరు అసలు అతన్ని చంపాల్సిన అవసరం లేకుండా ప్రయత్నం చేస్తాను.” మార్టిన్‌ హామీ ఇచ్చాడు.

*  *  *

టెరెన్స్‌ చిప్పెవా స్ట్రీట్‌లోని నాలుగు గదుల అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నాడు.

“మీరు అతని లాయర్‌ అన్నమాట?” అతను మార్టిన్‌ని నవ్వుతూ ప్రశ్నించాడు.

“అవును.”

“ఐతే నన్ను బెదిరించి వెళ్ళండి. కోర్ట్‌లో కేసు వేస్తానని, రౌడీలని పంపిస్తానని... వచ్చిన పని పూర్తి చేసుకుని మీరు వెళ్ళచ్చు.”

“నేను అందుకు రాలేదు.”

“అంటే ఇదివరకు వచ్చిన వాళ్ళతో పోలిస్తే  మీరు బాగా డెవలప్‌ అయ్యారన్న మాట. దేనికి వచ్చారు మిస్టర్‌ లాయర్‌?”

“మీకు క్రోవిమీద అంత పగ దేనికి?”

“నన్ను కుంటివాడిని చేసినందుకా? కాదు. అది అతని పని కాదు. దేవుడి పని. నేను పుట్టుకతో కుంటివాడిని. నాకా మనిషంటే ద్వేషం. అందుకు కారణం అనవసరం. మీరో ఆధ్యాత్మిక ప్రసంగవేత్తని టి.వి.లో చూస్తారు. అతను చెప్పింది కొద్దిసేపు విన్నాక మీకు అతనంటే కోపం కలుగుతుంది. కొందరి కంఠధ్వని మీకెంతో ఎలర్జీగా అనిపిస్తుంది. అతని మీద మీకు ద్వేషం ఏర్పడుతుంది. లేదా మోహం కలుగుతుంది. మనం ఎవర్నయినా ప్రేమించాల్సిన అవసరం ఉన్నట్లుగానే ద్వేషించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని తీర్చుకోవడానికి నేను మీ క్లయింట్‌ని ద్వేషిస్తున్నాను” టెరెన్స్‌ చెప్పాడు.

“నా క్లయింట్‌ని మీరు ఎప్పుడైనా కలిశారా?”

“ఒకర్ని ద్వేషించడానికి అతన్ని కలవాల్సిన అవసరం లేదు. అతన్ని ద్వేషించడంలో నాకు సరదా ఉంది. నేను చేయాల్సిందల్లా రిసీవర్‌ అందుకుని అతన్ని ఇబ్బంది పెట్టడమే. అది నాకు ఆనందాన్ని ఇస్తుంది” టెరెన్స్‌ నవ్వుతూ సంతోషంగా చెప్పాడు.

“మీకు ఆదాయం ఏమిటి?”

“అంగవైకల్యం వల్ల నాకు వచ్చే సోషల్‌ సెక్యూరిటీ చెక్స్‌ మాత్రమే నా ఆదాయం. నేను ఎక్కువ తినను. అందరిలా నేను బట్టలమీద ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నేను బయటికి వెళ్తేగా?”

“నా క్లయింట్‌ మీ ఆదాయాన్ని పెంచుతాడు.”

“నేను బ్లాక్‌మెయిలర్ని కాను.”

నిస్సహాయత అతన్ని పిచ్చివాడ్ని చేసిందని మార్టిన్‌కి అనిపించింది.

*  *  *

పన్నెండు రోజుల తర్వాత మార్టిన్‌ ఫోన్‌ మోగింది. టెరెన్స్‌ నించి.

“నువ్వు హృదయం లేని మనిషివి మిస్టర్‌ మార్టిన్‌” అవతల నించి వినిపించింది.

“అవును.”

“నేను ఇల్లు కదల్లేని కుంటివాడిని. ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకు తెలుసా?” టెరెన్స్‌ ఆక్రోశంగా అడిగాడు.

“కొద్దిగా.”

“నువ్వు దుర్మార్గుడివి.”

“అవును. దాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు.” మార్టిన్‌ చెప్పాడు.

“మర్చిపోను. పదే పదే నన్ను వేధించడం మానేయ్‌.” అర్థించాడు.

అలాగే మీరు కూడా నా క్లయింట్‌ని వేధించడం మానితే మంచిది. మీరా పిచ్చి ట్రిక్స్‌ని తక్షణం మానండి. మీకు ద్వేషించే అవసరం ఉంటే ఇంకా కోట్ల మంది మనుషులు ఉన్నారు. అతనికి ఫోన్‌ చేసి సారీ చెప్పండి. లేదా మీ కష్టాలు కొనసాగుతాయి” చెప్పి మార్టిన్‌ రిసీవర్‌ పెట్టేసాడు.


“అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇందాక జరిగింది. టెరెన్స్‌ నాకు ఫోన్‌ చేసి తను చేసిన పొరపాట్లకి క్షమాపణ వేడుకున్నాడు. అతని గొంతుని నేను గుర్తుపట్టలేదు. భయపడుతున్నట్లుగా మాట్లాడాడు” క్రోవి చెప్పాడు.“అనుకున్నాను.”“ఇక మీదట నాకు అతని వల్ల ఎలాంటి ఇబ్బందీ కలగదని హామీ ఇచ్చాడు. మీరేం మాయ చేసారు మిస్టర్‌ మార్టిన్‌?” క్రోవి ఆశ్చర్యంగా అడిగాడు.“అతను మిమ్మల్ని వేధించడం కొనసాగిస్తే అతనికి జరిగేది రుచి చూపించాను.” మార్టిన్‌ నవ్వుతూ చెప్పాడు.“ఎలా?”“మొదటగా నేను పోస్ట్‌ ఆఫీస్‌కి వెళ్ళి ఫాం తీసుకుని అతని చిరునామాలో మార్పుని రాసి సంతకం చేసిచ్చాను. అతని ఉత్తరాలన్నీ మూడు వేల మైళ్ళ దూరంలోని, చిన్న పల్లెటూరు శ్మశానానికి వెళ్తున్నాయి.”“గుడ్‌ హెవెన్స్‌!”“అతని ఎలక్ట్రిక్‌ కంపెనీకి ఫోన్‌ చేసి, టెరెన్స్‌ ఆ ఇంటిని ఖాళీ చేసాడని, కాబట్టి కనెక్షన్‌ తొలగించమని కోరాను. నాకు ఫోర్జరీ క్లయింట్స్‌ చాలామంది ఉన్నారు. అతను అపార్ట్‌మెంట్‌ని ఖాళీ చేస్తున్నాడని రెండు వారాల నోటీస్‌ ఇస్తూ లీజ్‌ రద్దు చేయమని కోరాను. అతని అపార్ట్‌మెంట్‌ని వారానికి రెండుసార్లు వచ్చి శుభ్రం చేసే పనిమనిషిని కూడా కలిసి, ఆమె సేవలు అవసరం లేదని టెరెన్స్‌ చెప్పమన్నాడని, అతని ఇంట్లోని కొన్ని వస్తువులు ఇటీవల మాయమవడం కారణమని చెప్పాను. ఓ కుంటివాడి జీవితం ఆ పరిస్థితుల్లో ఎంతటి దుర్భరమో మీరే ఆలోచించండి. చీకటి. ఫోన్‌ లేదు. ఇల్లు ఖాళీ చేయాలి. ముఖ్యంగా నీళ్ళు లేవు. అతనికి ప్రపంచంతో గల సంబంధం కేవలం కిటికీలే. నేను అతని కిటికీ అద్దాలకి కూడా అర్ధరాత్రి నల్లరంగు పూయించగానే నాకు అతన్నించి ఫోన్‌ కాల్‌ వచ్చింది. అతను ఏం చేయాలో సలహా ఇచ్చాను. ఫలితంగా మీరు నా ముందున్నారు” మార్టిన్‌ నవ్వుతూ చెప్పాడు.

“అతను నాకేం చేశాడో మీరు సరిగ్గా అతనికి అదే చేసారన్న మాట.”“అవును. నేను అతనికి నేర్పిన పాఠం ఎప్పటికీ మర్చిపోడని అనుకుంటాను.”“తేలిక మార్గం. కాని మెరుగైన మార్గం. నాకీ ఆలోచన వచ్చుండాల్సింది.”“మీకు రానందుకు నాకు ఆనందం” మార్టిన్‌ చెప్పాడు.“ఎందుకని?”“మీరు యాభై వేల డాలర్లు ఆదా చేసుండేవాళ్ళు.” వెంటనే క్రోవి మొహంలో ఆశ్చర్యం ప్రవేశించింది.“యాభై వేల డాలర్లు? అది ఇవ్వాలా?” అడిగాడు.“అవును. అది నా ఫీజ్‌.”“కాని మీరు చేసిన కొన్ని ఫోన్‌ కాల్స్‌కి అది చాలా పెద్ద మొత్తం.”“నేను మీరు కోరిందే చేశాను. హత్యానేరంలో ఇరుక్కోకుండా బయట పడేసాను. దుర్భరంగా మారిన మీ జీవితాన్ని చక్కదిద్దాను.”“కాని నేను అతన్ని చంపి ఉండేవాడిని కాను.”“మీరా ఉద్దేశంతోనే నన్ను కలిసారు. కాబట్టి నాకు సంబంధించినంత వరకు మీరు అతన్ని హత్య చేస్తారు. మీకు కావాల్సిన ఫలితాన్ని నేను మీకు అందించాను. కాబట్టి మీరు నా ఫీజ్‌ని నాకు చెల్లించాలి” మార్టిన్‌ కోరాడు.“కాని అది చాలా పెద్ద మొత్తం మిస్టర్‌ మార్టిన్‌” క్రోవి తల అడ్డంగా ఊపుతు చెప్పాడు.“నా ఫీజ్‌ ఎప్పుడూ పెద్ద మొత్తమని మీకా రోజే చెప్పాను. టెరెన్స్‌ మిమ్మల్ని ద్వేషిస్తూ మీ జీవితాన్ని నరకప్రాయం చేశాడు. మీకు హత్య చేసే పరిస్థితి రాకుండా బయట పడేశాను. న్యాయం ఉందో లేదో మీరే ఆలోచించండి.”క్రోవి జేబులోంచి ఓ చెక్‌ బుక్‌ని తీసి, దాన్ని రాసిచ్చి మరోసారి థాంక్స్‌ చెప్పి వెళ్ళిపోయాడు. మార్టిన్‌ ఆ చెక్‌ని చూస్తే అది ఐదు వేలకి. ఆయన చిన్నగా నవ్వి దాన్ని చింపి చెత్తబుట్టలో పడేసి రిసీవర్ని అందుకున్నాడు.

“నాకు తెలుసు, ఇది మీ పనేనని” క్రోవి ఆందోళనగా చెప్పాడు.“ఏమిటి నా పని?” మార్టిన్‌ ప్రశ్నించాడు.“నేను చచ్చానని మీరు అండర్‌టేకర్‌కి ఫోన్‌ చేసారు. ఇంకా నా శవపటిక కోసం ఫోన్‌ చేసి నా పేరు, చిరునామా ఇచ్చారు.”“ఋజువు చేయగలరా? ఐనా ఇది అన్యాయం కాదుగా. మీరు మొదటిసారి ఈ ఆఫీస్‌లోకి ఏ రకమైన జీవితంతో అడుగు పెట్టారు. అదే కొనసాగుతుంది. దాన్ని తొలగించమని మీరు నన్ను కోరడానికి వస్తే మీరు ముందుగా నా ఫీజ్‌ చెల్లించాలి.”“యాభై వేల డాలర్లకి చెక్‌ తెచ్చాను” క్రోవి ఓడిపోయిన మొహం పెట్టి ఓ కవర్ని ఇచ్చి చెప్పాడు.“ఇప్పుడు నా ఫీజ్‌ అరవై వేలు” మార్టిన్‌ ఆ కవర్ని అందుకోకుండా చెప్పాడు.“మళ్ళీ ఇదేమిటి?”“నాకు ఎక్కువ పని పెట్టారు. దానికి పది వేలు అదనంగా చెల్లించాలి. లేదా...”“అర్థమైంది.” క్రోవి ముక్కుపుటాలు అదురుతూంటే జేబులోంచి చెక్‌ బుక్‌ని బయటకి తీసాడు.“ద్వేషం చెడ్డదని మీరు అనుభవపూర్వకంగా గ్రహించారు. ఆ చెక్‌ని చిరునవ్వుతో రాయమని నా సలహా.” మార్టిన్‌ కోరాడు.

(లారెన్స్‌ బ్లాక్‌ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి


logo