గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 01:09:48

మౌనితగా నిలిచిపోయా!

మౌనితగా నిలిచిపోయా!

‘ఇంకొకరి భర్తను కోరుకుంటున్నది అసలు ఆడదేనా?’..‘దీపని అంతగా ఏడిపిస్తున్నది.. మౌనిత బెడద ఎప్పుడు పోతుందో’.. ఈ డైలాగ్‌లు వింటుంటే మౌనితని ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో తెలిసిపోతున్నది..కార్తీక దీపం సీరియల్‌లో దీపను ఎంత ప్రేమిస్తారో..మౌనితను అంత ద్వేషించే వాళ్లున్నారు..ఆ క్యారెక్టర్‌ని అంతగా పండిస్తున్న నటి శోభ శెట్టి.అందరి మనసులో ద్వేషం నింపినా..తన నటనతో ఎంతో ఆకట్టుకుంటున్నది.ఆ నటి తన సీరియల్‌ ప్రస్థానం చెప్పుకొచ్చిందిలా..నేను కన్నడ అమ్మాయిని. పుట్టి పెరిగింది బెంగళూరులో. మేం నలుగురం. నేనే చిన్నదాన్ని. నేనంటే ఇంట్లో అందరికీ ఇష్టం. చాలా ముద్దు చేసేవారు. చిన్నప్పటి నుంచి నేను మంచి స్టూడెంట్‌నే. అలా అని ర్యాంకుల కోసం తెగ కష్టపడే టైప్‌ మాత్రం కాదు. ఫస్ట్‌ క్లాసులో పాసయ్యేదాన్ని.  దగ్గరయిన వాళ్లతో చాలా కలివిడిగా ఉంటాన్నేను.

డ్యాన్స్‌ నేర్చుకున్నా..

నేను ఎనిమిదో తరగతిలో భరతనాట్యం నేర్చుకున్నా. ఇది కూడా  ఫ్రెండ్స్‌ వెళుతున్నారని వెళ్లాను తప్ప.. నాకు పెద్దగా ఇంట్రెస్ట్‌ లేదు. పదవతరగతి వచ్చేసరికి స్టడీస్‌ మీద శ్రద్ధ పెట్టాను. స్కూల్‌లో మాత్రం కల్చరల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనేదాన్ని. ఈ కళాభిమానం మా తాతయ్య నుంచి వచ్చిందంటుంది అమ్మ. వాళ్ల నాన్న, అంటే నా తాతయ్య.. డ్రామా కంపెనీ ఓనర్‌. చిన్నప్పుడు నన్ను చూసి ‘ఇది నాలాగే మంచి యాక్టర్‌ అవుతుంది’ అనేవారట. కానీ ఎవరూ ఆయన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ మాటలే నిజమయ్యాయి.

డిగ్రీలో ఉండగా..

కొన్ని అవకాశాలు అనుకోకుండా వస్తాయంటారు. నా విషయంలోనూ అదే జరిగింది. నేను డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు కాలేజీ యాన్యువల్‌ డే జరిగింది. ఒక డైరెక్టర్‌ ఆ ప్రోగ్రాంకి వచ్చాడు. నేను యాక్టివ్‌గా ఉండడం చూశాడు. ఆ రోజు మా అమ్మ కూడా నాతో ఉంది. ఆయన మా స్కూల్‌ వాళ్ల దగ్గర వివరాలు తీసుకొని ఆ రోజే అమ్మతో మాట్లాడాడు. ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి.. మరుసటి రోజు నా ఫొటోలు తీసుకొని రమ్మని చెప్పి వెళ్లిపోయాడు. నేను, అమ్మ కలిసి వెళ్లాం. ఆయనకు ఫొటోలు ఇచ్చేసరికి నవ్వుతున్నారు. ఎందుకంటే మేం ఇచ్చింది.. పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోస్‌. ఆ సమయంలో ఎలా ఫొటోలు తీయించుకోవాలే కూడా తెలియదు నాకు. ఆ తర్వాత మేకప్‌, స్క్రీన్‌ టెస్ట్‌ చేశారు. ఓకే చెప్పడంతో మొదటి సీరియల్‌లో అవకాశం దక్కింది.

కన్నడ టు తెలుగు..

ఒక సీరియల్‌లో ఆరు నెలలు నటించా లీడ్‌ హీరోయిన్‌గా. ఆ సమయంలో నా స్టడీస్‌కి చాలా ఇబ్బంది అయ్యింది. అందుకే మానేశా. మళ్లీ ఇంకో అవకాశం వచ్చింది. కాదనలేక, చదువుతూనే ఆ సీరియల్‌ చేశా. అగ్నిసాక్షిలో ఒక లీడ్‌గా నేను చేశా. అది సూపర్‌ హిట్‌. ఆ తర్వాత నా కెరీర్‌ ఇదేనని ఫిక్స్‌ అయ్యా. అప్పుడే అర్క మీడియా నుంచి తెలుగులో ఆఫర్‌ వచ్చింది. ముందు చాలా ఆలోచించా. అమ్మా, నాన్న ఇచ్చిన ధైర్యంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టా. ఇక్కడ రెండు తెలుగు సీరియల్స్‌ చేశాను. ముందు తెలుగు తెలియక కొద్దిగా ఇబ్బంది పడ్డా. కానీ ఇప్పుడు బాగా నేర్చుకున్నా. అప్పటిదాకా పాజిటివ్‌ రోల్స్‌ చేశా. అప్పుడే కార్తిక దీపం సీరియల్‌ ఆఫర్‌ వచ్చింది.

మానేయాలనుకున్నా..

కార్తీక దీపంలో నెగిటివ్‌ రోల్‌ అనగానే చాలా ఆలోచించా. మౌనితలా క్రూరంగా ఆలోచించడం నా స్వభావానికి విరుద్ధం. ముందు నేను చేయగలనా? అనిపించింది. అందరూ ఇచ్చిన ధైర్యంతో ఒప్పుకొన్నా. మొదట్లో ప్రేక్షకులు నన్ను తిట్టేవాళ్లు. అది చూసి చాలా బాధపడేదాన్ని. కొందరైతే చంపేయాలన్నంత కోపంతో ఏవేవో మెసేజ్‌లు పెట్టారు. ఆ సమయంలో నేను నటన మానేసి వెళ్లిపోదామనుకున్నా. అప్పుడే కొంతమంది ఫ్రెండ్స్‌ ‘పాజిటివ్‌ కామెంట్స్‌ కూడా చూడు. నువ్వు నెగటివ్‌ మాత్రమే చూస్తున్నావు’ అని సర్దిచెప్పారు. ఆ తర్వాత నాకు అర్థమయింది... అందరూ మౌనితనే తిడుతున్నారు కానీ, నన్ను కాదని. అలా ఇప్పుడు మౌనితగా అందరి మనసులలో నిలిచిపోయా. ఆ క్యారెక్టర్‌కి ఎన్నో అవార్డులు ప్రకటించడంతో మరింత ధైర్యం వచ్చింది. అందుకే అప్పటి నుంచి డ్రెస్సింగ్‌ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టా. ఆ క్యారెక్టర్‌ వేసుకునే డ్రెస్‌లు నేను డిజైన్‌ చేయించి కుట్టించినవే. పాత్రకి ఒక యునీక్‌నెస్‌ రావాలని అలా చేశాను.

అమ్మానాన్నలే సపోర్ట్‌..

మేం చాలా ఇబ్బందికర పరిస్థితి నుంచి ఈ స్థాయికి వచ్చాం. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు నాన్నే నాకు తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు అమ్మ వస్తుంది. వాళ్లిద్దరూ ఇప్పటికీ నన్ను  చిన్నపిల్లలా చూసుకుంటారు. ప్రతీ విషయాన్ని అమ్మతో పంచుకుంటా. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అమ్మే. తొలిరోజుల్లో యాక్టింగ్‌ చేసేటప్పుడు అమ్మ స్క్రిప్ట్‌ చదివి ఎలా చేయాలో నాకు నేర్పించేది. అలా నాకు నటనలో ఓనమాలు నేర్పింది. నెలలో ఒక వారం సెలవు తీసుకుంటా. ఆ సమయంలో బెంగళూరులో వాలిపోతా. అమ్మానాన్నతో, అక్కలతో, అన్నయ్యతో కాలం గడుపుతుంటా. మంచి క్యారెక్టర్‌ వస్తే సినిమా కూడా చేయాలనుకుంటున్నా. ఇక పెండ్లి విషయానికొస్తే ఏం ఆలోచించలేదు.  అమ్మానాన్నలకి నచ్చిన అబ్బాయిని చేసుకుంటా. షూటింగ్‌ గ్యాప్‌లో నేను ఎక్కువగా గూగుల్‌ సెర్చ్‌ చేస్తుంటా. అంటే.. ఏదో ఒకదాని గురించి వెతుకుతుంటా. అందుకే  కో ఆర్టిస్ట్‌లు నన్ను ‘గూగుల్‌ సెర్చ్‌' అని ఆటపట్టిస్తుంటారు. కాస్త బోర్‌ కొట్టినా కారు తీసుకొని లాంగ్‌ డ్రైవ్‌ వెళుతుంటా. 


logo