గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Apr 25, 2020 , 23:44:07

తొలి గాథా సంకలన కావ్యకర్త హాలుడు

తొలి గాథా సంకలన కావ్యకర్త హాలుడు

హాలుడు శాతవాహన వంశానికి చెందిన కవిరాజు. కవివత్సలుడనే బిరుదాంకితుడు. ఈయన పాలించింది ఐదేళ్లే. అయినా, శాతవాహన వంశపు రాజులందరిలో జగత్ప్రసిద్ధుడయ్యాడు. ఇందుకు కారణం.. ఆ మహారాజు సంకలనం చేసి ప్రపంచానికి అందించిన గాథాసప్తశతి అనే గ్రంథం. ఇది భారతదేశంలో వెలసిన అత్యంత ప్రాచీన లౌకిక సాహిత్యానికి సంబంధించిన మహా సంకలన గ్రంథం. అలంకారాలకే అలంకారం తెచ్చిన మహాకావ్యం. 

ప్రపంచ సాహిత్యంలోనే హాలుడు తొలి సంకలన కర్త. శ్రీపాలితుడిని సప్తశతిలోకి నాలుగు గాథలను చేర్చమని కోరి హాలుడు తన ఖజానా నుంచి నాలుగు కోటి కర్షపణాలు (కోటి దేశపు నాణేలు) ఇచ్చాడు. ఈ విషయాన్ని మేరుతుంగుడనే కవి ప్రబంధ చింతామణిలో పేర్కొన్నాడు. హాలుడు కోటిలింగాలను ఏలినాడు. ఇది ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని వెలగటూరు మండలంలోని గ్రామం. ఈ గ్రామానికి నాడు కోటి అని పేరు. శాతవానుల కాలంలో లింగాల అనే పదం లేదు. పశ్చిమ చాళుక్యుల కాలంలో వచ్చింది. అప్పుడిది కోటి రాజ్యం. ఇక్కడే తాను తన గ్రంథాన్ని సంకలనం చేశానని గాథాసప్తశతి 3వ గాథలో హాలుడు చెప్పుకొన్నాడు.  

హాలుడు క్రీ.శ. 29 నుంచి 74 వరకు ఐదేండ్లు పాలించాడు. ఈతడు లీలావతిని పరిణయం ఆడాడు. వీరి వివాహం సప్త గోదావరి ప్రాంతంలో జరిగినట్లు ప్రాకృతంలో వెలిసిన లీలావతి అనే కావ్యం చెబుతున్నది. హాలుడు శాతవాహనుల వంశంలో 17వ రాజుగా చరిత్రకారులు చెబుతారు. హాలుడు, సాలనుడు, కుంతలుడు, శాతవాహనుడు.. ఈ నాలుగు పేర్లు ఒక్కరివే అని హేమచంద్రుడు తన దేశకోశములో చెప్పాడు. క్రీ.శ. 78వ సంవత్సరం నుంచి లెక్కించబడుతున్న శాలివాహన శకానికి ఈ హాల శాతవాహనుడే కర్త అని కొందరంటారు.

హాలుడు మొదటి ప్రజాకవిగా కీర్తి ప్రతిష్టలు పొందాడు. లీలావతి కావ్యం, అభిదాన చింతామణి, దేశీ నామమాలాది గ్రంథాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. హాలుడు విద్యాభిమాని, విద్యారసికుడు. ఇతడు కవులను, విద్వాంసులను ఆదరిస్తూ ఆరాధిస్తూ.. తానూ కవిగా వెలుగొందాడు. ఇతని కాలంలో రాజపోషణం లభించడంతో దేశభాషలు బాగా అభివృద్ధి చెందాయి. హాలుని ఆస్థానంలో సకల విద్యలు నెలకొని ఉన్నాయి. ఇతని కాలాన్ని ‘ప్రాకృతానికి స్వర్ణయుగం’గా చెబుతారు.  

ప్రాచీన మహారాష్ట్ర ప్రాకృతములో హాలుడు ‘సప్తశతి’ అనే నీతిశృంగార కావ్యాన్ని రచించాడు. దీనినే గాథా సప్తశతి (సత్తసయి) గ్రంథంగా వర్ణిస్తారు. ఇందులో మనోహరమైన అలంకారాలున్నాయి. అలంకారాలకే అలంకారాలు తెచ్చిన మహాకావ్యమిదని పలువురు కీర్తిస్తారు. హాలుడు సమకాలీన సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ ప్రాకృత పద్య గాథలను సేకరించి సంకలనం చేశాడు. ఇందులో ఏడు వందల శృంగార గాథలున్నాయి. ఈ గాథలు ముఖ్యంగా ధ్వని ప్రధానమైనవి. ఈ సంకలనం సుమారు రెండు వేల సంవత్సరాల కిందటిది. ఆనాటి తెలుగు దేశపు ప్రజల ఆచార వ్యవహారాలు చాలావరకు ఈ గాథల్లో ప్రతిబింబింపజేశాడు. ఆనందవర్ధనుడు, ముమ్మటుడు వంటి అలంకారికులు తమ గ్రంథాలలో సప్తశతి గాథలను ఉదాహరణల కింద వాడుకున్నారు. కాళిదాసులాంటి కవుల్నే ఇవి ప్రభావితం చేశాయంటే వీటి ఉత్కృష్టత ఎంతటిదో అంచనా వేయవచ్చు. హాలుని సప్తశతిని బాణుడు తన ‘హర్ష చరిత్రము’లో పొగిడాడు. కావ్య ప్రణాళికలోనూ, సరస్వతీ కంఠాభరణములోనూ, దశరూపక వ్యాఖ్యానంలోనూ సప్తశతి పద్యాల గురించిన ప్రస్తావన ఉంది.

శాతవాహనుల తొలి రాజధాని కోటి లింగాల. ఈ విషయం అక్కడి తవ్వకాల ద్వారా నిరూపణ అయింది. ఈ వంశపు తొలి ప్రభువు చిముకుని (సిముకుని) నాణేలు ఇక్కడ దొరికాయి. తరువాత ప్రభువులు రాజధానిని పైఠాన్‌కు మార్చారు. అందువల్ల హాలుని నాటికి రాజధాని ఐన పైఠాన్‌ ప్రాంతంలో మహారాష్ట్రీ ప్రాకృతంలో ఈ గ్రంథం రాసినట్లు చెబుతారు. కానీ ఇందులోని ప్రాకృతం మహారాష్ట్రలో నాడు స్థిరపడిన భాషకు భిన్నంగా ఉంది. ఇందుకు శాతవాహనులు వేయించిన మహారాష్ట్ర శాసనాలు ప్రమాణం. ఈ భాషకు గాథాసప్తశతి భాషకు కొంత భిన్నత్వం ఉంది. పైగా దీంట్లో తెలుగు పదాలున్నాయి. కనుక ఇది ఆంధ్రీ ప్రాకృత భాష. కేవలం దేశవాచకంగా మహారాష్ట్రీ ప్రాకృతం అన్నారు. తెలుగు జన వ్యవహార భాష. ప్రాకృతం అధికార భాష. గాథాసప్తశతి ఆంధ్ర ప్రాకృత భాష. నాడు ఆంధ్ర అంటే తెలంగాణ ప్రాంతమే. ‘హాలుడు వివాహం ఆడింది సింహళదేశానికి చెందిన యువతిని అని, సప్తగోదారి అంటే ద్రాక్షారామం అని కొందరు చరిత్రకారులు పొరపాటు పడ్డారు. కానీ హాలుడు పెళ్లాడింది తెలంగాణ అమ్మాయిని. హాలుడు తెలంగాణ అల్లుడు’ అని ప్రముఖ చరిత్రకారులు సంగనభట్ల సరసయ్య చారిత్రక ఆధారాలతో నిరూపించారు. 

- నగేష్‌ బీరెడ్డి