శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sunday - Apr 19, 2020 , 01:28:29

చాణక్య... నాయకత్వం!

చాణక్య... నాయకత్వం!

కౌటిల్యుని అర్థశాస్త్రం మౌర్య సామ్రాజ్యానికి దిశానిర్దేశనం చేసింది. చంద్రగుప్త మౌర్యుడిని తిరుగులేని నేతగా తీర్చిదిద్దింది. అవే సూత్రాలు.. ఒక కార్పొరేట్‌ సంస్థ తనను తాను బిలియన్‌ డాలర్‌ కంపెనీగా  తీర్చిదిద్దుకోవడంలో, ఒక వ్యక్తి తన జీవితాన్ని తాను సమర్థంగా మలుచుకోవడంలో.. వికాస పాఠాలుగా ఉపయోగపడతాయి.‘చాణక్యాస్‌ 7 సీక్రెట్స్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌'లో రచయిత రాధాకృష్ణ పిైళ్లె చెబుతున్నదీ అదే.

  • స్వామి, అమాత్య, జనపద, దుర్గ, కోశ, దండ, మిత్ర.. ఇతి ప్రక్రియః రాజ్యం అంటే రాజు, మంత్రి మండలి, ప్రజలు, రాజధాని, కోశాగారం, సైన్యం, శ్రేయోభిలాషుల సమూహం.కంపెనీ విషయంలో యజమాని, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు, ఉద్యోగులు, కార్పొరేట్‌ ఆఫీస్‌, చక్కని బ్యాలెన్స్‌ షీట్‌, సంస్థ బైలాస్‌... ఇలా ఆ సూత్రాల్ని అన్వయించుకోవచ్చు.
  • సంపద -  నాయకుడి దూరదృష్టి ఫలితం. ఆ సంపదే మరింత సంపదను సృష్టించేలా చేయగల మంత్రదండం నాయకుడి చేతిలో ఉంటుంది. దాన్నే ‘విజన్‌' అంటారు. ఆర్థిక పరిజ్ఞానం ఉన్న సీయీవో ఒకే కస్టమర్‌ మీద, ఒకే ఆదాయవనరు మీద ఎప్పుడూ ఆధారపడడు. బంగారం నుంచి చెత్తవరకూ అన్నింటిలోనూ వ్యాపార అవకాశాన్ని చూస్తాడు.
  • మన తాతముత్తాతలు వేసిన పునాదుల మీద మనం ఇల్లు కట్టుకున్నాం. మనం చేసే పునాదుల మీద రేపటితరం ధైర్యంగా బతకాలి. రాజ్యానికైనా, సంస్థకైనా మౌలిక వనరులు చాలా ముఖ్యం. రహదారులు, నీటి పారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యాసంస్థలు- రాజ్యానికి సంబంధించినంత వరకూ తిరుగులేని మౌలిక వనరులు.
  • వారసత్వమో, అదృష్టమో, కుతంత్రమో.. కారణం ఏమైతేనేం అయాచితంగా మనం పీఠానికి దగ్గర అవుతాం. కానీ అధికార పీఠం - సమదర్శి. మనలో ఏ కొంచెం తేడా కనిపించినా.. కిందికి తోసేస్తుంది. సమర్థుడిని తానే వెదికి పట్టుకుంటుంది.అది సీయీవో సీటు కావచ్చు, ఏ రాజకీయ పదవో కావచ్చు.
  • నాయకత్వానికి సంబంధించినంత వరకు నువ్వు అంటే నీ బృందమే. ఆ టీమ్‌ను ఎంపిక చేసుకోవడంలోనే నీ నైపుణ్యం బయటపడుతుంది. నీ సమర్థత అయినా అసమర్థత అయినా ప్రపంచానికి తెలిసేది వాళ్ల ద్వారానే. నీ టీమ్‌ నిన్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లగలదు, పాతాళానికి తొక్కేయగలదూ! గొప్ప నాయకుడు విజయాన్ని బృందంతో పంచుకుంటాడు. వైఫల్యాన్ని ఒక్కడే ముళ్ల కిరీటంలా మోస్తాడు.
  • నిన్ను నమ్ముకున్నవాడు- రాజ్యంలో అయితే పౌరుడు, కార్పొరేట్‌ స్వామ్యంలో అయితే ఉద్యోగి- ఎంత ఆనందంగా ఉన్నాడన్నదే నీ విజయానికి కొలమానం. వాళ్లకు కావల్సిందల్లా శాంతి, సంపద, భరోసా! అంతే!పాలకుడి మనసు పువ్వులా మృదువుగా ఉండాలి. వజ్రంలా కఠినంగానూ ఉండాలి. సంక్షోభ సమయాలు కచ్చితంగా వ్యవహరించడంలో తప్పులేదు. ఎంత ప్రేమ ఉన్నా, అనారోగ్యంతో పత్యం మీద ఉన్న బిడ్డకి.. తినకూడని పదార్థాలు వడ్డించదు కదా ఏ తల్లీ!


logo