గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - May 10, 2020 , 01:39:49

అంజీరాతో జయించాడు!

అంజీరాతో జయించాడు!

కట్ల శ్రీనివాస్‌ ఎంబీఏ చదివాడు. కొంతకాలం ముంబైలోని రెడ్‌చిల్లీస్‌లో మంచి ఉద్యోగం. రైతు కుటుంబమే అయినా వ్యవసాయం రాదు. ప్రజారోగ్యం కోసం వ్యవసాయంలో ఎలాంటి మార్పులు రావాలి? అన్న విషయంపై అధ్యయనం చేశాడు. సాగులోకి అడుగుపెట్టి అంజీరాతో సక్సెస్‌ సాధించి ఔరా అనిపిస్తున్నాడు. 

శ్రీనివాస్‌ది రామడుగు మండలం తిర్మలాపూర్‌. అనుభవమున్నది సాఫ్ట్‌వేర్‌ రంగంలో. వ్యవసాయం పట్ల అవగాహన అంతంతే. వ్యవసాయాన్ని మాత్రం వదలొద్దు అనుకొని కొత్తగూడెంకు చెందిన మల్లేపల్లి రవి.. గద్వాలకు చెందిన వినోద్‌కుమార్‌...అగ్రికల్చర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కే రెడ్డి.. సారా సంస్థ రోహిణిరెడ్డి వంటి నిపుణుల సహచర్యంలో అవగాహన పెంచుకున్నాడు. 2014లో తిర్మలాపూర్‌లో సేంద్రియ సాగు ప్రారంభించాడు. 

ఔషధ పండ్ల పట్ల ఆసక్తి: సంవత్సరం గడిచింది. మంచి దిగుబడి వచ్చింది. ఇంకా రకరకాల ప్రయత్నాలు చేయాలి అనుకొని 2016లో బోడకాకర సాగుచేశాడు. రెండెకరాల్లో పంట. ఇది కూడా మంచి దిగుబడి సాధించింది. సంప్రదాయ సాగు చేస్తున్న రైతుల దృష్టిలో ఇదొక విప్లవం. అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీనివాస్‌ సలహాలు తీసుకోవడం.. పండించేందుకు ఆసక్తికనబర్చడం మొదలైంది. ఇప్పుడు శ్రీనివాస్‌ దృష్టి పండ్ల సాగుపై పడింది. రసాయనాలతో పండించిన పండ్లు కాకుండా ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే ఔషధ పండ్లను సేంద్రియ సాగులో పండించాలనుకున్నాడు. 

అంజీరా సాగు: ఔషధ పండ్లను అందించాలనే కృతనిశ్చయంతో హార్టికల్చర్‌పై రీసెర్చ్‌ ప్రారంభించాడు శ్రీనివాస్‌. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని పుష్కలమైన ఔషధ గుణాలున్న అంజీరాను ఎంచుకున్నాడు. వాస్తవానికి అంజీరాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మన దగ్గర ఎక్కువగా డయానా రకానికి చెందిన పూణెఫిగ్‌.. బళ్లారి ఫిగ్‌ రకాల అంజీరాలను సాగు చేస్తుంటారు. అయితే శ్రీనివాస్‌ మాత్రం ఇక్కడొక సాహసం చేశాడు. తెలంగాణలో ఇప్పటివరకు ఎక్కడా సాగుచేయని బ్రౌన్‌ టర్కీ రకాన్ని ఎంచుకున్నాడు. ఇది పూణె యూనివర్సిటీ అభివృద్ధి చేసిన విత్తనం. అంజీరానే ఎందుకు: శ్రీనివాస్‌ అంజీరాను ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే అంజీరా ఔషధపండ్ల రారాజు. రక్తహీనతను నివారిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 2019 మార్చి మొదటి వారంలో రాయచూర్‌ రైతు రామచందర్‌రావు దగ్గర ఎకరాకు 900 బ్రౌన్‌టర్కీ మొక్కలను కొనుగోలు చేశాడు. మొక్కకు మొక్కకు మధ్య 8 అడుగులు.. వరుస వరుసకు మధ్య 12 అడుగుల దూరంలో డ్రిప్‌ను ఏర్పాటు చేసి మొక్కలు నాటాడు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని వేరుకు పోషకాలు అందించే ప్రక్రియలో భాగంగా వేరు వ్యవస్థకు మైకోరైజాను నేరుగా అందించాడు.  జీవ ఎరువులను వాడాడు.


దిగుబడి: ఇది మే నెల. అంజీరా పండ్ల దశ. సంవత్సరం పొడవునా 7 నుంచి 8 నెలలు పంటకాలం ఉంటుంది. ప్రస్తుతం ఎకరాకు 15 కిలోల దిగుబడి వస్తుంది. రెండో ఏడాది దిగుబడి రెండింతలు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నాడు శ్రీనివాస్‌. మొదటిరకం పండ్లను మాత్రం మార్కెట్‌కు తరలిస్తున్నారు. రెండోరకం పండ్లను డీహైడ్రేట్‌ చేసి ఎండలో నాలుగు నుంచి ఐదు రోజులు పండ్లను ఆరబెట్టి పౌడర్‌ చేసి మిల్క్‌షేక్‌ల్లో.. బేకరీల్లో వాడే స్వీట్స్‌కు బదులుగా డ్రై పౌడర్‌ను వాడేందుకు తయారుచేసి అందించాలనేది శ్రీనివాస్‌ ఉద్దేశం. వీటితో పాటు అంజీర జామ్‌, సిరప్‌ తయారీ దిశగా ప్రయత్నాలు చేపడుతున్నాడు. ‘శ్రీనివాస్‌ సాధించిన విజయాన్ని చూసైనా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తే బాగుంటుంది’ అని మెచ్చుకున్నారు స్థానిక వ్యవసాయ అధికారి యాస్మిన్‌.

సంతృప్తిగా ఉంది: ఈ ఏడేండ్లలో ఎంతోమంది రైతులకు మార్గదర్శకంగా నిలిచి వారిలో ఆత్మాభిమానాన్ని పెంపొందించినందుకు చాలా సంతృప్తికరంగా ఉంది. పూర్తిస్థాయిలో సేంద్రియ సాగు ద్వారా ప్రజలకు మంచి పోషకాహారాన్ని అందిస్తున్నందుకు ఆనందంగా కూడా ఉంది. ఇక్కడి వాతావరణంలో బ్లూబెర్రీ పంటను సాగు చేయాలనే ఆలోచనతో విశ్లేషణ చేస్తున్నా. 

-కట్ల శ్రీనివాస్‌

తాజావార్తలు


logo