సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 01:21:33

జర్నీ విత్‌జానపదం!

జర్నీ విత్‌జానపదం!

జానపదం.. ఒకప్పుడు.. ఊరి పొలిమేర కాడ వినిపించేది. ఇప్పుడు.. హైటెక్‌ నగరాల నడి మధ్యలో మారుమోగుతున్నది.యూట్యూబ్‌లో ఫోక్‌ ఇప్పుడొక ట్రెండ్‌. ఇష్టపడి రాస్తే.. ప్రేమించి పాడితే... జానపదం ఏ స్థాయికైనా చేరుస్తుంది.అలాంటి అచ్చ తెలంగాణ  ఫోక్‌ సింగర్‌ మామిడి మౌనిక. మౌనిక జానపద ప్రస్థానమే ఈ వారం లైఫ్‌ జర్నీ. 

  • నాకు జానపదం అంటే పిచ్చి ప్రేమ. మాది జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్‌. ఇది మా అమ్మమ్మ వాళ్ల ఊరు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా కాబట్టి, నా ఊరు కూడా. పెద్దవాళ్లతో కలిసి ఉండటం వల్లనేమో పల్లెదనం అలవాటైంది నాకు. మాటలు.. కట్టు.. బొట్టు.. వ్యవహారం అన్నీ వాళ్ల లెక్కనే వచ్చినయి. చిన్నప్పుడు ఇంట్లో మా చిన్న మామయ్య కాసర్ల భీమన్న పాటలు పాడుతుండె. అది చూసి నేను కూడా ప్రయత్నించేదాన్ని. ఫస్ట్‌క్లాస్‌ నుంచే పాటలు పాడేది నేను. స్కూల్లో ఏ ప్రోగ్రామైనా నా నుంచి ఒక మంచి జానపదం ఉండాల్సిందే. ఎప్పుడైతే మా ఇంకో మామ మల్లిక్‌ పాడే పాటలు వినడం మొదలువెట్టిన్నో జానపదాన్ని సీరియస్‌గా తీసుకున్నా. 
  • స్కూల్‌ అయిపోయింది. కాలేజీకి వచ్చిన కూడా పాటే ప్రపంచంగా బతికిన. ‘ఈ జమాన్ల కూడా ఎన్కటి పాటలు పాడ్తవా? ఎన్కటి మనుషుల లెక్క ఉంటవా? అప్‌డేట్‌ కావా?’ అనేవాళ్లు తెలిసినోళ్లు. నాకు చిత్రమనిపించేది. వాళ్ల దృష్టిలో అప్‌డేట్‌ అవడం అంటే టెక్నాలజీ తెలిసి ఉండటం. యస్‌.. నాకు టెక్నాలజీపై బ్రహ్మాండమైన పట్టుంది. ఇంకోటి ఆధునిక కోర్సులు చదవడం. ఇది కూడా నాకు సమస్య కాదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి టాపర్‌నే. ఇప్పుడు జగిత్యాల రామకృష్ట కాలేజీల బయోటెక్నాలజీ చదువుతున్నా. అప్‌డేట్‌ అంటే... మూలాలను మర్చిపోవడం కాదు, ఆ సాంకేతికత ఆధారంగా మన మూలాల్లోకి వెళ్లడం. 
  • పాటైతే పాడుతున్నా. కానీ దీన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని మాత్రం నాకు లేకుండె. ‘ఏరా మౌనికా.. బాగా పాడుతున్నావ్‌. ఎంవీ మ్యూజిక్‌ తరపున పాట తీద్దామనుకుంటున్నం. పాడతవా మరి?’ అని అవకాశం కల్పించిండు. ఏదో క్యాజువల్‌గా పాడే నేను.. జనాదరణ చూసేసరికి సంబురపడ్డా. నా గొంతు నేనే వింటూ పరవశించిపోయిన. ఇంత కిక్కుంటదా అనిపించింది.  ఇప్పుడు నేను పాడిన పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నయి. టిక్‌టాక్‌లో అయితే ఊపుతున్నయి. నాకంటూ క్రేజ్‌  ఏర్పడింది.  జానపదం మాత్రమే పాడతానా అంటే.. అవకాశం వస్తే సినిమాలకు కూడా పాడతా. ఎందుకు పాడను? చాలామంది అంటుంటారు.. ‘మౌనికా.. నీ గొంతు చాలా సహజత్వంగా ఉంటుంది. వీడియోస్‌లో నీ కట్ట్టూబొట్టు కూడా అచ్చమైన పల్లెటూరు పిల్లలా.. చూస్తే కడుపు నిండేలా ఉంటుంది’ అంటుంటారు. అలా ఎవరైనా అన్నప్పుడు నాకూ నిజంగానే కడుపు నిండిపోతుంది.  
  • పాటేంటో తెలిసింది. ఇక రాయలేమా? అనిపించి తొలిప్రయత్నంగా ‘నేనత్త బావా’ అనే పాట రాశాను. రాసినవి ఇంకా చాలానే ఉన్నాయి. అవకాశాన్ని బట్టి వాటిని బయటకు తీసుకొస్తా.  పాటల్లో ఎంజాయ్‌ చేయొచ్చు అని నిరూపించిన సాంగ్స్‌ ‘మదనా సుందారీ’.. ‘సువ్వీ సువ్వియ్యాలో’ ఈ పాటలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. బాగా పాపులర్‌ అయ్యాయి. సువ్వీ సువ్వీయ్యాలో పాటకైతే ఒక్కరోజులోనే లక్షల వ్యూస్‌ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు జనాలకు ఎంత రీచ్‌ అవుతున్నాయో నా పాటలు. 
  • నాదో కొత్త ప్రపంచం. షూటింగ్స్‌.. రికార్డింగ్‌.. ప్రమోషన్‌. వీటితో సమాంతరంగా చదువు. ఫోక్స్‌లో కూడా కాంపిటీషన్‌ హెవీగా ఉంది. నాకైతే ఈ పోటీతత్వం మంచికే అనిపిస్తుంది. అమ్మమ్మ తాతయ్య అయితే టీవీలో చూసి చాలా సంతోషపడుతారు. నా పాటలు పెట్టుకొని చూస్తుంటారు.. వింటుంటారు. అప్పుడు వాళ్ల కళ్లలో తెలియని ఆనందం.. సంతృప్తి కనిపిస్తాయి. ఒకవైపు చదువుతూనే మరోవైపు కళల్లో కూడా రాణిస్తుండటం పట్ల స్నేహితులు కూడా గ్రేట్‌గా ఫీలవుతుంటారు. 
  • మౌనికకు మొదట్లో సైంటిస్ట్‌ అవ్వాలని ఉండేది. అందుకే బయోటెక్నాలజీ తీసుకున్నది. ఇప్పుడైతే పాటతోనే ప్రయాణం చేయాల్సి వస్తున్నది. ఇప్పుడామె ప్రపంచమంతా పాటే. ఇంకా మంచి పాటలు రాయాలి.. పాడాలి. టాలెంట్‌ ఉన్నవారికి అవకాశం ఇచ్చి కళాకారులుగా తీర్చిదిద్దాలనేలా ఆశయంతో అంచెలంచెలుగా ఎదుగుతున్నది. logo