సోమవారం 06 జూలై 2020
Sunday - May 10, 2020 , 00:02:10

విలన్‌గా చేయాలనుంది!

విలన్‌గా చేయాలనుంది!

మంచి నటుడు కావాలంటే.. మంచి నడవడిక ఉండాలి..ఈ మాటను తుచ తప్పక పాటిస్తానంటున్నాడీ హీరో..బుల్లితెర మీద  పరిచయమై ఇరవై సంవత్సరాలు కావొస్తున్నది..అయినా,  కథానాయకుడిగా కొనసాగుతున్నాడు.. నందకిషోర్‌ ! ‘రామ సక్కని సీత’తో ఇప్పటికీ హీరోగా ఫామ్‌లోనే ఉన్నాడు.వెండితెరపై కూడా హీరో పాత్రతో పరిచయం కావాలని అనుకుంటున్నాడు.అటు నటుడిగా.. ఇటు క్రికెటర్‌గా కూడా..అందరి మన్ననలనూ అందుకుంటున్న నంద కిషోర్‌  ప్రస్థానం అతడి మాటల్లో..

ఏడోతరగతిలో మొదటిసారిగా ముఖానికి రంగేసుకున్నా. నాన్నే స్వయంగా నాకు మేకప్‌ వేశారు. ఆయన సికింద్రాబాద్‌ రైల్‌భవన్‌లో పనిచేసేవారు. ఆ సంవత్సరం వాళ్ల ఆఫీసులో నాటకాల పోటీలు జరిగాయి. నేనూ పాల్గొన్నా. ఆ తర్వాత స్కూల్లో కూడా కొన్ని నాటకాలు వేసిన అనుభవం ఉంది. చదివిందంతా రైల్వే స్కూల్‌, కాలేజీల్లోనే!  పదోతరగతి వచ్చేసరికి యాక్టింగ్‌ మీద మక్కువ ఎక్కువైంది. అలా అని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. మంచి స్టూడెంట్‌నే.

నాటకాల వైపు..

భూమిక థియేటర్‌ గ్రూప్‌ అని, ఇప్పటికీ ఉంది. ఉదయభానుగారని రైల్వేలో పనిచేసేవారు. ఆయనే ఈ థియేటర్‌ గ్రూప్‌లో ముందు చేరారు. అలా మాకు పరిచయం అయింది. జానపద నాటకాలు వేయడం ఇక్కడ నేర్చుకున్నా. స్టేజ్‌ మీద పాడటం, డ్యాన్స్‌, నటన.. అన్నీ ఒకేచోట నేర్చుకున్నాను. ఇదంతా డిగ్రీ చదువుతూనే చేశాను. హీరో, విలన్‌.. చిన్నచిన్న పాత్రలను కూడా చేసి ప్రేక్షకుల మెప్పు పొందాను. భద్రుకా కాలేజీలో పీజీ చేస్తున్నప్పుడు నాన్న    నన్ను పిలిచి, ఉద్యోగం చేసే ఆలోచన ఉందా? అనడిగారు. అప్పుడప్పుడే సీరియల్స్‌ హవా మొదలైంది. అందరూ నన్ను అటుగా ట్రై చేయొచ్చు కదా అన్నారు. కానీ పైలెట్‌ అవ్వాలని ప్రయత్నించా. కానీ టెస్ట్‌ పాస్‌ కాలేదు. దాంతో నటన వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అదే విషయాన్ని నాన్న దగ్గర ప్రస్తావించా. ఒక ప్రయత్నం చేయి అని ప్రోత్సహించారు.

సీరియల్లో అడుగు..

2001లో.. ఓ సీరియల్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్ర చేశాను. అది టెలికాస్ట్‌ కాలేదు. ఆ తర్వాత.. స్వాతిలో హీరోగా, వెలుగు నీడలులో విలన్‌గా ఆఫర్‌ వచ్చింది. అలా దూరదర్శన్‌, ఈటీవీలతో నా కెరీర్‌ ప్రారంభమైంది. అదే సమయంలో వేరే చానెల్స్‌ నుంచి కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. జెమినిటీవీలో నాకు ఆఫర్‌ రావడంతో చెన్నై..హైదరాబాద్‌ తిరుగుతుండేవాడిని. అప్పుడే రాడాన్‌ నుంచి పిలుపు వచ్చింది. రాధిక గారి ఆధ్వర్యంలో ఆ సీరియల్‌లో హీరోగా చేశా. రెండు సంవత్సరాలు నడిచింది. అది చూసే స్రవంతి సీరియల్‌లో చాన్స్‌ ఇచ్చారు. ఇదే నా కెరీర్‌లో పెద్ద మైలురాయి అని చెప్పొచ్చు. ఈ సీరియల్‌ ఐదు సంవత్సరాలు నడిచింది.

అడపాదడపా..

సీరియల్స్‌ చేస్తూనే సినిమాల్లో కూడా నా అదృష్టం పరీక్షించుకున్నా. ‘ద్రోణ’లో నితిన్‌ ఫ్రెండ్‌గా చేశా. 10-12 సినిమాల్లో చిన్నాచితకా వేషాలు చేశాను. కానీ సీరియల్‌లో వచ్చిన పేరు వాటిలో రాలేదు. అందుకే పెద్దగా సినిమాల గురించి ఆలోచించలేదు. కొన్ని సమయం లేక కూడా చేయలేకపోయాను. ఆ తర్వాత శుభలేఖ, మంచుపల్లకి, డాక్టర్‌ చక్రవర్తి.. ఇలా అన్ని చానెల్స్‌ల్లో హీరో పాత్రలే చేశాను. ప్రస్తుతం జీ తెలుగులో చేస్తున్న రామ సక్కని సీతలో మళ్లీ హీరోగా  ఆదరిస్తున్నారు. దాదాపు 19 సంవత్సరాల నుంచి హీరోగా చేస్తున్నా చూస్తున్నారంటే ప్రేక్షకుల అభిమానమే. నేను పర్సనల్‌ లైఫ్‌ని పెద్దగా చెప్పడానికి ఇష్టపడను. ఎందుకంటే నా కుటుంబానికి పైవసీ ఉండాలని నేను కోరుకుంటా. 

సీసీఎల్‌లో..

చిన్నప్పటి నుంచి నాటకాలు, చదువులలోనే కాదు.. ఆటల్లోనూ ప్రావీణ్యం ఉంది. స్కూల్‌ నుంచి రాగానే క్రికెట్‌ ఆడేవాడ్ని. నేను ఆ ఆటలో ఆల్‌రౌండర్‌ని. వాలీబాల్‌ ప్లేయర్‌ని కూడా. ఉస్మానియా యూనివర్సిటీ తరపున కూడా ఆడాను.  స్పోర్ట్స్‌ కోటాలో జాబ్‌ వచ్చింది. కానీ ఏదో సమస్య కారణంగా నాకు ఆ ఉద్యోగం ఇవ్వనని చెప్పారు. క్రికెట్‌ విషయానికొస్తే.. 2011లో సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ జరుగుతున్నప్పుడు శ్రీకాంత్‌, వెంకటేష్‌ గారు, తరుణ్‌ మంచి టీమ్‌ కోసం వెతుకుతుంటే ఎవరో నా పేరు చెప్పారు. అలా తెలుగు వారియర్స్‌ తరపున ఆడే అవకాశం దక్కింది. ట్రోఫీ విజయంలో నా వంతు పాత్ర ఉందని చెప్పడానికి సంతోషిస్తా.

మంచి క్యారెక్టర్‌తో..

ఒక సీరియల్‌ షూటింగ్‌ కోసం అన్నపూర్ణాలో ఉన్నా. అప్పుడే ఏఎన్‌ఆర్‌గారు కారులో వెళ్తున్నారు. షూటింగ్‌ గ్యాప్‌లో నేను రోడ్‌ మీద నిల్చున్నా. ఆయన వెళుతూ వెళుతూ కారు ఆపి నన్ను పలకరించారు. ‘నువ్వు మంచి యాక్టర్‌వోయ్‌' అంటూ ముందుకెళ్లి పోయారు. ఈ ప్రశంసను నేను ఎప్పటికీ మరచిపోలేను. స్రవంతిలో, శుభలేఖ.. ప్రత్యేకంగా రామసక్కని సీతలో రామరాజు పాత్ర నాకు దగ్గరగా అనిపిస్తాయి. ఎందుకంటే.. ఒకరితో మాట పడటం నాకు తెలియదు. ఏదైనా ముక్కుసూటిగా చెప్పేస్తా. అలా అని ఇతరులను బాధ పెట్టే మాటలు అనలేను. 


logo