గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - May 10, 2020 , 02:07:02

ఏం జవాబు చెప్పాలమ్మా!

ఏం జవాబు చెప్పాలమ్మా!

అమ్మ అయస్కాంతం, బిడ్డ ఇనుపరజం. తల్లి కనిపించకపోతే,బిడ్డకు ఏడుపు వచ్చేస్తుంది.బిడ్డ కనిపించకపోతే,తల్లికి ఉక్కపోత మొదలవుతుంది.బిడ్డకు ఆకలేస్తే ఆమ్మ పేగులు అరుస్తాయి.అమ్మకు జ్వరమొస్తే బిడ్డ ఒళ్లు వెచ్చబడుతుంది.వాడికి పరీక్షలొస్తే...ఈమెకు బీపీ.ఈమెకు ఆఫీసులో పనెక్కువైతే వాడికి అసహనం. బిడ్డ కళ్లకి... అమ్మతో దెబ్బలాడిన ప్రతిసారీ, అంతమంచి నాన్న కూడా  అమ్రిష్‌పురిలా కనిపిస్తాడు. అమ్మ కళ్లకి... బిడ్డను బెత్తంతో బాదిన ప్రతిసారీ అంతబాగా చెప్పే లెక్కలసార్‌ కూడా రెక్కలభూతంలా అనిపిస్తాడు. 

బిడ్డ కాలేజీ దశకు వస్తాడు.

అమ్మ నడివయసుకు చేరుకుంటుంది.

వాడికి నూనూగు మీసాలూ,

బొంగురుగొంతూ!

ఆమె కళ్ల కింద నల్లచారలూ, 

తలమీద తెల్ల వెంట్రుకలూ!

కొడుకు...చదువుల కోసం, ఉద్యోగం కోసం ఊరొదిలి వస్తాడు. 

దేశం వదిలి వెళ్తాడు.

ఏదో ఓ క్షణం 

బిడ్డ ఫోన్‌ చేస్తాడన్న ధైర్యం - అమ్మది.

ప్రతిక్షణం

అమ్మ తన గురించే ఆలోచిస్తుందన్న నమ్మకం - బిడ్డది.

అంతలోనే... అతడి జీవితంలో 

ముందు ప్రియురాలై, ఆతర్వాత ఇల్లాలై ఓ అందమైన పాత్ర ప్రవేశిస్తుంది.

వాళ్లకు పిల్లలూ, వాళ్ల చదువులూ పెళ్లిళ్లూ! 

 ఓ నాన్నయిన తర్వాత కూడా...

అమ్మ ముందు బిడ్డ  పసివాడే.

అమ్మమ్మ, నానమ్మ హోదాల కంటే -

అమ్మ పాత్ర మీదే  తల్లికి మక్కువ.‘వాడు భోంచేశాడా? వాడు పడుకున్నాడా? 

వాడు వాకింగ్‌కు వెళ్లాడా? వాడు ఆఫీసుకు బయల్దేరాడా?‘

ఎదుటివాళ్లు విసుక్కున్నా సరే ఆమె అడుగుతూనే ఉంటుంది.

‘అమ్మ మందులేసుకుందా? అమ్మకు జ్వరం తగ్గిందా?

అమ్మను డాక్టరు దగ్గరికి తీసుకెళ్లారా?’

ఎదుటివాళ్లు జవాబు చెప్పేలోపే ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉంటాడు.

ఆ బంధం నిత్యనూతనం.

ఆ అనురాగం సత్యం-శివం-సుందరం!


అకస్మాత్తుగా...

ఆ ముడుతలు పడిన మొహాన్నీ, ముగ్గుబుట్ట తలనీ, ఎండుబావి లాంటి నోటినీ, పొరలు కమ్మిన కళ్లనీ, మొరాయించిన చెవులనీ, బలహీనపడిన గుండెనీ, కనాకష్టంగా నెట్టుకొస్తున్న కాలేయాన్నీ, ముక్కుతూ మూలుగుతూ పనిచేసే మూత్రపిండాల్నీ... సమస్తాన్నీ ఇక్కడే వదిలిపెట్టి - జీవితంలోంచి శాశ్వతంగా నిష్క్రమిస్తే.. 

అమ్మ ఇక లేదని తెలిస్తే, రానే రాదని ఖరారైతే - బిడ్డ పరిస్థితి ఏమిటి? 

ఏడవలేడు.

‘ఏడిస్తే నా మీద ఒట్టే’ అని చిన్నప్పుడే మాట తీసుకున్నది అమ్మ.

మరచిపోలేడు.

‘నన్ను మరచిపోవు కదూ’ తొలిసారిగా విమానం ఎక్కుతున్నరోజే ప్రమాణం చేయించుకున్నది అమ్మ. మహా అయితే, అమ్మ తాలూకు జ్ఞాపకాల్ని పంచుకుంటాడు. ‘ఏదైనా నలుగురితో పంచుకుంటేనే అందం, ఆనందం’ అని అమ్మ తరచుగా చెప్పేది కాబట్టి. 

ఆ పనే చేస్తున్నాడు ఓ కొడుకు... మాతృదినోత్సవం సందర్భంగా... ఈమధ్యే మరణించిన తల్లి జ్ఞాపకాల్ని మనతో పంచుకుంటున్నాడు. 

ప్రతి మధ్యాహ్నం వస్తాడు. 

గేటు ముందు నిలబడతాడు.

అలికిడి వినిపించిన ప్రతిసారీ ఆశగా తలపైకెత్తుతాడు. 

‘ఆ అమ్మ యాడికిబోయిందో?’ .... స్వగతంలో ప్రశ్నించుకుంటూ నిరాశగా వెళ్తాడు.

నువ్వు ఉన్నంతకాలం... ప్రతి మధ్యాహ్నం వాడికి పండగ భోజనమే! కడుపునిండా పెట్టేదానివి. దేవుడికి నైవేద్యం సమర్పించినట్టు. అతిథికి ఆత్మీయంగా వడ్డించినట్టు.

‘దేవుడు నిన్ను చల్లగా చూడాలమ్మా’... కృతజ్ఞతతో కన్నీరు తుడుచుకుంటూ వెళ్లిపోయేవాడు. మళ్లీ మరుసటి రోజు మధ్యాహ్నం ప్రత్యక్షం అయ్యేవాడు... పేగులు తేలిన పొట్టతో.

గేటు దగ్గరకి రాగానే....

పండ్లతోటలో కాలు పెట్టినంత ఆనందం. అమ్మ వస్తుందన్న నమ్మకం. ఆకలి తీరుస్తుందన్న భరోసా!

వారం పదిరోజుల నుంచీ...

వస్తున్నాడు. నిలబడుతున్నాడు. వెళ్లిపోతున్నాడు. ఎవరైనా ఓ ముద్ద వేస్తే అన్యమనస్కంగా తీసుకుంటున్నాడు.

‘అమ్మ లేదా?’

‘అమ్మ రాదా?’

...ఎంతమందిని అడిగాడో, ఎన్నిసార్లు అడిగాడో?

వాడికేం జవాబు చెప్పాలమ్మా?

              

కడుపులో ఉన్న కూతురు..

చెల్లి! 

కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కొడుకులు.

నేను, తమ్ముడు!

ఎకరం పొలం తప్పించి  ఆస్తిపాస్తుల్లేవు. చదువు లేదు. నాన్న పోయిన పుట్టెడు దుఃఖం ఒకటి. 

ఆ సమయంలోనూ అంత ధైర్యంగా ఎలా ఉన్నావమ్మా! ఒక సంపాదన సంపాదన కాదన్న ఆర్థిక పాఠాన్ని అనుభవాల్లోంచి నేర్చుకున్నావు కాబోలు! కిరాణాకొట్టు నడిపించి జీవన రణరంగంలో నిలిచావు, గెలిచావు. 

ఆత్మాభిమానమంటే నీదీ!

మగదిక్కులేని కుటుంబానికి... నువ్వే నాలుగు దిక్కులు!

పిల్లలం ముగ్గురికి....

అమ్మ, నాన్న - రెండూ బాధ్యతలూ నీవే.

అందుకేనేమో....

నాన్నను తలుచుకున్నా నీ రూపమే మెదుల్తుంది.

ఏ లోటూ రాకుండా మమ్మల్ని పెంచావు. పెద్ద చేశావు.

రోజూ బడికెళ్తున్నప్పుడు...

బస్సు చార్జీల కోసం...

చేతిలో రెండు రూపాయలు పెట్టేదానివి.

ఒక రూపాయి...

వెళ్లడానికి.

ఒక రూపాయి...

రావడానికి. 

వెళ్తున్నప్పుడు బడి గమ్యం.

తిరిగొస్తున్నప్పుడు ఇల్లు గమ్యం. 

ఆ రెండే ముఖ్యం. 

చిరుతిళ్లూ, సినిమాలూ, షికార్లూ... మనసును పక్కదారి పట్టించే ప్రలోభాలు. 

ఆ సంగతి నీకు బాగా తెలుసు. కాబట్టే, అలిగినా బతిమాలినా అంతకు మించి, నయాపైసా కూడా ఇచ్చేదానివి కాదు. 

ఆ రెండు రూపాయల జీవన సత్యమే... ఇప్పటికీ మమ్మల్ని నడిపిస్తున్నది. వంద, ఐదొందలు, రెండువేలు... పర్సులోని నోట్ల దొంతర్లన్నీ మిథ్య! వ్యాలెట్లో మిడిసిపడే క్రెడిట్‌కార్డులూ, డెబిట్‌కార్డులూ చెత్తకిందే లెక్క. 

ఎక్కడున్నాం?

ఎక్కడికెళ్తున్నాం?

అన్న రెండు ప్రశ్నలు...

జేబులోని రెండు రూపాయి నాణాలు.

‘పోరాడటానికే పుట్టినట్టు, కష్టమే లక్ష్యమైనట్టు... మమ్మల్ని పాపాయిల్లా పెంచిన ఆ అమ్మ ఎక్కడికెళ్లింది?’ అని అడుగుతున్నాయి 

ఆ రెండు రూపాయలూ. 

వాటికేం జవాబు చెప్పాలమ్మా!

పుస్తకాలు చదవమంటూ ప్రోత్సహించేదానివి. చిన్నప్పుడైతే, ముందు కూర్చోబెట్టుకుని మరీ చదివించేదానివి. ఆ అలవాటు ఓ వ్యసనంగా, పాజిటివ్‌ వ్యసనంగా  మారింది మాకు! ఇప్పటికీ, ఏ కొంత సమయం దొరికినా, నాలుగు పేజీలైనా తిరగేస్తుంటాం. కానీ ఎక్కడో అసంతృప్తి! ఇందులో కొత్తేముందీ?

అమ్మ చెప్పినవేగా! అమ్మ ఆచరిస్తున్నవేగా! -

అనిపిస్తూ ఉంటుంది. 

ఈమధ్య ఓ పెద్ద ఆంగ్ల రచయిత ‘ఫైవ్‌ ఏఎమ్‌ క్లబ్‌' పేరుతో ఓ పుస్తకం రాశారు. తెల్లవారుజామున లేస్తే.... చాలా ప్రయోజనాలట! అలా లేచేవాళ్లు జీవితంలో పైకి వస్తారట!  నువ్వు చెప్పిన మాటే కదమ్మా! నువ్వు నేర్పిన అలవాటే కదమ్మా!

సూర్యుడిని చూసో, అలారం పెట్టుకునో నిద్రలేవడం మాకెప్పుడూ అలవాటు లేదు. అమ్మ లేచిందంటే... బ్రాహ్మీ ముహూర్తం మొదలైనట్టు. మేమూ లేవాల్సిందే. నువ్వు వంట పనులు చేసుకుంటూ ఉంటే, మేం టీచర్లు ఇచ్చిన ఇంటిపనులు పూర్తి చేసుకునేవాళ్లం. 

ఈమధ్య ప్రపంచవ్యాప్తంగా ‘మినిమలిజం’ పేరుతో పెద్ద ఉద్యమమే నడుస్తున్నది. ‘మినిమలిజం - లివ్‌ ఎ మీనింగ్‌ఫుల్‌ లైఫ్‌', ‘గుడ్‌ బై థింగ్స్‌...’ ఇలా చాలా పుస్తకాలే వచ్చాయి. ఆ పుస్తకాల నిండా నీవు ఆచరించిన జీవన విధానమే. అనవసర ఆర్భాటాలకూ, అర్థంలేని ఆడంబరాలకూ దూరంగా బతకడం. వస్తు వ్యామోహాన్ని జయించడం. ఆ పరిణతి నీకు పుట్టుకతోనే అబ్బినట్టుంది. లేకపోతే... పంచభక్ష్యాలు వడ్డించుకుని తినేంత స్థోమత వచ్చాక కూడా పప్పుచారు, పచ్చడి మెతుకులతో ఎలా భోంచేస్తావు. పట్టు పీనాంబరాలు కొనిపించగలిగే కొడుకులున్నా, మూడంటే మూడు జతల బట్టలతో ఎలా జీవనం సాగిస్తావు.

అది పీనాసితనమో మరొకటో కాదు. 

నిరాడంబరత్వం, నిర్మోహత్వం!

చిరుగుల చీరతోనో, చాలీచాలని బట్టలతోనో ఎవరైనా కనిపిస్తే చాలు, నీ గుండె తరుక్కుపోయేది! ఉన్నంతలో మంచి బట్టలిచ్చి  పంపేదానివి.

వాళ్లంతా మళ్లీ వస్తే?

నీ గురించి వాకబు చేస్తే?

ఏం జవాబు చెప్పాలమ్మా! 

 

నీకు మనుషులంటే ప్రేమ.

బంధాలంటే మమకారం.

మా స్నేహితుల పట్ల కూడా మా అంత వాత్సల్యం. మాకు  చెప్పే మంచే వాళ్లకూ చెప్పేదానివి. మాలానే వేళకానివేళ ఇంటికొచ్చినా... నిమిషాల్లో వంట చేసేదానివి. మాకు వడ్డించినట్టే కొసరికొసరి వడ్డించేదానివి. మమ్మల్ని హెచ్చరించినట్టే, ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరించేదానివి. 

ఏ తల్లి అయినా....

బిడ్డలు బాగా సంపాదించుకోవాలని కోరుకుంటుంది. స్థలాలూ పొలాలూ కొనేసుకోమని పోరుతుంది. 

పొరపాటున కూడా నువ్వు ఆ మాట అనలేదెప్పుడూ.

ఆర్థికంగా స్థిరపడమని మాత్రమే చెప్పావు.

నీ భాషలో స్థిరత్వం అంటే...

బతకగలిగేంత.

బతికించగలిగేంత.

చేయిచాచాల్సిన అవసరం లేనంత.

చేయిచాచినవాళ్లకు లేదనకుండా ఇవ్వగలిగేంత.

ముఖ్యంగా...

‘చదువులకు సాయం చేయరా?’

అని ఎన్నిసార్లు చెప్పావో!

నువ్వూ ఎంత మందికి సాయం చేశావో!

వాళ్లంతా పట్టాలు పుచ్చుకునో, నియామక పత్రాలు పట్టుకునో నీ ఆశీర్వాదం కోసం వస్తే....

ఏం జవాబు చెప్పాలమ్మా! 


అబద్ధం అయినా సరే...

ఊరెళ్లినవనే చెబుతాం. 

దురాశ అనిపించినా సరే...

తిరిగొస్తావనే అంటాం. 

అయినా, నువ్వు బంధాల మనిషివి. 

ఆత్మీయతలకు ప్రాణమిచ్చే తల్లివి. 

శ్రమజీవివి.

స్వర్గంలో....

మాట్లాడుకోవడానికి మనుషులు ఉండరు.

అందరూ దేవుళ్లే!

శ్రమించడానికి పొలాలుండవు.

ఎటు చూసినా సౌధాలే.

ప్రేమలూ ఆప్యాయతలూ ఉండవు.

హంగులూ ఆడంబరాలే!

నీకిష్టమైన పప్పుచారూ మజ్జిగా లభించవు.

తిన్నా, తాగినా అమృతమే!

ఆ వాతావరణం నీకు అస్సలు పడదు.

ఏదో ఒకరోజు... నీ నిర్ణయాన్ని మార్చుకుంటావు. ఒంటరిగా ప్రపంచాన్ని గెలిచిన దావిని, ముక్కోటి దేవతలొక లెక్కా! ఒప్పించో, మెప్పించో వెనక్కి వచ్చేస్తావు. 

ఆరోజు కోసం...ఎదురుచూస్తూ ఉంటాం.

నేను- తమ్ముడు - చెల్లె

అమ్మ కావాలి!

అమ్మను తలుచుకోగానే స్పష్టాస్పష్టమైన ఊహాచిత్రం తప్పించి మరో జ్ఞాపకం తెలియనివాళ్లు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. కన్న తల్లి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని, రెక్కలు కట్టుకుని ఆమె ముందు వాలిపోవాలన్న బలీయమైన కోరిక ఆ బిడ్డల్ని స్థిమితంగా ఉండనీయదు. ఎక్కడ ఏ పండుటాకు కనిపించినా ఆమెలో తల్లిపోలికల్నే వెతుక్కుంటారు. ఇలాంటివారికి కన్నతల్లిని వెతికిపెట్టే మాతృయజ్ఞం చేపట్టాడు అరుణ్‌ధోలే. తను జర్మనీ పౌరుడు. మూలాలు భారత్‌లో ఉన్నాయి. బాల్యంలోనే జర్మనీకి దత్తత వెళ్లాడు. బుద్ధి తెలిసినప్పటి నుంచే కన్నతల్లిని చూడాలన్న ఆరాటం మొదలైంది. ఎవరో అజ్ఞాత మాతృమూర్తి పుణెలోని ఓ అనాథ శరణాలయంలో తనను వదిలి వెళ్లిపోయిందని తెలిసింది. అంతకు మించి ఏ చిన్న ఆధారమూ లభించలేదు. సొంతంగా ప్రయత్నిద్దామంటే చట్టాలు అడ్డొచ్చాయి. దీంతో భారతీయ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అనుకున్నది సాధించాడు. అమ్మను కలుసుకున్నాడు. తనలా, అభంశుభం తెలియని వయసులోనే విదేశాలకు దత్తత వెళ్లిన పిల్లలకు... కన్నతల్లుల్ని వెతికిపెట్టడానికి అడాప్టీ రైట్స్‌ కౌన్సిల్‌ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల నుంచి కూడా తనకి అభ్యర్థనలు వస్తున్నాయి. ‘అమ్మను చూడాలని ఉంది... అని తలుపుతట్టే ప్రతి ఒక్కరిలో నన్నునేను చూసుకుంటాను’ అంటాడు అరుణ్‌.అ...అమ్మ, ఆ...ఆట!

ఒకవైపు అమ్మ అనిపించుకోవాలన్న ఆరాటం, మరోవైపు పోటీల్లో పతకాలు సాధించాలన్న తపన. గర్భం ధరిస్తే ఫిట్‌నెస్‌ తగ్గిపోతుంది. పోటీలో నిలువడం కష్టం, గెలవడం దాదాపుగా అసాధ్యం! ఓ బిడ్డకు తల్లి అనిపించుకోలేకపోతే... జీవితానికే అర్థం ఉండదన్న స్త్రీ సహజ ఆకాంక్ష! వయసు పెరిగేకొద్దీ గర్భధారణ కష్టతరం! ఆ రెండు.. లక్ష్యాల మధ్యా వివాహితులైన క్రీడాకారిణులు మానసికంగా నలిగిపోతుంటారు. ‘నాకు బంతి ఎంత ముఖ్యమో,  పాపా అంతే ముఖ్యం’ అంటారు కర్నాటకకు చెందిన ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి అమూల్య వెంకటేశ్‌. వీలైనంత త్వరగా మైదానంలోకి వెళ్లాలంటే... సహజమైన ప్రసూతి అయితేనే ఉత్తమమని డాక్టర్లు చెబుతారు. దీంతో తీవ్రమైన పురిటి నొప్పులను భరించడానికి కూడా సిద్ధపడ్డారు అమూల్య. రగ్బీ క్రీడాకారిణి సంగీత అయితే... పచ్చిబాలింతరాలిగానే మైదానంలోకి వెళ్లింది. దేశానికి తొలి అంతర్జాతీయ పతకాన్నీ తెచ్చిపెట్టింది. ‘టోర్నమెంట్‌ ప్రారంభానికి ముందు... ఒంటి బరువు తగ్గించుకోవడానికి చనుబాలను నేను వాష్‌బేసిన్‌ పాలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆ సమయంలో ఏడుపు తన్నుకొచ్చేది’ అంటారామె. రెజ్లర్‌ ప్రీతికౌర్‌కు బరిలోకి దిగిన ప్రతిసారీ ఝాన్సీ లక్ష్మీబాయే గుర్తుకు వస్తుందట. బిడ్డను భుజానికి ఎత్తుకుని యుద్ధం చేస్తున్న దృశ్యం వేయి ఏనుగుల బలాన్ని ఇస్తుందట. అంతిమంగా, ట్రోఫీని అందుకున్నప్పుడు బిడ్డను ఎత్తుకున్న ఆనందం! ఇంటికొచ్చి బిడ్డను ముద్దు చేస్తున్నప్పుడు ట్రోఫీతో ఆడుకున్నంత పరవశం!ఓ తల్లి సాహసం

ఆమె పేరు హీరా. ఛత్రపతి శివాజీ మహారాజుకు చెందిన రాయ్‌గఢ్‌కోట పరిసరాల్లో నివసించేది. శివరాజు కొలువులో భర్త  సైనికుడు. అంతఃపురానికి పాలూపెరుగూ అందిస్తూ తానూ ఓ నాలుగురాళ్లు సంపాదించేది. ఆ జంటకు ఓ బాబు పుట్టాడు. ముద్దులొలికే ఆ చిన్నారి అంటే, అమ్మకు ప్రాణం. ఓరోజు ఎప్పటిలాగే హీరా పాలగిన్నెలతో బయల్దేరింది. పనిపూర్తయ్యేలోపు చీకటి పడిపోయింది. కోట తలుపులు మూసుకున్నాయి. తెల్లారేవరకు బయటికి రాలేదు. ఇంట్లోనేమో పసిబిడ్డ. పాలుపట్టాల్సిన సమయమూ అయ్యింది. సైనికుల్ని వేడుకుంది. అధికారుల్ని బతిమాలింది. ఎవరూ కనికరించలేదు. బిడ్డ మీద మమకారం... ఆ తల్లిని  వ్యూహకర్తను చేసింది. రాయ్‌గఢ్‌ కోటకు మూడువైపులా ప్రాకారాలు ఉంటాయి. ఒక్కవైపు మాత్రం ఖాళీగా ఉంటుంది. జనసంచారం తక్కువ. కానీ, దట్టమైన అటవీ ప్రాంతం అది. కొండ చివరి నుంచి కిందికి దిగడం అంటే... ప్రాణాలతో చెలగాటమే. అయినా హీరా సాహసించింది. అవరోధాల్ని దాటుకుంటూ ఇంటికి చేరుకుంది. బిడ్డను ఒళ్లోకి తీసుకునే సమయానికి ఒళ్లంతా గాయాలే! తెల్లారేసరికి ఆ విషయం శివాజీ మహారాజుకు తెలిసింది. ఆమెను హాజరుపర్చమని ఆదేశించాడు. భయపడుతూ వచ్చింది. ఆ సాహసానికి  ప్రభువు మెచ్చుకున్నాడు. ‘తల్లీ నిన్ను చూస్తుంటే మా అమ్మే గుర్తుకొస్తున్నది’ అంటూ పట్టుచీర పెట్టాడు. ఈ చిత్రంపేరు ‘హిర్కణి’... మరాఠాలో మహాద్భుతంగా తీశారు. అమెజాన్‌ ప్రైమ్‌లో  ఉంది. మాతృయాత్ర

ఆమె పేరు రామచంద్రమ్మ. నాగర్‌ కర్నూలుజిల్లాలోని కోమటికుంట సొంతూరు. హైదరాబాద్‌లో ఉంటున్న కొడుకు రాములు ఎట్లున్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో? - అన్న ఆలోచనతో ఆ తల్లికి తిండి సయించలేదు. నిద్రపట్టలేదు. నంబరు కాగితం పట్టుకుని తెలిసినవాళ్లతో ఫోన్‌ చేయించింది. స్విచ్‌ఆఫ్‌ అని  వచ్చింది. బిడ్డ యోగక్షేమాలు ఎవర్ని అడగాలో అర్థం కాలేదు. ఒకరిద్దర్ని అడిగినా సంతృప్తినిచ్చే సమాధానం రాలేదు. బట్టసంచిలో రెండు జతల చీరలు పెట్టుకుని, కాలికి రబ్బరు చెప్పులు తొడుక్కుని తానే బయల్దేరింది... కొడుకుని వెతుక్కుంటూ! నెత్తిమీద ఎండ. కాళ్లకింద వేడి. గమ్యం హైదరాబాద్‌ మహానగరం. చేతిలో అడ్రస్‌ కాగితం కూడా లేదు. ఫలానా ప్రాంతంలో ఉన్నానంటూ కొడుకు మాటల సందర్భంలో చెప్పిన గుడ్డి గుర్తులే ఆధారం.  మొండి ధైర్యంతో ప్రయాణం మొదలుపెట్టింది. వంద కిలోమీటర్లు నడిచి హైదరాబాద్‌కు అయితే చేరుకున్నది కానీ, బిడ్డ ఉంటున్న ప్రాంతానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. అసలే కర్ఫ్యూ వాతావరణం. చీకటి పడితే వీధిలో నరమానవుడు కూడా కనిపించడు. కడుపులో ఆకలి, గుండెలో ఆవేదన. ‘అమ్మా అన్నం పెట్టండి’ అంటూ ఓ ఇంటి తలుపు తట్టింది. యజమాని మంచివాడిలా ఉన్నాడు. కడుపునిండా అన్నం పెట్టాడు. కష్టసుఖాలు అడిగాడు. తన కథంతా చెప్పింది. కొడుకు ఆనవాళ్లు వివరించింది. ఆ ప్రాంతంలో ఉంటే మిత్రుల సహకారంతో రాములు అడ్రస్‌ తెలుసుకున్నాడు ఆ పెద్ద మనిషి. తన కార్లో తీసుకుని వెళ్లి కొడుకు దగ్గరికి చేర్చాడు. ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. ఆ బిడ్డ సంతోషానికి మాటల్లేవు. -బతుకమ్మ డెస్క్‌


logo