మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Apr 26, 2020 , 01:58:55

కరోనా తర్వాత కొత్త డాక్టర్లు!

 కరోనా తర్వాత కొత్త డాక్టర్లు!

కరోనా కల్లోల కారకమే. కానీ అది మనకు ‘ఏదో కొత్త’ని పరిచయం చేసింది. సంఘజీవి అయిన మనిషి మధ్య భౌతిక దూరం పెంచింది. బాధ పెట్టింది. భయం కలిగించింది. కానీ, జీవితంలో సర్వస్వం  కోల్పోయినా భవిష్యత్తు మిగిలే ఉంటుందంటారు. ఆ భవిష్యత్తునీ ప్రశ్నించింది. దాన్ని వర్తమానంలోనే చూపించింది. కరోనా కట్టడికి మనిషి వేసిన ప్రతి అడుగూ రేపటికి ముందడుగు. వైద్యం దైవం అయిన నేల.. వైద్యోపకరణాలు మృగ్యమైన వేళ..సాంకేతిక పరిజ్ఞానం కొత్త ఊరటనిచ్చింది. నాలుగో పారిశ్రామిక విప్లవం పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం.. కొత్త ఆశల్ని, ఆశయాల్ని పుట్టించింది.  ఈ ప్రగతిలో కీలకమైన కృత్రిమమేథ, రోబోటిక్స్‌.. పరుగులు పెడుతూ భవిష్యత్తుకు భరోసానిస్తున్నాయి. రేపటి వైద్యం మాదే అంటున్నాయి.  

యావత్‌ ప్రపంచం సరికొత్త టెక్నాలజీ యుగంలోకి దూసుకెళుతున్నది. నిన్న కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్ల విప్లవం, ఇవాళ కృత్రిమమేథ (ఏఐ), రోబోటిక్స్‌, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతూ వినియోగంలోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యంత్ర పరికరాల ఉత్పాదన తొలి పారిశ్రామిక విప్లవానికి నాంది అయింది. విద్యుదుత్పత్తి, వినియోగం రెండో పారిశ్రామిక విప్లవానికి దారి తీశాయి. 20వ శతాబ్దం మధ్యకాలం నుంచి కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, డిజిటల్‌ టెక్నాలజీ మూడో విప్లవానికి కారణమయ్యాయి. ఇక ఇది నాలుగో పారిశ్రామిక విప్లవం. రోబోటిక్స్‌, బిగ్‌ డేటా అండ్‌ అనలిటిక్స్‌, కృత్రిమమేథ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) తదితర కొత్తరకం టెక్నాలజీ అభివృద్ధి, వినియోగం ద్వారా మనం ఆర్థికాభివృద్ధితోపాటు సామాజిక ప్రగతిని కూడా సాధించనున్నాం.  

రోబోలదే హవా: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 777 కోట్ల జనాభా ఉన్నది. 2030 నాటికి ఇది 850 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుత జనాభాకే తగిన వైద్యుల సంఖ్య లేదని ప్రపంచ ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందులో కాస్త ఊరటనిస్తున్నది. వైద్యరంగంలో రోబోల వాడకం ఆశాజనకంగా మారనున్నది. ఎందుకంటే, ఎనిమిది మంది వైద్యులు చేసే సర్జరీని సైతం ఒక్క రోబో విజయవంతంగా పూర్తి చేయడం సాధారణ విషయంగా మారనున్నది. దీంతో రానున్న కాలంలో వైద్యరంగంలో రోబోల విప్లవం రానున్నట్లు వైద్యారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.  

రోబో వైద్యం విస్తరిస్తున్నది..  

ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో రోబోల వినియోగం రోజురోజుకూ విస్తరిస్తున్నది. ముఖ్యంగా శస్త్ర చికిత్సల్లో రోబోల వినియోగం విదేశాల్లో అధికంగా ఉంది. చికిత్సలు చేసేటప్పుడు వైద్యుల కంటే జాగ్రత్తగా ఈ రోబోలు విజయవంతంగా ఫలితాలను సాధిస్తున్నాయి. వైద్యులు శస్త్రచికిత్సల కోసం వినియోగించే పరికరాలకంటే అతిసూక్ష్మమైన పరికరాలను రోబోలు వినియోగించడంతో రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే భారత్‌లో సైతం రోబోల వినియోగం కొన్ని కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లలో ఉంది. స్వల్పకాలంలోనే ఈ సేవలు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్‌ తరం రోబోలదే. 

-డాక్టర్‌ సుబిర్‌ కుమార్‌ సాహా, ఐఐటీ న్యూఢిల్లీ శాస్త్రవేత్త (104వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌- రోబోటిక్స్‌ సదస్సులో)

కీళ్లమార్పిడిలో సంచలనం

హైదరాబాద్‌కు చెందిన సన్‌షైన్‌ హాస్పిటల్‌ రెండు నెలల క్రితం వైద్యరంగంలో జాతీయ స్థాయిలో సరికొత్త సంచలనానికి తెర తీసింది. కీళ్ల మార్పిడికి దేశంలోనే తొలిసారిగా నాలుగోతరం రోబోను అందుబాటులోకి తెచ్చి అరుదైన రికార్డును సృష్టించింది. ఈ సందర్భంగా సన్‌షైన్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, కీళ్ల మార్పిడి వైద్యనిపుణులు డా.ఎ.వి.గురవారెడ్డి మాట్లాడుతూ ‘కీళ్ల మార్పిడికి రోబోను అందుబాటులోకి తేవటం మనదేశంలో ఇదే ప్రథమం. రోబో సహాయక శస్త్రచికిత్సలతో మోకాలి చిప్ప, తుంటి ఎముకల్లో అరిగిన భాగాన్ని ఖచ్చితంగా అంచనా వేసి, కంప్యూటర్‌ నావిగేషన్‌ సహాయంతో సరైన పరిమాణాన్ని ఎంచుకుని, కీళ్లను మార్పిడి చేయవచ్చు. రోగికి మెరుగైన ఫలితాలు రావటంతోపాటు అతి తక్కువ రక్తస్రావంతో త్వరగా కోలుకుంటారు. ఫలితంగా త్వరగా హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశమూ ఉంది’ అని వివరించారు.

ఇతర దేశాల్లో.. కరోనా కట్టడి ఇలా! 

కరోనా కారకమైన చైనాలో దాని కట్టడికి వారు రోబోలను విస్తృతంగా వాడారు. రోడ్లను, అపరిశుభ్ర ప్రాంతాలను శానిటైజ్‌ చేయడానికి అత్యాధునిక మరయంత్రాలను వినియోగించారు. రోగులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి, గదులు శుభ్రం చేయడానికి కూడా రోబోలను వినియోగించారు. అలాగే రోగ నిర్ధారణ, థర్మల్‌ స్క్రీనింగ్‌కూ వీటిని విరివిగా వాడారు. వంటలు వండటానికి కూడా ఈ రోబోలు అక్కడి వారికి సహాయపడ్డాయి. కరోనా నిర్మూలనకు అభివృద్ధి చేసిన రోబోలు.. యూవీ కిరణాలను ప్రసరింపజేసి వైరస్‌లను నిర్మూలిస్తాయి. ఇలాంటి రోబోలను చైనాలోనే కాకుండా అమెరికా, ఇటలీ, థాయ్‌లాండ్‌ వంటి దేశాలలో కూడా వాడుతున్నారు.  మెడిబోట్‌ గార్డు..  

కరోనాపై యుద్ధానికి మలేషియాలోని ఇంటర్నేషనల్‌ ఇస్లామిక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మెడిబోట్‌ అనే రోబోను అభివృద్ధి చేశారు. దీని ధర రూ. 2.61 లక్షలు. పీపా ఆకారంలో 1.5 మీటర్ల ఎత్తు ఉండే ఈ రోబో ఆరోగ్య సిబ్బంది, వైద్యులకు బదులు ఆస్పత్రి వార్డుల్లో తిరుగుతూ రోగుల స్థితిగతులను పర్యవేక్షిస్తుంది. దీనికి కెమెరా, స్క్రీన్‌ ఉంటాయి. ఇది రోగులు పిలవగానే వారి వైపు వెళ్లి కావాల్సిన సేవలు అందిస్తుంది. 

రోబో క్లీనర్స్‌ 

ఉపరితలాలపై ఉన్న వైరస్‌ను అతి తక్కువ రిస్క్‌తో శుభ్రపరిచే రోబోలను సింగపూర్‌లోని సన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. వీటికి ‘ఎక్స్‌ట్రీమ్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబో’ అని పేరు పెట్టారు. ఇవి పాక్షిక స్వయంశక్తిని కలిగి ఉంటాయి. ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ సహాయంతో వీటిని నియంత్రించవచ్చు. ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్న రోబోలు చదునైన ఉపరితలాలు అంటే ఫ్లోర్‌ వంటి వాటిని మాత్రమే శుభ్రపరచగలవు. భిన్నమైన ఉపరితలాలపై పనిచేయలేవు. ఐతే, ఈ కొత్త రోబోలకు ఆరు చేతులు ఉంటాయి. దాంతో బెడ్స్‌, టేబుల్‌ కింది భాగంలో అలాగే తలుపులకు ఉండే గడియలు వాటిపైన, టేబుల్‌ టాప్స్‌, లైట్‌ స్విచ్‌లను కూడా ఇవి శుభ్రం చేస్తాయి. వస్తువు ఉపరితలమే కాదు, కనిపించని భాగాలను సైతం అవి శుభ్రపరచగలవు. రసాయనాలను కూడా వీటితో చల్లవచ్చు. ముప్పయ్‌ నుంచి యాభై మీటర్ల దూరం నుంచే వీటిని ఆపరేట్‌ చేయొచ్చు.కరోనా కట్టడిలో మన రోబోలు

కరోనా పోరులో ప్రాణాలకు తెగించి రేయింబవళ్లు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది రోగులకు చికిత్స చేశారు, చేస్తున్నారు. వారికి తోడుగానే కాకుండా వివిధ దేశాల్లో అనేక ఇతర పనులకోసం కూడా రోబోల సేవను వాడారు. మన దేశంలోని కొన్ని హాస్పిటల్స్‌లలో కూడా వీటిని ప్రవేశపెట్టారు. 

చెన్నయ్‌లో రోబోటిక్‌ నర్సులు:  కరోనా రోగులకు మందులను, ఆహారాన్ని అందించేందుకు చెన్నయ్‌లోని స్టాన్లీ హాస్పిటల్‌లో హ్యుమనాయిడ్‌ రోబోలను వినియోగిస్తున్నారు. ఐసొలేషన్‌ వార్డుల్లో నర్సులు, హెల్త్‌కేర్‌ వర్కర్‌లకు ప్రత్యామ్నాయంగా పనిచేసేలా ఈ రోబోలను తయారు చేశారు.  తిరుచిరాపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ కూడా హ్యుమనాయిడ్‌ రోబోలను రూపొందించింది. కరోనా పేషెంట్లకు నిర్దేశిత సమయానికి మందులు ఇచ్చేలా రోబోల సాఫ్ట్‌వేర్‌ను డిజైన్‌ చేసినట్లు ఆ కంపెనీ చెబుతున్నది.  ఇంటర్నెట్‌తో పనిచేసే రోబో.. 

చత్తీస్‌గడ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థి యోగేష్‌ సాహు ఇంటర్నెట్‌ ద్వారా నియంత్రితమయ్యే రోబోను తయారు చేశాడు. ఐసోలేషన్‌ వార్డుల్లో కొన్ని రకాల సేవలకు సంబంధించి డాక్టర్లకు ప్రత్యామ్నాయంగా ఈ రోబో పనిచేస్తున్నది. ఎక్కువ సమయం రోగులవద్ద డాక్టర్లు గడపడంలో ఉన్న రిస్క్‌ను గుర్తించిన యోగేష్‌కు ఈ రోబోను తయారుచేయాలన్న ఆలోచన వచ్చిందట. అందుకోసం ఇంటర్నెట్‌లో రోబోల తయారీకి సంబంధించిన కొన్ని వీడియోలు చూశాడు. ఇద్దరు స్నేహితుల సహకారంతో వాటిని తయారు చేశాడు. ఇవి ఇంటర్నెట్‌ ఆధారంగా పనిచేస్తాయి. దీంతో  వీటిని ఎక్కడి నుంచైనా ఆపరేట్‌ చేయవచ్చు. ఈ రోబోకు ఉండే కెమెరా సహాయంతో డాక్టర్లు రోగులతో మాడ్లాడవచ్చు.  ఐదు వేల రూపాయల ఖర్చుతో యోగేష్‌ ఈ రోబోను తయారుచేయడం విశేషం.  

కేరళ అసిమోవ్‌ రోబో..

కేరళ ప్రభుత్వ అనుబంధ సంస్థ.. కేఎస్‌యూఎం(కేరళ స్టార్టప్‌ మిషన్‌) వినూత్న ప్రయత్నం చేసింది. కొవిడ్‌ 19పై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా, మాస్కులను అందించేందుకూ రోబోలను వినియోగించింది. ఈ రోబోలను కేఎస్‌యూఎంలో ఇంక్యుబేట్‌ అయిన అసిమోవ్‌ అనే స్టార్టప్‌ కంపెనీ తయారుచేసింది. కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ఆధారంగా పనిచేసే ఈ హ్యుమనాయిడ్‌ రోబోలతో కరోనా వ్యాపించిన వారికి వైద్య సహాయం కూడా చేయవచ్చు. రెండు రోబోలను అభివృద్ధి చేసిన అసిమోవ్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని విషయాలను వాటిలో పొందుపరిచింది. ‘ఈ రోబోలు వైరస్‌కు సంబంధించిన అన్ని రకాల విషయాలనూ ప్రజలకు వివరిస్తాయి. శానిటైజర్‌, మాస్కులను అందిస్తాయి’ అని అసిమో రోబోటిక్స్‌ సీఈవో జయకృష్ణన్‌ చెప్పారు. కేరళలో నిఫా వైరస్‌ ప్రబలినప్పుడు ఈ రోబోలను అభివృద్ధి చేశామన్నారు. మాన్‌సింగ్‌ హాస్పిటల్‌లో

జైపూర్‌ నగరంలోని సవాయ్‌ మాన్‌సింగ్‌ హాస్పిటల్‌లో నర్సింగ్‌ రోబోలు పనిచేశాయి. కరోనా వైరస్‌ పాజిటివ్‌ రోగులకు చికిత్స చేసేందుకు వీటిని వినియోగించారు. ఐసొలేషన్‌ వార్డులో తిరుగుతూ ఈ రోబోలు వైద్యసేవలు అందించాయి. జోథ్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ రోబోలను తయారు చేశాడు. బ్యాటరీతో పనిచేసే వీటి జీవిత కాలం 4 నుంచి 5 ఏండ్లు. ఈ రోబోలను నర్సింగ్‌ సేవల కోసం వాడటంతో నర్సులకు కరోనా సోకకుండా చాలావరకు కాపాడగలిగామని ఆ హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్‌ డీస్‌ మీనా తెలిపారు.

హైదరాబాద్‌ యువకుల ప్రయత్నం: హైదరాబాద్‌కు చెందిన అష్పాఖ్‌, అబ్బుల్‌ బారీ, సల్మాన్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడు వార్షిక ప్రాజెక్టు కోసం వాకింగ్‌ రోబోను తయారుచేశారు. దీనికి మెరుగులు దిద్ది హాస్పిటల్‌లలో వాడుకోవచ్చనే ప్రతిపాదనను ఇటీవలే మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం చాలాచోట్ల వైద్యులకూ కరోనా సోకుతుందనే విషయం తెలిశాక తమ ప్రాజెక్టుకు మెరుగులు దిద్దడం ప్రారంభించారీ యువకులు. ఇప్పటికే దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో రోబో సర్వింగ్‌ రెస్టారెంట్లు వెలిశాయి. వాటికి మరింత సాంకేతికతను జోడిస్తే హాస్పిటల్స్‌ల్లోనూ ఉపయోగించవచ్చనేది వీరి ఆలోచన. 

రేపటి వైద్యానికి రోబోలుటి వైద్యం.. 

అంటే సమీప భవిష్యత్తులో వైద్యరంగంలో రోబోలే కీలకపాత్ర పోషించనున్నాయి. ఆ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేయడానికి అనేక రకాల రోబోలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. శస్త్ర చికిత్సకు సహాయపడే రోబోలు మాత్రమే కాదు.. వృద్ధులకు, దివ్యాంగులకు సహాయపడటానికి, శానిటైజ్‌ పనులకు, మందుల పంపిణీకి రోబోలు రూపుదిద్దుకుంటున్నాయి. రక్తకణాల కంటే తక్కువ పరిమాణంలో ఉండే నానో రోబోలు సరికొత్త వైద్యానికి తెర తీయనున్నాయి. 

రోబోటిక్‌ సర్జరీ :  వైద్యరంగంలో రోబోలు శస్త్రచికిత్స చేయడం ఇప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ కాదు. ఇప్పటికే వేలాది శస్త్రచికిత్సలు రోబోల సహాయంతో జరుగుతున్నాయి. రోబోకు అదనంగా అమర్చిన అనేక పరికరాలను నిర్దేశించే రిమోట్‌ కంట్రోల్‌ సహాయంతో వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల వైద్యులు ఎంతో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలనూ సులభంగా చేయగలుగుతున్నారు. సంప్రదాయ పద్ధతిలో శస్త్రచికిత్స చేయించుకున్న వారికన్నా ఈ పద్ధతిలో శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరమూ ఉండదు. ఈ పేషెంట్లు త్వరగా కోలుకుంటున్నట్లు కూడా వైద్యులు చెబుతున్నారు. నానోమెడిసిన్‌  

నానోటెక్నాలజీని వైద్యరంగంలో ఉపయోగించడాన్నే ‘నానోమెడిసిన్‌' అంటారు. సూక్ష్మాతిసూక్ష్మమైన పరికరాలను ఉపయోగించి చేసేదే ఈ నానోటెక్నాలజీ. ఇందులో ప్రమాణాలను నానోమీటర్లలో కొలుస్తారు. అది ఒక మీటరులో నూరు కోట్ల వంతు. అంటే.. ఒక వెంట్రుక దాదాపు 80 వేల నానోమీటర్ల మందం ఉంటుంది. ఒక వైరస్‌ సుమారు 100 నానోమీటర్ల పొడవు ఉంటుంది. కరోనా వైరస్‌ 60 నుంచి 140 నానోమీటర్లు ఉంటుంది. సమీప భవిష్యత్తులో శాస్త్రజ్ఞులు మానవ శరీరంలోపల వైద్యవిధానాలను నిర్వహించేందుకు అతిసూక్ష్మ పరికరాలను నిర్మించనున్నారు. నానోబోట్స్‌గా పిలిచే ఈ అతిసూక్ష్మ రోబోలు ఎన్నో నిర్దిష్టమైన ఆదేశాలతో ప్రోగ్రామ్‌ చేసిన మైక్రో కంప్యూటర్లుగా పనిచేస్తాయి. ఆశ్చర్యకరంగా, ఎంతో సంక్లిష్టమైన ఈ యంత్రాలు 100 నానోమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉన్న భాగాలతో తయారుచేస్తారు. అవి ఒక ఎర్రరక్త కణపు వృత్తవ్యాసం కన్నా 25 రెట్లు చిన్నవి. దీంతో రక్తకేశనాళికల గుండా సులభంగా పయనించి రక్తహీనధాతువులకు ఆక్సీజన్‌ను అందించగలుగుతాయి. మెదడు, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించగలుగుతాయి. వైరస్‌లను, సూక్ష్మక్రిములను, ఇతర అంటువ్యాధి కారకాలను పసిగట్టి వాటినీ నాశనం చేయగలవు. ఇవి మందులను నేరుగా దేహ నిర్దిష్ట కణాలకు చేరవేసేందుకు కూడా ఉపయోగపడతాయి. నానోమెడిసన్‌ సహాయంతో క్యాన్సర్‌ను పసిగట్టడంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. 

ఎండోస్కోపీ-బోట్‌ : జీర్ణవ్యవస్థ సంబంధ వ్యాధులను గుర్తించడానికి ఇప్పటికే పేగుల్లోకి పంపే కెమెరాలను వాడుతున్నారు. నోటీ ద్వారా పంపే వీటిలో కొన్ని ఇబ్బందులున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు మాత్ర పరిమాణంలో ఉండే రోబోలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ‘క్యాఫ్సూల్‌ ఎండోస్కోపీ’ ద్వారా జీర్ణవ్యవస్థ డేటాను సులభంగా తెలుసుకోవచ్చు. క్రిమిసంహారక రోబోలు    

ఆస్పత్రులకు రకరకాల రోగులు వస్తుంటారు. వీరినుంచి హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లు ఇతరులకు చేరుతుంటాయి. అందుకే హాస్పిటల్స్‌ ఎంతో శుభ్రంగా ఉండాలి. ఈ క్రిమిసంహారక రోబోలు ఆ పనే చేస్తాయి. యూవీ కిరణాలను ప్రసారం చేస్తూ గాలిలోని హానికారకాలను నాశనం చేస్తాయి. కరోనా నేపథ్యంలో వీటిని కొన్ని చోట్ల వాడుతున్నారు.  

సహాయక రోబోలు! 

వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి వారికి సహాయపడతాయి ఈ రోబోలు. ఆస్పత్రుల్లోనే కాకుండా, ఈ రోబోలను ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ‘బుడ్డీ’ పేరుతో శాస్త్రవేత్తలు తయారుచేసిన రోబో 2018లో బెస్ట్‌ ఇన్నోవేషన్‌ అవార్డును కూడా గెలుపొందింది. ఇది రోగి అపస్మారక స్థితిలో చేరితే ఆస్పత్రికి ఫోన్‌ చేయగలదు కూడా. 

రోబోలతో డాక్టర్‌ చెకప్‌లు!   

డాక్టర్‌కు బదులు మీ ముందు ఒక రోబో ఉంటుందన్నమాట. డాక్టర్‌ ఎక్కడో ఉంటారు. కానీ, ఆయన మీ ముందు రోబో స్క్రీన్‌లో కనిపిస్తుంటాడు. దానిద్వారా మిమ్మల్ని చెకప్‌ చేస్తాడు. తగు ప్రిస్కిప్షన్‌ కూడా ఇస్తాడు. అమెరికా ఇప్పటికే ఈ రకమైన విధానాన్ని వాడుతున్నది.  

ఔషధాల అమ్మకానికి.. 

సింపుల్‌గా చెప్పాలంటే.. ఆస్పత్రుల్లో, మెడికల్‌ షాపుల్లో మందులు అమ్మే మెషీన్‌. మనుషుల కంటే వేగంగా, కచ్చితత్వంతో ఇవి పనిచేస్తాయి. యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియా, సాన్‌ఫ్రాన్సిస్కోలలో ఇలాంటి కాన్సెప్ట్‌ ఫార్మసీ రోబోలు ఐదారేండ్ల నుంచే ప్రయోగాత్మకంగా పనిచేస్తున్నాయి.  

రోబోటిక్‌ -అసిస్టెడ్‌ బయాప్సీ  

ఇది రోబోలతో చేసే మురాబ్‌ (ఎంఆర్‌ఐ అండ్‌ ఆల్ట్రాసౌండ్‌ రోబోటిక్‌ అసిస్టెడ్‌ బయాప్సీ) అనే కాన్సెప్ట్‌ ప్రాజెక్ట్‌. ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ నిర్ధారణకు, బయాప్సీ చికిత్సకు ఉపయోగపడే కాన్సెప్ట్‌ ఇది. ఈ విధానం ద్వారా ఎంఆర్‌ఐ, ఆల్ట్రాసౌండ్‌ కాంబినేషన్‌ టెక్నిక్‌ ద్వారా సర్జన్‌ బయాప్సీ చేయాల్సిన చోట 3డీ చిత్రాన్ని రూపొందించి సులభంగా చికిత్స చేయొచ్చు. 

చికిత్సలు చేసే మైక్రోబోట్‌ : ‌ : శరీరంలోని ఒక నిర్దిష్ట సూక్ష్మభాగానికి చికిత్స చేయడానికి ఈ మైక్రోబోట్‌లను అభివృద్ధి చేస్తున్నారు. సూక్ష్మ యాంత్రిక కణాలుగా పిలిచే ఇవి కావాలనుకొన్న ప్రదేశానికి వెళ్లి రోగనిరోధక మందునివ్వడమే కాక, అవసరమైన చికిత్సలను కూడా చేయగలవు. logo