శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 03:07:23

భాస్కరేంద్రజాలం!

భాస్కరేంద్రజాలం!

ఖాళీ చేతులతో స్టేజి పైకి వచ్చి గాలిలో నుంచి వందలాది సిగరెట్లు సృష్టించటం, రంపంతో మనిషిని ముక్కలు చేసి తిరిగి అతికించడం, స్టేజి మీద మాయమై ప్రేక్షకుల మధ్యలో నుంచి ప్రత్యక్షమవడం, ఏ ఆధారం లేకుండా మనిషి గాలిలో తేలడం ఇలాంటి ఎన్నో.. అద్భుతమైన అంశాలను భాస్కర్‌ మ్యాజిక్‌ షోలో చూడవచ్చు. అతని మాయల వెనుక ఓ కథే దాగుంది. 

అది మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపురం సింగరేణి ఉన్నత పాఠశాల. మ్యాజిక్‌ షో నడుస్తున్నది. స్టేజీమీద మెజీషీయన్‌ గ్లాసులో పాలు పోసి చేత్తో పట్టుకున్నాడు. విద్యార్థుల్లో ఒకరికి జానెడు పొడవున్న స్ట్రా ఇచ్చి పీల్చమన్నాడు. అలా పీలుస్తుంటే గ్లాసులోని పాలు తగ్గుతూ వచ్చాయి. అలా చాలా ట్రిక్స్‌ చేసి చూపించాడు. అక్కడున్న విద్యార్థులంతా ఆనందపడ్డారు. నాలుగు రోజులు గడిచాక ఆ సంగతే మరిచిపోయారు. కానీ, ఏడో తరగతి చదువుతున్న గోదా భాస్కర్‌ అనే విద్యార్థి బుర్రలో మాత్రం ఎన్నో ప్రశ్నలు. ఇదంతా ఎలా సాధ్యం? అక్కడున్న గ్లాసులో పాలు, ఇక్కడ పీలిస్తే తగ్గడం ఏమిటి? కొన్ని రోజులు గడిచాయి. అయినా ఆ ఘటనను మర్చిపోలేక పోయాడు. ఆ మెజీషీయన్‌ తర్వాతి ప్రోగ్రాం ఎక్కడో తెలుసుకున్నాడు. స్కూల్‌కి డుమ్మా కొట్టి మరీ అక్కడికి వెళ్లాడు. ఆ తర్వాత కూడా ఎక్కడ మేజిక్‌షో జరిగినా వదిలేవాడు కాదు.

ఆసక్తిని పెంచిన పుస్తకం: రెండేండ్లు గడిచాయి. ఒకరోజు భాస్కర్‌ వరంగల్‌లోని మేనమామ ఇంటికి వెళ్లాడు. మామతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ పుస్తకం ఆకర్షించింది. పేరు... 101 మ్యాజిక్‌ ట్రిక్స్‌.  ఆ పుస్తకాన్ని కొనివ్వమని మారాం చేశాడు. దాని ధర పాతిక రూపాయలు. అప్పట్లో అది పెద్ద మొత్తమే. అయినా కొనిచ్చాడు మేనమామ. ప్రతి మ్యాజిక్‌ వెనుక ఒక ట్రిక్‌ ఉంటుందని అప్పుడే అర్థమైంది. తాను సొంతగా కొన్ని అంశాల్ని తయారు చేసుకొని పాఠశాలలో ప్రదర్శనలిచ్చేవాడు. వినాయక మండపాల్లో, ఫంక్షన్లలో తనకు తెలిసిన విద్యను ప్రదర్శించేవాడు. మ్యాజిక్‌ అంటే ఇంతేనా? కాదు ఇంకేదో ఉందనిపించింది. దాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. కొన్నేళ్లు కష్టపడ్డాడు. ఎక్కడ మ్యాజిక్‌కు సంబంధించిన సమాచారం కనిపించినా సేకరించి పెట్టుకునేవాడు. అప్పుడప్పుడూ మ్యాజిక్‌ ఫెస్టివల్స్‌ జరుగుతాయని సీనియర్‌ మెజీషియన్స్‌ బండి శంకర్‌, దశరథ్‌ల ద్వారా తెలుసుకున్నాడు. అమ్మా నాన్నా ఇచ్చిన పాకెట్‌ మనీతో నెల్లూరు, కరీంనగర్‌, ఉడిపిలలో జరిగిన మ్యాజిక్‌ ఫెస్టివల్స్‌కు వెళ్లాడు. అప్పుడు అర్థమైంది, తనకు తెలిసింది గోరంత అనీ, తెలియాల్సింది కొండంత అనీ. ఎవరి దగ్గరా ప్రత్యక్షంగా శిష్యరికం చేయకపోయినా... మ్యాజిక్‌ పుస్తకాలు చదవడం, మ్యాజిక్‌ ఫెస్టివల్స్‌ కి వెళ్లడం. వివిధ రాష్ర్టాల  మెజీషియన్స్‌ ప్రదర్శనలను గమనించటం, విదేశీ మెజీషియన్స్‌ వీడియోలు చూడటం... నిత్యకృత్యంగా పెట్టుకోవడంతో ఎన్నో మెళకువలు తెలిశాయి. తనను తాను మెరుగుపర్చుకున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించాడు. 

మెడపట్టి గెంటేశారు: ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన భాస్కర్‌కు ఏపీఎస్‌ఆర్టీసీ ముషీరాబాద్‌ డిపోలో అప్రెంటిస్‌షిప్‌ చేసే అవకాశం వచ్చింది. దీంతో  హైదరాబాద్‌కి వెళ్లాడు. అక్కడ తనలాంటి ఔత్సాహిక ఇంద్రజాలికులు అల్తాఫ్‌అలీ, అలీ అహ్మద్‌లతో పరిచయం పెంచుకున్నాడు. 1996లో కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాల్‌లో జరుగుతున్న జాతీయ స్థాయి ఇంద్రజాల పోటీలో పాల్గొనడానికి వెళ్లాడు. అక్కడ నిర్వాహకులు తనని పాల్గ్గొననివ్వలేదు. కారణం అడిగినందుకు మెడపట్టి బయటకి గెంటేశారు. ఆ అవమానం అతడిని ఇంద్రజాలంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే కసిని పెంచింది. ఎన్నో ఏండ్లు సాధన చేశాడు. సొంతంగా పరికరాలన్నీ తయారు చేసుకున్నాడు. వివిధ ప్రక్రియల మీద పట్టు సాధించాడు. 

-పడమటింటి రవికుమార్‌


logo