బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Apr 12, 2020 , 02:00:45

ఇస్మార్ట్‌ జనరేషన్‌

ఇస్మార్ట్‌ జనరేషన్‌

త్రివిక్రమ్‌ మాటల్లో చెప్పాలంటే.. ‘ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్‌ అంటారు. వ్యాపారస్తులు.. ఫ్యాషన్‌ అంటారు. రాజకీయనాయకులు.. తరం అంటారు. మామూలు జనాలు.. జనరేషన్‌ అంటారు’. ఎవరేమన్నా ప్రతి జనరేషన్‌కు ఒక గ్యాప్‌ ఉంటుంది. ఒక కొత్త థాట్‌ ప్రాసెస్‌ ఉంటుంది. మనం మామూలు జనాలం. మనకు ‘జనరేషన్‌' గురించే కావాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జనరేషన్‌ జెడ్‌ గురించి. ఎందుకంటే మనం ఏ జనరేషన్‌కి చెందినవారమైనా ఈ జనరేషన్‌తో కనెక్ట్‌ అయి ఉంటాం. ఉన్నాం. ఎందుకంటే వీరు మన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు. రేపటి తరం.. సరికొత్త తరం.. కొత్తని పట్టుకుంటూ.. పాతని పట్టుకెళ్తున్న నవతరం. ఈ ఇస్మార్ట్‌ జనరేషన్‌ జెడ్‌ గురించే ఈ వారం ముఖచిత్ర కథనం.  

జనరేషన్‌ జెడ్‌ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే- వీరి దగ్గర స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. కానీ వీరు ఎక్కువగా స్మార్‌ఫోన్‌ వాడతారు!అదెలా? అంటే.. తల్లిదండ్రుల ఫోన్‌ తీసుకుని ఆడటం మొదలెట్టి వాడటం వరకు వెళ్తారన్నమాట. వీరు అరచేతిలోకి అంతర్జాలం వచ్చినప్పుడు పుట్టారు. హైపర్‌ కనెక్టెడ్‌ వరల్డ్‌లో పెరుగుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వీరి ఒంట్లో ఓ భాగం. ఇంటర్‌నెట్‌ వీరి ఇంకో భాగం. జేబులో పర్సు, అందులో డబ్బు లేకపోయినా ఫర్వాలేదు. కానీ చేతిలో మాత్రం స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాగని డబ్బునేం తక్కువగా చూడరు. దాని గురించి వీరు.. తల్లిదండ్రులలాగే ఆలోచిస్తారు. కానీ వారు పడిన కష్టాలు కూడా చూసి ఉన్నారు, కాబట్టి వారికంటే ఇంకా జాగ్రత్తగానే ఉంటారట. పర్సనల్‌ ఫైనాన్స్‌ గురించి కాస్త స్పృహ ఎక్కువగానే ఉంటుందట. వీరి గురించి మరింత తెలుసుకోవాలంటే.. ముందు ఇతర జనరేషన్‌ల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైందిగా జనరేషన్‌ అంటే? జననాల ప్రారంభ, ముగింపు సంవత్సరాల మధ్య పుట్టి పెరిగినవారు ‘ఒక జనరేషన్‌'కి చెందినవారు (దీనికి కచ్చితమైన కొలమానాలు ఏమీలేవు). కచ్చితంగా ప్రారంభ, ముగింపు సంవత్సరాలు అవేకాదు, కానీ కాస్త అటు ఇటుగా కూడా జనరేషన్‌ను నిర్వచిస్తున్నారు. 1910కి ముందు జనరేషన్‌లు లేవా? అంటే.. ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అప్రస్తుతం. కింది పట్టికను చూసి మీరు ఏ జనరేషన్‌కు చెందినవారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జనరేషన్‌ గురించి అర్థమైందిగా.. 1995 నుంచి 2012 సంవత్సరాల మధ్య పుట్టినవారు. వీరిలో ఎక్కువమంది జనరేషన్‌ ఎక్స్‌ (1965-1980) వారి పిల్లలన్నమాట. ఆ పై జనరేషన్లకు మనవళ్లు, మనవరాళ్లు అన్నమాట. 

లక్ష్యం జెన్‌ జెడ్‌!

ఇప్పుడీ ప్రపంచానికి మీరు (జెన్‌ జెడ్‌ కాని తరాలు) అక్కర్లేదు. ఎందుకంటే జెన్‌ జెడ్‌ వచ్చేస్తున్నది. వారు కెరీర్‌లో ముందడుగు వేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కొనుగోలు శక్తి పెరుగుతున్నది. వారే రేపటి వినియోగదారులు. వారే పనివాళ్లు. అందుకే మీరు పనికిరాకుండా పోతున్నారు. భూమి ఎప్పుడూ తన చుట్టూ తాను తిరుగుతుంది. కానీ ఈ ప్రపంచం అప్పుడూ ఇప్పుడు ఎప్పుడూ డబ్బు చుట్టూనే తిరుగుతుంది. కొనేవారు వ్యాపారులకు కావాలి. అమ్మేవారు వినియోగదారులకు కావాలి. వారికి, వీరికి మధ్య నమ్మకం కుదరాలి. అందుకే జెన్‌ జెడ్‌ లక్ష్యంగా మార్కెట్‌లో భారీ వ్యూహాలు మొదలయ్యాయి. వారిని నమ్మించేందుకు, కమ్మేసేందుకు, కొనిపించేందుకు ఎవరికి వారు స్ట్రాటెజీలు రాస్తున్నారు. స్కెచ్చులు వేస్తున్నారు. కొత్తొక వింత. పాతొక రోత. మీరిప్పుడు పాత చింతకాయ పచ్చడి. మార్కెట్‌ ఇప్పుడు జెన్‌ జెడ్‌ లక్ష్యంగా కొత్త ఆవకాయ పచ్చడి పెడుతున్నది.   ఎలా ఉండబోతున్నది?

జనరేషన్‌ జెడ్‌ వారు.. అదో రకం. అంటే.. చాలా ప్రత్యేకమైనవారని అర్థం. పైగా విభిన్నమైనవారు. వీరు కలగన్నది ఏదైనా కావాలని ఆరాటపడతారు. అందుకోసం పోరాడతారు కూడా. వీరు డిజిటల్‌ నేటివ్స్‌. పైగా ‘పోస్ట్‌ ఇంటర్‌నెట్‌ వరల్డ్‌'లో పుట్టినవారు. వీరు ఇష్టపడే కమ్యూనికేషన్‌ పద్ధతి.. సెల్‌ఫోన్‌. సగటున మొబైల్‌తో రోజులో 3 గంటలు గడుపుతున్నారు. తక్కువ వయసులోనే ఇంటర్‌నెట్‌ వాడటం మొదలెట్టారు. ఇదే వారి ప్రపంచమైపోయింది. డబ్బు విషయంలో.. వీరు జెన్‌ ఎక్స్‌ (వీరి తల్లిదండ్రులే)లాగే ఆలోచిస్తారు. కాకపోతే మరింత ఆర్థిక సంప్రదాయవాద విధాన్ని అవలంబిస్తారు. వ్యక్తిగత ఫైనాన్స్‌ గురించి నేర్చుకుంటారు. ఆర్థిక విద్య పట్ల బలమైన ఆవగాహన, ఉత్సాహం కలిగి ఉంటారు. మునుపటి తరాల కంటే చిన్న వయసులోనే పొదుపు ఖాతాలను తెరుస్తారు. మొబైల్‌ బ్యాంకింగ్‌ తర్వాతే డెబిట్‌ కార్డుల వినియోగం వీరి ప్రాధాన్యాల జాబితాలో ఉంటుంది. 50 శాతం మంది మూడు, నాలుగు నెలలు దాటితేగానీ బ్యాంకు మొఖం చూడరు. వీరు మరింత హెల్త్‌ కాన్షియస్‌గా ఉండనున్నారు. కాబట్టి ఆ ఆహారం తయారు చేసే కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. వీరికి బ్యూటీ అండ్‌ స్కిన్‌ కేర్‌ కూడా ఎక్కువే. గేమింగ్‌, ఈ-స్పోర్ట్స్‌, వీడియో స్ట్రీమింగ్‌ అంటే ఇష్టం. టీవీ షోలు కూడా మొబైల్స్‌లోనే చూస్తారు. కాబట్టి అమ్మకందార్ల చూపంతా జెన్‌ జెడ్‌ మైండ్‌ సెట్‌ కేంద్రంగానే ఆలోచిస్తున్నది. 

కొత్త తరం.. కొత్త ఆలోచన

జెన్‌ జెడ్‌ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నది. స్వీయ గుర్తింపు కోసం ఆరాటపడుతున్నది. కెరీర్‌ పట్ల అవగాహన ఉంది. మానవ సంబంధాల విషయంలో అంతో ఇంతో జాగ్రత్తగానే ఉంటున్నది. స్వీయ వ్యక్తీకరణ, స్వతంత్రభావాలు కలిగి ఉన్నది. స్వేచ్ఛను కోరుకుంటున్న ఈ కొత్త తరం కొత్తను కోరుకుంటున్నది. ఆ కొత్తే ఇప్పుడు మార్కెట్‌ శక్తులకు కావాలి. అందుకే వారి కోసం ముఖ్యమైన బ్రాండ్స్‌, అమ్మకందార్లు స్ట్రాంగ్‌ జెన్‌ జెడ్‌ స్ట్రాటజీని రూపొందిస్తారు. ఎందుకంటే వారి అమ్మకాలకు మరో పది, ఇరవై ఏండ్ల పాటు వారే టార్గెట్‌ కస్టమర్లు కాబోతున్నారు కాబట్టి. ఇప్పుడు జాబ్‌ మార్కెట్‌ పరీక్షించడానికి సిద్ధంగా ఉన్న జన్‌ జెడ్‌ నిన్నటి తరం యజమానులకు అనేక ఆశ్చర్యాలను కలిగించనున్నది. ఈ శక్తివంతమైన, ధైర్యమైన తరం కొన్ని సంప్రదాయాలకు విలువనిస్తూనే, కొన్ని విప్లవాత్మకమైన మార్పులతో మార్కెట్‌ శక్తులకు సవాల్‌ విసరనున్నది. అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉన్న ఈ తరాన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే’ అని బిజినెస్‌ వరల్డ్‌ పేర్కొంది. ఈ సంస్థతో కలిసి ఎక్స్‌బీఎస్‌ఎల్‌ నిర్వహించిన ఒక సర్వేలో ‘ఈ తరానికి చెందిన చాలామంది ఒకరి దగ్గర పనిచేయడం కంటే, సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడుతూ నలుగురికి ఉపాధి కల్పించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది. స్టార్టప్‌లు మొదలెట్టడానికి, వాటిల్లో పనిచేయడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్లు తేలింది. మల్టీనేషనల్‌ కంపెనీల్లో మాత్రం రెండు మూడు ఏండ్లు ఎక్స్‌పీరియన్స్‌ కోసం మాత్రమే పనిచేస్తామని చెప్పినట్లు అర్థమవుతున్నది.  మానవ సంబంధాలు 

ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ టిండెర్‌ నిర్వహించిన ఒక సర్వే ద్వారా జనరేషన్‌ జెడ్‌ మానవ సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది.  ఇందులో సగం మంది సహజీవనాన్ని చాలా సహజంగా తీసుకోనున్నట్లు చెప్పారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ తమకు కావాల్సిన వారిని తామే స్వయంగా ఎంచుకోవడం పట్ల ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. ఇతరులకంటే ‘నేను’ అనే భావనే ఈ తరానికి ఎక్కువ. 56 శాతం మంది బలమైన స్నేహాన్ని ఇష్టపడుతున్నట్లు ఓటేశారు. తల్లిదండ్రులు గర్వపడేలా పని చేయాలని చాలామంది అనుకుంటున్నారు. దీనిని బట్టి పెద్దల పట్ల వీరికెంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అమ్మానాన్నల వల్ల వచ్చే పేరుకంటే 63 శాతం మంది మాత్రం స్వీయగుర్తింపుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.  

రుణం తీసుకోని తరం

2019 లెక్కల ప్రకారం మనదేశంలో 60.9 కోట్ల మంది జెన్‌ జెడ్‌ వారున్నారు. వీరిలో 14.7 కోట్ల మంది అప్పుతీసుకునేందుకు అర్హులు. కానీ వీరిలో 90 లక్షల మంది అంటే కేవలం 6 శాతం మంది మాత్రమే క్రెడిట్‌ యాక్టివ్‌గా ఉన్నట్లు ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ సర్వేలో తేలింది.  మరి వీరు ఎందుకు లోన్‌ తీసుకున్నారంటే.. వీరిలో ఎక్కువమంది టూవీలర్‌ కోసమే లోన్‌ తీసుకున్నారట. ఇతర లోన్లు ఏంటంటే స్మార్ట్‌ఫోన్లు, పర్సనల్‌ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌. కానీ ఇంతకుముందు తరంలో ఈ లోన్లు ఎలా ఉండేవంటే ఇంటికి సంబంధించినవి ఫ్రిజ్‌లు, వాష్‌మెషీన్లుగా ఉండేవని సిబిల్‌ చెబుతున్నది. 

అయినవాళ్లు చెబితేనే!

మీరొక వస్తువును కొనాలంటే ఏం చేస్తారు? నిన్నటి తరం సేల్స్‌మ్యాన్‌ చెప్పింది వినేది. ఇప్పటి తరం ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్‌ రివ్యూ చూస్తున్నది. కానీ జెన్‌ జెడ్‌ అలా కాదు. వీరిలో 7 శాతం మంది మాత్రమే సేల్స్‌మ్యాన్‌ చెప్పింది నమ్ముతారు. 10 శాతం మంది మాత్రమే మీడియా రివ్యూలను చూస్తారు. 24 శాతం మంది సోషల్‌ మీడియా ద్వారా ప్రభావితం అవుతారు. 47 శాతం మాత్రం స్నేహితులు, కుటుంబసభ్యులు చెప్పిన ప్రకారమే తమకు కావాల్సింది కొనాలనుకుంటున్నారు.  విద్యా? నైపుణ్యమా??

జనరేషన్‌ జెడ్‌కు ‘ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న ఫీల్డు’లే సరైనవని నిపుణులు అంటున్నారు. వీరికి రెండు అవకాశాలున్నాయి. సొంత పని ఎంచుకోవడం, ఉన్నత విద్య నేర్చుకోవడం. తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు వీరు పనికిరారు. నాలుగు రోజులైతే ఆ ఉద్యోగాలూ కనపించవట. మిగిలివున్న ఆ ఉద్యోగాలనే చేస్తూ కూర్చుంటే కుటుంబాన్ని పోషించడం కూడా కష్టమైపోతుందట. అందుకే ఈతరానికి నైపుణ్యం ఉండాలి. లేదంటే ఉన్నత విద్య అయినా ఉండాలి. హెల్త్‌కేర్‌, హైటెక్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న, డిమాండ్‌ ఉన్న రంగాలు. ఇది ఇంకా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతుంది. అందుకే సైన్స్‌, ఇంజినీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌, మెడిసిన్‌ జెన్‌ జెడ్‌కు మంచి చాయిస్‌. ఇంగ్లీష్‌, హిస్టరీ, ఫిలాసఫీ ఎంత చదివినా పెద్దగా ఉపయోగం ఉండదట. 

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ కూడా బాగుంటాయి. నర్సు, డాక్టర్‌ అయినా ఓకే. సివిల్‌ ఇంజినీరింగ్‌లో మాత్రం పెద్దగా ఉద్యోగాలు లేవు. చాలాకాలం నుంచి మనం పెద్దగా బ్రిడ్జీలు, బిల్డింగులు కట్టడం లేదు. కడుతున్నవాటికి సరిపోయేంత మంది సివిల్‌ ఇంజినీర్లు వీరి ముందు తరం నుంచి ఉన్నారు. ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్‌ కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే ఎలక్ట్రిక్‌ కార్లు వచ్చేస్తున్నాయి. వీటి పెరుగుదలతో ఆటో మెకానిక్‌ ఫీల్డ్‌ చాలా ఆసక్తికరమైన మార్పులు చూడబోతున్నది. స్పేస్‌ ఫ్లైట్‌లకు సంబంధించిన ఉద్యోగాలు పెరుగుతాయి. జియాలజీ ఉద్యోగాలు, ముఖ్యంగా ఇతర గ్రహాలపై ఖనిజాలను కనుగొనడానికి సంబంధించిన వాటికి డిమాండ్‌ ఉంటుంది. వర్చువల్‌ రియాలిటీ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతాయి. వీఆర్‌ అనుభూతి.. అద్భుతాలను చూపించబోతున్నది.  సేల్స్‌ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. షాపింగ్‌ మాల్స్‌ ఉన్నా.. అమేజాన్‌, ఫ్లిఫ్‌కార్డ్‌లాంటి ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ వాటిని దెబ్బతీస్తుండటంతో రిటైల్‌ అమ్మకాల ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. వ్యాపార అభివృద్ధి, కొత్త కస్టమర్లను కనుగొనే వారి కథ వేరు. ఇవి మంచి ఉద్యోగాలే కానీ, ఇందులో కూడా ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కళాశాల విద్య అవసరమయ్యే ఉద్యోగాల కంటే తక్కువ వేతనం ఉన్నప్పటికీ ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్స్‌, బ్యూటీషియన్ల వంటి ఉద్యోగాలు ఇప్పటికి ఎప్పటికీ డిమాండ్‌లో ఉంటాయి. అనేక ఇతర కేరీర్‌ల కంటే ఇవి స్థిరంగానూ ఉంటాయి. 

జెన్‌ జెడ్‌ నిజానిజాలు

 • ప్రపంచ జనాభాలో 32 శాతం మంది జెన్‌ జెడ్‌కు చెందినవారే ఉన్నారు.  
 • ప్రపంచవ్యాప్తంగా జనరేషన్‌ జెడ్‌ 600 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ సామర్థ్యాన్ని కలిగి ఉండనుందని ఒక అంచనా. 
 • జెన్‌ జెడ్‌లో 50 శాతం మంది రోజుకు 10 గంటలకంటే ఎక్కువ సమయాన్ని ఇంటర్‌నెట్‌లో వెచ్చిస్తున్నది. 
 • 95 శాతం మంది టీనేజర్లు స్మార్ట్‌ఫోన్లను వాడనున్నారు. 
 • జెన్‌ జెడ్‌ ఎక్కువగా స్నాప్‌చాట్‌ వాడుతున్నది. 14 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించరు. 51 శాతం మంది ఫేస్‌బుక్‌లో ఉండరు. 90 శాతం మంది ట్విట్టర్‌ లో కనిపించరు. 
 • జెన్‌ జెడ్‌ వారు ముందు తరాలకంటే రెండు రెట్లు ఎక్కువగా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అలవాటు పడిపోనున్నారు. 
 • ఇది చదివేతరం కాదు. చూసే తరం. యూట్యూబ్‌ వీక్షణం వీరి ప్రథమ వ్యాపకాల్లో ముఖ్యమైంది. 
 • జెన్‌ జెడ్‌లో 85 శాతం మంది సాంకేతిక సంబంధమైన ఉద్యోగాలను చేయడానికి ఇష్టపడుతున్నట్లు ఒక సర్వే చెబుతున్నది. 
 • ఇప్పుడున్న ఉద్యోగాలేవీ ఇంకో 20 ఏండ్ల తర్వాత ఉండవని 59 శాతం జెన్‌ జెడ్‌ నమ్మకం. 
 • కీబోర్డు మీద టైప్‌ చేయడం కాదు, అలెక్సాలాంటి వాయిస్‌ సెర్చ్‌లను ఈ తరం ఎక్కువగా వాడనున్నది. 


జనరేషన్‌ జెడ్‌ అంటే? 

1995 నుంచి 2012 మధ్య పుట్టినవారు.వీరికి ప్రస్తుతం 8 నుంచి 25 ఏండ్ల మధ్య వయసుంటుంది.  వీరిలో ఎక్కువమంది జనరేషన్‌ ఎక్స్‌ (1965-1980) వారి పిల్లలు.జెన్‌ జెడ్‌కు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ప్రకారం అర్థం : 21వ శతాబ్దపు రెండో దశాబ్దంలో యవ్వనానికి చేరుకున్నతరం 

వీరికి ఇతర పేర్లు 

ఐ జనరేషన్‌; జెన్‌ టెక్‌, జెన్‌ వై, హోమ్‌ల్యాండ్‌ జనరేషన్‌, నెట్‌ జన్‌, డిజిటల్‌ నేటివ్స్‌, ప్లూరల్స్‌, జూమర్స్‌, పోస్ట్‌ మిలీనియల్స్‌. సెంటెనియల్స్‌.మెరియమ్‌ వెబ్‌స్టర్‌ డిక్షనరీ ప్రకారం జనరేషన్‌ జెడ్‌ వారికి పెట్టిన నిక్‌నేమ్‌ జూమర్స్‌. 2016 నుంచి ఇలా వాడుతున్నారు కానీ, ఇప్పటి వరకూ దీన్ని డిక్షనరీకి ఎక్కించలేదు. 

మంచి - చెడులు

 పాజిటివ్స్‌

 • ఇతర తరాలతో పోల్చితే జనరేషన్‌ జెడ్‌కు సహనం కాస్త ఎక్కువే. అన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటారు. రిస్క్‌ తీసుకోవడంలో కూడా ముందే ఉంటారు.  
 • డబ్బు పట్ల అవగాహన ఉంటుంది. జాగ్రత్తగా మనీ మేనేజ్‌మెంట్‌ చేస్తారు. 
 • రిలేషన్‌షిప్స్‌ను పట్టించుకుంటారు.  (లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్స్‌కు కూడా సై అంటారు)
 • షాపింగ్‌ మాల్స్‌కు, సినిమాలకు పెద్దగా వెళ్లరు. (చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటుందిగా)
 • ఆశావాదంతో పాటు, అమాయకత్వం కూడా తక్కువే. 
 • ఫేస్‌బుక్‌ కంటే ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా వాడతారు.

నెగెటివ్స్‌

 • స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఎక్కువ సమయం కనెక్ట్‌ కావడం వల్ల ఇతరులతో వ్యక్తిగతంగా, ముఖాముఖిగా తక్కువ పరిచయం ఉంటుంది. 
 • ఫిజికల్‌ గేమ్స్‌ కంటే వీడియో గేమ్స్‌ను ఎక్కువ ఇష్టపడతారు.  
 • పుస్తకాలు, వార్తాపత్రికలు తక్కువగా చదువుతారు. (చదివే తరం కాదు వీరిది, చూసే తరం)
 • హైస్కూల్‌ నుంచే డబ్బు పట్ల ఆశ (ఉన్నా.. అవగాహన కూడా ఉంటుంది)
 • స్మార్ట్‌ఫోన్‌, సోషల్‌ మీడియా ఉంటే తెల్లవారుజాము 2 గంటల వరకైనా మేల్కొని ఉంటారు.
 • ఒంటరితనాన్ని ఎక్కువ కోరుకుంటారు. ఇతరుల అవసరం పెద్దగా లేదనుకుంటారు. ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా వీరిలో ఎక్కువేనట. 

యంగ్‌ ఇండియా జెన్‌ జెడ్‌

మనదేశంలో 60.9 కోట్ల మంది జనరేషన్‌ జెడ్‌కు చెందినవారు ఉన్నారు. వీరిలో 15 నుంచి 25 ఏండ్ల మధ్య వారిని శాంపిల్స్‌గా తీసుకుని ఎంటీవీ ఒక సర్వే చేసింది. 400 నగరాల నుంచి 25 వేల మంది ఇందులో పాల్గొన్నారు. ఈ తరం ఆలోచనా విధానం, భవిష్యత్తు పట్ల అవగాహన ఎలా ఉందనేది ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ‘జెన్‌ జెడ్‌ డిజిటల్‌ జనరేషనే అయినా సమాజం పట్ల సానుకూల దృక్పథంలో, ఉద్వేగభరితంగా ఉన్నదని, మాటల్లో కాకుండా చేతల్లో చూపే తరమిది’ అని తేలినట్లు అధ్యయనకారులు చెబుతున్నారు. జెన్‌ జెడ్‌లో 94 శాతం మంది దేశవిదేశాల్లో ఉద్యోగం చేయకుండా తమ సొంత ఊళ్లో, దగ్గరి పట్టణాల్లోనే ఉద్యోగం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 84 శాతం మంది తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటామని చెప్పారు. 60 శాతం మంది అరేంజ్డ్‌ మ్యారేజెస్‌ను ఇష్టపడుతున్నట్లు చెప్పారు. తమకు ఎలాంటి వారు కావాలో తల్లిదండ్రులకు తెలుసని వారి నమ్మకమట. పెళ్లయ్యాక తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి 81 శాతం మంది ఆసక్తి చూపారు. 81 శాతం మంది చెట్లు నాటడం, వీధులు శుభ్రం చేయడం వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తేలింది. మహిళల రక్షణకు ప్రాముఖ్యం ఇస్తున్నట్లు కూడా చెప్పారు. 94 శాతం మంది మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉండాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. 75 శాతం మంది తమ జీవితాలకు ఓ అర్థం ఉండేలా బతకాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 

-నగేష్‌ బీరెడ్డి, సెల్‌: 9182777177


logo