ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 03:22:05

ఓటీటీ..ఎనీటైమ్‌ వినోదం

ఓటీటీ..ఎనీటైమ్‌ వినోదం

ఒకప్పుడు సినిమా సమీక్షలు సినీ విమర్శకులు రాసేవారు.. ఇప్పుడు.. ప్రేక్షకులు కూడా రాస్తున్నారు.. ఒకప్పుడు థియేటర్‌లో సినిమా విడుదలైనప్పుడు రాసేవారు.. ఇప్పుడు.. ‘ప్రైమ్‌'లో వచ్చిన సందర్భంగా అనీ.. రాస్తున్నారు.. ఇక్కడ  ప్రైమ్‌ అంటే.. ఒక్క అమెజాన్‌ ప్రైమ్‌ మాత్రమే కాదు.. అలాంటి ప్రైమరీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అన్నమాట. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఓటీటీ అంటే ఓవర్‌ ది టాప్‌.. పైచేయి అని. పేరుకు తగ్గట్టుగానే దానిదే ఇప్పుడు పైచేయి అని. కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్‌ నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితం అయ్యాక వీటిని చూసే వారిసంఖ్య మరింత పెరిగింది. సినిమాలు లేవు. ఉన్నవి ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. విడుదలైనా జనాలు థియేటర్‌కు వస్తారా? లేదంటే ఇప్పుడే ఓటీటీల్లో విడుదల చేస్తే ఓ పనైపోతుందా? అలా చేస్తే థియేటర్ల పనే అయిపోతుందా? వేల రీళ్ల ప్రశ్నలు.. సమాధానం మాత్రం ఒకవైపే. అదీ ఓటీటీల వైపు. వాటి భవిష్యత్తు, సినిమాల మనుగడ ఎలా ఉండబోతున్నది? ఇదీ ఈవారం ముఖచిత్ర కథనం. 

ఉపోద్ఘాతం 

‘ఓటీటీల్లో నేరుగా సినిమా విడుదల చేయనున్న తొలి తెలుగు యంగ్‌ హీరో?’ఎవరో తెలుసా?!ప్రస్తుతానికి ఎవరూ లేరు. ఇది ఒక పుకారు. కరోనా కాలంలో చేసిన షికారు. విషయం ఏంటంటే?.. యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌ నటించిన సినిమా ‘ఒరేయ్‌ బుజ్జిగా..’. ‘గుండెజారి గల్లంతయిందే’ సినిమా ఫేమ్‌ కొండా విజయ్‌కుమార్‌ దర్శకుడు. ఈ సినిమా మార్చి 25న విడుదల కావాల్సి ఉండె. కానీ కరోనా.. జనతా కర్వ్యూ.. వెంటనే లాక్‌డౌన్‌. విడుదల ఆగిపోయింది. రోజులు గడుస్తున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత విడుదల తేదీని ప్రకటిద్దామనుకున్నారు. ఇంతలో లాక్‌డౌన్‌ పొడిగింపు. కరోనా ప్రభావం   మరింతకాలం ఉండేలా కనిపించసాగాయి పరిస్థితులు. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఎప్పుడు వస్తాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసినా.. జనాలు థియేటర్‌కి వస్తారా? వెంటనే రావడానికి ఇష్టపడరు. రెండు మూడు నెలలు గడిచిన తర్వాతే థియేటర్స్‌ వైపు చూస్తారనే చర్చ నడిచింది. ఈ క్రమంలో మార్చి, ఏప్రిల్‌లో విడుదల తేదీలను ప్రకటించిన సినిమాలు నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతాయన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇవన్నీ సోషల్‌మీడియా సృష్టించిన పుకార్లు. దీంతో బెంబేలెత్తిపోయిన సదరు నిర్మాత  అదే మీడియా వేదికగా ‘ఓటీటీల్లో విడుదల చేసే ప్రసక్తి లేదు. లాక్‌డౌన్‌ తర్వాత సమీక్షించుకున్నాక థియేటర్లోనే విడుదల చేస్తాం’ అని ప్రకటించాల్సి వచ్చింది. 

రామ్‌ పోతినేని నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా ‘రెడ్‌'. దీన్ని  కూడా ఏప్రిల్‌ 9న విడుదల చేద్దామనుకున్నారు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్‌ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదలకానున్నదనే వార్తలు వ్యాప్తించాయి. ‘22 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఓ డిజిటల్‌ సంస్థ ముందుకొచ్చిందని..’ పుకార్లు వచ్చాయి. దీన్ని ఖండిస్తూ రామ్‌ ట్వీట్‌ చేయాల్సి వచ్చింది. ‘ముందు బిగ్‌స్క్రీన్‌లోనే రిలేజ్‌' అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇలా విడుదల అవ్వాల్సిన సినిమాల్లో అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ కూడా ఉంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. ఈ సినిమా కూడా అమెజాన్‌ ప్రైమ్‌లో వచ్చేస్తున్నదంటూ డోలు బజాయించారు కొందరు. ‘ఇలాంటి వదంతులు నమ్మవద్దు. ఈ చిత్రం తాలూకు ఏ నిర్ణయాన్ని అయినా అధికారికంగా మేమే తెలియజేస్తాం’ అని నిర్మాణ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ఏమిటీ చర్చంతా? ఎందుకీ పుకార్ల షికార్లు అంటే.. ఓ మూలకారణం ఉంది. ఏ సినిమా అయినా థియేటర్‌లో విడుదలైన తర్వాతే కొన్నిరోజుల(నెలల)కు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి రావడం ఇప్పటివరకూ జరిగింది. కానీ ఓ తమిళ సినిమా ఈ మధ్య నేరుగా అమెజాన్‌ ఫ్రైమ్‌లో విడుదలైంది. శివ కార్తికేయ తమిళచిత్రం ‘హీరో’.. తెలుగులోకి ‘శక్తి’ పేరుతో డబ్‌ అయింది. మార్చి 20న థియేటర్‌లో విడుదల కావాల్సి ఉండె. అప్పటికే థియేటర్లు బంద్‌ అయ్యాయి. దీంతో సినిమాను నేరుగా డిజిటల్‌ మీడియాలో విడుదల చేసేశారు. సందీప్‌ కిషన్‌ నటించిన తమిళచిత్రం ‘నరగాసూరన్‌' కూడా మార్చి 27న విడుదల కావాల్సింది. ఈ సినిమాను కూడా నేరుగా వివిధ భాషల్లో డిజిటల్‌ మీడియా ద్వారా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. దీంతో టాలీవుడ్‌ సినిమాలు కూడా ఇలాగే ఓటీటీలకు వచ్చేస్తాయనే వార్తలు జోరందుకున్నాయి.  

ఉత్పాతం

కాలం మారుతున్నది. పైగా ఇది కరోనా కాలం. మనిషి జీవితం మారుతున్నది. జీవన విధానం మారుతున్నది. కరోనా సృష్టించిన కల్లోలంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. జనాలకు కాలక్షేపం కోసం టీవీ, లేదంటే సెల్‌ఫోన్‌ ప్రధాన భూమికలయ్యాయి. ఈ రెండూ ఇప్పుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయి ఉన్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఓటీటీల పుణ్యమా అని వందల వేల సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిణామం ఓ సరికొత్త పర్యవసానానికి, ఉత్పాతానికి దారితీస్తున్నది.  కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. తెరుచుకున్నా జనాలు వెంటనే వచ్చేస్తారా? రారు. ప్రేక్షకులు రావడం అనేది కొన్ని నెలల తర్వాత జరిగే పని అని నిర్మాతలకు అర్థమైపోయింది. వారు లాక్‌డౌన్‌ ఎత్తేయగానే థియేటర్లు తెరుచుకుంటాయనీ అనుకోవడం లేదు. జనసందోహం ఉండే ప్రాంతాలకు అప్పుడే అనుమతి ఇవ్వకపోవచ్చనీ తెలుసు. దశలవారీగా ఉంటుంది ఈ సడలింపు అని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కరోనా తిరగబడితే.. పరిస్థితి ఏంటని ఆందోళన కూడా చెందుతున్నారు. ఇది ఇప్పుడే తేలే వ్యవహారం కాదు.  ఈ స్థితిలో, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ గడ్డు పరిస్థితుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు బోలెడున్నాయి. ‘ఏం చేయాలి? విడుదల ఎలా?’ అని నిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు. 

‘మీరిప్పుడు విడుదల చేయలేరు.. మాకిచ్చేయండి అంటున్నాయి’ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌. తమిళంలో చూడండి.. ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగానే విడుదల చేస్తున్నారని ఉదాహరణలు చూపుతున్నాయి. ‘అలా ఇచ్చేస్తే.. జనాలు ఇంట్లోనే కూర్చుని సినిమా చూసేస్తే.. అలా  అలవాటు పడిపోతే.. ప్రేక్షకుడికి, వెండితెరకు మెల్లిగా దూరం పెరిగిపోతుంది’ అని భయపడుతున్నారు నిర్మాతలు.  నిర్మాతలకు థియేటర్లో విడుదల చేస్తే వచ్చే ఆదాయమే ప్రధానం. శాటిలైట్‌, డిజిటల్‌, ఆడియో అదనం. డబ్బింగ్‌ రైట్స్‌ మరో ఆదాయం. అలాంటిది ముందే ఓటీటీలకు ఇస్తే పరిస్థితి ఏంటి?- అసలు ముందు కాదు.. నిన్నమొన్నటి వరకు సినిమాలు విడుదలయ్యాక నెల, రెండు నెలలకు ఓటీటీల్లోకి వచ్చేవి. అలాంటి సమయంలోనే నిర్మాతలు ఆందోళన చెందారు. ‘నెల రోజుల్లో ఇంటికే వస్తుందంటే.. ఇక సినిమా చూడటానికి థియేటర్‌కు ఎవరొస్తార’ని ఆందోళన వ్యక్తం చేసిన నిర్మాతలూ ఉన్నారు. ఆశ్చర్యంగా అలాంటి వారి సినిమాలు కూడా ఆ తర్వాత విడుదలైన నెలరోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమయ్యాయంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎవరిది పైచెయ్యో. మొత్తంగా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ విప్లవం సినీ పరిశ్రమని కుదిపేస్తున్నది. ఇది నిన్నటి మాట. కరోనా దెబ్బకు ఇప్పుడది ఉత్పాతోత్తుంగ తరంగమై ఉరకలు వేస్తున్నది. 

కంటెంట్‌ ఈజ్‌ ద కింగ్‌ 

ఓటీటీ మార్కెట్‌ సినీ పరిశ్రమ భవిష్యత్తును ప్రశ్నిస్తున్నా.. తన భవిష్యత్తుకు మాత్రం బంగారు బాటలే వేసుకుంటున్నది. ఇందుకు అది నమ్ముతున్న ఏకైక సిద్ధాంతం- కంటెంట్‌. అదే కింగ్‌. ఈ కింగ్‌ మేకర్‌ విషయంలో ఓటీటీల్లో అంతర్గత పోరు, పోటీ జోరుగా ఉన్నది. గట్టిగా చెప్పాలంటే మార్కెట్‌లో ఇప్పుడు లీడర్లుగా ఉన్నది రెండే. ఒకటి అమెజాన్‌, రెండు నెట్‌ఫ్లిక్స్‌. హాట్‌స్టార్‌, జియో, సన్‌నెక్ట్స్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌ లాంటివి కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. కానీ, వాటికి ధీటుగా నిలువలేకపోతున్నాయి. ఎందుకంటే, టాప్‌ టూలో ఉన్న ఆ రెండు ప్లేయర్స్‌ ఇంటర్‌నేషనల్‌ కంటెంట్‌ ఇస్తుండగా మిగిలినవి ప్రస్తుతానికి ఆ పని చెయ్యడం లేదు. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లు బడ్జెట్‌ విషయంలో రాజీ పడకుండా ‘ఒరిజినల్‌ కంటెంట్‌' పేరుతో వెబ్‌ సిరీస్‌ల కోసం అవసరమైతే భారీబడ్జెట్‌ సినిమాకన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. భాష ఏదైనా క్రేజీ సినిమా ఉందంటే రైట్స్‌ కోసం గిరిగీసుకుని లెక్కలు వేసుకోవడం లేదు. మంచి కంటెంట్‌ ఉంటే కోట్లు కుమ్మరించడానికైనా వెనుకాడటం లేదు. లోకల్‌ ప్లాట్‌ఫామ్స్‌ అలాకాదు. హాట్‌స్టార్‌ కొంతలో కొంత నయంగా కనిపిస్తున్నది. క్వాలిటీ విషయంలో గట్టి పోటీకి రెడీ అవుతున్నది. మిగిలినవి ఎక్కువగా సినిమాలమీద ఆధారపడుతున్నాయి. కానీ ఆదాయం తీసుకురావడానికి అవొక్కటే సరిపోవు. మైండ్‌ బ్లోయింగ్‌ కాన్సెప్ట్‌తో కొత్త సిరీస్‌లు రావాలి. రాజీ పడకుండా నటీనటులను ఎంచుకోవాలి, ఒప్పించాలి. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం కన్నా ఇంట్లో కూర్చుని వెబ్‌సిరీస్‌ ఎంజాయ్‌ చేద్దామనే స్థాయిలో అవుట్‌పుట్‌ ఉండాలి. అలాగనీ బోల్డ్‌ కంటెంట్‌ను మాత్రమే నమ్ముకున్నా ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే చేరువవుతాయి. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఈ విషయంలో చాలా ముందంజలో, క్రియేటివ్‌గా ఉన్నాయి. మరి ‘ఆహా’తో పాటు రాబోయే ఇతర సంస్థలు, ఇప్పటికే పోటీలో ఉన్న కంపెనీలు ఆ దిశగా ఆలోచించినప్పుడే మంచి ఫలితాలొస్తాయి. అంతేగానీ, డిమాండ్‌ ఉంది కదా అని ఒక్కొక్కరు మొదలుపెట్టుకుంటూ పోతే చివరికి వ్యవహారం తేలిపోతుంది. అసలే ఇన్నేసి యాప్స్‌కి సబ్‌స్క్రిప్షన్‌ రూపంలో డబ్బులు ఎలా కట్టాలా అని ఎంటర్‌టైన్‌మెంట్‌ లవర్స్‌ లెక్కలు వేసుకుంటున్నారు. కరోనా దెబ్బకు వారి జీవితమే కాదు.. జీతమూ మారపోతున్నది. ఈ నేపథ్యంలో ఓటీటీల సంఖ్య పెరిగితే బెస్ట్‌ కంటెంట్‌ ఇచ్చిన వారికి తప్ప మిగిలిన వారికి మిగిలేది చిల్లరే.  

మన దేశంలో ఓటీటీ 

ప్రస్తుతానికి మన దేశంలో 40కిపైగా ఓటీటీ మీడియా సర్వీసులు ఉన్నాయి. 2018లో ఈ మార్కెట్‌ విలువ మన దేశంలో రూ. 2150 కోట్లు ఉండేది. 2019 నాటికి ఇది 3500 కోట్లకు పెరిగింది. కెపీఎంజీ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఒ భారతీయ చందాదారుడు సగటున 20-50 నిమిషాలు ఓటీటీ మీద గడుపుతున్నాడు. 2030 చివరి నాటికి 50 కోట్ల మంది వినియోగదారులతో మన దేశం రెండో అతిపెద్ద ఓటీటీ దేశంగా అవతరించనున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. 

మన దేశంలో మొదటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ బిగ్‌ఫ్లిక్స్‌(BIGFlix). దీన్ని 2008లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రారంభించింది. 2010లో డిజివైవ్‌ మొదటి ఓటీటీ మొబైల్‌ యాప్‌ నెక్ట్స్‌జెన్‌టీవీ (nexGTv)ని మొదలెట్టింది. ఇది లైవ్‌ టీవీతోపాటు ఆన్‌డిమాండ్‌ కంటెంట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఐపీఎల్‌ను తొలిసారి లైవ్‌ స్ట్రీమ్‌ చేసిందిది. 2015లో మొట్టమొదటిసారిగా మొబైల్‌ టాలెంట్‌ డిస్కవరీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. దీని పేరు స్పాట్‌లైట్‌. 2016లో తొలి ఒరిజినల్‌ సిరీస్‌ ప్రియాంక చోప్రాతో ‘ఇన్‌ మై సిటీ’ని రూపొందించింది. డిట్టో టీవీ (DittoTV), సోనీ లైవ్‌ (Sony Liv) 2013లో వచ్చాయి. అమెరికన్‌ స్ట్రీమింగ్‌ సర్వీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ 2016 ప్రారంభంలో ఇండియన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది. మోర్గాన్‌ స్టాన్లీ అధ్యయనం ప్రకారం ఇది అతి తక్కువ సమయంలోనే వీక్షకులను సంపాదించగలిగింది. ముంబైలో ఆఫీసు తెరిచి ‘ఒరిజినల్‌' కంటెంట్‌ మీద దృష్టి పెట్టింది. ఇందుకోసం 600 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా పెట్టింది. హాట్‌స్టార్‌ హాటెస్ట్‌ ఓటీటీగా వచ్చింది. స్టార్‌ ఇండియా దీన్ని 2018లో ప్రారంభించింది. ఏడాది తర్వాత రూ. 120 కోట్లు పెట్టుబడి పెట్టి ఒరిజినల్‌ కంటెంట్‌ను అందిస్తూ ‘హాట్‌స్టార్‌ స్పెషల్స్‌'గా ప్రచారం చేసుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌ 2016లో వచ్చింది. వస్తూ వస్తూనే ఇండియన్‌ కంటెంట్‌ కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు ప్రకటించి ఆకట్టుకుంది. 2300 టైటిల్స్‌, రెండు వేల సినిమాలు, 400 షోస్‌తో అడుగు పెట్టింది. 2018 నాటికి ఆరు ప్రాంతీయ భాషల్లో పట్టు సాధించింది. ఇరోస్‌ నౌ.. 11 వేల సినిమాలు.. లక్ష మ్యూజిక్‌ ఆల్బమ్స్‌, 100 టీవీ షోలతో రంగంలోకి దిగింది. 2019కి గాను బెస్ట్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు (బ్రిటీష్‌ ఏసియ్‌ మీడియా) సంపాదించింది.  బాలాజీ టెలీ ఫిల్మ్స్‌ వారి ఆల్ట్‌ బాలాజీ, వయాకామ్‌ 18 వారి వూట్‌ యూనిక్‌ కంటెంట్‌తో వచ్చాయి. రిలయన్స్‌.. జియో, సినిమా.. టీవీలతో, టైమ్స్‌ గ్రూప్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌తో రంగంలోకి దిగి గట్టి పోటీని ఇస్తున్నాయి. 

దేని వీక్షకులు దానికే.. 

టీవీలు వచ్చినప్పుడూ ఇలాగే అనుకున్నారు. తర్వాత స్టార్‌ నెట్‌వర్క్‌ వచ్చినప్పుడు ‘టీవీల్లో వందల సినిమాలు వస్తుంటే థియేటర్లకు ఎవరొస్తారు? అని అనుకున్నారు. విషయం ఏంటంటే వెండితేర ప్రేక్షకులు వేరు. బుల్లి తెర ప్రేక్షకులు వేరు. కొందరు రెండూ చూస్తారు. వెబ్‌ వచ్చిన తర్వాత వెండితెర నుంచి కొంతమంది, బుల్లితెర నుంచి కొంతమంది ప్రేక్షకులను తీసుకుంది. వెబ్‌ సిరీస్‌లకు సెపరేట్‌ ఆడియన్స్‌ ఉన్నారు. నో డౌట్‌.. కరోనా వల్ల సినిమా నుంచి వెబ్‌సిరీస్‌లకు వెళ్లే ప్రేక్షకులు ఉంటారు. అయితే.. థియేటర్‌లకు వచ్చే ప్రేక్షకులూ తప్పకుండా ఉంటారు.  మనిషి హ్యుమన్‌ బీయింగ్‌. సోషల్‌ యానిమల్‌. ప్రజలతో కలిసి సినిమా చూడాలని, భావోద్వేగాలు పంచుకోవాలని అనుకుంటాడు. అందరితో కలిసి నవ్వాలి. ఏడవాలి. అరవాలి. అందుకని థియేటర్‌లకు వస్తారు. మనమంతా సినిమాను టీవీలో ఒక రకంగా, వెబ్‌లో ఒక రకంగా, థియేటర్‌లో ఇంకో రకంగా చూస్తాం. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ వేరు. ప్రతి కంటెంట్‌ను డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేయలేం. కొంత కంటెంట్‌, థియేటర్‌కి, డిజిటల్‌కి ఉపయోగపడొచ్చు. కరోనా కాలంలో డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌, శాటిలైట్‌ చానల్స్‌లో మాత్రమే సినిమాలు విడుదల చేసుకోగలం. అది సినిమా హాళ్లకు మృత్యు గంటలు మోగిస్తుందని అనుకోను. 

- రాజమౌళి, సినీ దర్శకుడు (కరోనా నేపథ్యంలో)

ప్రాంతీయ భాషల్లో ‘ఆహా’ 

మన దేశంలో హోమ్‌ఛోయో తొలి ప్రాంతీయ భాషా ఓటీటీ. బెంగాలీ భాషలో 30 కొత్త షోలను లాంచ్‌ చేసింది. 12 ఒరిజినల్‌ ఫిల్మ్స్‌ను నిర్మించింది. 200 బెంగాలీ సినిమాలను కొనేసింది. 2018 నుంచి బంగ్లాదేశ్‌, యూఏఈలలో విస్తరించి 180 మిలియన్ల చందాదారులను సంపాదించింది. 2017లో సన్‌ నెక్ట్స్‌ తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ భాషలతో సౌత్‌ ఇండియన్‌ ఓటీటీగా వచ్చింది. ఫిబ్రవరి 2020 ‘ఆహా’ తొలి తెలుగు ఓటీటీగా అవతరించింది. సినీ నిర్మాత అల్లు అరవింద్‌ భాగస్వామ్యంలో వచ్చింది ఈ ఓటీటీ. కొత్త కంటెంట్‌తో తన ప్రభావాన్ని చూపించాలనుకున్న సమయంలోనే కరోనా దెబ్బకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నది. ఈ నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా ఇలాంటి ఓటీటీలో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, ఇందులో వాస్తవం లేదని మహేశ్‌ సన్నిహితులు ఖండించారు. నిర్మాతలు సురేష్‌బాబు, ‘దిల్‌' రాజు కూడా సంయుక్తంగా ఇలాంటి ఒక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. నెల రోజులకే వేస్తే ఎలా? 

తెలుగులో చాలా మంచి చిన్న సినిమాలు వస్తున్నాయి. వాటికి మంచి పేరు, రేటింగ్స్‌ కూడా వస్తున్నాయి. కానీ జనం ఎందుకు థియేటర్స్‌కి రావడం లేదు. అంటే వారికి ప్రత్యామ్నాయాలున్నాయి. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటివి ఉన్నాయి. డిజిటల్‌, శాటిలైట్‌లో వచ్చేస్తుంది కదా.. అప్పుడు చూద్దాం అనుకుంటున్నారు. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌ మీద సినిమాలు నాలుగు వారాల్లోనే వేసేస్తే ప్రేక్షకుడికి థియేటర్‌ రావడానికి ఎగ్జయిట్‌మెంట్‌ ఏముంటుంది? సినిమా విడుదలకు థియేటర్‌ మెయిన్‌ విండో. అందుకే అలాంటి వాటిని పోస్ట్‌పోన్‌ చేసుకోవాలి. కానీ, నిర్మాతలు కన్వీనియన్స్‌ కోసం అమ్మేసుకుని, నేను సేఫ్‌ అయిపోతా అనుకుంటే పరిస్థితులు మారిపోతాయి. ఒక సంవత్సరం తర్వాత శాటిలైట్‌లోకొచ్చే సినిమాల్ని ఆరునెలలకు తీసుకొచ్చేశాం. తర్వాత మూడు నెలలకు. ఇప్పుడు నాలుగు వారాలకు తీసుకొచ్చేస్తున్నారు. ఇక రేపు సమాంతరంగా విడుదల చేసుకుంటారు. ఏమవుతది..? సినిమా వ్యూవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ పోతది. కంటెంట్‌ ఎప్పుడూ ఉంటది. తీస్తారు. దాన్ని వేరే ప్లాట్‌ఫామ్స్‌ మీద చూస్తారు. కానీ కంటెంట్‌ను మనం ఎలా సేఫ్‌గార్డ్‌ చేసుకోవాలి. ఈ ఫిల్మ్‌ ఆర్ట్‌ ఫామ్‌ని ఎలా కాపాడుకోవాలి.. అనేది సినీ ట్రేడ్‌బాడీలు, పరిశ్రమ, ప్రొడ్యూసర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ చర్చించి నిర్ణయించుకోవాలి.  

- సురేష్‌ బాబు, సినీ నిర్మాత (మెంటల్‌ మదిలో.. సినిమా సమయంలో..)

  • ప్రస్తుతం మనదేశంలో ఒక్కో ప్రేక్షకుడి బ్రాడ్‌కాస్ట్‌ టీవీ సగటు వినియోగం గంట 34 నిమిషాలు కాగా, అదే ఆన్‌లైన్‌ టీవీ సగటు వినియోగం గంట 34 నిమిషాలుగా ఉంది. 
  • ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌లో జనాలు ఎక్కువగా చూస్తున్న జోనర్‌ కామెడీ. డ్రామాది తర్వాతి స్థానం. 
  • కెపీఎంజీ అధ్యయనం ప్రకారం మనదేశంలో హిందీ ఆన్‌లైన్‌ వీడియో కంటెంట్‌ 64 శాతం ఉంటే, తెలుగుది 5 శాతం మాత్రమే. 
  • డిజిటల్‌ వీడియో స్ట్రీమింగ్‌లలో ప్రాంతీయ భాషల వాటా 40 శాతం. 
  • ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఒక ఓటీటీ వినియోగదారుడు సగటున 45 నిమిషాలు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ చేసేవాడు. ప్రస్తుతం  అది గంట 17 నిమిషాలకు పెరిగింది. 
  • కరోనా కారణంగా బుల్లితెర వీక్షకుల సంఖ్య 47  శాతం పెరిగిందని బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) చెబుతున్నది. 


logo