శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - May 17, 2020 , 00:04:34

అందమైన మనసు

 అందమైన మనసు

తెరమీద  బాపు బొమ్మ... కలువకండ్ల కథానాయిక.. నిజ జీవితంలోనూ, అంతే అందమైన మనసున్న మగువ... తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ప్రణీత!కరోనా విజృంభిస్తున్న సమయంలో ‘ప్రణీత ఫౌండేషన్‌' ఆధ్వర్యంలో ఆమె అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. నేనున్నా అని ధైర్యం ఇస్తున్నది. 

తొలి అడుగులు

ప్రణీత పుట్టింది బెంగళూర్‌లో. కుటుంబం కూడా సేవా నేపథ్యం కలదే. తల్లిదండ్రులు సుభాష్‌, జయశ్రీ. ఇద్దరూ డాక్టర్లే. సొంతంగా హాస్పిటల్‌ ఉంది. తండ్రి జనరల్‌ ఫిజీషియన్‌, తల్లి గైనకాలజిస్టు.తల్లిదండ్రులు హాస్పిటల్‌లో అనేక వైద్య శిబిరాలు నిర్వహించేవారు. ప్రణీత తన బాల్యంలో తరచూ వాటికి హాజరయ్యేది. నిరుపేద ప్రజలను దగ్గర నుంచీ చూసేది. టీనేజ్‌  వచ్చేసరికి ప్రణీత ఈ క్యాంపుల్లో భాగస్వామి అయింది. అందర్నీ చిరునవ్వుతో పలకరించేది.ఎంతో మంది పేద ప్రజలు వైద్యం కోసం హాస్పిటల్‌కు వచ్చేవారు. అవసరమైన వైద్యం ఉచితంగా అందించేవారు తల్లిదండ్రులు. అలా  ప్రణీతకు సేవాభావం అబ్బింది.

కరోనా బాధితులకు  అండగా..

ప్రస్తుతం కరోనా బాధితులను ఆదుకోవడానికి ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. పేదల ఆకలి తీరుస్తున్నది. లాక్‌డౌన్‌ అమలైన నాటి నుంచే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టింది. వ్యక్తిగతంగా 50 కుటుంబాలను ఆదుకుంటున్నది. లాక్‌డౌన్‌ అమలైన తొలి ఇరవై రోజుల్లో  సుమారు 75వేల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది. ఇప్పటికే లక్ష దాటిపోయింది.

వెలుగు దారులు..

  • ప్రణీత ఫౌండేషన్‌ (www.pranithafoundation.org)వెబ్‌సైట్‌కి వెళ్లగానే  కనిపించే పెద్ద కవర్‌ ఫొటో చదువుల విలువను చెపుతుంది.  ఆమె నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ లక్ష్యం ఇది. ‘విద్యార్థులకు నాణ్యమైన  విద్యా వైద్యాల్ని అందించాలి. పేదల ఆకలి తీర్చాలి’ అన్నది ఫౌండేషన్‌ నినాదం.  
  • మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలను కాపాడే కార్యక్రమం చేపట్టింది ప్రణీత. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నది. 
  • బస్తీల్లో, గ్రామాల్లో ఆరోగ్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నది. సామాజిక మాధ్యమాల ద్వారా రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్నది.


తెరమీద..

ప్రణీత 2010లో కన్నడ ‘పోకిరి’తో సినిమాల్లోకి వచ్చింది. తెలుగులో ‘ఏం పిల్లో- ఏం పిల్లడో’ ‘బావా’ సినిమాలతో పరిచయం అయ్యింది. తర్వాత మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టింది. తమిళ, కన్నడ, హిందీ చిత్రపరిశ్రమల్లోనూ బిజీ బిజీగానూ ఉంటున్నది. ప్రస్తుతం ‘హంగామా-2’లో నటిస్తున్నది. 

పేదరికం నుంచి ప్రజల్ని విముక్తుల్ని చేయడానికి శక్తివంతమైన సాధనం... ‘విద్య’

- ప్రణీత సుభాష్‌


logo