శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sunday - May 16, 2020 , 23:56:11

ఆనిగెపు గారె... భళారే!

ఆనిగెపు గారె... భళారే!

ఆనిక్కాయ.. ఆనిగెపు కాయ.. ఏ పేరుతో పిలిచినా చల్లగా వచ్చేస్తుంది.. కాలంతో పనిలేకుండా.. సర్వకాల సర్వావస్థల్లోనూ కాస్తుంది.. ఇది కమ్మని వంటకాలకే కాదు.. తియ్యని పాయసానికీ పనికొస్తుంది..ప్రత్యేకంగా గారెలూ చేసుకోవచ్చు..

 • తెలంగాణలో ఆనిక్కాయ అని పిలుస్తారు. ఇదే ఆంధ్రాలో సొరకాయ. దీంతో తీపి, కారం గారెలు చేస్తారు.
 • దసరా సమయంలో, ఆ తర్వాత కార్తీక మాసంలో ఈ కాయలు విరివిగా కనిపిస్తాయి. ఆ సమయంలో ఉపవాసాలు కూడా ఎక్కువే. అందుకే ఆనిక్కాయతో  గారెలను చేసే సంప్రదాయం మొదలుపెట్టారని అంటారు.
 • తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వీటిని ‘మెత్త అప్పాలు, మెత్త బిళ్లలు’ అని కూడా పిలుస్తారు.
 • ఆనిక్కాయలు ఒకప్పుడు చలికాలంలోనే వచ్చేవి. ఆ సమయంలో ఒంటిని వేడిపర్చడానికి దీని తురుములో నువ్వులు, జీలకర్ర వేసి అప్పాలు చేసేవారు.
 • కొందరు వీటిని మెత్తగా చేసుకుంటే, ఇంకొందరు కరకరలాడేలా చేస్తారు.  గడ్డ పెరుగుతో కలిపి తింటే కమ్మగా ఉంటాయి. ఓ డజను లాగించొచ్చు.
 • ఆనిక్కాయ తురిమి.. అందులో బియ్యంపిండి, పచ్చిమిర్చి పేస్ట్‌, కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు.. కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకోవాలి. దీంట్లో ప్రత్యేకంగా నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఆనిక్కాయలో ఊరే నీళ్లే సరిపోతాయి.
 • ఆనిగెపు కాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, సులువుగా జీర్ణం అవుతుంది. డయూరెటిక్‌గా పనిచేస్తుంది. మూత్రనాళాల జబ్బుల నివారణకు ఇది మంచిది.
 • ఆనిగెపు కాయలు అన్నికాలాల్లో లభిస్తున్నాయి. నువ్వులకు బదులు పల్లీలు, పుట్నాల పొడి వేసుకొని గారెలు చేసుకుంటున్నారు. అజీర్తి సమస్యను తొలగించే గుణం నువ్వులకు ఉంది.
 • క్యాల్షియం, ఫాస్పరస్‌, విటమిన్‌ - సి, బి-కాంప్లెక్‌ ఆనిగెపు కాయలో లభిస్తాయి. ఇందులో పీచు పదార్థ్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
 • ప్రశాంతమైన నిద్రకు దోహదం చేసే స్వభావం నువ్వులకు ఉంది. నల్లటి నువ్వుల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎనీమియాను, బలహీనతలను తగ్గిస్తాయి.
 • కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ మూత్ర సంబంధిత సమస్యల నుంచి దూరం చేస్తాయి.
 • ఈ గారెలు ఒకటి, రెండు రోజులకు మించి ఉండవు. కాబట్టి, వేడివేడిగా ఆరగించేయాలి.
 • జీలకర్రలోని పొటాషియం బీపీని, హృదయ స్పందనను నియంత్రిస్తుంది. శ్వాస సమస్యలు, వాపు, జాయింట్‌ ఇన్ఫెక్షన్లు, పేగు సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలు, పంటి నొప్పి ఉపశమిస్తాయి.
 •  జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు బాగా సహాయపడుతుంది. 
 • కరివేపాకు యాంటీహైపర్‌ గ్లిసమిక్‌ నేచర్‌ను కలిగి ఉండటం వల్ల రక్త నాళాల్లో గ్లూకోజ్‌ను కంట్రోల్‌ చేస్తుంది.
 • నువ్వులలోని జింక్‌ చర్మకాంతిని పెంచుతుంది.వీటిలోని మెగ్నీషియం, క్యాల్షియం మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తాయి.
 • నువ్వులు అధిక రక్తపోటును అదుపు చేస్తాయి.  రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి .
 • జీలకర్రలో ఉండే థెమోల్‌, ఇతరత్రా నూనెలు ఆహారం జీర్ణం అయ్యేందుకు సాయపడతాయి.
 • ఆనిగెపు కాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి చాలా మేలు చేస్తుంది.


logo