బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Apr 19, 2020 , 01:28:53

కల్చర్‌ ఆఫ్‌ అగ్రి!

కల్చర్‌ ఆఫ్‌ అగ్రి!

వ్యవసాయం.. మోటు పని కాదు. గ్రేటు పని! రైతు.. ఒక క్వాలిఫికేషన్‌ కాదు. ఉత్పాదనకు డెఫినిషన్‌! అసలు,  రైతు రాజా? పేదా? అన్న ప్రశ్నకు  జవాబు తెలియాలంటే  ఒంటెద్దు ప్రవీణ్‌రెడ్డి లాంటి యువ రైతు లైఫ్‌ జర్నీ ని తెలుసుకోవాలి. అతనితో మాట్లాడాలి.

మాది నల్గొండ పక్కన ముషంపల్లి. వ్యవసాయ కుటుంబం. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివిన. డిగ్రీ తర్వాత ఏం చేయాలా అని అనుకుంటున్న సందర్భంలో రెండు ఆప్షన్లు కనిపించినయి. ఒకటి హైదరాబాద్‌కు వెళ్లడం. రెండు ఊళ్లోనే తల్లిదండ్రులకు ఆసరాగా నిలవడం. మొదటి అప్షనే ఎంచుకున్నా. హైదరాబాద్‌ షిఫ్టయిన. లిఫ్ట్‌ తయారీ కంపెనీలో కొన్నాళ్లు ఉద్యోగం చేసిన. అన్ని మెలకువలూ తెలిసినయి. మనిషి బుద్ధి ఒకచోటే ఉండదు కదా? ‘పని నేర్చుకున్న. పరిచయాలు పెరిగినయి. మార్కెటింగ్‌ తెలుసు. ఇంకా వేరేవాళ్ల దగ్గర పనేం చేస్తాం? మనకంటూ ఓ ప్లాట్‌ఫారమ్‌ ఉండాలె కదా?’ అనిపించింది. వ్యాపారం ప్రారంభించిన. విదేశాల నుంచి మెటీరియల్‌ వచ్చేది. లక్షల రూపాయల లావాదేవీలు. బయట తీసుకొచ్చినవాయె. కస్టమర్ల నుంచి డబ్బులు పెండింగ్‌. చాలామంది ఎగ్గొట్టిండ్రు. వ్యాపారంలో బాగా నష్టపోయిన. ఇంకో ఎక్స్‌పరిమెంట్‌ చేస్తే మొదటికే మోసం వస్తుందనుకున్నా. ఊరికెళ్లాల్నా? ఇక్కడే ఉండాల్నా? అనే ప్రశ్న మల్లా వచ్చింది. ఎవరేం అనుకుంటే మనకేంది? నేనైతే ఒకడ్ని మోసం చేయలే. నీతిగా వ్యాపారం చేద్దామనుకున్నా. కొందర్ని నమ్మి మోసపోయిన. ఊరికిపోతేనే కొంచెం పానం నిమ్మళముంటదని అనిపించి ముషంపల్లి వచ్చేసిన. 

వ్యవసాయమే నా ఆప్షన్‌. సేద్యం కొత్త కాదు. చిన్నప్పటి నుంచి చూసిందేనాయె. కాకపోతే పక్కా ప్లాన్‌తో చేయాల్సిందే. అన్ని మెలకువలు తెలుసుకున్నా. వ్యవసాయంలోనే స్థిరపడాలె అనుకున్నా. అదే పాత పద్ధతి.. అదే మూస ధోరణి కాదు. ‘డిగ్రీ వరకు చదువుకున్నా. ఏదైనా కొత్తరకంగా చేయాలె. మంచి దిగుబడులు సాధించాలె’ అని నిర్ణయించుకున్నా. ఒక ఆలోచన వచ్చింది. మన పంటను మనమే మార్కెటింగ్‌ చేస్తే ఎలా ఉంటుంది? అనేదే ఆ ఆలోచన. ఒకవేళ ఇది గనుక సక్సెస్‌ అయితే మనతో పాటు ఓ నలుగురికి మంచి చేసినోళ్లం అవుతాం. తొలిసారిగా దొండ పందిరి వేసిన. టమాటో.. మిరప.. వంకాయ.. బీర వంటి కూరగాయలు పండించడం మొదలుపెట్టిన. వాస్తవానికి నాకు ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేయడం తెల్వదు. రసాయన మందులేసే వ్యవసాయం చేసేవాడిని. పైసలెక్కువ ఖర్చయ్యేవి. నేనే రోజూ నల్గొండ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేవాడిని. అంతా దళారులదే నడిచేది. బాధనిపించేది. ఒక్కొక్కసారి ఆటో కిరాయిలు కూడా మిగలకపోయేవి. 

ఒకింత నిరుత్సాహం. కానీ అప్పటికే నేర్చిన జీవిత పాఠం నా నిరుత్సాహాన్ని కట్టడిచేసేది. మామిడి తోట పెట్టాను. ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు. అంతా ఆర్గానిక్‌. పిల్లల్ని పెంచినట్లు పెంచి ఆఖరికి దళారుల జేబు నింపాలా? అనిపించింది. సాంకేతికతను ప్రయోగించిన. తాజా మామిడి కాయలు.. పండ్ల ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేయడంతో నల్గొండకు చెందినవాళ్లు ఆర్డర్‌ ఇచ్చారు. కొందరికి డోర్‌ డెలివరీ చేసేవాడిని. కొంచెం ఊరట. వరి మీదా ప్రయోగం చేసిన. సహజ ఎరువుల ద్వారా సాగు చేసిన. తర్వాత నాకు పెండ్లయింది. మా ఆవిడ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మకాం హైదరాబాద్‌కు మార్చాల్సి వచ్చింది. రైతుపట్ల అందరూ జాలి చూపిస్తరు. కానీ ఏ ఒక్కరూ రైతుగా మారాలి అనుకోరు. అసలు రైతుకు పిల్లనిచ్చి పెండ్లి చేయాలంటెనే జంకుతరు. కానీ నాకు ఆ సమస్య రాలేదు. నా భార్య నన్ను అర్థం చేసుకుంది. ‘వ్యవసాయమేం మోటు పని కాదు. ఈ రోజుల్లో అగ్రికల్చర్‌కి కావాల్సింది నీ లాంటి చదువుకున్నోళ్లు.. టెక్నాలజీ తెల్సినోళ్లు.. మార్కెటింగ్‌ పట్ల అవగాహన ఉన్నోళ్లే’ అని ఎంకరేజ్‌ చేసింది. ఇప్పుడు నేను.. వారంలో మూడ్రోజులు హైదరాబాద్‌లో ఉంటా. నాలుగు రోజులు ఊర్లో ఉంటూ వ్యవసాయం చేస్తున్నా. మామిడి.. సపోటా.. అల్లనేరేడు.. బత్తాయి.. నిమ్మ.. వరి.. కంది.. కూరగాయలు అన్నీ 15 ఎకరాల్లో సాగు చేస్తున్నా. వీటిని సీజనల్‌గా ఫేస్‌బుక్‌.. వాట్సప్‌లో పెట్టి మార్కెటింగ్‌ చేస్తున్నా. ఇప్పుడు హ్యాపీగా ఉంది. దేన్నయితే ఇష్టంగా చేస్తున్నానో.. దాంట్లో విజయం సాధించినా. అందుకే, సంతృప్తిగా కూడా ఉండగలుగుతున్నా. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలె? ఇదే ఊపుతో ఇంకింత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేద్దామని ఉన్నా.. వ్యవసాయంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఇంతటితో సరిపెట్టుకున్నా. నా కోరిక ఒకటే.. యువ రైతులతో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసి, డైరెక్ట్‌గా వినియోగదారులకే చేరేలా మార్కెటింగ్‌ చేయాలి. 

వారంలో మూడు రోజులు హైదరాబాద్‌లో ఉంటున్నా అని చెప్పిన కదా.. ఆ మూడు రోజులూ సిటీవాళ్లకు మిద్దెతోటలో మెలకువలు నేర్పిస్తున్నా. నా నాలుగేండ్ల వ్యవసాయ ప్రస్థానంలో మొదటి సంవత్సరం రూపాయి బిళ్ల కూడా మిగల్లేదు. ఇంట్లోవాళ్లు సిటీ వెళ్లి ఏదన్నా ఉద్యోగం చేసుకో అన్నారు. కానీ.. నేను వెళ్లలేదు. తాడో పేడో ఇక్కడే తేల్చుకోవాలె అనుకున్నా. ఇవాళ సక్సెస్‌ఫుల్‌ ఫార్మర్‌ అనిపించుకుంటున్నా. మనలో చాలామంది.. భూమి అంటే ఇష్టపడతారు. ఎకరాల కొద్ది కొంటారు. వ్యవసాయం చేసేందుకు కాదు. తిరిగి అమ్ముకునేందుకు. పైకి రైతు అంటే సానుభూతి. కానీ ఒకసారి ప్రవీణ్‌ను చూడండి.. తన గ్రాడ్యుయేషన్‌ని.. టెక్నాలజీని అగ్రికల్చర్‌కు అప్లయ్‌ చేసి ఎలా విజయం సాధించాడో. యువ రైతులతో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసి, డైరెక్ట్‌గా వినియోగదారులకే చేరేలా మార్కెటింగ్‌ చేయాలి. వారంలో మూడు రోజులు హైదరాబాద్‌లో ఉంటున్నా అని చెప్పిన కదా.. ఆ మూడు రోజులూ సిటీవాళ్లకు మిద్దెతోటలో మెలకువలు నేర్పిస్తున్నా.  

-దాయి శ్రీశైలం


logo