మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 03:13:16

యాచన నుంచి ఫ్యాషన్‌కు

యాచన నుంచి ఫ్యాషన్‌కు

రాణు మండల్‌ గుర్తుందా..? రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయిపోయిన బిచ్చగత్తె, ఇప్పుడు బాలీవుడ్‌ సింగర్‌. ఈ యువతి కూడా ఒకనాడు బిచ్చగత్తే. నేడు బిగ్‌బ్రదర్‌ సెలబ్రెటీ, సూపర్‌ మోడల్‌, సీరియల్‌ నటి కూడా. జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఊహించలేం. అందుకు ప్రత్యక్ష సాక్షి ఫిలిప్పీన్స్‌కు చెందిన రీటా. 

అది 2016.. ఫిలిప్పీన్స్‌లోని లుబ్కాన్‌ ప్రాంతం. అందులో ఫిలిపినో పట్టణ వీధుల్లో భిక్షాటన చేస్తున్నది 13 యేండ్ల రీటా గవియోలా. ఆ ప్రాంతంలో ఏదో ఫెస్టివల్‌ జరుగుతున్నది. దానికి  ప్రముఖ ఫొటోగ్రాఫర్లు హాజరయ్యారు. ఎవరికివారు ఉత్సవాల్ని కవర్‌ చేసుకుని వెళ్లిపోయారు.  టోఫెర్‌ క్వింటో బుర్గోస్‌ అనే ఫొటోగ్రాఫర్‌ దృష్టి మాత్రం ఓ బిచ్చగత్తె వైపు మళ్లింది. అతను ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిని ప్రేమించే కళ్లకే తెలుస్తుంది సహజ సౌందర్యం గురించి. అక్కడున్నవాళ్లంతా ఓ యువతిలో బిచ్చగత్తెను చూశారు. టోఫెర్‌ కళ్లకు మాత్రం ఆమెలో ఓ సూపర్‌ మోడల్‌ దర్శనమిచ్చింది. వెంటనే తన కెమెరాకు పనిచెప్పాడు. రోడ్డుపై దీనంగా నిలుచున్న రీటాను తనదైన శైలిలో బంధించాడు. తుది మెరుగులు దిద్దకుండానే ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ యువతి.. నేడు సెలబ్రిటీ మోడల్‌. రీటా కుటుంబం కటిక పేదరికాన్ని అనుభవించింది. పస్తులు ఉండేంత దుస్థితి. దీంతో రీటా చదువు మధ్యలోనే ఆగిపోయింది. తండ్రి పారిశుద్ధ్య కార్మికుడు. రోజూ ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేవాడు. వచ్చిన నాలుగురాళ్లతో కుటుంబాన్ని పోషించేవాడు. అయినా ఆ సంపాదన సరిపోయేది కాదు. దీంతో రీటా తల్లితో కలిసి భిక్షాటన చేసేది. ఆ చిల్లర సైసలతో కడుపులెలా నిండుతాయి? ఎవరైనా దయతలచి అన్నం పెడితే ఓ పూట గడిచిపోయేది. లేకపోతే, మంచినీళ్లే భోజనం. అప్పుడే, ఒక ఫొటోగ్రాఫ్‌... కటిక దారిద్య్రం నుంచి కోట్లకొద్దీ సంపదవైపు తీసుకెళ్లింది ఆమెను.

మోడల్‌ నుంచి నటిగా..

రీటా పాపులారిటీని సొమ్ము చేసుకునేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయి. తమ ప్రకటనల్లో  అవకాశం కల్పించాయి. దీంతో అనూహ్యంగా మోడల్‌గా మారింది. ఆ వెంటనే  టీవీ సీరియళ్లలో నటించే ఛాన్స్‌ వచ్చింది. ప్రతిదాన్నీ సద్వినియోగం చేసుకున్నది రీటా. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో ‘బిగ్‌ బ్రదర్‌' (బిగ్‌బాస్‌ తరహా గేమ్‌ షో)లో అవకాశం వచ్చింది. అందులో అత్యంత చిన్న వయసు సెలబ్రిటీగా ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్‌ ప్రారంభమైన రెండేండ్లలోనే ప్రముఖ మోడళ్ల సరసన చేరింది రీటా.  తనకున్న పాపులారిటీతో బాగానే సంపాదించింది. ఓ ఇల్లు కూడా కొన్నది. కుటుంబ పరిస్థితుల కారణంగా బడికి దూరమైన రీటా.. ప్రస్తుతం చదువును కొనసాగిస్తానని అంటున్నది. ‘నన్ను ఈ స్థాయికి చేర్చిన టోఫెర్‌ అన్నకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఆయన చేసిన సాయం జీవితంలో మర్చిపోలేనిది. నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు’ అంటున్నది రీటా.  గతాన్ని మరచిపోని గుణం తనది.

జీవితాన్నే మార్చిన ఫొటో..

లుబ్కాన్‌లో టోఫెర్‌ తీసిన రీటా ఫొటో ఎవ్వరూ ఊహించని విధంగా వైరల్‌ అయింది. ఆమె వివరాలు తెలపాలంటూ ఒకటే మెసేజీలు, ఫోన్‌కాల్స్‌! ఎంతోమంది ఆర్థికంగా సహాయం చేశారు. మిస్‌వరల్డ్‌ ఫిలిప్పీన్స్‌ -2015 హిల్లరీ డన్నీలే పరుంగో, మిస్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిలిప్పీన్స్‌ బియాంక గైడొట్టి, మిస్‌ ఎర్త్‌- 2015 యాంజిలియా ఓంగ్‌... సోషల్‌ మీడియా ద్వారా రీటా ఫొటోను షేర్‌ చేసి ఆమెకు మరింత ప్రాచుర్యం కల్పించారు. logo