బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 00:57:59

భాషోద్యమ వేదికగడిగోలు!

భాషోద్యమ వేదికగడిగోలు!

భాష పోతే.. ఆ భాషలోని పదాలు పోతే... జాతిపోయినట్టే. సంస్కృతులూ మాయమైనట్టే. అందుకే ఆ పదాలను పదిలపరచుకోవాలి. ఆ పదాలతో అనుబంధమున్న తరం నుంచి పదాలను సేకరించి పుస్తకాలకెక్కించాలి. అంతకంటే ముందు అందర్నీ ఒక్కచోటుకు చేర్చాలి. ఆ ప్రయత్నమే ‘గడిగోలు’. ఇది ఫేస్‌బుక్‌ పేజీ. మాండలికాలను బతికిస్తున్న ఆధునిక భాషోద్యమానికి వేదిక. 

‘కోడికూసింది. వెంకన్న లేచి గంగాళంలో ఉన్న నీళ్లు మొఖంపై జిల్కరించుకున్నడు. పెద్దపీటె మీద పండుకున్న తమ్ముడు రాజన్నను.. సాయమాన్ల కునుకుదీస్తున్న అన్న కొమురయ్యను లేపిండు. ‘మోట్లాల్లాయె ఇంకెప్పుడు లేస్తరు? అనుకుంట పడమటర్రలకు పోయిండు. శిల్కొయ్యకున్న ముల్లుగర్ర.. చర్నకోల తీసుకొని చుట్ట ముట్టించుకున్నడు’ 

- ఈ వ్యాక్యాల్లో ‘గంగాళం.. జిల్కరించుకునుడు.. పెద్దపీటె.. సాయమాను.. మోట్లాళ్ల.. పడమటర్ర.. శిల్కొయ్య.. ముల్లుగర్ర.. చర్రకోల.. ముట్టించుకునుడు’ పదాలు వింటే.. వాటికి సంబంధించిన ఫొటోలు చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది? ఇవి అచ్చ తెలంగాణ స్వచ్ఛమైన పదాలు. మనం మరిచిన మన పదాలు.  వాటిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. 

ఎందుకు: ఆ పదాల్లో మన అస్తిత్వం ఉంది.  ఉద్యమ నేపథ్యమూ ఉంది. ఆ బాధ్యత తీసుకొని ‘గడిగోలు’ అనే ఫేస్‌బుక్‌  పేజీ ద్వారా సరికొత్త భాషోద్యమం చేస్తున్నారు తెలంగాణ నెటిజన్లు. తెలంగాణ పదాలు.. ఇసిరెలు.. సంస్కృతి.. వాటి ఫొటోలను సేకరించి.. అధ్యయనం చేసి ‘గడిగోలు’ గ్రూపులో పెడుతున్నారు. సెలయేటి ప్రవాహం లాంటి తెలంగాణ పదకోశం గురించి చర్చించడానికంటూ ఓ వేదిక ఉండాలని జగిత్యాలకు చెందిన సుధీర్‌కుమార్‌ తాండ్ర ఆలోచించాడు. మిత్రులతో కలిసి గడిగోలు గ్రూపును క్రియేట్‌ చేశాడు. ప్రవాహంలో ఎన్నో పదాలను కలుపుకపోయినట్లూ.. ఇంతమంచి కార్యక్రమంలో ఎక్కువమందిని కలుపుకపోవాలి అనుకున్నాడు. అందుకే గడిగోలు గ్రూపు నిత్యనూతనమై తెలంగాణ పదకోశం మరింత సజీవత్వాన్ని సంతరించుకుంటున్నది. గ్రాంథికానికి నేటి తరాన్ని దూరంగా ఉంచుతూ.. తెలంగాణ మాండలికపు పదాలను పదిమందికి పరిచయం చేస్తున్నారు. దీంట్లో కవులు.. రచయితలు.. మేధావులు.. ప్రొఫెసర్లు భాగస్వాములు అవుతున్నారు. వాళ్లంతా తెలంగాణ భాషను ప్రేమించేవాళ్లే. పదాల గురించి చర్చ పెడుతున్న గ్రూప్‌ ఇదొక్కటే కావచ్చు. 

 అందరూ ఒక్కటై: తెలంగాణ ముప్ఫై మూడు జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఒక్కో మాండలికం ఉంటుంది. వారి వారి ప్రాంతాల్లో ఒక్కో పదాన్ని ఒక్కో రకంగా పలుకుతుంటారు. ఇలా ఏయే ప్రాంతాల్లో ఏం అంటారో కూడా అందరికీ తెలియచేస్తున్నారు. మాండలిక భాషా సొగసులు అనుభవిస్తున్న వాళ్లకే దాని రుచి తెలుస్తుంది కాబట్టి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా తమకు ఉన్న సందేహాలు ఈ గడిగోలు వేదిక ద్వారా నివృత్తి చేసుకుంటున్నారు. మాండలికం జీవన భాష. ప్రజల నోళ్లలో నానే సజీవ భాష. గలగలపారే సెలయేరు లాంటిది. స్వచ్ఛమైంది. అలాంటి మాండలికానికి పుట్టిన బిడ్డలే తెలంగాణ పదాలు. ఆ పదాల వేదికే గడిగోలు. గడిగోలులో ఇప్పుడు పదివేల మందికి పైగా సభ్యులున్నారు. వాళ్లలో 43 దేశాల్లోని ప్రవాసులూ ఉన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తమశాఖ ఆధ్వర్యంలో ఈ గ్రూపు ద్వారా సేకరించిన పదాలను ఫొటోలతో సహా పుస్తకం వేయడానికి ముందుకొచ్చారు. ఇందుకోసం గత సంవత్సరం రవీంద్రభారతి వేదికగా అడ్మిన్ల ములాఖత్‌ ఏర్పాటుచేశారు.  

భాషను బతికించాలనే: తెలంగాణ భాషను బతికించుకోవాలనే ఉద్దేశ్యంతో స్నేహితులతోకలిసి ‘గడిగోలు’ గ్రూప్‌ పెట్టాం. మంచి స్పందన వస్తున్నది. భాషాభిమానులు ఉత్సాహంగా పదాలు పంచుకుంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 20000కు పైగా పదాలు.. 1000కి పైగా రకరకాల పనిముట్లు.. ఇతర వస్తువుల ఫొటోలు సేకరించాం. ఇవన్నీ అరుదైనవి కావడం విశేషం. -సుధీర్‌కుమార్‌ తాండ్ర 


logo