గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - May 17, 2020 , 00:08:28

సిగ్గువొయ్యింది

సిగ్గువొయ్యింది

ఎప్పటోలెనే ఎండుకాలం తాతిల్లు షురూ కాంగనే అమ్మమ్మోల్ల ఊర్లవడ్డ దాంక పోయినం అందరం కట్టగట్టుకొని. మల్ల తెల్లారే మా అమ్మక్క, మా మల్లిగాడు అంటె మా అమ్మక్క కొడుకు, మా పెద్దమామ కొడుకు కొండల్గాడు ఒచ్చిండ్రు. మా ముగ్గుర్దీ ఒకటే సోపతి. మేమంత ఆర్నెల్ల సందున పుట్టినోల్లం. ఇగ ఏడ తిరిగినా, ఏడికి పోయినా, ఒగని తోకవట్టుకొని ఒగరం తిరిగేటోల్లం. అందుట్ల నేనే జర్రంత పెద్దోన్నైనందుకు ఇద్దర్నీ మల్లిగాడంటాని, కొండల్గాడంటాని పిలుస్త. ఇగ అందరం పిల్లలం జమైనం. ఒగరా ఇద్దరా మొత్తం లెక్కవెడితే ఇయ్యాల్టికి పంతొమ్మిది మందిమైతం గని, ఆయల్ల సగం మంది పుట్టనే పుట్టలే. ఇల్లంత పిల్లలతోని, పెద్దోల్లతోని ఒక జాతర తీర్గ, నిచ్చె ఓ పెండ్లి తీర్గ గొడుతుండె.గప్పుడు జర పెద్దగనే ఉన్నం. ఆరో తరగతి అంటే పెద్దగైనట్లే మల్ల. ఇగ ఒగనాడు తెల్లారంగనే మేమ్ముగ్గురం కూడవలుక్కొని బాయి మొకాన వడి పొయినం. నడుస్త నడుస్త కానుగుపుల్లనో, యాపపుల్లనో, తంగెడుపుల్లనో ఇరుసుకొని నోట్లేసుకోని నముల్కుంట, పండ్లు తోముకుంట ఏనె పక్కలున్న కుంట కాడికి వొయ్యి దొడ్డికి కూసోని, మల్ల చిట్టెం బాయికాడికొచ్చి పండ్ల పుల్ల పారేసి మొకం కడుక్కోని ఇంటి మొకానవడి పోయినం.  ఏడికి పోయినా ముగ్గురం పోతుంటిమి. అమ్మమ్మ ఎన్నడన్న దుక్నానికొయ్యి అగ్గిపెట్టె తెమ్మని తోలిచ్చినా ముగ్గురం జతై పోతుంటిమి. ’తిర్మూర్తులోలె ఊర్లె యాడ సూసినా ముగ్గురు కన్లవడ్తరు, ముద్దుగున్నరు పోరలు’, అంటాని అనుకునేటోల్లు సుట్టుపక్కలోల్లు.మొదాలే ఎండుకాలం. దబ్బున తెల్లర్తది. జర్ర సేపట్ల పొద్దెక్కుతనే ఉంటది. ఇంటికొచ్చి ఇంత చాయ బొట్టు తాగి, అట్లిట్ల మెసిలేట్యాల్లకు పచ్చ జొన్నరొట్టెలు చేతిల పెట్టిన్రు. ఇగ రొట్టెమీదికి ఇంత మాడ్కాయ తొక్కో, చింతకాయ తొక్కో  ఏపిచ్చుకొని, తొక్కును ముద్దుగ రొట్టెకు రుద్దుకొని ఇంట్లకు, ఆకిట్లకు తిరుక్కుంట తలా రెండు రొట్టెలు తిన్నం.ఇగ తినుడాల్శెం ఎవలి తువ్వాల్లు, అంగిలాగులు  ఆల్లు సదుర్కొని బాయి మొకానవడి ఉర్కుతుంటిమి. ‘పైలమ్రో నాయనా, జర నిమ్మలంగ వోండ్రి, మల్ల ఎల్లమే బాయిలకెల్లి ఎల్లుండ్రి, సర్దులు జరాలు వట్టుకుంటె నేనేడ సత్తు’ అని మా అమ్మమ్మ మా ఎనకమాల్ల మొత్తుకుంటనే ఉన్నది. ఎన్నడు వోయి బాయిల దుంకదామా అన్న సోయే మాకు. ఆడికొయ్యేట్యాల్లకు ఊర్లె ఉన్న పోరలంత ఆడ్నే ఉన్నరు. పెద్ద బాయది. త్యాట నీల్లు, పదిపైసల సిక్క నీల్లల్ల ఏస్తే అడుగునున్నది కన్లవడుతది. బాయిగెట్టుమీద బట్టలు తువ్వాల్లు వెట్టి, అట్లనే లాగుతోటే చెంగున బాయిల దుంకి, మునిగి తేల్నం. ఏమన్న ఆటలా, ఏమన్న దుంకుడా. మోట్ల మీదికెల్లి కాంచిడు కొట్టినం. సక్కగ మీదికెల్లి గడ్డపార దుంకుడు దుంకితే సక్కగ కాల్లకు అడుగు తల్గిందాంక గుత్త. పుంజు పెట్ట ఆట. ముట్టిచ్చుకునే ఆట అన్ని బాయిల్నే. దుంకీ దుంకీ, ఆడీ ఆడీ నడినెత్తిలకు పొద్దెక్కినంక పొడిబట్టలు ఏస్కొని, తడి బట్టలు నీల్లల్ల జాడిచ్చి మెల్లెగ బయటపడి ఇంటికి మర్లినం.


ఇంటికొచ్చేట్యాల్లకు కడుపుల ఒకటే ఆకలైతుంది, దూపైతుంది. జల్ది జల్ది పిండుకొచ్చిన బట్టలు దండెమ్మీద ఆరేసి బువ్వదిననీకె కూసోని కుత్కెల్దాంక తిని లేశినం..ఓ దిక్కు మా యమ్మ గిట్ల తిడ్తనే ఉన్నది,’ఏం అవుతారం ఏస్కొచ్చిండ్రు. నీల్లల్ల నాని నాని పెయ్యంత బూశి బూశి అయ్యింది, తానం చెయ్యనీకె పొయ్యినోల్లు అట్లవొయ్యి ఇట్ల రావాలె, ఓగ్యంలేని పిల్లలు, ఎన్నడొస్తదో ఏమో పో,’ అంటాని ఒకటే సదూతుండే. ఆ తిట్లన్ని ఎంతసేపు ఇన్నా గని అంత ఉత్తది. మల్ల బయటికివొయ్యి కుక్క దుల్పినట్లు దులిపితే అయిపాయే.ఇగ పెద్దలు, పిల్లలు అందరు తిన్నంక, పిల్లలందరు ఆటలల్ల పడ్డరు. పెద్దలంత సాయమాన్ల కొందరు, బంకుల్ల కొందరు ’జోలి’ వెట్టుకుంట, కోడి కూర్కినట్లు కూర్కుతున్నరు.ఇగ గిదే మోక అనుకొని ముగ్గురం ఇశార చేస్కోని, ఓంటికోతున్నట్లు మెల్లగ ఇంట్లకెల్లి బయటవడ్డం. కాల్లకు చెప్పులు గూడ లేవు. జరంతసేపు యాపచెట్టుకింద కూసోని సోంచాయించినం. ఏం సమజ్గాలేదు. ఎట్లయితే అట్లయితదని బాయి దిక్కు మల్రినం.మొదలే ఎండుగాలం. పగటేలాయె, బావుల కాడ ఎవల్లేరు. ఊరెనకకెల్లి అవుతల, చిట్టెపు బాయిదిక్కు పొయ్యినం. జరంతసేపు మేడిశెట్టుకింద కూసున్నం. శెట్టునిండ పెద్ద పెద్ద గండుసీమలు. రెండు మూడు మా మీదవడి అంటిచ్చినయ్యి. బాయిలకు సూస్తె నిండ నీల్లు. మల్ల ఈతలు కొడదామని కూడవలుక్కున్నము. బట్టలేం తెచ్చుకోలే, లాగుతోటి దుంకితే పచ్చిగయ్యి ఇంట్ల గుర్తువట్టి మల్ల నాల్గు తల్గిస్తరని అదో బయ్యం.. ఎట్లజేతమంటాని నిలవడ్డరు మా మల్లిగాడు, కొండల్గాడు. ఏం జేస్నా దైర్నం నేనే జెయ్యలె. అంగిలాగిడిసి బత్తెల మోట్లమీదికెల్లి దుబిక్కిన బాయిల దుంకిన. ఎనకనే మల్లిగాడు, కొండల్గాడు.  అట్లనే బరుబత్తెల ఎంతసేపు బాయిలున్నమో అర్తమే గాలె. అందుట్ల మల్లిగాడు ఈతల ఏక్‌ నంబరు. ఇట్ల మునిగి అట్ల అడుగుకొయ్యి మన్ను దీసుకొస్తడు. కొండల్గాడు కాంచిడు కొడ్తే, బాయిల సోర్కె వొయ్యెనట్టే పోతడు.ఈతలు కొట్టీ కొట్టీ ఇగ జర సేపైతే పొద్దు మూకుతదనంగ బాయిలకెల్లి ఎల్లినము. గెట్టు మీదికొచ్చి సూశేట్యాల్లకు ఏముంది గెట్టు మీద మా బట్టల్లేవు. బాయి సుట్టు ముట్టు దేవులాడినం. మేడి శెట్టుకింద సూశ్నం. యాడ లేవు. ఎట్ల జెయ్యాలె అంటాని బత్తెల నిలవడి సోంచాయించినం. బట్టలెవడెత్కపాయె, ఇంట్ల ఏమని జెప్పాలె, ఇప్పుడింటికి ఎట్ల పోవాల్నంటాని ఒక్క తీర్గ పరేషానై నెత్తికి చేతులు వెట్టుకున్నం.ఇట్ల బత్తెల ఊర్లకి వోతే ఇజ్జతి వోతదని ఏడ్పు మొకం బెట్టిండు మా కొండల్గాడు. ‘ఏమైతదన్నా ఇట్లనే పోదాము నడ్వుండ్రి, మనమేమన్న పెద్దోల్లమా, సిన్న పోరలమే గదా’ అంటడు మా మల్లిగాడు.ఏందన్న ఉపాయం దొరకదా అంటాని నేను సోంచాయిస్తున్న. అట్ల గెట్టు మీదికెల్లి అవుతలికి పోంగనే గుబురుగున్న మోదుగశెట్టు కన్లవడ్డది. నా దిమాకుల బల్బు ఎలిగింది.ముగ్గురం పెద్ద పెద్ద మోదుగాకులు తెంపుకుని మొల్దారం కింద జెక్కుకున్నం. మా మల్లిగాడైతే రెండు పెద్ద మండలిరిసి జెక్కుకున్నడు. ఒగర్నొగరం సూశి ఒకటే నవ్వు. అచ్చం అడివి మడుసులోలున్నము. ఇగ బందోబస్తుగ ఆకులు గట్టిగ జారిపోకుండ కట్టుకొని ఊల్లెకు మల్లినం.సాకలోల్లింటికాడికొయ్యినమో లేదో. మా అమ్మమ్మ ఎదురొచ్చింది. మమ్ముల జూసి నవ్వాల్నో, ఇయ్యాల్టిదాంక ఏడికివొయ్యిండ్రాంటాని తిట్టాల్నో అర్తం కాలే. ఈడికెల్లి ఆడిదాంక మా అవతారాలని సూశి ఒగటే నవ్వుడు అందరు. ఆకులు రాల్తయేమొనంటాని గట్టిగ పట్టుకొని ఇంటిదిక్కు రూంజిగ ఉర్కినం. ఆకిట్లకు అడుగువెట్టి సూస్తే బాయికాడ పొయ్యిన మా బట్టలు ఈడ దండెమ్మీద ఆరేసున్నయి. ఇయ్యాల్టిదాంక బాయి గెట్టు మీదికెల్లి మా బట్టలెవరు దెచ్చిండ్రాంటాని మేమెవలం అడగలే, మాకెవరు చేప్పలే.    

-కొట్టం రామకృష్ణారెడ్డి


logo