గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 01:00:53

నాట్‌ ఫర్‌ సేల్‌

నాట్‌ ఫర్‌ సేల్‌

క్రిస్టినీకి బయట నించి స్టార్‌గేజర్‌ గుర్రం గిట్టల చప్పుడు, సకిలింపు, కారు ఇంజిన్‌ చప్పుడు వినిపించాయి. తను పొలంలోని ఆ ఇంటికి వచ్చినట్లు తన లాయర్‌కి తప్ప మరెవరికీ తెలీదు. ఎవరు వచ్చారా అని కొద్దిగా ఆతృతగా లేచింది. డోర్‌ బెల్‌ మోగకపోవడం, స్టార్‌గేజర్‌ సకిలింపు విన్న ఆమె ఎవరో దాని షెడ్లోకి వెళ్ళారని గ్రహించింది.కొద్దిసేపటికి తలుపు మీద తట్టారు. వెళ్ళి తలుపు తెరచింది. ఆయన క్రిస్టినీ వంక నవ్వుతూ చూసి, లోపలకి వచ్చి అడిగాడు.“హలో క్రిస్టినీ. నన్ను గుర్తు పట్టావా? అలెన్‌ని.”అతన్నించి షేవింగ్‌ లోషన్‌, పొగాకు వాసన వస్తోంది.“నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలీదు అనుకున్నాను. ఏం కావాలి మిస్టర్‌ అలెన్‌?” క్రిస్టినీ ప్రశ్నించింది.“మీ నాన్న విల్‌ మరణం మా అందరికీ షాక్‌. నిజానికి అందరికన్నా ముందే నేను ఇక్కడికి వచ్చానని అనుకుంటాను? మీ పొలం అమ్మకానికి రావడం నాకు బాధగా ఉంది. విల్‌ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే బావుండేదని నాకు అనిపిస్తూంటుంది. మిత్రుడికి అప్పు ఇవ్వడం వల్ల స్నేహం చెడుతుంది అన్నది నా విషయంలో జరిగింది. మీ నాన్న నాకింకా కొంత సొమ్ము బాకీ ఉన్నాడు.”“అవును. ఎస్టేట్‌ వ్యవహారాలు పూర్తిగా సెటిలయ్యాక అన్ని అప్పులూ తీరుస్తాను. పొలం ఈ మధ్యే అమ్ముడైంది మిస్టర్‌ అలెన్‌.”“మీ నాన్న చాలా మంచి గుర్రాలని పెంచాడు. నిన్న జరిగిన వాటి వేలంపాటలో నేనూ పాల్గొన్నాను. నా దగ్గర డబ్బున్నంత మేరకి వాటిని కొన్నాను. మీ నాన్నలా నాకూ గుర్రాలంటే ప్రాణం. అదే మా స్నేహానికి కారణం. చాలాకాలంగా నేను గుర్రాలని పెంచుతున్నాను.”“కాని అన్ని గుర్రాలూ అమ్ముడైపోయాయి” క్రిస్టినీ చెప్పింది.

“నేను కొందామనుకున్న గుర్రం మాత్రం వేలంపాటకి రాలేదు? స్టార్‌గేజర్‌ చంపే గుర్రం అని దాన్ని వేలం పాటకి పంపలేదా? అంత చక్కగా పెంచబడ్డ గుర్రం అకస్మాత్తుగా తిరగబడి చంపుతుందని నేను నమ్మలేను.” అలెన్‌ అడిగాడు.

“అవును. కావాలనే దాన్ని వేలానికి పంపలేదు.”

“నేను అది చంపిన బ్రూనెట్‌ విచారణ మొత్తం విన్నాను. బ్రూనెట్‌ స్టార్‌గేజర్‌ విషయంలో క్రూరంగా ప్రవర్తించబట్టే అది అతన్ని చంపిందని నా నమ్మకం.”

“లేదు. బ్రూనెట్‌ చక్కటి శిక్షకుడు.”

“నేనా గుర్రాన్ని కొనాలని వచ్చాను. దానికి గల అపఖ్యాతి వల్ల తక్కువకు కొంటానని అనుకోకు.”

“కాని దాన్ని నేను అమ్మదలచుకోలేదు.”

“చక్కటి ధర వస్తే దాన్ని అమ్మకుండా ఉంచుకుంటావని అనుకోను.”

“నాకు స్టార్‌గేజర్‌ అంటే ఇష్టం. అది బ్రూనెట్‌ని చంపాక మళ్ళీ ఎవరూ దాని మీద స్వారీ చేయలేరు కూడా.”

“ఓ చక్కటి గుర్రాన్ని నువ్వు వృథా చేస్తున్నావంటాను. అది ఏ పోటీలో పాల్గొన్నా గెలిచి తీరుతుంది.”

“కాని ఎవరూ మళ్ళీ దాని మీద స్వారీ చేయడం నాకు ఇష్టం లేదు మిస్టర్‌ అలెన్‌” క్రిస్టినీ చెప్పింది.

“దాని మీద ఎక్కితే మళ్ళీ అది చంపుతుందనా?”

“బహుశా చంపవచ్చు.”

“అంటే స్టార్‌గేజర్ని చంపే పిచ్చి గుర్రం అంటున్నావా?”

“నేనేమీ అనడం లేదు. నాకు చాలా పనులున్నాయి.” చిన్నగా నిట్టూర్చి చెప్పింది.

“ఐతే నాతో ఓ పందెం కడతావా? దాని మీద నేను స్వారీ చేసినా నన్నేం చేయలేదది” అలెన్‌ నవ్వుతూ అడిగాడు.

“కాదు. నేను...”

“నేనో క్షణం కూడా ఆ వదంతిని నమ్మను. స్టార్‌గేజర్‌ కన్నా ఐదింతలు అపఖ్యాతి గల చాలా గుర్రాల మీద నేను స్వారీ చేశాను. నాకేం కాదని హామీ.”

“దయచేసి. నేనీ విషయం మీద ఇక చర్చించదలచుకోలేదు” క్రిస్టిని బాధగా చెప్పింది.

“నేను దాని మీద ప్రమాదం లేకుండా స్వారీ చేయగలనని నిరూపించుకుంటే అప్పుడు అమ్ముతావా?”

“లేదు మిస్టర్‌ అలెన్‌. ఇక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని మళ్ళీ వాషింగ్టన్‌కి మా వారి దగ్గరకి వెళ్ళిపోతాను. కాబట్టి ఇక రాకండి” క్రిస్టినీ చెప్పింది.

“నువ్వు మీ నాన్న కూతురు అనిపించావు. ఆయన ఇతరుల మాటని వినేవాడు కాదు. మరి స్టార్‌గేజర్ని ఏం చేస్తావు?”

“వాషింగ్టన్‌కి తీసుకెళ్తాను.”

“నాకేమైనా అవుతుందని నువ్వు భయపడక్కర్లేదు. నేను పుట్టింది జీనులోనే.  ఏదైనా జరిగితే బాధ్యత నాదే.”

“మరోసారి స్టార్‌గేజర్‌ మీద ఎవరైనా స్వారీ చేస్తుండగా మరణిస్తే దాన్ని చంపేస్తారు. చట్టపరంగా ఆ హక్కు అందరికీ వస్తుంది. అలా జరగనివ్వను. కారణం నాకు స్టార్‌గేజర్‌ అంటే ఇష్టం.”

“అలా జరగదు కూడా.”

“జరగొచ్చు. స్టార్‌గేజర్‌ గురించి నాకు బాగా తెలుసు. అది మా గుర్రాలకి పుట్టలేదు. చిన్నపిల్లగా ఉండగా నాన్న దాన్ని కొన్నారు. దాన్ని అమ్మినవాడు దాన్ని క్రూరంగా బాధించడంతో అది మొండిగా శిక్షణకి లొంగేది కాదు. నేను దాన్ని దయతో దారికి తెచ్చుకుంటానని నమ్మి మా నాన్న దాన్ని నా కోసం కొన్నారు. అది అందుకు స్పందించింది. స్వారీ చేయడానికి అది చాలా మంచి గుర్రం. ఎంతో మృదువుగా ప్రవర్తించేది. మీరు చెప్పింది నిజమే. దాన్లో మార్పు వచ్చింది. బ్రూనెట్‌ దాన్ని సరిగ్గా చూడలేదు. అతను మంచి శిక్షకుడు. కాకపోతే సహనం లేదు. మాట వినకపోతే ఒక్కోసారి క్రూరంగా శిక్షిస్తాడు. అలాంటి సందర్భాల్లో అన్ని గుర్రాలు చేసే పనే స్టార్‌గేజర్‌ కూడా చేసింది. అతన్ని పడేసి గిట్టలతో తొక్కి చంపింది. షెడ్లో, పచ్చిక బయల్లో గడ్డి తింటూ అది చాలా మంచి గుర్రంలా కనిపిస్తుంది. కాని మీద మనిషి బరువు పడగానే దాన్లో క్రోధం తన్నుకు వస్తుంది. దయచేసి వెళ్ళండి. ఇంక ఈ విషయం మాట్లాడటం నాకు ఇష్టం లేదు” చెప్తుంటే క్రిస్టినీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆయన నిశ్శబ్దంగా లేచి బయటకి నడిచాడు. చిరుకోపంతో తలుపు చప్పుడయ్యేలా వేశాడు. ఆమె లేచి బల్ల ముందు కూర్చుని వేలంపాట నించి వచ్చిన అమ్మకాల స్టేట్‌మెంట్‌ని చదవసాగింది.

అకస్మాత్తుగా ఆమెకి గుర్రం సకిలింపు, గిట్టతో అది నేల మీద కొడుతున్న ధ్వని వినిపించాయి. వెంటనే లేచి కిటికీ దగ్గరకి పరిగెత్తుకెళ్ళి చూసింది. షెడ్లోంచి ఆ గుర్రం బయటకి వచ్చింది. అలెన్‌ దాని మీద ఎక్కి స్వారీ చేస్తున్నాడు. వెంటనే ఆమె ఆదుర్దాగా బయటకి పరిగెత్తుకు వచ్చి అరిచింది.

“స్టార్‌గేజర్‌! ఆగు.”

అది ఆగకుండా వేగంగా దౌడు తీసింది. క్రిస్టినీకి భయం కలిగింది. అది మళ్ళీ అలెన్‌ని చంపుతుందా? ఏం చేయాలి? షెడ్లోని తన కారు వైపు వెళ్తూ బయట ఆగిన అలెన్‌ కారుని చూసి చటుక్కున ఆగింది. ఇగ్నీషన్‌ కీ కారుకే ఉండటం గమనించి ఆలస్యం చేయకుండా అది ఎక్కి స్టార్ట్‌ చేసి, దూరంగా దుమ్ము లేపుతూ పరిగెత్తే స్టార్‌గేజర్‌ వైపు దాన్ని పోనిచ్చింది. ఎలాగైనా దాన్ని ఆపాలన్నది ఆమె లక్ష్యం.

చెట్ల దగ్గరకి చేరే దాకా కారులో వెళ్ళింది. చెట్ల మధ్య కాలిబాట మీద ఆ గుర్రం వెళ్ళడంతో, కారాపి దిగి ఆ బాట వెంట పరిగెత్తింది. తను కార్లో వెంబడించడం గమనించి అలెన్‌ గుర్రాన్ని కాలిబాటలోకి మళ్ళించాడని ఊహించింది. కొద్ది దూరం పరిగెత్తాక దూరం నించి స్టార్‌గేజర్‌ సకిలింపు విన్నది.“స్టార్‌గేజర్‌!” అరుస్తూ పరిగెత్తింది.

కొద్ది దూరం వెళ్ళాక కాలిబాట మలుపు తిరిగిన చోట స్టార్‌గేజర్‌ ఎత్తయిన పాప్లర్‌ చెట్ల మధ్య ప్రశాంతంగా నిలబడి ఉంది. దాని జీను ఖాళీగా ఉండటాన్ని తాత్కాలికంగా విస్మరించి, దాని దగ్గరకి ఆనందంగా పరిగెత్తుకెళ్ళి దాని తలని నిమిరింది. అది మళ్ళీ క్రిస్టినీని గుర్తించినట్లుగా చిన్నగా సకిలించింది. అకస్మాత్తుగా ఆమెకి నేల మీద కొద్ది దూరంలో అచేతనంగా పడి ఉన్న అలెన్‌ కనిపించాడు. దురుసుతనానికి అది అతను చెల్లించిన మూల్యం అనే ఆలోచన ఆమెకి కలిగింది. అతని దగ్గరకి వెళ్ళి పరీక్షగా చూశాక అతను చెల్లించిన మూల్యం అపరాధం కన్నా ఎక్కువని గ్రహించింది. అతను మరణించాడని గ్రహించగానే ‘ఓ గాడ్‌!’ అని అరిచింది. అతను బతికున్నాడా అని గుండెమీద చేతిని వేసి పరీక్షించలేదు. గుర్రపు గిట్టలు అతని పక్కటెముకలని విరిచేశాయి. అడ్డు పెట్టుకున్న కుడిచేయి విరిగింది. పుర్రె పగిలింది. వెంటనే ఆమె తల తిప్పుకుంది. స్టార్‌గేజర్‌ తనని స్పృశించమన్నట్లుగా తలని వంచింది. ఆమె దాన్ని ఆప్యాయంగా తట్టింది.

“నువ్వేం చేశావో నీకు తెలీదు” జాలిగా చెప్పింది.

దానికే కాదు. ఎవరికీ తెలీదు. తెలీగానే స్టార్‌గేజర్ని ఏం చేస్తారో తట్టగానే ఆమె వణికింది. ఆమె గట్టిగా ఊపిరి తీసి వదిలి అలెన్‌ శవం వంక చూసింది. అలా వదిలేసి స్టార్‌గేజర్ని తమ ఊరు వాషింగ్టన్‌కి వెంటనే పంపితే? ఆయన శవాన్ని కనుక్కునే సరికి స్టార్‌గేజర్‌ ఎవరికీ అందుబాటులో ఉండదు. కాని గుర్రం కాలి గిట్టల ముద్రలని బట్టి జరిగింది గ్రహిస్తారు. అది వార్తగా దినపత్రికల్లో వస్తుంది. తన భర్తకి స్టార్‌గేజర్‌ గురించి తెలిస్తే? దానికి ఇక తిండి వృధా అని వెంటనే చంపించేస్తాడు. అది అతని తత్త్వం అని ఆమెకి తెలుసు. తను నేలమీద గుర్తులని తుడిపేస్తే? కాని వంటి మీది దెబ్బలని మార్చలేదు. అవి కాలి గిట్టలవని తేలిగ్గా తెలిసిపోతుంది. ఎలా మరి? ఆమెకో ఉపాయం తట్టింది. తల తిప్పి తను ఎక్కి వచ్చిన అలెన్‌ కారు వంక చూసింది. మళ్ళీ ఆయన శవం వంక చూసింది. కారు ప్రమాదంలో మరణించాడని అంతా అనుకుంటే?

వెంటనే ఆమె స్టార్‌గేజర్‌ కళ్ళాన్ని ఓ చెట్టు కొమ్మకి కట్టి, అతని భుజాల కింద చేతులు వేసి పట్టుకుని లాక్కుంటూ కారు దగ్గరకి తీసుకెళ్ళింది. జాగ్రత్తగా కార్లో ముందు సీట్లోకి ఎక్కించింది. కారు స్టార్ట్‌ చేసి పోనించింది.

పది నిమిషాల తర్వాత ఆమె కారు ‘లీప్‌ కేనియన్‌'కి చేరుకుంది. ఆ దారిలో ట్రాఫిక్‌ పెద్దగా ఉండదు. ఆ సమయంలో అసలు ప్రయాణించవు. స్టేట్‌ హైవేలో అక్కడి ప్రమాదకరమైన మలుపు వల్ల చాలా కార్లు కింద లోయలోకి పడటం వల్ల దానికి లీప్‌ కేనియన్‌ అనే పేరు వచ్చింది. దాని గురించి ముందే అనేక హెచ్చరిక బోర్డ్‌లని ఉంచారు. ఆమె మనసు అందుకు అంగీకరించకపోయినా తప్పదు అనుకుని మనసుని గట్టి పరచుకుని కారుని ఎత్తులో కిందకి వాలుగా ఉన్న చోట ఆపి హేండ్‌ బ్రేక్‌ వేసి కారు తలుపు తెరచుకుని కిందకి దిగింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి, అటు ఇటు చూసి ఆ బ్రేక్‌ని తీసేసింది. వెంటనే కారు తోయాల్సిన అవసరం లేకుండానే వాలు వల్ల ముందుకి కదిలింది. కిందకి సూటిగా కారు దిగుతుంటే దాని బరువుకి వేగం పెరిగింది. అది ఎదురుగా ఉన్న ఇనుప కంచె వైపు వెళ్ళింది. క్రిస్టినీ కొద్ది క్షణాలు కంచె కారుని ఆపుతుందేమోనని భయంగా చూసింది. కాని అది కంచెని తాకీతాకగానే దాన్ని తెంపుకుని ముందుకి వెళ్ళి పెద్దగా చప్పుడు చేస్తూ లోయలోకి పడిపోయింది. కొద్ది క్షణాల తర్వాత కింద నించి పేలుడు శబ్దం వినిపించడంతో కారు పెట్రోల్‌ టేంక్‌ అంటుకుందని తెలుసుకుంది. ఆయన దేహం కాలిపోయి వంటి మీది గాయాలు గుర్రం గిట్టల దెబ్బల వల్ల అని పోస్ట్‌మార్టం డాక్టర్‌ గుర్తించే బలహీనమైన అవకాశం కూడా పోయిందని గ్రహించింది. ఆమె వేగంగా తను స్టార్‌గేజర్ని కట్టిన వైపు నడిచింది.

*  *  *

ఆమె పడుకుంది కాని ఆందోళనతో కలత చెందిన మనసు వల్ల వెంటనే నిద్రపట్టలేదు. నిద్రలోకి వెళ్ళిన కొన్ని నిమిషాలకి తలుపు చప్పుడుకు మెలకువ వచ్చింది. ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. మరోసారి వినిపించడంతో వెళ్ళి తలుపు తెరిచింది. బొటన వేళ్ళని పేంట్‌ ముందు జేబుల్లో ఉంచుకున్న ఓ మధ్యవయస్కుడు ఆమెని చూసి పలకరింపుగా నవ్వాడు. అతని పై వరుస పళ్ళు రెంటి మధ్య పావు అంగుళం సందుంది. అతను అపరిచితుడు.

“ఎవరు మీరు? ఏం కావాలి?” అడిగింది.

“మేడం. నా పేరు శామ్‌. నేను మీకు తెలీదు. ఆల్గోకిన్‌ స్టేబుల్స్‌ నించి వస్తున్నాను. నేను కొన్ని వారాల క్రితం అలెన్‌ దగ్గర గుర్రాలని చూసుకునే పనికి కుదిరాను.”

“సరే. మీకేం కావాలి?” అడిగింది.

“మీరు విలియం కూతురు. అవునా?”

ఆమె తలుపుని మూయబోయింది. కాని అతను బూటు కాలిని అడ్డు పెట్టి చెప్పాడు.

“కేనియన్‌లో ఇందాక జరిగిందాని గురించి మాట్లాడాలి. నేను అలెన్‌ కారుని గుర్తు పట్టాను.”

ఆమె కళ్ళు విశాలమయ్యాయి. అతని వంక ఆందోళనగా చూసింది. అతడు  లోపలికి అడుగు పెట్టి తలుపు మూశాడు.

“ఏం చూశారు?” అడిగింది.

“మీరు కారుని లోయలోకి తోయడం, అందులో ఆయన ఉండటం.”

“నేను తోయలేదు. అది ప్రమాదవశాత్తు బ్రేక్స్‌ ఫెయిలై పడిపోయింది” 

అతను చప్పుడయ్యేలా నవ్వి చెప్పాడు.

“ఆ సమయంలో నేను ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకోవడానికి కేనియన్‌లో స్వారీ చేస్తున్నాను. జరిగిందంతా నేను సినిమా చూసినంత స్పష్టంగా చూసాను” తన మెళ్ళో వేలాడే బైనాక్యులర్స్‌ని తట్టి చెప్పాడు.

“నేనా పని ఎందుకు చేశానో చెప్తా వినండి.”

“మీరా పని ఎందుకు చేసారన్నది నాకు అనవసరం. ఆయన్ని నేను కూడా పెద్దగా ఇష్టపడను.”

“నేనాయన్ని చంపలేదు. అప్పటికే మరణించాడు.”

“మీరు రోడ్‌ మీంచి కారుని తోసేప్పటికా? మీరేం చేశారో మీకే తెలుసు మేడం. నేను మిమ్మల్ని అందుకు తప్పు పట్టడం లేదు. చుట్టుపక్కలంతా అలెన్‌ మీ నాన్న దగ్గర చాలా వడ్డీ గుంజాడని చెప్పుకుంటుంటారు.”

“నేను ఆయన్ని చంపలేదు. మీరు ఇది నమ్మాలి” క్రిస్టినీ ఏడుపు గొంతుతో చెప్పింది.

“సరే. మీరు చెప్పింది నమ్ముతాను. కాని వాళ్ళు వచ్చి నన్ను ప్రశ్నలు అడిగితే మాత్రం...”

“ఎవరు అడుగుతారు?” భయంగా అడ్డుపడి అడిగింది.

“ఇంకెవరు? పోలీసులు.”

అతను తను చూసింది చెప్తాడని, ఆ సమాధానాలన్నీ తన తప్పుని బహిర్గతం చేసేవే అని క్రిస్టినీ గ్రహించింది. తన రక్షణకి ఏం చేయాలి? స్టార్‌గేజర్‌ మరోసారి చంపిందనే నిజాన్ని చెప్తే జూరీ సభ్యులు నమ్ముతారా? లేక తన తండ్రిని అప్పులు ఇచ్చి పీడించిన కోపంతో చంపిందనే ప్రాసిక్యూషన్‌ వారి వాదనతో ఏకీభవిస్తారా?

“నేను కొంత కాలంగా ఆల్గోకిన్‌ స్టేబుల్స్‌లో ఉద్యోగం మానేయాలని అనుకుంటున్నాను. వాళ్ళు ప్రశ్నలు అడిగే సమయానికి బహుశ నేను ఇక్కడ ఉండకపోవచ్చు. నేను చెప్పేది మీకు అర్ధమౌతోందా?”

అయోమయంగా తలాడించింది. దూరంగా వెళ్ళిపోవడానికి ఎంతడుగుతాడు? ఆ బ్లాక్‌మెయిల్‌ని అంతటితో ఆపుతాడా? “ఇప్పుడేమంటారు?” క్రిస్టినీ అడిగింది.

“సరిపడే డబ్బు చేతికి వచ్చాక నేనీ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. నాకు ఎక్కువ మొత్తం అవసరం లేదు. మూడు, నాలుగు వందల డాలర్లు చాలు” చెప్పాడు. బ్లాక్‌మెయిలింగ్‌ని తక్కువ మొత్తంతో ఆరంభిస్తున్నాడు అనుకుంది. అతన్ని తిట్టబోయి తమాయించుకుని అడిగింది.

“సారీ. నా దగ్గర డబ్బు లేదు. నేను సాయం చేయలేను.”

“మీరు నిన్ననే చాలా గుర్రాలని వేలం వేయించారు.”

“వచ్చిన డబ్బుని అప్పుల వాళ్ళకి పంచేశాను. అది అందుకు సరిపోలేదు.”

అతను  విచారంగా గదిలోని వస్తువులని చూస్తు చెప్పాడు.

“ఇంకాస్త డబ్బు రావడానికి మీ దగ్గర వేరేవేం లేవా? మీ నాన్న విలువైనవేవీ వదిలి వెళ్ళలేదా?”

“ఆయన నాకు వదిలింది ఒకటే. అది చాలా విలువైంది. దాన్ని అమ్మవద్దని కోరారు.”

“ఏమిటది?”

“గుర్రం. స్టార్‌గేజర్‌. అది ఛాంపియన్‌ గుర్రం.”

వెంటనే అతని మొహంలోకి కొంత వెలుగు ప్రవేశించింది.

“నేను ఇక్కడికి వస్తు చూసిన గుర్రమా? అది చాలా నాణ్యమైన గుర్రం. గుర్రాల గురించి తెలిసిన ఎవరైనా దాన్ని కొనాలని అనుకోకుండా ఉండలేరు. అది తప్ప ఇవ్వడానికి మీ దగ్గర ఏం లేకపోతే సరే. దాన్నే తీసుకుంటాను.”

“సరే” క్రిస్టినీ విచారంగా చెప్పింది.

ఆమె తన తండ్రి బల్ల దగ్గరకి వెళ్ళి కాగితాల్లోంచి తన తండ్రి కొన్న ఆ గుర్రం సేల్‌డీడ్‌ని బయటకి తీసింది. కొద్ది నిమిషాల్లో ఆమె శామ్‌కి చట్టబద్ధంగా దాన్ని ఇచ్చిందనే సేల్‌డీడ్‌ని తయారు చేసి, సంతకం చేసింది. అతనా కాగితాలని పరిశీలించాక సంతకం చేసి  చెప్పాడు.

“దీన్ని కొనడానికి ఆసక్తి గల కొందరు నాకు తెలుసు. ఒక వేళ వాళ్ళు మీ దగ్గరకి వస్తే నా దగ్గరకి పంపండి. ఈ లోగా నేనే వాళ్ళ దగ్గరకి వెళ్తాను.”

“అలాగే.”

ఆమెతో కరచాలనం చేసి అతను షెడ్లోకి వెళ్ళి స్టార్‌గేజర్‌ వంక నవ్వుతూ చూస్తూ దాని వీపు మీద అరచేత్తో తట్టి చెప్పాడు.

“రౌతు కొద్దీ గుర్రం. చూద్దాం మనిద్దరిలో ఎవరు ఎవరికి యజమానో.”

అతను గిట్టలతో భూమి మీద తంతూ, సకిలించే స్టార్‌గేజర్‌కి కళ్ళెం, జీను తొడిగి పూర్తిగా సూర్యాస్తమయం అయే లోగా దాన్ని స్వారీ చేయాలనే ఆసక్తితో వెంటనే దాని మీద వెళ్ళిపోయాడు.

కొద్ది సేపటికి ఆ గుర్రం ఒంటరిగా తిరిగి షెడ్‌కి రావచ్చని క్రిస్టినీ నమ్మింది.

(హెన్రీ స్లేసర్‌ కథకు స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి


logo