ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 00:08:38

తీరొక్క నగలతో వర్ధిల్లు!

తీరొక్క నగలతో వర్ధిల్లు!

నగలంటే నచ్చని మగువ ఉంటుందా?ప్రతి ఒక్కరూ బంగారు నగలు కొనలేరు.. ప్రత్యామ్నాయాలు వెదకాలి..వన్‌గ్రామ్‌ గోల్డ్‌, గిల్ట్‌ నగల గురించి అందరికీ తెలుసు..కానీ అంతకుమించి చెక్క .. గ్లాస్‌.. రెజిన్‌తో.. రకరకాల ఆభరణాలు చేయొచ్చని తెలుసా?తెలియకపోతే, ఇప్పుడు తెలుసుకోండి..

కాదేదీ నగలకనర్హం అంటున్నారు నేటి జువెలరీ డిజైనర్లు. బంగారానికే పరిమితం కాకుండా... సరికొత్త మెటీరియల్‌ను పరిచయం చేస్తున్నారు. అసలు వీటితో కూడా నగలు చేయొచ్చా? అన్నట్టు ఆ డిజైన్లు ఉంటున్నాయి. వెండి, ప్లాటినం లాంటి ఖరీదైన నగలకంటే వీటిమీదే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఆ నగల కథాకమామీషు..

చెక్కతో చక్కగా..

బల్లలు.. కుర్చీలు.. మంచాలు.. చెక్కలతో ఇంతకుమించి ఏం చేయొచ్చు? అనే ఆలోచన వస్తుంది. ఇంట్లో వస్తువులను సమకూర్చే ఆ ముడిసరుకును ఫ్యాషన్‌ ప్రపంచమూ ఆహ్వానించింది. చెక్కను చక్కగా చెక్కి నగలను తయారు చేస్తున్నది. వెస్ట్రన్‌ వేర్‌, సంప్రదాయ దుస్తుల మీదికి అలంకరించుకునేలా చెక్క నగలను తీర్చిదిద్దుతున్నారు. వీటితో చెవి కమ్మలు, ఉంగరాలను కూడా రూపొందిస్తున్నారు. అంతేకాదండోయ్‌.. చెక్కకు మధ్య రెసిన్‌  మిక్స్‌ చేసి మరిన్ని సోయగాలనూ చేరుస్తున్నారు.

మట్టి పరిమళం..

మట్టితో నగలను తయారు చేస్తారా? అనిపిస్తుంది కదూ! టెర్రకోట అనే ప్రత్యేకమైన మట్టితో అందమైన నగలను రూపొందిస్తున్నారు. వీటికి ఇప్పుడు బంగారు నగలకంటే ఎక్కువ గిరాకీ ఉందంటే అతిశయోక్తి కాదేమో! పూసల నగల్లాగే ఇవీ ఉంటాయి. గోల్డ్‌ మిక్సింగ్‌తో రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. లాకెట్‌ పెద్దగా, చెవులకు పెద్ద బుట్టలు రావడంతో... హెవీగా కనిపించాలనుకుంటే ఈ నగలు ధరించొచ్చు. సంప్రదాయ దుస్తుల మీదకి ఇవి బాగా నప్పుతాయి.

గాజు గమ్మత్తుగా..

గాజును చెక్కి మరీ వీటిని తయారుచేస్తారు. చేతి గాజులను ఎలా భద్రపరుస్తామో వీటిని కూడా అలాగే వేసుకోవాలి. ఇందులో రకరకాల డిజైన్లు వస్తున్నాయి. పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండకుండా వాటిలో ఏదో ఒకటి పొందుపరిచి మరీ నగలను తయారు చేయడం ఇక్కడ విశేషం. అంటే.. గ్లిటర్‌ (మెరుపు) లను నింపి, ఫొటోలను పెట్టి పర్సనలైజ్డ్‌ నగలు చేయించుకుంటే మరింత ప్రత్యేకంగా ఉంటాయి.

రెసిన్‌ రమ్యంగా..

ఈ మధ్యకాలంలో ట్రెండ్‌లో ఉన్న నగలు ఇవి. ఒక రకమైన ప్లాస్టిక్‌ లాంటి పదార్థంతో వీటిని తయారుచేస్తారు. అయితే.. ఉత్తమ ఫలితాల కోసం పాలిస్టర్‌ కాస్టింగ్‌ రెసిన్‌ కాకుండా పాలియురేతేన్‌ కాస్టింగ్‌ రెసిన్‌ ఎంచుకోవాలి. ఇది కూడా అచ్చు గాజులాగే కనిపిస్తుంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది కాబట్టి, మధ్యలో ఎండిపోయిన పువ్వులు, ఫొటోలు..  ఇందులో పొందుపరిచి  ధరించొచ్చు. లాకెట్‌గా, చెవికమ్మలుగా ఈ నగలు  అందుబాటులో ఉన్నాయి.


logo