శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Apr 19, 2020 , 01:28:14

ఇంకా వుంది

ఇంకా వుంది

అమందాతో తను ఆమెని పెళ్ళి చేసుకోలేనని జేసన్‌ చెప్తే నేను దుఃఖం పట్టలేక విలపించాను. పగటి పూట వచ్చే టి.వి. సీరియల్‌ ‘టు లివ్‌ అండ్‌ టు లవ్‌'లో బాగా కదిలించే దృశ్యం అది. జేసన్‌ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి డగ్గుత్తికగా వివరించాడు. ‘అమందా! చాలా సంవత్సరాల క్రితం నేనో కూతురికి తండ్రిని అయ్యాను. నా తల్లిదండ్రులు మా పెళ్ళికి అంగీకరించలేదు. దాంతో నా కూతుర్ని దత్తతకి ఇచ్చేయాల్సి వచ్చింది. తన కన్నా నేను నా కూతుర్ని అధికంగా ప్రేమిస్తున్నానని భావించి నా ప్రేయసి నన్ను వదిలేసింది. మన పెళ్ళయ్యే లోగా నా కూతుర్ని వెదికి కనుక్కోవాలన్నది నా లక్ష్యం”...అమందా జేసన్‌ ప్రతిపాదనని సానుభూతిగా అర్ధం చేసుకుని అంగీకరించింది. ఆమె జేసన్‌ కోసం వేచి ఉంటుందని నాకు తెలుసు. అది ఆమె క్యారెక్టర్‌.నేను టి.విని ఆఫ్‌ చేసాక సోఫాలో కూర్చుని చాలాసేపు ఆలోచిస్తుండి పోయాను. నా మూడో నెల్లో దత్తతకి వచ్చిన నేను నా అసలు తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ ఉంటారు అని ఆలోచించాను. టు లివ్‌ అండ్‌ టు లవ్‌ చూసాక నా జీవితంలోని ఆ రహస్యం పూర్తిగా ఛేదించబడింది.

జేసన్‌ నా తండ్రి. నా పెంపుడు తల్లిదండ్రులని నా అసలు తల్లిదండ్రుల గురించి ప్రశ్నించినప్పుడల్లా వాళ్ళు బాధ పడేవాళ్ళు. నేను వాళ్ళని ప్రేమించడం లేదు అనుకునే వారు. నాకు వాళ్ళంటే ప్రేమే. కాని ఇది ఆసక్తి. నేను మా ఇంటి వెనక చిన్న కొండ మీద కూర్చున్నప్పుడు నా మనసులోని భావాలని గాలితెరలకి చెప్పేదాన్ని. జేసన్‌తో నేను వస్తున్నానని, అమందాతో ఆయన చెప్పిన మాటలు నా గురించేనని, నేనాయన కూతుర్ని అని చెప్పమని, గాలితెరలతో విన్నవించుకున్నాను.న్యూ జెర్సీలో నేను పంతొమ్మిదేళ్ళ క్రితం పుట్టానని, ఓ మతసంస్థ మూడు నెలల తర్వాత నన్ను దత్తతకి ఇచ్చిందని జేసన్‌ అమందాకి చెప్పాడు. అంటే జేసనే నా తండ్రై ఉండాలి. ఆయన తన కూతురు గురించి చెప్పిన వివరాలన్నీ నాకు సరిగ్గా సరిపోవడమే కాక ఆయన కూడా సరిగ్గా నాలానే ఉంటాడు. నాలా పొడగరి. సన్నగా ఉంటాడు. మా ఇద్దరివీ ముదురు తేనె రంగు కళ్ళు. అదే రంగు జుట్టు.నేను వెంటనే న్యూయార్క్‌కి వెళ్ళాలని అనుకున్నాను. ఆయన తన కూతురు గురించి అన్వేషణ మొదలుపెట్టే లోగా ఆయన్ని నేను కలవాలని నిర్ణయించాను. కలిసాక ఇద్దరం కలిసి మా అమ్మ కోసం వెదకచ్చు అనుకున్నాను. ఆవిడని కనుక్కోవడం తేలిక. జేసన్‌ పర్స్‌లో ఆమె ఫొటో ఉంది. ఆయన దాన్ని అమందాకి చూపించాడు కూడా.నన్ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఆఫీస్‌లో ఉన్నారు. నేను ఏ పని మీద వెళ్తున్నానో వాళ్ళకో ఉత్తరం రాసిపెట్టి వెళ్ళాలని అనుకున్నాను. కాని అంతలోనే వాళ్ళకి నేను నాకు జన్మనిచ్చిన తండ్రిని కలుసుకోబోతున్నానని తెలిస్తే, పోలీసులకి ఫిర్యాదు చేసి నన్ను వెనక్కి రప్పించవచ్చని అనిపించడంతో అది విరమించుకున్నాను. నేను పగటి సీరియల్స్‌లో మునిగిపోతున్నానని వాళ్ళు చాలాసార్లు హెచ్చరించారు. ది డానింగ్‌ ఆఫ్‌ ది డే సీరియల్లోని మెలిస్సా ఆలివర్‌కి బిడ్డ పుట్టాక నేను పాతిక డాలర్ల పూలబుట్టని పంపితే వాళ్ళు నొచ్చుకున్నారు. నేను ఎందుకు పంపానో వాళ్ళకి తెలీదు. నా తండ్రిలా కాక మెలిస్సా ఎన్ని సమస్యలున్నా తన కూతురుని దత్తతకి ఇవ్వకుండా తన దగ్గరే ఉంచేసుకుంది.ఎయిర్‌ బ్యాగ్‌ని సర్దుకున్నాక అకస్మాత్తుగా నాకు భయం వేసింది. జేసన్‌ ఓ ఎపిసోడ్లో న్యూయార్క్‌లో చాలామంది మగ్గర్స్‌ ఉన్నారని చెప్పడం గుర్తు వచ్చింది. నేను మా నాన్న బట్టల సొరుగుని తీసి, అడుగున ఉన్న ఆయన రివాల్వర్‌ని తీసి నా సంచీలో ఉంచుకున్నాను. అది నన్ను కాపాడుతుంది. నన్ను దత్తత తీసుకున్న తల్లితండ్రుల ఫొటోని కూడా తీసుకున్నాను.

“గుడ్‌ బై ఇల్లు. గుడ్‌ బై గాలి.” చెప్పి నేను నా ఇంటి తలుపుని మూసాను.నాకు కొద్దిగా దిగులైంది. ఐతే జేసన్‌ నా పెంపుడు తల్లితండ్రుల దగ్గరకి పంపుతాడని నాకు తెలుసు. కాబట్టి ఆ దిగులుని దులిపేసుకున్నాను. వాళ్ళు నా పట్ల మంచిగా ఉండటంతో మళ్ళీ వచ్చి వాళ్ళని చూడాలని అనుకున్నాను.బ్యాంక్‌లో నా పని సజావుగా సాగింది. నా బ్యాంక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఎకౌంట్లోని మూడు వందల డాలర్లని విత్‌డ్రా చేసుకున్నాను. టెల్లర్‌ అడిగితే, న్యూయార్క్‌ వెళ్తున్నానని చెప్పాను. తర్వాత ట్యాక్సీలో బస్‌ స్టాండ్‌కి చేరుకున్నాను.డబ్బుని ఆదా చేయడానికి హోటల్లో కాక వైడబ్ల్యుసీఏలో దిగాను. తర్వాత ప్రైవెట్‌ డిటెక్టివ్‌ ఏజన్సీల దగ్గరకి వెళ్ళాలనుకున్నాను. జేసన్‌ తన కూతుర్ని వెదకడానికి వాళ్ళనే ఆశ్రయిస్తానని అమందాకి చెప్పాడు.జేసన్‌ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజన్సీ ఆఫీస్‌లో నన్ను చూసి ఆనందంగా కౌగిలించుకుంటాడనే ఊహ కలిగింది. ఆయన ఆనందంగా తన కూతుర్ని కలుసుకునే దృశ్యాన్ని చాలాసార్లు ఊహించుకున్నాను. ఊహల్లోనే అది నాకు ఎంతో అద్భుతంగా ఉంది. న్యూయార్క్‌లోని మొదటి రెండు వారాల్లో నాకు రెండు విషయాలు తెలిసాయి. మూడు వందల డాలర్లు నేను అనుకున్నన్ని వారాలు రావు. న్యూయార్క్‌లో చాలా చాలా డిటెక్టివ్‌ ఏజన్సీలు ఉన్నాయి అని టెలీఫోన్‌ డైరెక్టరీ చూస్తే తెలిసింది.‘జేసన్‌ అనే అతను తన కూతురి కోసం వెదకమని కోరింది మిమ్మల్నేనా?’ అని నేను అడిగితే అంతా ‘తమ క్లయింట్స్‌ పేర్లు బయటి వారికి చెప్పమని’ నిరాకరించారు. ఓ చోట ఓ రిసెప్షనిస్ట్‌ మాత్రం చెప్పింది.“జేసన్‌ కార్టర్స్‌ అన్నారా? ఆ పేరు ఎక్కడో విన్నట్లుంది. టు లివ్‌ అండ్‌ టు లవ్‌లో ఒకరి పేరు కదా? నా లంచ్‌ అవర్లో నేను దాన్ని చూస్తుంటాను.”ఓ రోజు ఆమె నన్ను జేసన్‌తో ఆ షోలో లంచ్‌ అవర్లో చూసి నివ్వెరపోవడం ఖాయం అనుకున్నాను.డిటెక్టివ్‌ ఏజన్సీలు మొత్తం తిరిగాక ఆ మార్గం మూసుకుపోయిందని గ్రహించాను. రెండో మార్గం గురించి ఆలోచించాను. ఓ పత్రిక ఇంటర్వ్యూ కోసం సార్డీ అనే రెస్టారెంట్లో జేసన్‌ని ఫొటో తీసారు. వరసగా మూడు రోజులు నేను ఆ సార్డీకి లంచ్‌కి వెళ్ళాను. ఆయన మళ్ళీ ఇంకోసారి వస్తాడని ఆశపడ్డాను. నాలుగో రోజు నా ఆశ ఫలించింది.జేసన్‌ మరో వ్యక్తితో రాగానే ఆయన్ని ప్రత్యక్షంగా చూడటంతో నాలో ఊపిరి స్తంభించిందనే చెప్పాలి. నేను కూర్చున్న బల్లకి అతి సమీపంలో వాళ్ళిద్దరూ కూర్చున్నారు. నాలోని ఎకె్సైట్‌మెంట్‌ వల్ల సరిగ్గా తినలేకపోయాను. ఆయన టి.విలో కనిపించిన దాని కన్నా ముసలివాడుగా, కనిపించాడు. నన్ను వెదికే ఒత్తిడి ఆయన మొహంలో నాకు స్పష్టంగా కనిపించింది.లంచ్‌ పూర్తయి బయటకి వెళ్ళే జేసన్ని రహస్యంగా అనుసరించాను. జేసన్‌ అతనికి గుడ్‌ బై చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ నాకు కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నారు. ఆయన దగ్గరకి వెళ్ళి ట్యాక్సీ కోసం చేతిని ఎత్తుతుంటే ఆ చేతిని పట్టుకుని ఆపాను. ఆయన తల తిప్పి నా వంక కోపంగా చూసాడు. నేను నవ్వాను. నేను ఇంతకాలం ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. నన్ను చూసాక మొదట ఆయనకి కలిగిన స్పందన గురించి చెప్పుకుని నవ్వుకుంటాం అనుకున్నాను. అమందా ప్రేమలో పడ్డ ఆ తేనెరంగు కళ్ళతో ఆయన నా వంక చూసాడు.

“నీ వల్ల ఆ ట్యాక్సీని పిలువలేకపోయాను” కోపంగా చెప్పాడు.“మీరు ట్యాక్సీని కోల్పోయారు కాని, కూతుర్ని పొందారు. మీరు వెదికే కూతుర్ని” చెప్పాను.“అవును. నా ఫేన్‌ని. వాళ్ళు నాకు అన్ని చోట్లా కనిపిస్తుంటారు” చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.ఆయన కంఠం అచ్చం టి.విలో లానే ఉంది. తన కోట్లోంచి చిన్న కాగితాన్ని తీసి దానిమీద ఏదో రాసి సంతకం చేసి నాకు ఇచ్చాడు. చదివాను. ‘బెస్ట్‌ విషెస్‌. ఎవరీ విల్సన్‌'ఆయన మళ్ళీ ట్యాక్సీ కోసం చూడసాగాడు. నేనా అపరిచిత పేరు గల ఆటోగ్రాఫ్‌ని నా జేబులో ఉంచుకున్నాను. మగ్గర్స్‌ నించి నన్ను నేను రక్షించుకోవడానికి వెంట తెచ్చుకున్న పిస్తోలుని బయటకి తీసాను. జేసన్‌ ఆగిన ట్యాక్సీ వెనక తలుపు లోంచి ఎక్కుతున్నాడు. ఎంతమాత్రం ఇష్టం లేకపోయినా పిస్తోలు గొట్టాన్ని ఆయన వీపుకి ఆనించాను. ఆయన నాకు దూరం కాకూడదంటే ఇంకో మార్గం తోచలేదు.ఆయన అదిరిపడి వెనక్కి తిరిగి చూసాడు. పిస్తోలుని చూసాక ఆయన కళ్ళల్లో కోపం బదులు భయం కనిపించింది. నేను ఆయన పక్కన కూర్చుంటే అభ్యంతరం చెప్పలేదు. “ఎక్కడికి?” డ్రైవర్‌ అడిగాడు. “సెంట్రల్‌ పార్క్‌.” చెప్పాను.జేసన్ని చూస్తే నాకు జాలి వేసింది. ఆయన వణికే తన చేతుల్ని రెంటినీ కలిపి ఒళ్ళో బలంగా పట్టుకున్నాడు. కాని ట్యాక్సీలో ఉండగా ఆయనకి నేనేమౌతానో చెప్పడం ఇష్టం లేక ఆగాను. మా సెంటిమెంటల్‌ కలయిక మధ్యలో మూడో వ్యక్తి ఉండకూడదు. నేను చాలాకాలంగా ఊహించిన ఆ దృశ్యంలో డ్రైవర్‌ ఉండకూడదు.మా ట్యాక్సీ మధ్యలో ఓ సారి రెడ్‌ లైట్‌ దగ్గర ఆగినప్పుడు జేసన్‌ చెయ్యి తలుపు హేండిల్‌ మీదకి వెళ్ళింది. నేను పిస్తోలు గొట్టాన్ని గట్టిగా గుచ్చగానే ఆయన చేతులు మళ్ళీ ఒకదాన్ని మరొకటి కలుసుకున్నాయి. ట్యాక్సీ పార్క్‌కి చేరాక నేను డబ్బిచ్చే లోగా ఆయన డ్రైవర్‌కి పది డాలర్లు ఇచ్చాడు.ఆయన ముందు, వెనకే నేను ట్యాక్సీ దిగాం. ఐతే ఆ దృశ్యం నేను ఊహించుకున్నట్లుగా లేనందుకు నాకు బాధగా ఉంది. ఇద్దరం పార్క్‌లోకి నడిచాం. పార్క్‌లోని గాలి ఈ చక్కటి దృశ్యానికి మంచి లొకేషన్‌ అని నా చెవిలో చెప్పింది. 

ఆ గాలి నన్ను ఎగతాళి చేస్తున్నది. ఆయన్ని ఓ బెంచీమీద కూర్చోమన్నట్లుగా సైగ చేసాను. ఆయనకి కొద్ది దూరంలో నిలబడి నేనెవరో చెప్తే లేచి ఒక్క ఉదుటన నా దగ్గరకి చేతులు చాపి వస్తాడు.“ఇలా చేసినందుకు సారీ. కాని ఇక్కడికి మిమ్మల్ని తీసుకురావడానికి పిస్తోలుని ఉపయోగించక తప్పలేదు. లేదా మీరు నన్ను వదిలి ట్యాక్సీలో వెళ్ళిపోతారు. జేసన్‌. నేను మీ అభిమానిని మాత్రమే కాదు. మీ కూతుర్ని కూడా. మీరు అమందాకి చెప్పిన, మీరు వెదికే కూతుర్ని” నెమ్మదిగా చెప్పాను.జేసన్‌ చూపులో విభ్రాంతి తప్ప నేను ఎదురు చూసిన ఆప్యాయత, ఆనందాలు కనిపించలేదు.“మాట్లాడరే?” అడిగాను.“ఆ పిస్తోలుని ఆ చెట్టు పక్కన ఉంచితే మాట్లాడుతాను.” ఆయన గొంతు సర్దుకుని చెప్పాడు.నేను దాన్ని చెట్టు కిందికి విసిరేసాక ఆయన పక్కన కూర్చున్నాను. ఆయన నా వంక అమందా వంక చూసినట్లుగా చూసాడు. “నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను మీ నాన్నని కాను. నిజానికి నేను జేసన్‌ కార్టర్స్‌ని కూడా కాను. నా పేరు ఎవరీ విల్సన్‌. టి.వి సీరియల్లో ఆ వేషాన్ని వేస్తున్నాను. జేసన్‌ తన కూతురి కోసం వెదకడం కేవలం కథ మాత్రమే. అర్ధమైందా?”“మీరేం చేస్తున్నారో నాకు తెలుసు. మీరు నన్ను పరీక్షిస్తున్నారు. నేను మీ కూతుర్ని అవునా, కాదా అని అనుకుంటున్నారు. నా ఐడి, ఓటర్‌ రిజిస్ట్రేషన్‌ కార్డ్‌ని చూపించమంటారా? నాది మీ కూతురి వయసే. పంతొమ్మిది. నేను మీ కూతురుండే న్యూజెర్సీలోనే ఉంటాను. నేను మీ కూతుర్ని. విన్నారా? నేను మీ కూతుర్ని.” గట్టిగా చెప్పాను. “ఎందుకో నువ్వు గొప్ప మానసిక ఒత్తిడిలో ఉన్నావు. నాతో వస్తే డాక్టర్‌ దగ్గరకి తీసుకెళ్తాను.” ఆయన చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. వెంటనే నేను కోపంగా లేచి నిలబడి అరిచాను. 

“నీక్కావాల్సింది డబ్బే ఐతే సంతోషంగా ఇస్తాను.”“నాకు కావాల్సింది మీ డబ్బు కాదు. అందులోని అమందాకి చూపించిన మా అమ్మ ఫొటో. నేను మీలా పొడుగ్గా, సన్నగా ఉన్నా, నా మొహం మీ మొహాన్ని పోలి లేదు. బహుశ నాది అమ్మ పోలిక.”ఆయన దాన్ని ఇస్తే అందులోని ఫొటోలన్నీ చూసాను. అందులో టి.విలో నేను చూసిన మా అమ్మ ఫొటో లేదు.“అమ్మ ఫొటో ఏం చేసారు?” అడిగాను.“నా పర్స్‌లో మీ అమ్మ ఫొటో ఎప్పుడూ లేదు. టు లివ్‌ అండ్‌ టు లవ్‌ టి.వి నాటకంలో జేసన్‌ కార్టర్స్‌ పర్స్‌లో ఉందది.” “మీరు జేసన్‌ కార్టర్స్‌ వేషం వేస్తున్నారని చెప్పడం ఆపండి. గత వారంగా మీరు నా కోసం వెదుకుతున్నారు.”మా నాన్నతో కలయిక నేను ఊహించిన రీతిలో జరగడం లేదు. నాలో దుఃఖం ముంచుకువచ్చింది.“నన్నెందుకు మీరు నమ్మరు?” అడిగాను.“ఏడవకు.” ఓదార్చాడు.“మార్చి గాలి నా గుండెని కోస్తున్నది.”“నేను ఎవరి తండ్రినీ కాదని నువ్వు అర్థం చేసుకోవాలి.” ఆయన నా భుజం చుట్టూ చేతులు వేసి చెప్పాడు.ఓ సారి మా అమ్మని పెళ్ళి చేసుకోడానికి చెప్పిన లాంటి అబద్ధమే జేసన్‌ నాకు చెప్తున్నాడు. ఆయన బాధ్యతని మోసే మనిషి కాదు. నా తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటే నేను బాధ పడతానని నా పెంపుడు తల్లిదండ్రులు చెప్పడం గుర్తొచ్చింది.“మీరిక వెళ్ళొచ్చు” చెప్పాను.బహుశ నేను పుట్టకమునుపు మా అమ్మ చెప్పిన మాటలు ఇవే అయి ఉంటాయి.ఆయన లేచి కొన్ని అడుగులు వేసాడు. తర్వాత పరిగెత్తసాగాడు. నా నుంచి పారిపోసాగాడు. నా తల్లినించి కూడా ఇలాగే పారిపోయాడు. నేను చెట్టు దగ్గరకి పరిగెత్తి పిస్తోలు అందుకున్నాను. తండ్రీకూతుళ్ళ మధ్య తొలి కలయిక ఇంత పేలవంగా ఉండటం నాకు కన్నీళ్ళని తెప్పించింది. నేను అక్కడనించి నడవసాగాను. బస్సెక్కి దిగకుండా చాలాసేపు కూర్చున్నాను. చివరికి ఓ రద్దీ ప్రాంతంలో దిగి, ఎదురుగా కనపడే పెద్ద మాల్‌ లోకి వెళ్ళాను. చూసుకుంటూ మూడో అంతస్థుకి చేరుకున్నాను. జేసన్‌ మళ్ళీ నాకు అక్కడ కనిపించాడు. ఎప్పటిలా నవ్వుతూ, నా వంక చూస్తూ ఏదో చెప్తున్నాడు. నేను దగ్గరకి వెళ్ళి విన్నాను. అజీర్తికి, కడుపులోని గ్యాస్‌కి ఏం తీసుకోవాలో ఓ మాత్రల సీసాని చూపిస్లూ నవ్వుతూ చెప్తున్నాడు. ఎంతటి నిర్దయుడు! నా గుండెలోని బాధ ఓ ఏంటాసిడ్‌ మాత్రతో పోతుందని చెప్తాడా? ఈ సారి ఉపేక్షించదలచుకోలేదు. పిస్తోలు తీసి ఆయన చిరునవ్వుకి గురిపెట్టి ట్రిగ్గర్‌ లాగాను. వెంటనే గాజు పలక పగిలింది. కొందరు అరిచారు. “ఆమె టి.వి సెట్‌ని కాల్చింది!” ఒకామె అరిచింది. నేను పిస్తోలుని కింద పడేసి ఎస్కలేటర్‌ వైపు నడిచాను. నిమిషంలో రెండు చేతులు నన్ను బలంగా పట్టుకున్నాయి.

నన్ను తీసుకు వచ్చిన చోటుని వాళ్ళు హాస్పిటల్‌ అని పిలుస్తున్నారు. కానీ, నేను అంతకు మునుపు ఎన్నడూ కిటికీలకి ఇనుప చువ్వలున్న హాస్పిటల్‌ని చూడలేదు. అవి నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టవు కాని, ఇక్కడి శబ్దాలు నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తాళం చెవుల చప్పుడు, ఇనుప తలుపులు తెరచి మూసేచప్పుడు, కొందరి మూలుగులు. నా పెంపుడు తల్లిదండ్రులని నా గదికో టి.విని పంపమని కోరాను. కాని డాక్టర్‌ నా సమస్యకి కారణం టి.వినే అని చెప్పి అడ్డుపడ్డాడు.గ్రూప్‌ థెరపీలోని తోటివాళ్ళు నేను కోలుకుంటున్నానని చెప్తున్నారు. జేసన్‌ నా అసలు తండ్రి కాదని వాళ్ళకి నిన్న చెప్తే అంతా నా భుజం తట్టి ఆనందాన్ని వ్యక్తం చేసారు. రిక్రియేషన్‌ గదిలోని టి.విలో టు లివ్‌ అండ్‌ టు లవ్‌ని చూసిన వాళ్ళు జేసన్‌, అమందాలకి అవబోయే పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్నారు. జేసన్‌ వెదికినా తన కూతుర్ని కనుక్కోలేక పోయాడని వింటే నాకు వణుకు పుట్టుకు వస్తుంది.అమందాకి నా సహాయం కావాలి. జేసన్‌ నిజంగా ఆమెని ప్రేమించలేదని ఎవరైనా చెప్పాలి. జేసన్‌ పర్స్‌ని ఎవరైనా ఆమెకి చూపిస్తే అతనికి ఇంతకు మునుపే పెళె్ళైందని, ఇద్దరు బిడ్డల తండ్రని తెలుస్తుంది. అందులో వారి ఫొటోలు కనిపిస్తాయి. టి.వి స్టూడియోలో ఆమెని కలుసుకోవచ్చని ఒకరు చెప్పారు. నేను చెప్పేది ఆమె పూర్తిగా వినకుండా జేసన్‌లా పారిపోకూడదని ఆశిస్తాను. నేను చెప్పేది వినే దాకా ఆమెని కదలకుండా ఉంచడానికి బహుశ నేను ఇంకో పిస్తోలుని సంపాదించాలి.

మల్లాది వెంకట కృష్ణమూర్తి