మంగళవారం 27 అక్టోబర్ 2020
Sunday - May 16, 2020 , 23:41:25

వాస్తు

వాస్తు

మా భార్యాభర్తల మద్య ఎప్పుడూ తగాదాలు వస్తున్నాయి. ఇంట్లో ఎలాంటి మార్పు చేయాలి?-ఏలె పద్మాదేవి, భూపాలపల్లి

ఆలుమగలు అడపాదడపా ఎడమొఖం, పెడమొఖం పెట్టుకోవడం సాధారణమే. కానీ వారి తగాదా ఇల్లుదాటి తల్లిదండ్రుల వరకు పెద్ద మనుషుల వరకు వచ్చిందంటే అన్ని కోణాలలో ఆలోచించవలసి వస్తుంది. వాస్తుపరంగా చూస్తే ఇంటి భార్యాభర్తలు విడిపోవడం భర్తమీద భార్య విరుచుకుపడటం, భార్యను చులకన చేసి భర్తలు ప్రవర్తించడం ప్రధానంగా.. ఆగ్నేయం - వాయవ్యం దోషాలతో వస్తుంటాయి. వ్యక్తిగత క్రమశిక్షణ కారణం కూడా ఉంటుంది. కొన్ని దిశల ప్రభావాలు మనసులను ఉల్లాసంగా ఉంచితే, మరికొన్ని దిశలు చికాకు చేస్తాయి. ప్రధానంగా ఆగ్నేయంలో సెప్టిక్‌ట్యాంక్‌, వాయవ్యంలో నీళ్ల సంపు లేదా ఆగ్నేయం త్రెంపు, వాయవ్యంలో మెట్లకింద లెట్రిన్‌ గది, మెట్ల భాగాన్ని వాయవ్యం బెడ్‌రూము లోపలి నుండి కలుపుకొని అక్కడ టాయిలెట్‌ కట్టడం, ఇంటికి వాయవ్యంలో ద్వారం, ఇంటి కిచెన్‌కు ఈశాన్యం కదా అని తూర్పు బాల్కనీలోకి ద్వారం పెట్టడం.. ఇత్యాది దోషాలు భార్యాభర్తల మధ్య చికాకు, మానసిక అశాంతికి కారణమవుతాయి. వాటిని శాస్త్రపరంగా సరిదిద్దుకోవాలి. మనకన్నా ఇల్లు మార్పు పెద్దది కాదు కదా.

గృహస్తులు మొదటిసారి తిరుమల కొండకు నడిచేవెళ్లాలా? అందరికీ సాధ్యమా?-కల్వల మోక్షాదేవి, రుద్రవరం

తిరుమల అదొక కలియుగ స్వర్గధామం. మానవుడిగా పుట్టి తన కళ్లున్నందుకు ఒక అమరత్వాన్ని నింపుకునే ఆనంద నిలయం చుట్టూ పచ్చటిచెట్లు చల్లటి ఔషధీయపు గాలుల స్పర్శ సర్వత్రా వినబడే మంత్రోచ్ఛారణల శబ్దామృతం వెరసి అదొక అద్భుత లోకం తిరుమల. తిరుమల కొండలు ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగి ఉంటాయి. ఏడుపదుల సంవత్సరాల క్రితం చరిత్రలోకి వెళితే ఏడు కొండల వాడిని చేరడానికి సరైన దారిలేదు. కాలినడకన రెండు రోజులు ఎక్కితే కానీ చేరే వారట. 1870లో మెట్లదారి భక్తులకు దక్కింది. తిరుమలకు నడిచి వెళ్లాలి ప్రథమంగా అన్నది భక్తుల గొప్ప ఆరోగ్య ఆధ్యాత్మికానందపు ఆచారం. కారణం ఏడుకొండలు మనిషిలోని ఏడు చక్రాలకు ప్రతీకలు. మనిషిలో ఉండే మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా ఏడవదైన సహస్రారం, ఈ ఏడు చక్రాలను ప్రభావితం చేస్తాయి. ఏడుకొండలైన వృషభాద్రి, వృషాద్రి (అంజనాద్రి), శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, వేంకటాద్రి కొండలు మహిమాన్వితమైన ఔషధీయ, వృక్షాల నిలయాలు. వాటిని చూస్తూ ఆ గాలిని ఆస్వాదిస్తూ నడక దారిన వెళ్లగలగడం ఒక వరం. అది అందరికీ దొరకని అరుదైన అవకాశం. మనిషి కాలుకదపకుండా ఉన్నతిని అందుకోలేడు. ప్రధానంగా యాత్రా స్థలాల దర్శనంలో నడక ముఖ్యమైంది. ఏ క్షేత్రమైనా దాదాపు కొండలపైన సుదూర ప్రాంతాలలో ఉండటం అక్కడికి భక్తులు కాలినడకన చేరుకోవడం వల్ల శరీరం అక్కడి ప్రాంతాల దివ్యదర్శనంలో మనస్సు చైతన్యవంతమవుతాయి. నడక అనేది అది కాళ్లను కేంద్రంగా చేసుకొని సాగుతుంది. శాస్త్రీయంగా చూస్తే మనిషి ఒక్కో పాదంలో ఏడువేల రెండువందల నరాల ఎండింగ్‌ పాయింట్స్‌ ఉంటాయని శాస్త్రవేత్తలు, వైద్యులు చెపుతారు. అవి స్పందన పొందితే వాటికి అనుసంధానమై ఉన్న మనిషిలోని లోపలి అవయవాలు నడకద్వారా చైతన్యవంతమౌతాయి. కనబడని లోపలి అంగాల ఆరోగ్యానికి అరికాళ్లలో ఉండే ఎండింగ్‌ బటన్స్‌ నడక నడిచేవారికి నూతన శక్తిని కలిగిస్తాయి. కాబట్టి నడకను కేంద్రంగా చేసుకొని క్షేత్రాలు వెలిశాయి. ఏదిఏమైనా మన భక్తిని బట్టి మన యాత్ర ఆనందంగా సాగుతుంది. అందరూ నడకనే ఎంచుకోవాలనే చట్టం లేదుకానీ తిరుమల కొండమీద మాత్రం నడక అనివార్యం అవుతుంది. ఆ  విధంగా గృహస్తుల శక్తి మేరకు భక్తి మేరకు తిరుమలను దర్శించుకోవడం ఒక ఆరోగ్య సంప్రదాయం.

వాస్తు ఇంటితో పేదరికం పోతుందని అనుకుంటే  పేదలు ఎందుకుంటారు? సమస్యలు ఎందుకున్నాయి?-పెరిక వినీత, కోఠి

పేదరికం ఎవరికీ ‘జన్మలక్షణం కాదు’. కుటుంబ వారసత్వం కాదు. అసమర్థులు, నిరాశావాదులు తాము మునగడమే కాక తమతో ఉన్నవాళ్లనీ కిందకులాగుతారు. మనిషికి సమర్థత, ధైర్యం, శ్రమశక్తి జన్మ లక్షణాలు. ఇవి ఉన్నా ప్రయత్నం అనే మహత్తర శక్తిని కలిగి ఉన్నవాళ్లే అద్భుతాలు, సాహసాలు చేయగలుగుతారు, చేస్తున్నారు. ‘సోమరితనం, చురుకుతనం, సాధుగుణం’ ఇవి అందరిలో ఉంటాయి. అయితే గృహంలోని చీకటి, వక్రతలు వ్యక్తిలో చురుకుదనాన్ని పెంపొందించే బదులు నిరాశ సోమరితనాన్ని మరింత పెంచుతాయి. శ్రమించే లక్షణాన్ని పాడుచేస్తాయి. అందుకు పరిసరాలు కూడా తోడవుతూ ఉంటాయి. కాబట్టి వ్యక్తికి ఉన్న శ్రమగుణాన్ని ప్రయత్న ఫలాన్ని వాస్తు ఇల్లు తప్పక అందిస్తుంది. వాస్తు గృహంలో ఉండేవారికి అనారోగ్యాలు రావని, సమస్యలు రావని కాదు. వాటిని గెలిచే శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి. చీకటిని చూస్తే కాదు, ఒక దీపం వెలిగించాలి. అప్పుడే జీవితంలో వెలుగు వస్తుంది.

సుద్దాల సుధాకర్‌ తేజ

[email protected]

Cell: 7993467678


logo