శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Apr 18, 2020 , 23:44:23

బ్లాక్‌ మెయిల్‌

బ్లాక్‌ మెయిల్‌

సిన్నప్పుడు అంటే అప్పుడు నాకు ఏడెనిమిదేండ్లుంటై. సదువుతున్నది రెండో తరగతో మల్ల మూడో తరగతో యాది లేదు గని,  అప్పుడు బక్కగ, సొప్ప బెండోలె, ఆయిదపు లొట్టోలె, సీపురు పుల్లోలె ఉండెటోన్ని. ఎంత దిన్నా పెయ్యికి పడ్తలేదంటని తుర్కాయన కాడ మంతిరిచ్చిర్రు, కడుపుల నట్టలుండయేమోనంటని నట్టల మందు తాపిచ్చిండ్రు, ఎన్నడు కోడిపుంజును కోస్నా, ఈడు నట్టలోడు, ఈనికింత బలమన్న ఒస్తదని, పుంజు వొట్టలను గొంతుల ఏసి అట్లనే పచ్చివి మింగిపిచ్చేటోళ్ళు. అయినా ఏం పున్నెం లేదు. అంత ఎప్పటోలెనే ఉంటి గని మస్తు కొంటెపాసునంటని ఇప్పట్కి యాజ్జేస్తది అమ్మ.

గాయల్ల కూడ పిడికెల గూట్లకెల్లి పిడికెలు దీయమంటని మా యమ్మ చెప్తె, పెరడులున్న కొట్టంల దూలాల మీదేసిన చెక్కల మీది కెక్కి పదిరవై  పిడికెలు అందిస్తి అమ్మకు. గా పిడికెల నడ్మ ఒక కోడిగుడ్డు దొరికిందని చెప్పి అమ్మకిచ్చిన. గీ పెట్ట గూడ రోజు పెట్టె జాగల గుడ్డు పెట్టక గీడ వెట్టింది. పాపం యాది మరిసి పెట్టినట్టుంది అనుకున్న.

మా బాపమ్మ బాయికాడికి పోయింది, లేకుంటె యాడ కోడిగుడ్డు దొరికిన, అవ్విటికి మంచిగ కట్టె బొగ్గుతోటి 1,2,3 అంటని నంబర్లేసి గుల్లల పెడ్తుండె, తర్వాత ఎన్నడో అవన్ని పదిహేనిరవై అయినంక పెట్టని ఆటి మీద పొదుగేస్తుండె.

అట్ల ఎప్పుడు పదిహేనిరవై కోళ్ళు ఇంటెనక కాళ్ళల్ల కదుల్తనే ఉండేటివి. ఒక గుడ్డు అట్టు వోసుకోనియ్యది, బుద్ధి పుట్టినప్పుడు కోడ్ని కోసుకోనియ్యది బాపమ్మ. ఇగ ఆమె నోటికి జడిసి కుయిక్‌ మనేటోళ్ళు గారు ఎవ్వరు. ఇంట్ల పెత్తనమంత బాపమ్మదే నాయె. రొంటిల తాళం చేతులగుత్తి దోపుకొని రాజిర్కం చలాయించేదని, బాపమ్మ లేనిది చూసి తిట్టుకొనేది అమ్మ.

ఇగ మా బాపమ్మ జోలి మల్లొకపాలి జెప్పుకుందాం గని. అది ఒగవారంల చెప్పుకొని సదురుకునేది గాదు. కమస్కం మూన్నాలుగు వారాలు చెప్పుకుంటె గాని ఒడ్వది.

ఇగ గాయల్ల పిడికెలు గిట్ల అందించి ఊరు మీద వడి తిరిగి తిరిగి ఎన్నడో పొద్దుమూకంగ కొంపకు జేర్తి. నన్ను జూడంగనే మా యమ్మ కోపం నశాళానికెక్కింది. 

‘ఏం మావలజెయ్యనీకె పొయ్నవు, తిండి లేదు తిప్పల్లేవ్‌, అడ్డమైనోన్ని ఏంటేస్కొని ఏ చెర్లల్ల మర్లాడితివి, ఏ శేన్లల్ల పొర్లాడితివి, ఏం అవతారమెత్తినవో ఎర్కయితున్నదా? మనిసి పుట్క పుట్టినవా, గాడ్ది పుట్క పుట్నవా’, అంటని ఒక్క తీర్గ నెత్తీ నోరు మొత్తుకొని, ఎవ్వని మీది కోపమో నా మీద తీశింది.

అంగి లాగిడిసి, జారట్లకు గుంజుకవొయ్యి ఉడుకుడుకు నీళ్ళ తోటి పెయ్యంత రాకి రాకి కడిగింది. కొబ్బరి పీసువెట్టి తోమింది, నెత్తిల ఉన్న ఉశ్కంత తీసి మల్ల నన్ను చింతపండువెట్టి తోమిన ఇత్తడి చెంబోలె జేసింది.

అప్పటికి పొద్దుమూకింది, అందరు ఇండ్లల్లకు మల్లిండ్రు. బట్టలేస్కున్నంక వండెమింట్ల కూసోవెట్టి అన్నం దోస్కాయె పప్పు పెట్టి కలిపి, తళ్ళె నా ముందల వెట్టింది. నేను తలకాయ దించుకొని తింటున్న.

బాపమ్మ, తాతయ్య బంకుల్ల గూసోని ఎవల్తోటో మాట్లాడుతున్నరు. బాపు బాయికాడికెళ్ళి ఇంక రాలె.

తలకాయ న్యాలకు దించుకొని తింటున్న నా తళ్ళెల ఒక కోడిగుడ్డు వెట్టింది అమ్మ.

‘ఎక్కడిదమ్మా?’ అంటని అడిగిన మా యమ్మని.

‘ఎక్కడిదైతే నీకెందుకురా? నోర్మూస్కోని తిను,’ జప్పున గొంతంత సిన్నగ జేస్కోని అన్నది.

‘పొద్గాల మనకు దొర్కిన గుడ్డా? మల్ల గుల్లల వెట్టలే?’

‘మల్ల మాట్లాడకు, గుడ్డు జోలి మల్లెత్తితే ఈపులు పల్గుతై, సప్పుడు జెయ్యక తిను,’ అంటని బెదిరిచ్చింది.

నేను సప్పుడు జెయ్యకుండ, ఉడ్కవెట్టిన కోడిగుడ్డు జరంత జరంత కొర్కి తిన్న...కమ్మగుండె.

     ఉడ్కవెట్టిన కోడిగుడ్డు పెంకు ఏ పొయ్యి బూడిదలేస్కోనివొయ్యి, ఎప్పుడు పెంట కుప్పలేసొచ్చిందో నాకు తెల్వనే తెల్వలే.

రెండు దినాలైపోయినయ్యి. ఒగనాడు అమ్మ నన్ను మల్ల పిల్సి పిడికెల గూట్లకెల్లి పిడికెలు దింపమంటని చెప్పింది. నేను మస్తు హుషారుగ దూలాలమీదికెక్కి, పిడికెల గూట్లకెల్లి పిడికెలు అందిచ్చి, అటు ఇటు అంత ఎతికితి. కిందికి మీదికి, పిడికెల సందు సందున ఎతికిన, మల్ల గిట్ల కోడిగుడ్డు దొర్కుతదేమోనంటని.

అంతట్ల, అమ్మ పిల్సింది, ‘ఇంక దిగవేందిరా...ఇయ్యాల్టికి సాల్తియ్యి,’ అంటని.

‘ఏ...మల్ల గిట్ల ఇంకో కోడిగుడ్డు కండ్లవడ్తదేమోనంటని సూస్తున్ననే,’ అని జరంత లాజిగనే అంటి.

మా యమ్మ బిత్తరపోయ్యి, దిక్కులు సూస్కుంట నన్ను సప్పుడు సేయకంటని మల్ల మల్ల సైగలు జెసింది.

కిందికి దిగి, ‘ఎందుకు’ అని అడిగిన.

‘నోర్మూస్కోని అవుతల్కి వో...’ అంటని కసిరింది.

‘ఎందుకమ్మా, బాపమ్మకు జెప్పలే?’ 

‘నోర్ముయ్యమంటె...ఇచ్చులు కచ్చకాయలు గావాలె పోరనికి, నడ్వు ఈడికెల్లి,’అంటని గెదిరిచ్చింది.

మెల్లెగ అమ్మెనకనే వండమింట్లకు నడుసుకుంట, ‘ఒగ ఐదు పసలియ్యే,’ అని అడిగితి.

‘ఎందుకు?’ కోపం జేసింది అమ్మ.

‘దుక్నంల కొనక తింట,’ అని జబర్దస్తీగ అడిగితి.

అమ్మ ఏ ఖయాలిలుందో...ఏడ్నో దాపెట్టుకున్న ఐదుపైసల బిల్ల దీస్కొచ్చి నా చేతిలవెట్టింది.

నేను ఉరుక్కుంట వొయ్యి నల్లీలు కొనుకొని, ఐదేళ్ళకి అయిదు తొడిగిచ్చుకోని, ఒక్కొక్కటి తినుకుంట ఇంటికొచ్చిన. అప్పుడప్పుడు అమ్మను ‘కోడిగుడ్డు’ అంటని బెదిరిచ్చి కొనకదిననీకె సందు దొర్కిందని మస్తు సంబరవడ్డ.

ఇట్లనే నాలుగొద్దులైపోయినయ్యి. గాయళ్ళ పొద్దుమూకినంక, మొఖం కాల్జేతులు కడుక్కొని, మంచిగ బాల్‌ గిట్ల దువ్వుకొని అమ్మ తానికొయ్యి,

‘అమ్మా ఐదు పైసలియ్యే,’ అని అడిగిన.

‘ఎందుకురా ఐదు పైసలు,’ అని శిన్నగ అడిగింది అమ్మ.

‘సంత్ర గోలీలు కొనుక్కుంటనే,’ అని గునిసిన.

‘పైసల్లేవ్‌, ఏం లేవ్‌, నడ్వు అవుతలికి, ఊకె బూకటి పోరడు మోతాదయ్యిండు నా పానానికి,’ అంటని ఇసిరికొట్టింది.

నేను ఊకోకుంట,’ అమ్మా ఐదు పైసలిస్తవా? లేకుంటె కోడిగుడ్డు జోలి బాపమ్మకు చెప్త,’ అంటని ఏలు సూపెట్టి బెదిరిస్తి.

ఏందో పని మీదున్న అమ్మ రప్పున నా తానికి ఒచ్చి, ‘ఏందిరా ఏలు సూపిచ్చి బెదిరిస్తున్నవు? ఎవనికి చెప్పుకుంటవో చెప్కో పో,’ అంటని, నా చెవులు విండి, తొడపాశం బెట్టి, ఒంగవెట్టి ఈపుల నాల్గు గుద్దులు లెక్కవెట్టి గుద్దింది.

పొయ్యిల కొర్కాసు దీస్కోని,’కొడ్కా! నట్టలోడివంటని, బక్కోనివని, బలం ఒస్తదని, జరంత కండవడ్తవంటని కోడిగుడ్డు వెడ్తే...నన్నే బెదిరిస్తవా,’ అనుకుంట వాత పెట్టనీకె నా ఎంటబడ్డది.

ఉన్నోన్ని ఉన్న తాన్నే గజ్జున ఒనుక్కుంట, గుడ్లు మిటకరించుకుంట నిలవడ్డ.

నా లాగెప్పుడు తడిసిందో నా కియ్యాల్టి దాంక తెల్వనే తెల్వలే.

-కొట్టం రామకృష్ణారెడ్డి