బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 00:19:53

జమలాపురంలో... జగన్నాయకుడు!

జమలాపురంలో... జగన్నాయకుడు!

అక్కడ జాబాలి మహర్షి తపస్సు చేశాడని అంటారు. అక్కడే శివుడు అర్జునుడికి పాశుపతాస్ర్తాన్ని ప్రసాదించాడనీ అంటారు. ఆ పరిసరాల్లోనే శ్రీనివాసుడు గోవులకాపరి రూపంలో సంచరించాడన్న ఐతిహ్యమూ ఉంది. జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఇలా ఎన్నో ప్రత్యేకతలు. కాబట్టే, ఆ ప్రాంతంలో శ్రీనివాసా అనో, వేంకటేశా అనో పిలిస్తే... పది తలలు వెనక్కి తిరిగి చూస్తాయి. 

దేశంలోని 108 దివ్య తిరుపతులలో ఒకటని చెబుతారు.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని. తెలంగాణ రాష్ట్రంలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిందీ క్షేత్రం. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి దిగొచ్చిన వేంకటేశ్వర స్వామి ఇక్కడ సతీసమేతంగా వెలిశాడని అంటారు. 

స్థల పురాణం: జాబాలి మహర్షి తీర్థయాత్రలు చేస్తూ జమలాపురం చేరుకున్నాడట. ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ఈ ప్రాంతం ఆయనకు బాగా నచ్చింది. దీంతో ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నాడు. పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకు వేదం నేర్పించడానికి గురుకులాన్ని స్థాపించాడు. ఇక్కడి సూచిగిరి కొండపై మహర్షి నిత్యం తపస్సు చేస్తుండేవారు. ఆ భక్తికి మెచ్చిన మహావిష్ణువు శ్రీవెంకటేశ్వర అవతారంలో స్వయంభూ మూర్తిగా వెలిశాడట. తనను కొలిచినవారి కోరికలు తీరుస్తానని ప్రకటించాడట. కొంతకాలం తర్వాత నెల్లూరు ప్రాంతానికి చెందిన యజ్ఞనారాయణ శర్మ కాశీకి వెళుతూ మార్గమధ్యలో జమలాపురానికి చేరుకున్నాడు. ఇక్కడ ఆయనకు ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలిగిందట. ఇది సాధారణమైన చోటు కాదని అర్థమైపోయింది. తరచూ తనకు కలలో కనిపించే మహావృక్షాలూ, కొండలూ ఇవేనని గ్రహించాడు. ఆ నేలతో తనకు ఏదో అనుబంధం ఉన్నదని భావించాడు.  దీంతో కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారట.శ్రీనివాసుడు భక్త వత్సలుడు. జాబాలి మహర్షి తనను కొలిచిన చోటంటే స్వామికి ఎంతో ఇష్టం. ద్వాపరలో గోపాలుడిగా జన్మించిన పరమాత్మకు... ఆ అవతారం మీద మక్కువ తీరలేదేమో. మరొక్కసారి పశువులకాపరి రూపం ధరించి... సూచిగిరికి రావడం మొదలుపెట్టాడు. అక్కడి గోపాలకులతో ఆటలాడేవాడు, పాటలుపాడేవాడు. ఎవరైనా అమాయకత్వం కొద్దీ ‘ఎక్కడివాడివి? నీ ఊరేది?’ అని అడిగితే పగలబడి నవ్వేవాడట. ‘నీ ఊరే నా ఊరు’ అని గడసరితనంతో జవాబు ఇచ్చేవాడట. ఆ నీలమేఘ వర్ణం, ఆ తేజస్సు అందర్నీ ఆకట్టుకునేవి. ఆ విషయం యజ్ఞనారాయణుడి వరకూ వచ్చింది. ఆ బాలకుడిని చూడాలన్న కోరిక బలీయమైంది. వెంటనే బయల్దేరి వెళ్లాడు. జాబాలి మహర్షి ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహం, శిలా శాసనం కనిపించాయట. దీంతో అక్కడే స్థిరపడిపోయి రోజూ కొండపైకి వెళ్లి పూజలు చేసేవారు. ఆయన ద్వారా క్షేత్ర మహత్యం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు... స్వామివారిని దర్శించుకోవడం ప్రారంభించారు. నీటికొలది తామరవోలె... ఎవరి భక్తికి తగినట్టు వారిని అనుగ్రహించేవాడు స్వామి. యజ్ఞ నారాయణ శర్మ తదనంతరం, ఆయన వారసుల్లో ఆరోతరానికి చెందిన అక్కుభట్లు స్వామివారిని అర్చించేవారు. ఒకనాడు వార్ధక్యం వల్ల కొండపైకి ఎక్కలేక మధ్యలో రాయి తగిలి కింద పడిపోయారు. దెబ్బలు తగిలాయి. పూజా జలం, నైవేద్యం కింద పడిపోయాయి. దీంతో బాధపడిన ఆయన ‘ఆకలేస్తే నువ్వే దిగిరా స్వామీ... ఇక రాలేను‘ అనుకున్నాడు. ‘నేను వస్తున్నాను... వెనుకకు చూడకుండా ముందుకు పద‘ అన్న గంభీర స్వరం అక్కుభట్లు వారికి వినిపించింది. ఆయన గ్రామం వైపు వస్తుండగా పెద్ద వెలుగుతో కూడిన ధ్వని వచ్చింది. అక్కుభట్లు వెనుదిరిగి చూసేసరికి... స్వామి వారు సూచిగిరి నుంచి ఒక అడుగు ప్రస్తుతం ఆలయం ఉన్న కొండపైకి వేశారట. ఈ పాద ముద్ర ఇప్పటికీ గుట్ట మీద ఉన్నది. అప్పుడే స్వయంభూ సాలగ్రామ రూపంలో స్వామి వెలిశాడిక్కడ అని అంటారు. 

ఆలయ నిర్మాణం: కాకతీయ ప్రతాపరుద్రుడూ, విజయనగరాధీశుడైన శ్రీకృష్ణ దేవరాయలూ జమలాపురంలో వెలిసిన వేంకటేశుడిని దర్శించుకున్నారనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తాడేపల్లి రాజు జీర్ణోద్ధరణ చేపట్టారు. 1965లో ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి స్వయంభూమూర్తితో పాటు వెంకటేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుందని సూచించారు. అలా 1976 మార్చి 26 చైత్రశుద్ధ సప్తమినాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పక్కనే అమ్మవారి ఆలయం ఉంది. ఏటా స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. అర్జునుడికి శివుడు పాశుపతాస్త్రం ఇచ్చిన ప్రదేశం కూడా ఇదేనని అంటారు. అందుకే శివుడి ఆలయమూ ఈ ప్రాంగణంలోనే ఉన్నది. ఈ ప్రాంతంలో ఎక్కువగా వెంకట, శ్రీనివాస అనే పేర్లు పెట్టుకుంటారు. కుటుంబంలో ఒక్కరికైనా స్వామిపేరు ఉండాల్సిందే.  

-పసుపులేటి వెంకటేశ్వరరావు


logo