ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Apr 18, 2020 , 23:36:52

ప్రకృతి జాకెట్టు!

ప్రకృతి జాకెట్టు!

ఖరీదైనా చీర, మామూలు చీర.. కట్టు ఏదైనా  కనికట్టు చేయడానికి డిజైనర్‌ బ్లౌజులే మార్గం. అందులోనే ప్రకృతి రమణీయతను అందంగా  పొందుపరుస్తున్నారు.  ఆ డిజైనర్‌ బ్లౌజ్‌ల గురించే ఇప్పుడు చర్చ అంతా..ఒకప్పుడు ఆరు గజాల చీరలు ఉండేవి. రవిక సంప్రదాయం తర్వాత వచ్చింది. అక్కడి నుంచి జాకెట్‌ పుట్టుకొచ్చింది. జాకెట్‌ ముక్క వేరుగా తానులోంచి తీసి కుట్టించుకునేవారు. ఇలా కాదు.. చీరకు మ్యాచింగ్‌గా ఉండాలన్న ఉద్దేశ్యంతో చీరతో పాటు బ్లౌజ్‌లను జతచేశారు. ఇప్పుడు, మళ్లీ పాత పద్ధతికే వచ్చారు. అయినా.. దానికి కొత్త హంగులను అద్దుతున్నారు. తానుల్లో జాకెట్టు ముక్కను తీసుకొని, వాటికే సరికొత్త డిజైన్లను అద్ది ‘డిజైనర్‌వేర్‌' అంటూ తెగ హొయలు పోతున్నారు.

ప్రేరణగా..

ఒక డిజైన్‌ రూపొందాలంటే ఏదో ఓ ప్రేరణ తప్పనిసరి. ఇంటర్నెట్‌ వెతికితే బోలెడు డిజైన్లు దొరకవచ్చు. కానీ ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరికించి చూస్తే, లెక్కకుమించి డిజైన్లు తారసపడతాయని అంటున్నారు ఫ్యాషనిస్టులు. పూలు, కొమ్మలు, పక్షులు... ఇవే మన డిజైన్‌కి కావాల్సినంత ప్రేరణ ఇస్తున్నాయి. కాకపోతే ప్రతీ చీర మీదికి ఇవి నప్పుతాయా? అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. మనం ప్రత్యేకంగా ఉండాలనుకుంటే, వేటి మీదికైనా ఈ జాకెట్‌లు నప్పుతాయనడంలో సందేహం లేదు. వీటిని  లెహంగాల మీదికి కూడా వేసుకోవచ్చు. ప్రకృతి డిజైన్లను జాకెట్‌లకే పరిమితం చేయకుండా స్కర్ట్‌, పలాజో, కుర్తాల మీద కూడా వేయించుకోవచ్చని డిజైనర్లు సిఫార్సు చేస్తున్నారు. 

ఎలిగెంట్‌గా ఎంబ్రాయిడరీ..

ైస్టెలిష్‌గా ఉండాలని అనుకోవడంలో తప్పులేదు.. కానీ, అదే సమయంలో ఆ అలంకరణలో మనం  నలుగురిలో నవ్వుల పాలు కాకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు మనం ఎంచుకునే డిజైన్లు సరిగ్గా ఉన్నా, కలర్‌ కాంబినేషన్లు కరెక్ట్‌గా కుదరకపోతే దేని అందమైనా పాడైపోతుంది. అందుకే లేత రంగు బ్లౌజ్‌లను ఎంచుకున్నప్పుడు డిజైన్‌ కాస్త ముదురు రంగుల్లో ఉంటే ఆ డిజైన్‌ హైలైట్‌ అవుతుంది. అలాకాకుండా మొత్తం లేత, లేకపోతే ముదురు రంగులను ఎంచుకోవద్దని డిజైనర్లు చెబుతున్నారు. పక్షులకు స్టోన్స్‌, జరీ, సీక్వెన్స్‌, జర్దోసీలను కలిపి లేదా విడివిడిగా  డిజైన్‌ చేయొచ్చు. కానీ  ప్రకృతి డిజైన్లకు భారీగా జర్దోసీని వాడితే బాగుంటుంది.

ఎక్కడ.. ఎలా?

బ్లౌజ్‌కి వెనుక వైపు మాత్రమే డిజైన్‌ చేస్తే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ ముందువైపు కూడా విస్తరిస్తే మరింత బాగుంటుంది. అది కూడా ఒకవైపు మాత్రమే హైలైట్‌ చేయాలి. ఇక్కడ కలర్‌ కాంబినేషన్‌లకి కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఒకటి.. చీరలోని రంగులను బట్టి డిజైన్లలోకి రంగులను ఎంచుకోవాలి. లేకపోతే పూర్తి కాంట్రాస్ట్‌గా అయినా ఉండాలి. అంతేకానీ.. అన్నీ కలగాపులగం మాత్రం చేయకూడదు. ముఖ్యంగా పక్షులు, ప్రకృతి థీమ్‌ ఎంచుకున్నప్పుడు. ఈ మధ్య కేవలం పక్షులకి సంబంధించిన ప్యాచ్‌లు వస్తున్నాయి. వాటిని మామూలు బ్లౌజ్‌మీద కూడా కుట్టేయవచ్చు. వద్దనుకుంటే ఆ కుట్లను విప్పేసి మామూలు బ్లౌజ్‌గా కూడా వేసుకోవచ్చు. కేవలం కుట్లు, అల్లికలతోనే కాదు.. పెయింటింగ్‌తో కూడా బ్లౌజ్‌లపై మీ ప్రకృతి ప్రేమను చూపించవచ్చు. 


logo