శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Apr 19, 2020 , 01:02:24

Forbes TALENT UNDER 30 పాంచ్‌ పటాకా

Forbes TALENT UNDER 30 పాంచ్‌ పటాకా

ఇన్నోవేట్‌.. ఇన్‌క్యుబేట్‌.. ఇన్‌కార్పొరేట్‌.. ఇది టీ-హబ్‌ ‘తారక’మంత్రం. ఇన్నోవేషన్‌ ఈజ్‌ ద మదర్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌.. ఆవిష్కరణ నుంచి వ్యాపారం పుడుతుంది. ఇందుకు నీకు కావాల్సింది మొదటి ఐ.. ఇన్నోవేట్‌. ఆవిష్కరించు. అంతటితో అయిపోదు. ఇది గుడ్డులాంటిది. పిల్ల అవ్వాలంటే పొదగాలి. ఇదే ఇన్‌క్యుబేషన్‌. రెండో ఐ. ఆవిష్కరణను ఎలా అమ్మాలి.. పెద్ద వ్యాపారంగా ఎలా మార్చాలి?? అందుకు ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలను అంచనా వేయాలి. దాన్నో కార్పొరెట్‌ కంపెనీగా ఎలా ఇన్‌కార్పొరేట్‌ చేయాలి? ఇది మూడో ఐ. ఈ ‘3ఐ మంత్ర’ పాటిస్తే ప్రతి స్టార్టప్‌ కూడా గొప్ప కంపెనీగా ఎదుగుతుంది. టీ-హబ్‌ ఇలాంటి స్టార్టప్‌లను ఎన్నింటినో పొదుగుతున్నది. కొన్ని గొప్ప కంపెనీలను తీర్చిదిద్దుతున్నది. ఎంతలా అంటే.. ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30కి ఐదు కంపెనీలు ఇక్కడి నుంచే ఎంపికయ్యాయి. టాలెంటే పెట్టుబడిగా ఎదిగిన ఆ ఐదు అంకురాల స్ఫూర్తికథలే ఈ వారం ముఖచిత్ర కథనం. 

ఉద్యోగం సంపాదించడం కాదు, తామే ఇతరులకు ఉపాధి కల్పించాలనే తపన, ఆసక్తి ఉన్న యువతకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తున్నది. టీ-హబ్‌ రూపంలో సరైన వేదికను ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నది. దీన్ని తెలంగాణ యువత కూడా అదే స్థాయిలో అందిపుచ్చుకుంటున్నది. తాజాగా ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన 30 అండర్‌ 30 ఆసియా 2020 జాబితాలో హైదరాబాద్‌కు చెందిన ఆరు స్టార్టప్‌లకు స్థానం లభించడమే దీనికి నిదర్శనం. ఇందులో ఐదు స్టార్టప్‌లూ మన టీ-హబ్‌ నుంచే పురుడుపోసుకోవడం విశేషం.  

మన దేశం నుంచే  ఎక్కువ..

30 ఏండ్లలోపు ఉద్యోగం సంపాదించడమే చాలామంది కల. అయితే కొంతమంది ఆలోపే అద్భుతాలు సృష్టిస్తుంటారు. అటువంటి వారు యువతరానికి స్ఫూర్తినిస్తారన్న ఉద్దేశ్యంతో ఫోర్బ్స్‌ పత్రిక ప్రతి ఏటా 30 ఏండ్లలోపు యువ నైపుణ్యవంతుల జాబితాను ప్రకటిస్తుంటుంది. తాజా జాబితాలో 10 విభాగాలకు 30 మంది చొప్పున మొత్తం 300 మంది ఉన్నారు. భారత్‌ నుంచి ఇందులో 69 మంది చోటు సంపాదించుకోవడం విశేషం. మొత్తం 22 దేశాల్లో భారత్‌ నుంచే అత్యధిక మందికి చోటు దక్కింది. 

పది విభాగాలు 

1. ది ఆర్ట్స్‌ అండ్‌ ైస్టెల్‌ 2. ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీ 3. ఫైనాన్స్‌ అండ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ 4. ఇండస్ట్రీ, మ్యానుఫాక్చరింగ్‌ అండ్‌ ఎనర్జీ 5. మీడియా, మార్కెటింగ్‌ అండ్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ 6. రిటైల్‌ అండ్‌ ఈ-కామర్స్‌ 7. కన్జ్యూమర్‌ టెక్నాలజీ 8. ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ స్పోర్ట్స్‌ 9. హెల్త్‌కేర్‌ అండ్‌ సైన్స్‌ 10. సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌.

అద్దె కార్లపై అద్దిరిపోయే ప్రకటనలు 

కంపెనీ:యాడ్‌ ఆన్‌ మో 

వెబ్‌సైట్‌ : adonmo.com

ఫోర్బ్స్‌ కేటగిరీ : మీడియా, మార్కెటింగ్‌ అండ్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ ఇన్‌క్యుబేటెడ్‌ @ టీ-హబ్‌

ఇంటర్‌నెట్‌ యాక్సెస్‌ చేస్తున్న వారి ఇష్టాలు, ప్రాధాన్యాలను గమనించి గూగుల్‌ యాడ్స్‌ ఇస్తుంటుంది. ఇలాగే ‘ట్యాక్సీ కారు పరిసరాల్లో ఉండే వ్యక్తులను అంచనా వేసి ప్రకటనలు ఇస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే యాడ్‌ఆన్‌మో. ్రప్రిడిక్టివ్‌ అనలిటిక్స్‌ ఆధారంగా ప్రకటలను ప్రదర్శిస్తున్న ప్రపంచంలోనే తొలి సంస్థ ఇది. 

ప్రజలకు ఉపయోగపడేలా..

డిజిటల్‌ యాడ్‌లు కేవలం వాణిజ్య అవసరాలకే కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తున్నాం. హ్యాక్‌ ఐ అడ్వర్టయిజ్‌మెంట్‌ను కూడా యాడ్‌ఆన్‌మో ద్వారానే ప్రజలకు చేరవేశాం. ప్రజలకు ఉపయోగపడే ట్రాఫిక్‌ అప్‌డేట్‌తో పాటు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై కూడా యాడ్‌ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నాం. టీ-హబ్‌, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం మర్చిపోలేనిది. 

-సందీప్‌ బొమ్మిరెడ్డి, యాడ్‌ఆన్‌మో సహ వ్యవస్థాపకుడు 

ఐఐటీ ఇండోర్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన సందీప్‌, అమెరికాలో ఎంఎస్‌ చదివిన స్రవంత్‌లకు మైక్రోసాఫ్ట్‌లో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం చేస్తూనే సందీప్‌ 7 పేజెస్‌ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాడు. అంకురాల విజయాలను వివరించే పుస్తకాలను ఆన్‌లైన్‌లో అమ్మడం ఈ సంస్థ పని. ప్రచారం సరిగా లేక అది విజయం సాధించలేకపోయింది. దీంతో ప్రచారానికి ఉన్న ప్రాధాన్యం గుర్తించాడు సందీప్‌. సందీప్‌ ఒకసారి గోవా వెళ్లాడు. అక్కడ బీచ్‌లో ఒక నానో కారును చూశాడు. దాని మీద ‘పార్టీ @ అంజనా బీచ్‌' అన్న ఫ్లెక్సీ ఉంది. దాన్ని చూసి ఒక ఐడియా వచ్చింది సందీప్‌కి. వాణిజ్య ప్రకటనలను కూడా ఇలా కార్లమీద ఇవ్వాలి. వాటికి సాంకేతికతను జోడించాలి.. లక్ష్యిత వీక్షకులు దాన్ని చూసేలా చేయాలి. మూస ధోరణిలో కాకుండా వినూత్నంగా ఆకట్టుకోవాలి- ఇదీ ఆలోచన. సందీప్‌, స్రవంత్‌ తమ ఆలోచనలకు దగ్గరగా ఉండి, అమెజాన్‌లో పనిచేస్తున్న కృష్ణచైతన్య బొమ్మకంటిని టీమ్‌లో కలుపుకొన్నారు. హైదరాబాద్‌ నగరంలో తిరిగే వేల అద్దె కార్లను తమ ప్రచారానికి వినియోగించుకోవాలనుకున్నారు. ప్రత్యేక డిజిటల్‌ స్క్రీన్‌ను రూపొందించే పనిలో పడ్డారు. ఓ చిన్న గది వీరి పరిశోధనలకు వేదికైంది. రెండేండ్లపాటు కష్టపడ్డారు. జులై 2017లో టీ-హబ్‌లో తమ ప్రస్థానాన్ని మొదలెట్టారు. ఏంటీ యాడ్‌ఆన్‌మో?  

అద్దె కార్ల పైభాగంలో ప్రత్యేకమైన డిజిటల్‌ స్క్రీన్‌ను అమరుస్తారు. కొన్ని ప్రాంతాలను గుర్తించి ఎక్కడ ఏ ప్రకటన రావాలో ముందుగానే నిర్ణయిస్తారు. దాన్ని బట్టి, ఈ డిజిటల్‌ స్క్రీన్‌ ఉన్న కారు ఆ ప్రదేశంలోకి చేరగానే ఆటోమేటిగ్గా ఆ ప్రకటన ప్రత్యక్షమవుతుంది. ప్రకటన ఏ సమయంలో రావాలన్నది కూడా ప్రకటనకర్తలు నిర్ణయించుకోవచ్చు. ఇదంతా కూడా కృత్రిమమేధ ఆధారంగానే జరుగుతుంది. దీనికోసం కచ్చితమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందీ మిత్రబృందం. జైన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌, స్టార్‌ హాస్పిటల్‌, లియోనియా రిసార్ట్స్‌, ఫస్ట్‌క్రై డాట్‌ కామ్‌ లాంటి సంస్థలు ప్రకటనలు ఇవ్వడం మొదలెట్టాయి. కనీసం రూ. 10 వేలు వెచ్చించే వారెవరైనా వీరి ద్వారా ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. గంటల లెక్కన బిల్లు వసూలు చేస్తారు. ఈ సంస్థ అందిస్తున్న  వినూత్న సేవలకుగాను ఇప్పటికే 5 పేటెంట్లు  లభించాయి. కంప్యూటర్‌ విజన్‌, హైపర్‌ లోకల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటివి ఇందులో ఉన్నాయి. తొలి రోజుల్లో  డిజిటల్‌ స్క్రీన్‌లను ఏర్పాటు చేసుకునేందుకు డ్రైవర్లను ఒప్పించడం కష్టమైందట. కానీ, ఒకరినుంచి ఒకరు తెలుసుకోవడం ద్వారా ఇప్పుడు వారే ముందుకు వస్తున్నారట. ఒక్కో కారు డ్రైవరుకు నెలకు సుమారు రూ. 4,000 దాకా అదనపు ఆదాయం వస్తున్నది. ఎక్కువగా తిరిగే కార్లకు ఇంకా ఎక్కువ వస్తుంది. 

మరి పెట్టుబడి?

ఉద్యోగం చేస్తున్నప్పుడు మిగుల్చుకున్న చెరో రూ. 10 లక్షలను ప్రాథమిక పెట్టుబడిగా పెట్టారు సందీప్‌, స్రవంత్‌. సీడ్‌ ఫండింగ్‌ కింద సిలికాన్‌ వ్యాలీ ఇన్వెస్టర్లతోపాటు హైదరాబాద్‌ ఏంజిల్‌ ఇన్వెస్టర్ల నుంచి 1.48 కోట్లు సేకరించారు. స్టార్టప్‌ ఇండియా నుంచి రూ. 1.2 కోట్ల సహకారం లభించింది. ఈ మొత్తంతో  డిజిటల్‌ స్క్రీన్‌లను మరింత అభివృద్ధి చేసి, మొదట 100 కార్లకు అమర్చారు. ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌-2018)లో పాల్గొనడం మర్చిపోలేని అనుభవం. ఆ సదస్సులో మా ఆలోచనను చాలామంది మెచ్చుకున్నారు. మాకు కావాల్సిన మరిన్ని నిధులు సమకూరాయి’ అని చెప్పాడు సందీప్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో 1600లకు పైగా క్యాబ్‌ల ద్వారా క్లయింట్లకు ప్రచార సర్వీసులందిస్తున్నారు. గతేడాది నుంచి ముంబైలో కూడా వీరి సేవలు మొదలెట్టారు. త్వరలో ఢిల్లీలో కూడా ప్రారంభించాలనుకుంటున్నారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లోనూ సర్వీసులందించాలని భావిస్తున్నారు. 

సామాజిక సమస్యలను గుర్తించే డ్రోన్లు

కంపెనీ:మారుట్‌ డ్రోన్స్‌

వెబ్‌సైట్‌ : marutdrones.com

ఫోర్బ్స్‌ కేటగిరీ : ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్‌ అండ్‌ ఎనర్జీ ఇన్‌క్యుబేటెడ్‌ @ టీ-హబ్‌

దోమల నివారణకు చెరువులు, కుంటల్లో క్రిమి సంహారకాలను వెదజల్లే డ్రోన్లను ఉత్పత్తి చేసే సంస్థగా పుట్టుకొచ్చింది మారుట్‌ డ్రోన్‌టెక్‌. ఏ ప్రాంతంలో దోమల లార్వా అధికంగా ఉంది.. మలేరియా, డెంగీలాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదాలున్నాయనే విషయాలను ఈ సంస్థ కృత్రిమమేథ ద్వారా విశ్లేషిస్తున్నది. అనేక సామాజిక సమస్యలకు సాంకేతికత ఆధారంగా పరిష్కారం చూపుతున్న ఈ సంస్థ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నివారణ కోసం రసాయనాలను వెదజల్లేందుకూ డ్రోన్లను ఉపయోగిస్తున్నది. సామాజిక సమస్యల పరిష్కారమే లక్ష్యం  

సామాజిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్‌ అండ్‌ ఎనర్జీ కేటగిరీలో ఫోర్బ్స్‌, 30 అండర్‌ 30 ఆసియాలో మేం చోటు దక్కించుకోవడం గర్వకారణం. ఈ స్ఫూర్తితో కరోనా నేపథ్యంలో కాంటాక్ట్‌లెస్‌ డెలివరీ టెక్నాలజీ, క్రిమిసంహారక మందుల స్ప్రేయింగ్‌ టెక్నాలజీలను అభివృద్ధి పరుస్తున్నాం. 

- ప్రేమ్‌ కుమార్‌, మారుట్‌ డ్రోన్స్‌ సీఈవో

ఐఐటీ గువహటీకి చెందిన పూర్వవిద్యార్థులు ఈ సంస్థను స్థాపించారు. ప్రేమ్‌ కుమార్‌ విస్లవత్‌ (29) నేతృత్వంలో సూరజ్‌ పెద్ది (28), సాయికుమార్‌ చింతల (28) ఆలోచనల నుంచి పురుడుపోసుకున్నదే మారుట్‌ డ్రోన్స్‌. చెరువుల్లో దోమల లార్వాలను నిర్మూలించేందుకు డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసి, దేశంలోనే.. తొలి సంస్థగా పేరొందిన మారుట్‌ డ్రోన్స్‌టెక్‌.. అనేక సామాజిక సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో మారుట్‌ రకరకాల డ్రోన్స్‌ను తయారు చేస్తున్నది. 

మారుట్‌ జాప్‌ (Marut ZAP)

ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 72 లక్షల 50 వేల మంది దోమకాటువల్ల మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మారుట్‌ డ్రోన్స్‌టెక్‌ మూడంచెల పద్ధతిలో పనిచేసే డ్రోన్‌ను తయారుచేసింది. దోమల నిర్మూలనకు వినియోగించే ప్రపంచంలోనే తొలి వాణిజ్యపరమైన డ్రోన్‌ ఇది. ఈ డ్రోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఆధారంగా దోమజాతులను, లార్వాల సంఖ్యను గుర్తించగలదు. అలాంటి ప్రాంతాల్లో నాలుగు అడుగుల ఎత్తులో ఎగురుతూ  మందులను పిచికారీ చేయగలదు. ఈ డ్రోన్‌తో రోజుకు 6.7 హెక్టార్లను కవర్‌ చేయొచ్చు. మారూట్‌ సంస్థ ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 4230 హెక్టార్లలో దోమల్ని నివారించింది. 

మారుట్‌ గ్రో (Marut GRO)

గ్లోబల్‌ వార్మింగ్‌లాంటి ప్రస్తుత పరిస్థితుల్లో అడవుల సంరక్షణ కూడా కీలకమైందే. వీటి పునరుద్ధరణ (రీఫారెస్టేషన్‌) కోసం మారుట్‌ ఓ సరికొత్త డ్రోన్‌ను తయారుచేసింది. అడవులను పర్యవేక్షించడానికి, పునరుద్ధరణ ప్రాంతాలను గుర్తించడానికి, అక్కడి నేలలో సారాన్ని అంచనా వేయడానికి డ్రోన్‌కు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ జోడిస్తున్నారు. సీడ్‌ బాల్స్‌ను ఈ డ్రోన్‌ ఆయా ప్రాంతాల్లో చల్లుతుంది. జియోట్యాగ్‌ చేసి తర్వాత డ్రోన్‌ ద్వారా ఆ మొక్కల పెరుగుదలను పర్యవేక్షించవచ్చు కూడా. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు ఇది వెళ్లిరాగలదు.  

మారుట్‌ మెడికో (Marut Medico)

మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి వేగంగా అత్యవసర మందులను పంపిణీ చేయడానికి ఉపయోగపడేలా మారుట్‌ ఈ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. మందుల సరఫరా కోసం డ్రోన్‌ టెక్నాలజీని వాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం, మారుట్‌ డ్రోన్స్‌, అపోలో ఆస్పత్రుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో డ్రోన్లతో వైద్యసేవలు అందించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలువనున్నది.  

మారుట్‌ అగ్రీ (Marut Agri)

వ్యవసాయ పనులను సులభతరం చేయడానికి మారుట్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్‌లను రూపొందిస్తున్నది. ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సైన్స్‌ ఆల్గారిథమ్స్‌ను ఉపయోగించుకుంటున్నది. ఇంటెలిజెంట్‌ అగ్రికల్చర్‌ పేరుతో మారుట్‌ రైతులకు శాస్త్రీయ, లాభదాయక, ప్రమాద రహిత పరిష్కారాలను చూపిస్తున్నది. పంటలో పోషకాల లోపం ఉన్న ప్రాంతాలను గుర్తించడం, తెగుళ్లను నివారించడం, ప్రిస్క్రిప్షన్‌ మ్యాప్‌లను రూపొందించడం.. వంటివి ఈ డ్రోన్స్‌ ద్వారా చేయొచ్చు.  

మారుట్‌ కొవిడ్‌-19 (Marut covid 19)

కరోనా వైరస్‌ నివారణ కోసం మారుట్‌ డ్రోన్స్‌, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నది.  డ్రోన్‌ల ద్వారా క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం, ప్రజలు గుమికూడటాన్ని పర్యవేక్షించడం, మందుల సరఫరా వంటి సేవలు అందిస్తున్నారు.  సంప్రదాయ పద్ధతుల కంటే డ్రోన్ల ద్వారా 50 రెట్లు అధిక విస్తీర్ణంలో, వేగవంతంగా క్రిమిసంహారక మందులు చల్లే వీలుంది.పెట్రోలింగ్‌ కంటే ఎంతో వేగంగా, సమర్థంగా సమాచారాన్ని వ్యాప్తి చేయొచ్చు. 


భూమి లేకుండా బాగైన సాగు  

కంపెనీ:అర్బన్‌ కిసాన్‌ 

వెబ్‌సైట్‌ : urbankisaan.com

ఫోర్బ్స్‌ కేటగిరీ : ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్‌ అండ్‌ ఎనర్జీ ఇన్‌క్యుబేటెడ్‌ @ టీ-హబ్‌

నీటిలో సహజ

సిద్ధంగా ఉండే పోషకాలను ఆధారం చేసుకుని, పంటలను పండించే విధానాన్ని రూపొందించిన సంస్థ అర్బన్‌ కిసాన్‌. ఇది 2017లో విహారి కనుకొల్లు సహ వ్యవస్థాపకుడిగా ప్రారంభమైంది. సంప్రదాయ విధానంతో పోలిస్తే 95 శాతం తక్కువ నీటితో 30 రెట్ల వరకూ పంట దిగుబడిని సాధించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇప్పటికి ఇది పది లక్షల డాలర్ల ఆదాయాన్ని అర్జించింది. ఇటీవలే 5.5 లక్షల డాలర్లను పెట్టుబడిగా సమీకరించుకుంది. 

విహారి కనుకొల్లు (26)కు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం. రసాయనాలు వాడుతూ పెంచుతున్న పండ్లు, కూరగాయలకు ప్రత్యామ్నాయ పంటలను పండించాలని అనుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలో తన పొరుగున ఉండే డాక్టర్‌ శ్రీరామ్‌ ఇంటికి తరచూ వెళ్తుండేవారు. ఆయన తన ఇంట్లో ఉన్న కొద్ది స్థలంలోనే కూరగాయలు పండిస్తుండటం చూశారు. అది విహారిని ఎంతో ఆకట్టుకుంది. డాక్టర్‌ శ్రీరామ్‌తో కలిసి హైడ్రోపానిక్స్‌ గురించి అధ్యయనం చేశారు. 2017లో అర్బన్‌ కిసాన్‌ సంస్థను స్థాపించి సేంద్రియ ఉత్పత్తుల పెంపకానికి ఇండోర్‌ వర్టికల్‌ ఫామ్స్‌ను అభివృద్ధి చేశాడు. ఈ విధానంలో భూమి అవసరం లేకుండా నీటిలోని ఖనిజాలద్వారా మొక్కలను పెంచుతారు. సంప్రదాయ సాగులో వినియోగించే నీటికంటే 95 శాతం తక్కువ నీటిని వినియోగించి 30 రెట్ల అధిక దిగుబడిని సాధించడం దీని ప్రత్యేకత. అర్బన్‌ కిసాన్‌ స్టార్టప్‌ ఇటీవల వై కాంబినేటర్స్‌ వింటర్‌ 2020 బ్యాచ్‌కు ఎంపికైంది. దీనిద్వారా 10 లక్షల డాలర్ల నిధులు సమకూర్చుకున్నది  ఈ సంస్థ.  15 సొంత ఫామ్స్‌

రైతుబజార్‌లు, సూపర్‌ మార్కెట్‌లలో పాడైన కూరగాయలను చెత్తకుప్పల్లో పారేస్తుంటారు. దీనివల్ల రైతు శ్రమ, వ్యయం రెండూ వృథాగా పోతున్నాయి. అర్బన్‌ కిసాన్‌ సంస్థకు స్టోరేజీ ఖర్చు లేదు. రవాణా ఖర్చు లేదు. 1.75 ఎకరాల్లో పండించే పంటను రెండు వేల గజాల్లో పెంచుతున్నారు. మామూలుగా 200 లీటర్ల నీరు అవసరమయ్యే పొలానికి హైడ్రోపోనిక్స్‌ ద్వారా చాలా తక్కువ నీరు అందిస్తే చాలు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అర్బన్‌ కిసాన్‌కు  15 సొంత ఫామ్స్‌ ఉన్నాయి. 3 వేల చదరపు అడుగుల్లో సాగు చేస్తున్నారు. ఇందులో రకరకాల కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ఇలాంటి పంటలను మీరు కూడా పండించాలనే ఆలోచన ఉంటే వీరిని సంప్రదించొచ్చు. అందుకోసం అర్బన్‌ కిసాన్‌ హోమ్‌ కిట్స్‌ను కూడా తయారుచేసి అమ్ముతున్నది. మీ పంటను సంరక్షించడంలో కూడా అర్బన్‌ కిసాన్‌ సహాయం చేస్తుంది.  సేంద్రియ ఉత్పత్తులను పండించడంలో అర్బన్‌ కిసాన్‌ సొంతంగా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నది. 

ఇంటివద్దకే కూరగాయలు

‘నిజానికి ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తున్న కూరగాయలు దాదాపు ఆరు రోజులపాటు సుమారు 200 కి.మీ. ప్రయాణం చేసి మన ఇంటికి వస్తాయి. వీటిపై క్రిమి సంహారకాలు, ఎరువుల తాలూకు రసాయనాలు ఉంటాయి. ఈ సమస్యలేవీ లేని, పోషక విలువలున్న కూరగాయలను వినియోగదారులకు అందించాలన్నదే మా ధ్యేయం’ అంటున్నారు అర్బన్‌ కిసాన్‌ సీఈవో విహారి కనుకొల్లు. అర్బన్‌ కిసాన్‌ ఉత్పత్తులను మీరు స్విగ్గీలో బుక్‌ చేసుకోవచ్చు. లేదంటే, సంస్థ వెబ్‌సైట్‌లో కూడా నేరుగా ఆర్డర్‌ ఇవ్వొచ్చు. మీరు ఆర్డర్‌ ఇచ్చిన తర్వాతే పండ్లు, కూరగాయలు తెంపి మీకు పంపిణీ చేస్తారు. వీరి ఫామ్స్‌ అన్నీ హైదరాబాద్‌ పరిసరాల్లోనే ఉన్నాయి కాబట్టి తాజా కూరగాయలు.. కోసిన కొద్దిసేపట్లోనే మీ ఇంటికి చేరతాయి. అర్బన్‌ కిసాన్‌ ఫామ్స్‌ను మీరు కూడా సందర్శించి స్వయంగా కావాల్సిన కూరగాయలను తెచ్చుకోవచ్చు. 

కల సాకారమైంది..

ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకోవాలన్న నా చిన్ననాటి కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. మరిన్ని లక్ష్యాల సాధనకు ఇది ప్రేరణగా నిలుస్తున్నది. ఆదరణ కోల్పోతున్న వ్యవసాయ రంగాన్ని అప్‌గ్రేడ్‌ చేసేందుకు కృషి చేస్తున్నాం. స్వచ్ఛమైన ఉత్పత్తులు కావాలనుకునే వారితోపాటు రైతులతో అనుసంధానం చేసుకొని దిగుబడిని, ఆదాయాన్ని పెంచుకొనేలా వారికి అవగాహన కల్పిస్తాం. 

- విహారి కనుకొల్లు, అర్బన్‌ కిసాన్‌ వ్యవస్థాపకుడు

అందుబాటు ధరలో మిల్క్‌ షేక్‌లు

కంపెనీ:ద థిక్‌ షేక్‌ ఫ్యాక్టరీ

వెబ్‌సైట్‌ : thethickshakefactory.com

ఫోర్బ్స్‌ కేటగిరీ : ది ఆర్ట్స్‌ ఇన్‌క్యుబేటెడ్‌ @ టీ-హబ్‌

అందుబాటు ధరలో మిల్క్‌ షేక్‌లను అందించాలనే లక్ష్యంతో తన సోదరుడు యశ్వంత్‌తో కలిసి అశ్విన్‌ మోచెర్ల ఏర్పాటు చేసిన సంస్థ ది థిక్‌ షేక్‌ ఫ్యాక్టరీ. ఇండియాలో మొట్టమొదటి ప్రీమియం థిక్‌ షేక్‌ బ్రాండ్‌ అయిన ఈ ఫ్యాక్టరీకి రెండు దేశాల్లోని 29 నగరాల్లో 125 విక్రయ కేంద్రాలున్నాయి. అమెరికా, ఇండియాల్లో 70 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సంస్థ సేవలను వినియోగించుకుంటున్నారు.

ఉద్యోగుల సహకారం మరవలేం

ది ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కేటగిరీ కింద ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా జాబితాలో మా సంస్థ స్థానం సంపాదించడం మా ఉద్యోగుల సహకారంతోనే సాధ్యమైంది. ఈ విజయానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు. మా సోదరుడు, ఉద్యోగుల సహకారం మరవేలేం. గతేడాది రూ. 55 కోట్ల టర్నోవర్‌ సాధించాం. కష్టపడుతున్నామని తెలియకుండా పనిచేసుకోవాలంటే ఇష్టమైన రంగంపై దృష్టి సారించాలన్నది నా అభిప్రాయం. 

- అశ్విన్‌ మోచెర్ల, ది థిక్‌ షేక్‌ ఫ్యాక్టరీ సహ వ్యవస్థాపకుడుస్వీట్‌ సక్సెస్‌ స్టోరీ

అశ్విన్‌ మోచెర్ల (29) గ్జేవియర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (భువనేశ్వర్‌)లో ఎంబీఏ చదివారు. కొంతకాలం టీసీఎస్‌లో ఉద్యోగం చేశారు.  తన చిన్నప్పటి కలను నెరవేర్చుకునేందుకు ఉద్యోగం మానేసి 2013లో థిక్‌ షేక్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. యూరప్‌ పర్యటనకు వెళ్లినప్పుడు చాలామంది చేతిలో షేక్స్‌, ఇతర బేవరేజెస్‌ పట్టుకుని నడుస్తుండటం చూశారు. వీటికి అక్కడ ఎంతగా డిమాండ్‌ ఉందో అర్థమైంది. సో.. మిల్క్‌ షేక్స్‌ వ్యాపారం ఇండియాలో మొదలుపెడితే ఎలా ఉంటుంది? అనే ఐడియా వచ్చింది. కానీ, ఇక్కడ వర్కవుట్‌ అవుతుందా? దిగితే కానీ లోతు తెలియదు. ఆరు నెలలపాటు మార్కెట్‌ను అధ్యయనం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో తొలి ఫ్యాక్టరీని తెరిచారు. ఇది ఒక ప్రత్యేకమైన పాల రిటెయిలర్‌ సంస్థ. స్థాపించిన నాటి నుంచి ఫ్రాంచైజీల ద్వారా అవుట్‌లెట్లను విస్తరించుకుంటూ వెళ్తున్నారు. హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, కోయంబత్తూరు వంటి నగరాలతోపాటు అమెరికాలోనూ  ఫ్యాక్టరీ అవుట్‌లెట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ మెట్రోరైలు అన్ని స్టేషన్లలోనూ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. థిక్‌ షేక్‌లు, మిల్క్‌ షేక్‌లు, బబుల్‌ టీ, కోల్డ్‌ కాఫీలతోపాటు చాక్లెట్స్‌, ఐస్‌క్రీమ్స్‌లాంటి 30 ప్రత్యేకమైన ఉత్పత్తులను ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి తెచ్చింది.  ఉత్పత్తులను అవుట్‌లెట్ల ద్వారానే కాకుండా స్విగ్గీ, జొమాటో, ఫుడ్‌పాండాలాంటి డెలివరీ యాప్స్‌ ద్వారా, వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా వినియోగదారులకు సరఫరా చేస్తున్నది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ సొంత రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ టీమ్‌ను కలిగి ఉన్నది. అన్ని అవుట్‌లెట్లలో ఒకే రకమైన రుచి, నాణ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ హైదరాబాద్‌ నుంచే ఉత్పత్తులను అవుట్‌లెట్లకు పంపిణీ చేస్తున్నది. ఇండియన్‌ హాస్పిటాలిటీ అవార్డ్‌లో ‘బెస్ట్‌ మిల్క్‌షేక్‌' అవార్డును, తెలంగాణ టూరిజం అవార్డును, పెప్సికో నుంచి ఇమేజెస్‌ ఫుడ్‌ సర్వీస్‌నుంచి మోస్ట్‌ అడ్మయిరబుల్‌  చైన్‌ ఆఫ్‌ ద ఇయర్‌, కేఫ్స్‌ అండ్‌ జ్యూస్‌ బార్స్‌ అవార్డును, క్యూఎస్‌ఆర్‌ (క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌) అవార్డును కూడా  సంస్థ గెల్చుకొంది.  

ఆకాశవీధిలో ‘స్కైరూట్‌'

కంపెనీ:స్కైరూట్‌ ఏరోస్పేస్‌ 

వెబ్‌సైట్‌ : skyroot.in

ఫోర్బ్స్‌ కేటగిరీ : హెల్త్‌కేర్‌ అండ్‌ సైన్స్‌ ఇన్‌క్యుబేటెడ్‌ @ టీ-హబ్‌

రాకెట్లను తయారు చేసే మొదటి ప్రైవేటు సంస్థగా దేశంలో గుర్తింపు పొందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్‌ కుమార్‌ చందన. ఈ సంస్థ 2021లో తన తొలి రాకెట్‌ను ప్రయోగించి, అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. పవన్‌ కుమార్‌ ఇస్రోలో సిస్టమ్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. ఇస్రో మాజీ ఉద్యోగులతో కలిసి ఏర్పాటుచేసిన ఈ సంస్థ ఇప్పటికే 60 లక్షల డాలర్ల నిధులను సమీకరించింది. మరిన్ని నిధులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి పవన్‌ 2012లో విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (విఎస్‌ఎస్‌సి)లో శాస్త్రవేత్తగా పనిచేశారు. ఐదేళ్లపాటు జిఎస్‌ఎల్‌వి-ఎంకె-3 ప్రాజెక్టులో చురుగ్గా పాల్గొన్నారు. ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి భరత్‌ కూడా 2012లో విఎస్‌ఎస్‌సిలో ఫ్లైట్‌ కంప్యూటర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. వీరిద్దరూ కలిసి స్కైరూట్‌ ఏరోస్పేస్‌ను అంకుర సంస్థగా ప్రారంభించారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ విక్రమ్‌ సారాభాయ్‌ పేరు మీద విక్రమ్‌ 1, 2, 3 అనే మూడు రకాల రాకెట్లను తయారు చేసింది. ఇవి 200-700 కిలోల పేలోడ్లను మోసుకెళ్లగలవు.  భవిష్యత్‌లో మంచి ప్రోత్సాహం

పారిశ్రామికవేత్తగా నా ప్రయాణంలో చాలా త్వరగానే ఫోర్బ్స్‌ జాబితాలో చోటు లభించడం ఆనందదాయకం. ఈ గుర్తింపు మరింత కృషి చేసేందుకు కావాల్సిన స్ఫూర్తినిస్తుంది. వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్లను అభివృద్ధి చేస్తున్నాం. రానున్న 18 నెలల్లోగా మా సబ్‌సిస్టమ్‌లను పరీక్షించి 2021 చివరి నాటికి రాకెట్లను ప్రయోగిస్తాం. ఇందులో 50 శాతం పని తెలంగాణలో, మిగిలిన పని మహారాష్ట్రలో చేస్తున్నాం. 

- పవన్‌ కుమార్‌ చందన, స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సీఈవో

ఎన్‌జీవోల కోసం ‘చెజూబా’ 

కంపెనీ:చెజూబా

వెబ్‌సైట్‌ : chezuba.net

ఫోర్బ్స్‌ కేటగిరీ : సైన్స్‌, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ 

ఎన్‌జీవోల అవసరాలను తీర్చే సంస్థ చెజూబా. దీని సహ వ్యవస్థాపకుడు సుఖేందర్‌ రెడ్డి రాంపల్లి. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా 3,000 ఎన్‌జీవోలకు ఇది సేవలందిస్తున్నది. దాదాపు 103 దేశాల నుంచి 70 వేలకు పైగా వలంటీర్లు ఈ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నారు. ఎన్‌జీవోలు ఆన్‌లైన్‌లో తమ సమస్యలను పేర్కొంటే.. వాటికి ఈ సంస్థ పరిష్కారాలను చూపిస్తుంది. సైన్స్‌, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కేటగిరీలలో ఈ సంస్థ ఫోర్బ్స్‌ 30 అండ్‌ 30లో స్థానం సంపాదించింది. 


తాజావార్తలు