మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 01:16:56

కలమే బలం

కలమే బలం

హీరోలు రాణించాలన్నా, దర్శకులు ఎదగాలన్నా ఆ సినిమా ఆడాలి. ‘సక్సెస్‌' అనిపించుకోవాలి.  ఆ విజయాన్ని అందుకోవాలంటే కథ బాగుండాలి. కథ బాగుండాలంటే రచయిత బాగా రాయాలి. అంటే సినిమాకు కథే ప్రాణం. కథ బాగుంటేనే బొమ్మ ఆడుతుంది. ఇప్పుడంటే రోజుల్లో తేలిపోతున్నది కానీ, ఒకప్పుడు కథా ప్రాధాన్యం కలిగిన చిత్రాలు నెలల తరబడి ఆడిన రోజులున్నాయి. సినిమాకు ఎన్ని హంగులూ అర్భాటాలున్నా కథే ప్రాణం. ఆ విషయం తెలిసిన కథా రచయితల్లో వెలిగొండ శ్రీనివాస్‌ ఒకరు. సినిమా కథ వెనుక కథ ఆయన మాటల్లోనే...

-మధుకర్‌ వైద్యుల

రచయిత ఆలోచనల్లోంచి పురుడు పోసుకున్న కథ వెండితెర మీదికి వచ్చేసరికి ఎన్ని మార్పులకు గురైనా, ఎంతమంది వేళ్లుపెట్టినా... మూలకథ మాత్రం మూల రచయిత రాసిందే ఉంటుంది. కథ ఎంత బలంగా ఉంటే సినిమా విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు మూస కథలే ఎక్కువ. ఒక హీరో, ఒక హీరోయిన్‌, ఒక విలన్‌.. ైక్లెమాక్స్‌లో హీరోదే విజయం. అంతిమంగా ‘శుభం’. ఇదే ఫార్ములాతో వందలకొద్దీ సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ఆడాయి, కొన్ని పోయాయి. ఇటీవలి కాలంలో కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలకే ప్రేక్షకుడు పట్టం కడుతున్నాడు. స్టార్‌డమ్‌నూ, గ్రాఫిక్స్‌ను, ఫారిన్‌ లొకేషన్స్‌ను, బడ్జెట్‌నూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కథ బాగుంటే కలెక్షన్ల వర్షమే. ప్రేక్షకులు కోరుకున్న కథను అందంగా చూపించగలిగితేనే సినిమా విజయం సాధిస్తుంది. అంటే, ప్రేక్షకులు ఈ కథను మాదీ అనుకోగలగాలి. వాస్తవానికి దగ్గరగా ఉండే కథలకు ఇప్పుడు ప్రాధాన్యం పెరిగింది.

అంతా దర్శకుడే...

సినిమా రంగంలో ఒకప్పుడు కథా రచయిత, దర్శకుడు, సంభాషణల రచయిత... ఇలా వేర్వేరుగా ఉండేవారు. సినిమా పరిశ్రమలో వేగం పెరుగుతున్న కొద్దీ, అన్ని పాత్రలనూ దర్శకుడే నిర్వహిస్తున్నాడు. ఎవరి కథ వాళ్లే సిద్ధం చేసుకుంటున్నారు. ఎవరి డైలాగ్స్‌ వాళ్లే రాసుకుంటున్నారు. ఒకప్పుడు కథా రచయితలు అవకాశాల కోసం దర్శకులు, హీరోల చుట్టూ తిరిగేవారు. కథ ఓకే అయితే సినిమా కూడా ఓకేనే! కానీ ఇప్పుడు దర్శకుడే సినిమానంతా తన భుజాలపై మోస్తున్నాడు. కొంతమంది మాత్రమే మరో రచయిత రాసిన కథతో సినిమా తీయడానికి ముందుకు వస్తున్నారు. మూలకథ నచ్చితే తన సినిమాకు తగినట్లు మార్చుకుంటున్నాడు.అంతంత మాత్రమే..

ఇండస్ట్రీలో ఒకరిద్దరు మినహా, కథా రచయితలకు అంతగా డిమాండ్‌ లేదనే చెప్పాలి. ఇప్పుడు కథలన్నీ  దర్శకులే రాసుకుంటున్నారు. ఆ కథను బట్టి సంభాషణల రచయితలను ఎంపిక చేసుకుంటున్నారు. రచయితే దర్శకుడు అయినప్పుడు తన కథకు పూర్తిగా న్యాయం చేయగలుగుతాడు కూడా. అందుకే చాలామంది దర్శకులు మెగాఫోన్‌తో పాటు కలమూ 

పడుతున్నారు.  

కథానాయకుడిని బట్టి..

రచయిత రాసుకొచ్చిన కథ దర్శకుడికి నచ్చితే.. వెంటనే ఫలానా హీరో అయితే బాగుంటుందని మనసులో అనుకుంటాడు. ఆ హీరోకు కథ వినిపిస్తాడు. నచ్చిందా, సినిమా ట్రాక్‌మీదికి వచ్చినట్లే. కొన్నిసార్లు నిర్మాతే కథను ఎంపిక చేసుకుని తగిన దర్శకుడినీ నటీనటులనూ ఎంపిక చేసుకుంటాడు. అయితే ఇప్పుడొస్తున్న  కథలను మాత్రం కథానాయకుల్ని దృష్టిలో పెట్టుకునే రాస్తున్నారు. ఒకప్పుడు ఫలానా సినిమా ఫలానా హీరో చేస్తేనే బాగుంటుంది అనుకుని మరీ  చేసేవారు. కొందరు హీరోలు యాంగ్రీయంగ్‌మ్యాన్‌ పాత్రలకీ, కొందరు హీరోలు లవర్‌బాయ్‌ పాత్రలకీ, కొందరు హీరోలు ఇద్దరు పెళ్లాల పాత్రలకీ.. ఇలా ఎవరి ముద్రలు వారికి ఉండేవి. అయితే నేటితరం హీరోలు అన్ని రకాల చిత్రాలూ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.  ప్రయోగాత్మక కథల పట్ల ఆసక్తి చూపుతున్నారు. దానికి తగినట్లే రచయితలూ తమ కలాల్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. 

విజయంతోనే అవకాశాలు

ఫలానా రచయిత కథ రాసిన సినిమా విజయవంతం అయితే, సహజంగానే సినిమా ఇండస్ట్రీలో అతనికి మంచి అవకాశాలు వస్తాయి. కొన్నిసార్లు అపజయాలు కూడా తప్పవు. అయితే రచయిత ఎప్పుడూ తనను తాను సానపట్టుకోవాలి. ప్రస్తుత ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ప్రేక్షకుల అభిరుచికి తగిన కథను అందిస్తేనే రచయితకు గుర్తింపు వస్తుంది. అది ప్రేమకథ అయినా, ఫ్యాక్షన్‌ కథ అయినా, ఫ్యామిలీ కథా అయినా ప్రేక్షకులు అంగీకరిస్తేనే విజయం. ఆ విజయాలే రచయితను పైపైకి తీసుకువెళ్తాయి.రచయిత గురించి

వెలిగొండ శ్రీనివాస్‌ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందినవాడు. చిన్నతనం నుండి కథలు రాయడం పట్ల ఆసక్తి. ఆ మక్కువతోనే ఇరవై ఐదేండ్ల క్రితం సినిమాల్లోకి వచ్చారు. తను తొలిసారి కథ రాసిన పోలీస్‌, దేవా రెండు సినిమాలు ఒకేసారి విడుదలై విజయం సాధించాయి. దీంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘ఒక్కడే’, ‘తిన్నామా?పడుకున్నామా? తెల్లారిందా?’, ‘బొమ్మనబ్రదర్స్‌-చందన సిస్టర్స్‌', ‘బాడీగార్డ్‌', ‘జయం మనదేరా’, ‘జబర్దస్త్‌', ‘డాన్‌శీను’,‘ఢమరుకం’ ‘సీమశాస్త్రి’, ‘కితకితలు’ ‘బలుపు’, ‘బెండు అప్పారావు’... ఇలా పలు సినిమాలకు కథా రచయితగా, సంభాషణల రచయితగా పనిచేశారు. ఇటీవల వచ్చిన ‘అంధగాడు’ సినిమాకు దర్శకత్వం వహించారు. త్వరలో మరో థ్రిల్లర్‌మూవీతో మనముందుకు వస్తానంటున్నారు. 


logo