ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 00:03:10

జీవితాన్ని ప్రేమించు...

జీవితాన్ని ప్రేమించు...

  • జీవితమే ఓ పండగని చెబుతారు శ్రీశ్రీ రవిశంకర్‌. ప్రేమ, బాధ, భయం, అభయం, అనురక్తి, వైరాగ్యం... ఇలాంటి అనేకానేక విషయాలకు సంబంధించి ‘సెలెబ్రేటింగ్‌ సైలెన్స్‌' పుస్తకంలో చర్చించారు. మనం ఎప్పుడూ మానవ సంబంధాల గురించే ఆలోచిస్తూ ఉంటాం. ప్రకృతితోనో పరమాత్మతోనో మన సంబంధ బాంధవ్యాల్ని పట్టించుకోం. అదే జీవితంలో తొలి సంక్షోభమని అంటారాయన.
  • మనసులో అసంతృప్తి గూడుకట్టుకున్నట్టు అనిపించిన ప్రతిసారీ... తపస్సు, వైరాగ్యం, శరణాగతి అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకోండి. తపస్సు అంటే... వర్తమానాన్ని యథాతథంగా ఆమోదించడం. అది ఆనందం కావచ్చు, విషాదమూ కావచ్చు. వైరాగ్యభావనలో ‘నేను ఏమీ కాను’, ‘నాకేదీ వద్దు’ అన్న ఆలోచన అంతర్లీనం. శరణాగతి సూత్రం ఒకటే...‘నా జీవితం నా కోసం కాదు. ఇతరుల కోసం, సమాజం కోసం’.
  • నీలోని పసితనపు అమాయకత్వాన్ని పారదోలేదీ, ‘నేనో ప్రత్యేకమైన మనిషిని’ అన్న భావనను కలిగించేదీ, ‘నా ఆలోచనలు మహోన్నతమైనవి’ అన్న అహాన్ని రగిలించేదీ, నీలోని అకారణ ఆనందాన్ని లాక్కుని పోయేదీ... జ్ఞానమే కాదు, అదొక గుదిబండ!
  • కొన్ని ప్రశ్నలకు సుదీర్ఘ సమాధానాల్లోనో, గంటలకొద్దీ ఉపన్యాసాల్లోనో సమాధానం లభించదు. మౌనంలో మాత్రమే జవాబు దొరుకుతుంది. మౌనంలో ఆత్మ ఘనీభవిస్తుంది. ఆ మానసిక స్థితినే మన పెద్దలు జ్ఞానం అని అంటారు. 
  • సైన్సులో పరిజ్ఞానాన్ని సంపాదించిన తర్వాత నమ్మకం వస్తుంది. కానీ ఆధ్యాత్మికతలో నమ్మకం ఏర్పడిన తర్వాత పరిజ్ఞానం వస్తుంది. క్రిమిసంహారకాలు వేస్తేనే పంటలు పండుతాయని సాధారణ సేద్యం చెబుతుంది. అవేవీ అవసరం లేకుండానే పండించవచ్చని సేంద్రియ సేద్యం 
  • చెబుతుంది.అంటే, పరిజ్ఞానం మారేకొద్దీ నమ్మకమూ మారింది. ఆధ్యాత్మికతకు సంబంధించినంత వరకూ ఒకే సత్యాన్ని, గురువులు రకరకాల కోణాలలో వివరిస్తుంటారు. 
  • కొందరు కాలం వేగంగా వెళ్లిపోతున్నదని గాభరా పడిపోతుంటారు. అంటే నువ్వు కాలం కంటే వెనుకబడ్డావని అర్థం. మరికొందరు కాలం మరీ తాబేలులా నిదానంగా వెళ్తున్నదని గోలపెడుతుంటారు. అంటే, నువ్వు కాలం కంటే వేగంగా పరిగెడుతున్నావని అర్థం. నిజానికి, పరిపూర్ణ ఆనందస్థితిలో ఉన్నవాడు కాలాన్ని పట్టించుకోడు. నిత్యధ్యాన స్థితిలో ఉన్నవాడికి కాలంతో పనే ఉండదు.
  • సరిగ్గా కాలని కుండలో నీళ్లు వేస్తే మట్టి కరిగిపోతుంది. నీళ్లు వృథా అవుతాయి. అదే చక్కగా కాలింది అయితే, కుండ మీద నీళ్లు పోయినా ఏమీ కాదు, కుండలో నీళ్లు పోసినా ఏమీ కాదు. అంత దృఢంగా ఉంటుంది. మిడిమిడి జ్ఞానికి, అజ్ఞానికి ఉన్న తేడా అదే. 
  • నకారాత్మక ఆలోచన... నెగెటివిటీ... మాసిన చొక్కా లాంటిది. అహంకారం అనే కొక్కానికి అది వేలాడుతూ ఉంటుంది. కొక్కెమే లేకపోతే, మాసిన చొక్కాకి స్థానమే లేదు. సకార్మాతక ఆలోచన ...పాజిటివిటీ... అనేది మంచిగంధం లాంటిది. మనం ప్రేమపూర్వకంగా  తలుపులు తెరిచిపెడితే చాలు. దానంతట అదే ప్రవేశిస్తుంది. 
  • ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే దేనికైనా తప్పక పరిష్కారం దొరుకుతుంది. అయినా, ఏ దారీ కనిపించలేదంటే అది సమస్యే కాదని అర్థం. దాన్నొక కఠిన వాస్తవంగా ఆమోదించాలి. హిమాలయాల్లో రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి ఉంటుంది. అది సమస్య కాదు. కఠిన వాస్తవం. మనం పరిష్కరించగలిగేవి సమస్యలు. మన పరిధిలో లేనివి కఠిన వాస్తవాలు. మన ముందు రెండే మార్గాలు. ఒకటి... పరిష్కరించడం లేదా ఆమోదించడం. మూడోది మూర్ఖులు ఎంచుకునే మార్గం... కుమిలిపోతూనో ఇతరుల్ని నిందిస్తూనో కూర్చోవడం!


logo