గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Apr 25, 2020 , 23:41:55

దీక్ష

దీక్ష

అయితారానికి నీసుకు ఏం సంవందం ఉందో నాకు తెల్వదుగని, అయితారం రాంగనే, తెల్లారంగనే మనకు తెల్వకుండనే కాళ్ళు కటిక అంగడికో, సికెన్‌ దుక్నానికో, శాపల అడ్డకాడికో తోవ వడ్తయ్యి. సియ్యల మీద అయితారం నాడు ఇంకింత ఆరివారం అనిపిస్తది. పావుకిల కైమ తెచ్చుకొని ముట్టీలు తినాలనిపిస్తది, అద్దకిలంత కోడి మాంసం తెచ్చి ఇక చెంచె నూనెక్కువేసి కూరజేసుకోవాలనిపిస్తది, మల్ల లేకపోతే  కొర్రమట్టలో, బొమ్మిడిచాపలో కొనుకొచ్చి పులుసు చేసుకోని జుర్రుకోవాల్నిపిస్తది, లేకుంటె ఇంత బోటి, నల్ల తెచ్చుకొని మంచిగ గంటసేపు ఉడుకుడుకు నీళ్ళతోటి కడిగి సాఫ్‌ జేసి జరకన్ని గుడాలేసి ఒండుకొని నవిల్తే సొర్గం మన పక్కలున్నట్లే గొడ్తది.

ఇగ నెలాఖరు దినాలు, కీసలల్ల పైసల గలగలలు తక్వగాంగనే ఇంగేం జేస్తమని అట్లిట్ల తన్లాడి కోడిగుడ్ల అంటుపులుసు పెట్టిచ్చుకొని జొన్నరొట్టెల అద్దుకొని తింటే గని జన్మ సార్తకం గాదు. మనిసికి ఉన్నదే ఒక జన్మ, గండ్ల గూడ నోరు గట్టేసుకొని, జివ్వ సంపేస్కొని, నాల్కె కత్తిరిచ్చుకొని బత్కుడు గూడ ఒగ బత్కేనా అనిపిస్తది.

ఏం జేస్తం, నాకైతె తప్పది. పెండ్లయి రజత దినోత్సవానికి దినాలు దగ్గెరవడ్తున్నయి గని ‘ఈమె’కు నీసు దినుడు నేర్పకపోతి. ఇన్నేండ్ల సంది ‘ఈమె’ను ఇవుతలికి గుంజాలని నేను, అవుతలికి గుంజాలని ‘ఆమె’, ఎన్నెత్తులేయాల్నో అన్నేసిన గని, ఎవ్వరి చేతుల్ల ఎవరు బిస్కలే. 

ఇప్పుడు అంతో ఇంతో నయ్యం, పిల్లలకు జరంత, జరంత అని సిన్నగున్నప్పటిసంది, ప్రతి  సందు దొర్కిన కాడ రుసి సూపెట్టి నా తోవలకే మల్పుకున్న గని, ఎక్వ తక్వ దినరు. మాసర సూసినట్లు సూస్తరు. ఆడికెల్లి జరంత ముంగల్కే నడుస్తున్నరు, గిప్పుడు రెండు మూడు తునకల కాడికి ఒచ్చిన్రు. ‘ఆమె’ తినకున్న మనకైతే కమ్మగ ఒండిపెడుతున్నది తియ్యని సదురుకున్న.

అట్లనే ఒక అయితారం నల్గురం, ఈమె, మా పిల్ల, పోరడు కల్సి గూసోని బువ్వ తింటుండంగ, మెల్లెగ ఎల్లదీశ్న.

‘గీ ఒచ్చే శుక్రారం సంది నేను దీక్ష తీసుకుంటున్న,’ అని చెప్తి.

‘గిప్పుడేం దీక్ష, అయ్యప్పదా, ఆంజనేలుదా, ల్యాకపోతే దుర్గమ్మ తల్లిదా,’ ఈమె.

‘ఏ...గవ్వన్నీ గాదు. మా ఆపీసుల మేం అయిదారుగురం కల్సి ఈ దీక్ష దీసుకుంటున్నం...ముప్పై రోజుల దీక్ష.’

‘అరె! అదేం దీక్ష? ఉంటే నలబై ఒక్క దినాల దీక్ష ఉంటది, గిదేం దీక్ష...గన్ని దినాలు ఏడుంటవు, ఏడ తింటవు, ఏడ పంటవు’ రాజాంగం ఇప్పమన్నది ఈమె.

‘అవన్నీ ఎప్పటోలెనే...ఇంట్లనే ఉండుడు, తినుడు, పండుడు గని ఒంటి పూట బోజనం, పొద్గాల అపీసుకు పొయ్యేటప్పుడు ఒక్కసారే ఇంత బువ్వ దిని పోతే, పగటేల ఏడ్నన్న ఇంత ఇడ్లో, దోశనో తినాల్నంట, రాతటికైతే ఉపాసం,’ ఇవరించిన.

‘మల్ల పండుడు...ఒక అర్ర గిట్ల సాఫ్‌ జేసి పెట్టాల్నా,  ఈతసాప గిట్ల సుదరాయించాల్నా’ ఈమె.

‘ఏ...అవన్నేం లేవు, నువ్వూకో, ఏమన్న అసోంటివి ఉంటే నేను చెప్తగని,’ అని మాట దాటిపిచ్చిన. గండం గడిచిందని ముర్సిన, పతకం పారుతున్నందుకు పబ్బతి గట్టిన. శుక్రారం రానే ఒచ్చింది. ఇగ ఇంట్ల ‘ఈమె’ తెల్లంజావునే లేసి ఇల్లూ ఆకిలూడిసి, నెత్తికోసుకొని తానం జేసి ఒంట జేసింది. నేను ముద్దుగ తయారై, కుదార్తంగ దిని ఆపీసుకు పోయ్న. పగటేల టిపిని సెంటర్ల ప్లేటు ఇడ్లి తిన్న. పొద్దుమూకినంక, ఆపీసు జతగాల్లతోటి కూడి చార్మినార్కాడ పిస్తాహౌస్ల హలీం తింటిమి. ఇయ్యల్నే రంజాన్‌ షురూ అయ్యింది. ఇగ ఈడ హైద్రాబాద్ల ఉండుకుంట, హలీం దినకుండ ఉండుడు అయితాది? అందుకే అందరం కల్సి హలీం దీక్ష దీసుకున్నం. దినాం ఒక తావల హలీం దినాలె. ముప్పై దినాలు ముప్పై తావుల్ల దినాలెనంటని సోంచాయించుకున్నం. మల్ల మల్ల గిట్ల దొరుకుతాది గీ హలీం? ఈ త్యాప దొర్కుతే మల్ల పదకొండు నెల్లకు, రంజాన్‌ మల్లొచ్చిన్నాడు దొర్కుతది. దాని రుసి ముంగల ఏ రుసి కమ్మగుంటది సెప్పుండ్రి. దునియలనే ఇంత మషూరు మన బిర్యాని, హలీము. ముద్దుగ హలీం తిని ఎప్పటోలెనే కుదార్తంగ ఇంటికి పోయి, తానం గిట్లజేసి పండుకున్న.

‘ఏం దీక్ష దీసుకున్నడొ ఏందో, ఏం జేస్నా మన కోసమే గద గింత గనం తిప్పలవడుడు,’ అని గీమె గూడ నాకు దినాం మడిగట్టుకొని ఒండిపెట్టింది. గింత తక్లీబు గాకుండ సూసుకున్నది.

నేను గిట్ల గీ దీక్ష తీసుకున్నని తెలిస్తే ఇంకేమన్న ఉన్నదా? గందుకే సప్పుడు జెయ్యక మనపని మనం జేసుకోవాలె. ఎవ్వల్కి ఇంత ఆయమియ్యొద్దు. మత్లబు తెల్వనియ్యొద్దు. మన జాగల మనం ఉంటం, ఆల్ల జాగల ఆల్లుంటరు, ‘సర్వేజనా ...’ అన్నట్లుండాలె.

ఇగ దినాం ఒక దోస్తుతోటో, అపీసు కొలీగుతోటో మంచి మంచి మషూరు తావుల్ల హలీం తిన్నం. ఒక దినం లష్కర్‌ ప్యారడైజుల, ఇంకొక దినం శాలిబండ షాగౌసుల, ఒక పాలి మదీన నయాబుల, మల్లొక దినం బహార్ల. ఇట్ల దీక్ష తీస్కోని దినాం తీరొక్క తావుల్ల హలీం దినాలె, ఇంటికి పోవాలె. తెల్లటి రికాబుల పెద్ద గంటెడు హలీం పెట్టి, మీద్కెల్లి మస్తు కాగవెట్టిన నెయ్యి పెద్ద చెంచెడు ఏసి, ఆటిమీద ఇన్ని ఏపిన ఉల్లిగడ్డలు, ఒక నిమ్మ చెక్క దాంట్ల మీద పిండుకొని తింటే, అబ్బ ఏమన్న రుసా? గందుకే మన హైద్రాబాద్‌ హలీం దునియల అన్ని జాగలకి ఎక్స్పోర్ట్‌ అయితుంది. సర్కారుకు కోట్లు సంపాయించి పెడ్తున్నది.

అన్ని దినాలు అయిపోయినయి. ఇగ రేపే రంజాను పండ్గ. రేపు దొర్కది హలీం. ఇయ్యాల్నే ఆఖరు. ఇయ్యాల దింటే ఇగ మల్ల త్యాప దాంక ఎదుర్సూడాలెనంటని మా జతగాల్లతోటి గల్సి చాదర్ఘాట్‌ నయగరా కాడికి పోయినం. అందరం ఒక్క తాన గూసోని నెత్తికో ప్లేటు చెప్పితిమి. మంచిగ పుర్సత్‌ గ తింటుండంగ ఒకాయిన కన్లవడి, ‘నమస్తే సార్‌, బాగున్నరా,’ అంటని అడిగె. ‘ఎవరో ఉండె ఈన’ అని నేను సోంచాయిస్తుండంగనే మల్ల ఆయిన్నే అన్నడు.

‘నేను సార్‌, రవీందర్ను, మీ అమ్మాయి, మా పిల్ల ఒగటే కాలేజ్ల సదూతున్నరు, మనం గల్సినం ఒకసారి,’ అంటని యాజ్జేసిండు.

‘గట్లనా సార్‌, శాన దినాలయ్యింది మనం గలిసి, నమస్తే సార్‌, అమ్మాయి ఎట్లున్నది,’ అని తునకలు తునకలు, అత్కనివి అన్ని అత్కవెట్టుకుంట అడిగితి.

ఆయినకు నేను గుర్తుపట్టలేందంటని అర్తమైనట్టున్నది, ‘ఒస్త సార్‌, మల్ల గలుస్త,’ అనుకుంట దబదబ ఎల్లి పోయిండు. దీక్ష అయిపోయిన నాలుగొద్దులకు నా బిడ్డె, నా సుట్టుపక్కల ఎవ్వరు లేంది సూశి, నా పక్కల గూసోని, ‘నాయ్నా, మల్లొచ్చే త్యాప నేను గూడ దీక్ష దీసుకుంటనే,’ అంటని చెవుల గుస గుస చెప్పి అవుతలికి పొయ్యింది. నేను సప్పుడు జెయ్యక దిక్కులు సూస్కుంట ఇగిలిచ్చిన.   

([email protected])

-కొట్టం రామకృష్ణారెడ్డి


logo