గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 00:50:18

తొలి తెలుగు మహాసామ్రాజ్ఞి రుద్రమదేవి

తొలి తెలుగు మహాసామ్రాజ్ఞి రుద్రమదేవి

‘ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా?’ అని అయినవాళ్లే ఆమె ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. అయినా  అదరలేదు. బెదరలేదు. సమాజంలో బలంగా వేళ్లూనుకున్న పురుషాధిక్యతపై సవాలు విసురుతూ రాజ్యాధికారం చేపట్టింది. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురుతిరిగారు. వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీరవనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ఆమె ప్రతీక. స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాక. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. తొలి తెలుగు మహాసామ్రాజ్ఞి.. రాణీ రుద్రమ దేవి.. 

కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులు అనే అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిలా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురయ్యాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్రమదేవి సమర్థవంతంగా ఎదుర్కొని తన పరిపాలనా దక్షతను చాటుకున్నది. అంతఃకలహాలను ఎదిరించి.. అధికార పునరుద్ధరణ గావించి.. సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ.. సుస్థిర పరిపాలనకు పట్టం కట్టింది రుద్రమదేవి.  

పాండ్యులు, వేంగి చాళుక్యులు, చోళుల వంటి శత్రువర్గాలను రూపుమాపి కొంచెం ఊపిరి తీసుకొనేలోపే పరరాజ్య శత్రువులు రుద్రమదేవి మీదికి లంఘించారు. అబల కావడంతో ఆమెను అవలీలగా జయించవచ్చనే భ్రమ వారిది. కానీ, రుద్రమ అబల కాదు, సబల అని వారికి తెలియదు. ఓరుగల్లు సింహాసనంపై ఒక అబల ఆసీనురాలైంది. అవలీలగా ఆ రాజ్యాన్ని గెలిచి విజయకేతనం ఎగురవేయవచ్చు అనే ధైర్యంతో దేవగిరి యాదవ మహాదేవుడు రుద్రమపైకి దండెత్తి వచ్చాడు. అతడు ఎనిమిది లక్షల సైన్యంతో ఓరుగల్లుపైకి దూసుకొచ్చి దుర్గాన్ని ముట్టడించాడు. యుద్ధ వ్యూహం రచించడంలో, శత్రువుని అవలీలగా మట్టి కరిపించడంలో రుద్రమది అందె వేసిన చేయి.

మహదేవుని దాడికి ఏ మాత్రం బెదరక.. తానే స్వయంగా నాయకత్వం వహించి యుద్ధరంగాన నిలిచింది. అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా ఒకటి కాదు.. రెండు కాదు.. పదిహేను రోజులకు పైగా భీకర పోరాటం చేసింది. శత్రువుని పడగొట్టాలంటే ముందు అతని బలం తెలుసుకోవాలి. ఆ బలాన్ని దెబ్బతీయాలి. మహాదేవుడి బలం అతని అశ్విక దళం. ఆ బలాన్ని, బలగాన్ని రుద్రమ సైన్యం సర్వనాశనం చేసింది. ఊహించని ఈ పరిణామంతో మహాదేవుడు తోకముడిచి దేవగిరి బాట పట్టాడు. కాకతీయ సేనానులు ఆ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టి దేవగిరి కోటనే ముట్టడించారు. రుద్రమ పరాక్రమాన్ని అధిగమించలేక మహాదేవుడు ఓటమిని అంగీకరించి రుద్రమతో సంధి చేసుకున్నాడు. కప్పంగా పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాడు. వితరణశీలురాలైన ఆ రాణి యాదవులు ఇచ్చిన ధనాన్ని సైనికులకు పంచి పెట్టిందట. ఈ యాదవ దురాక్రమణ యత్నాన్ని, తత్పరాజయాన్ని సూచించే నిదర్శనాలు ఉన్నాయి. బీదరు కోటలోని ఆనాటి శాసనం ఈ విషయాన్ని, రుద్రమ విజయాన్నీ పేర్కొంటున్నది.  

కాయస్థ నాయకుడైన జన్నిగదేవుడు ఆదినుంచి రుద్రమదేవికి విధేయునిగా ఉన్నాడు. తర్వాత అతని తమ్ముడు త్రిపురాంతకుడు కూడా రుద్రమదేవి ప్రతినిధిగా రాజ్యపాలన చేశాడు. అనంతరం ఇతని తమ్ముడు అంబదేవుడు రాజయ్యాడు. ఇతనికి రుద్రమదేవి చెప్పుచేతల్లో ఉండటం, విధేయునిగా మసలుకోవడం ఇష్టం లేదు. తనకంటూ స్వతంత్ర రాజ్యాన్ని కాంక్షించాడు. రుద్రమదేవి శత్రువులైన పాండ్యులు, యాదవులతో స్నేహం చేశాడు. రుద్రమ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ.. సామంతులను సంహరిస్తూ.. రాజ్యం విస్తరించుకున్నాడు అంబదేవుడు. ఇతని విజృంభణను రుద్రమదేవి ఎప్పటికప్పుడు అరికడుతూ, తన సేనానులతో అతనిని అదుపులో పెట్టింది. రుద్రమ ప్రాబల్యంతో అనేకసార్లు ఓటమి పాలైన అంబదేవుడు ఆమెపై కక్ష గట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరిస్తూ.. చాపకింద నీరులా విస్తరించే ప్రయత్నం చేశాడు.

అంబదేవుడి ఆగడాలు ఎంతో కాలం సాగలేదు. అతని కుట్రలు తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తి పట్టి కదన రంగాన దూకినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అప్పటికి ఆమె వయసు ఎనభై ఏళ్లు. దాదాపు రెండు వారాలకుపైగా పోరాటం చేసిందనీ భావిస్తుంటారు. రుద్రమ ఈ యుద్ధ సమయంలోనే మరణించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కానీ ఎలా మరణించిందన్నది తెలియదు. రుద్రమను అంబదేవుడు యుద్ధంలో నేరుగా ఎదుర్కోలేక కపటోపాయం పన్నినట్లు భావిస్తుంటారు. యుద్ధ క్షేత్రానికి సమీపంలోని గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా రుద్రమ ప్రత్యేక పూజలు చేస్తుండగా, ఈ విషయం ముందే తెలుసుకున్న అంబదేవుడు అంతకు ముందే పూజారుల స్థానంలో తన వాళ్లను పంపాడనీ, పూజలో నిమగ్నమైన రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచి చంపారని చెబుతుంటారు. కొందరు విష ప్రయోగం చేశారనీ వాదిస్తుంటారు. రుద్రమ సేనాని మల్లికార్జున నాయకుడు కూడా ఆమెతోపాటే మరణించడంతో ఇద్దరూ యుద్ధరంగంలోనే చనిపోయారని ఇంకొందరు భావిస్తుంటారు. అయితే, చారిత్రకంగా ఈ విషయాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

పానగల్లు శాసనాన్ని బట్టి మల్లికార్జున నాయకుడు రుద్రమదేవికి సర్వసైన్యాధ్యక్షుడని తెలుస్తున్నది. మల్లికార్జునుడి కొడుకు ఇమ్మడి మల్లికార్జున నాయకుడు కుమార రుద్రదేవ మహారాజుకు ధర్మువుగా 1290లో శాసనం వేయించాడు. నల్లగొండ జిల్లా చందుపట్లలో లభించిన శాసనంలో రుద్రమదేవి మరణం గురించి ఉంది. రుద్రమ, మల్లికార్జునుడు ఒకేసారి యుద్ధంలో శివసాయుజ్యం పొందినట్లు ఈ శాసనం పేర్కొంది. కాకతి రుద్రమదేవి, మల్లికార్జున నాయకులకు ధర్మువుగా పువ్వుల ముమ్మడి అనే బంటు సోమనాథ దేవునికి కొంత భూమిని దానం ఇచ్చినట్లు ఈ శాసనం పేర్కొంది. దీన్నిబట్టి శాసనం (నవంబర్‌ 27, 1289) వేయించిన కొన్ని రోజులకు ముందు రుద్రమ మరణించినట్లు స్పష్టమవుతున్నది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన మేడిమల్కల్‌ శాసనం ఈ విషయాన్ని బలపరుస్తున్నది. 

రుద్రమ పరాక్రమాన్ని అధిగమించలేక మహదేవుడు ఓటమిని అంగీకరించి రుద్రమతో సంధి చేసుకున్నాడు. కప్పంగా పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాడు. వితరణశీలురాలైన ఆ రాణి యాదవులు ఇచ్చిన ధనాన్ని సైనికులకు పంచి పెట్టిందట. ఈ యాదవ దురాక్రమణ యత్నాన్ని, తత్పరాజయాన్ని సూచించే నిదర్శనాలు ఉన్నాయి. బీదరు కోటలోని ఆనాటి శాసనం ఈ విషయాన్నీ, రుద్రమ విజయాన్నీ పేర్కొంటున్నది....? 

-నగేష్‌ బీరెడ్డి

తాజావార్తలు


logo