సోమవారం 25 మే 2020
Sunday - May 17, 2020 , 00:13:28

కోడికూయని ఊరు...చేప ముట్టనివారు

కోడికూయని ఊరు...చేప ముట్టనివారు

ఇంటికి బంధువులు వస్తే కోడికూర వండాల్సిందే. కనీసం కోడిగుడ్డయినా ఉడికించాలి. కానీ కంచిరావుపల్లి తండాలో కోడి కూర సంగతి పక్కన పెడితే, అసలు కోళ్లనే పెంచరు. అదొక్కటే కాదు, తండా వాసులకు కనీసం చేపల రుచి కూడా తెల్వదు. అనేక సంవత్సరాలుగా ఈ ఆచారం ఉంది. మొత్తం 80 కుటుంబాలు ఉన్న తండాలో... సోమసాత్‌ గురూజీ మాటలకు కట్టుబడి గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పల్లెటూళ్లలో కోడికూతతోనే ప్రజలు నిద్రలేస్తారు. కోడికూరతోనే మర్యాద చేస్తారు. కానీ ఆ గ్రామం మాత్రం కోడికూత వినదు. కోడికూర తినదు. అసలు ఆ ఊళ్లో కోడే కనిపించదు. కోడి పేరెత్తితేనే అంత దూరం పారిపోతారు. కోడి అంటే ఆ ఊరికి ఎందుకు అంత అయిష్టమో తెలుసుకోవాలంటే... వనపర్తి జిల్లా పెబ్బేర్‌ మండలం కంచిరావుపల్లి తండాకు వెళ్లాల్సిందే. ఇది కాకుండా, చేపలు ముట్టకపోవడానికి కూడా ఓ కారణం ఉంది.

శాకాహారులేం కాదు

నిన్నమొన్నటి వరకు చిన్న తండాగా ఉన్న కంచిరావుపల్లి నేడు గ్రామ పంచాయతీ అయ్యింది. అలా అని, పల్లెలో ఎవరూ కోడికూర తినరంటే, ఊరంతా శాకాహారులేమో అన్న అనుమానం రావచ్చు. అదేం లేదు. కోడి, చేప తినకపోవచ్చు కానీ... పండుగలు, పర్వదినాలను మాత్రం యాటతో చేసుకుంటారు. అంటే మేక మాంసం నిక్షేపంగా లాగిస్తారు. ఎంత ఇబ్బంది అయినా కోడిజోలికి వెళ్లరు. చేపలు ముట్టరు. ఇంకా చెప్పాలంటే, కోడి పేరు చెబితేనే వాంతులు చేసుకుంటారు. దీనివెనకో నమ్మకం ఉంది. తాము విశ్వసించే గురువుతో ముడిపడిన గాథ ఉంది. పూర్వం, కంచిరావు పల్లికి చెందిన సోమసాత్‌ గురూజీ ఓ కోడిని పెంచుకునేవాడు.  దాన్ని ప్రాణంలా చూసుకునేవాడు. కుటుంబంలో మనిషిలా భావించేవాడు. అలాంటి కోడి ఓ రోజు గురూజీ నోట్లో నుంచి పడిన ఉమ్మిని తినేసిందట. దీంతో గురువుగారికి ఆగ్రహం కలిగింది. ప్రజలు కూడా తాము డేవుడిలా భావించే గురువు అవమానానికి గురైనందుకు ఆవేదన పడిపోయారు. దీంతో కోళ్లను పెంచడం మానేసినట్లు గ్రామస్థులు చెబుతారు. నాటి నుంచీ ఊళ్లో కోళ్ల పెంపకం నిషేధించారు. కోడి మాంసాన్ని పళ్లెంలోంచి బహిష్కరించారు. కోడే లేనిచోట, కోడిగుడ్డు మాత్రం ఎందుకు ఉంటుంది? అలా గుడ్డు కూడా మాయమైపోయింది. మరో సందర్భంలో.. గురూజీ చెరువులో ముఖం కడిగేటప్పుడు చేపలు కూడా ఆయన ఉమ్మిని తిన్నాయట. దీంతో చేపల మీదా కోపం వచ్చింది. ప్రజలు మూకుమ్మడిగా వాటినీ బహిష్కరించారు. జిహ్వ చాపల్యం కొద్దీ ఎవరైనా చికెన్‌ తింటే, గుడ్డుతో అట్టు వేసుకుంటే, చేపల కూర వండుకుంటే?  ఫలితం ఘోరంగా ఉంటుందని గురువుగారు హెచ్చరించారు. ‘అలా జరిగితే మాత్రం.. రక్తం కక్కుకుని చచ్చిపోతారు’ అని ఆగ్రహంగా శాపం పెట్టారు. అప్పటి నుంచి ఆ ఊళ్లో నాన్‌వెజ్‌ అంటే  మేకలూ పొట్టేళ్లే! ఆ గ్రామ ప్రజలు పొలిమేర దాటినప్పుడు కూడా నియమాన్ని వదిలిపెట్టరు. పెండ్లిండ్లకు, దావత్‌లకు వెళ్లినా కూడా చికెన్‌ ముక్క ముట్టరు. జిహ్వ చాపల్యాన్ని గెలిచింది ఆ పల్లె!

బిడ్డలు ఓకే..కోడళ్లు నో..

అయితే ఇక్కడ ఇంకో వింత ఆచారం ఉంది. ఈ ఊరికి కోడలిగా వచ్చేవాళ్లు కూడా కోడికూరను మరిచిపోవాల్సిందే. లేదంటే అరిష్టమని నమ్ముతారు. ఒక్కసారి కంచిరావుపల్లి తండా అత్తగారింట్లో అడుగుపెట్టాక మళ్లీ పుట్టింటికెళ్లినా చికెన్‌ ముట్టకూడదు. కానీ పెళ్లి చేసుకొని వేరే ఊరికి వెళ్లిన ఆడపిల్లలు మాత్రం, అత్తగారింట్లో హాయిగా కోడికూర ఆరగించవచ్చు. పెండ్లి సంబంధం కలుపుకొనేటప్పుడే ఈ ముచ్చట చెప్పి, ఖాయం చేసుకుంటారు. గ్రామానికి చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నా.. ఊరి ఆచారాన్నే పాటిస్తారు. పిల్లల్ని చేర్పించినప్పుడే... కోడి, గుడ్డు పెట్టవద్దని వార్డెన్‌కు చెప్పి వెళ్తారు. కనీసం ఆ వాసన చూడటానికి కూడా పిల్లలు ఇష్టపడరు. 


logo