శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Apr 12, 2020 , 01:47:43

రియాలిటీ షో!

రియాలిటీ  షో!

కొన్ని రోజులకే హోటల్‌లో క్లీనర్‌ నుంచి బిల్‌ రీడర్‌ వరకు వెళ్లాను. ఆ పరిచయాలు లాభం చేశాయి. కస్టమర్లలో వేర్వేరు రాష్ర్టాల వాళ్లుండేవారు. దానివల్ల నాకు కన్నడ, తమిళం, తుళు, లంబాడీ, హిందీ, ఇంగ్లీష్‌, నేపాలీ భాషలు వచ్చాయి.

కొమురం ఇవాళ క్రేజీ ఆర్టిస్ట్‌. టీవీ ప్రపంచంలో కొత్త ఒరవడి. అన్నీ ఆడపాత్రలే. నిజంగా ఆడవాళ్లు కూడా అలా చేయరేమో? జబర్దస్త్‌ కొమురంగా.. కొమ్రక్కగా రియాలిటీషోస్‌లో తను ఎలా నిలిచి గెలిచాడు? అతడి లైఫ్‌జర్నీ ఎలా సాగుతున్నది?

మాది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఉడిత్యాల.  అమ్మా.. నాయిన చదువుకోలేదు. కూలీ పనే జీవనాధారం. ‘చేతనైన కాడికి  చేసినం. ఇగ మీ బతుకు మీరు బతుకున్రి బిడ్డా. కానీ నీతిగా బతుకున్రి’ అని చెప్పి బాహ్య ప్రపంచంలోకి మమ్మల్ని వదిలారు. ఇప్పుడు, ‘నా బిడ్డ ప్రపంచమంతా తెలుసు. కళకే వన్నె తెచ్చిండు’ అని చెప్పుకునేంత  ఆనందం వాళ్లకు ఇచ్చాను. నా ఎదుగుదలను చూసి ఎక్కువ సంబుర పడేది వాళ్లే. మా నాయిన యక్షగాన కళాకారుడు. ఆయన నుంచే నాకు కళ అబ్బింది. చిన్నప్పట్నుంచి నాన్న ప్రదర్శన చూస్తూ పెరిగాను.  పదో తరగతితోనే చదువు ఆపేసి బర్లు.. గొర్లు మేపాను. నా పని.. నా పల్లె.. నా పరిసరాలే నాలో ఉన్న ఆర్టిస్ట్‌ను నిద్ర లేపాయి. పశువులు మేపడానికి వెళ్లినప్పుడు  నాలో నేనే మాట్లాడుకునేవాడిని. హీరోలా, విలన్‌లా బహుపాత్రాభినయం చేస్తుండేవాడిని. భాగవత పద్యాలు.. శ్లోకాలు పాడేవాడిని. ఇలా నాలో ఒక కళాకారుడు పుట్టుకొచ్చాడు. హైదరాబాద్‌ పోతే ఏదో ఒకటి చేయొచ్చని వచ్చేశా. ఓ హోటల్‌లో క్లీనర్‌గా చేరాను.  హోటల్‌కి రకరకాల మనుషులు వస్తుంటారు కాబట్టి.. వారి ప్రవర్తనను.. మాటతీరును అనుకరించేవాడిని. కొన్ని రోజులకే హోటల్‌లో క్లీనర్‌ నుంచి బిల్‌ రీడర్‌ వరకు వెళ్లాను. ఆ పరిచయాలు లాభం చేశాయి. కస్టమర్లలో వేర్వేరు రాష్ర్టాల వాళ్లుండేవారు. దానివల్ల నాకు కన్నడ, తమిళం, తుళు, లంబాడీ, హిందీ, ఇంగ్లీష్‌, నేపాలీ భాషలు వచ్చాయి. ఐదేండ్లు గడిచాయి. పెద్దగా మార్పేమీ కనిపించలేదు. ఎన్నిరోజులు ఇలా ఉంటాం? అనిపించింది. ఊరికి వెళ్లిపోయాను. రెండ్రోజులు బాగానే ఉన్నా. ఎందుకొచ్చాన్రా అనిపించింది. మల్లా సిటీకి పోతే ఎలా ఉంటుంది అన్న ఆలోచన. ఈసారి పోతే మళ్లీ ఉత్తగా తిరిగిరావొద్దనే సంకల్పం. భార్యను ఒప్పించాను. 

బ్యాక్‌ టు సిటీ. 

ఒకవైపు హోటల్లో చేసుకుంటూనే కోఠిలో ఎఫ్‌ఎం రేడియోలు, మనీపర్స్‌లు అమ్మేవాడిని. వాటితో పూట గడిచేది. హోటల్లో పని చేస్తుండగా ఓ కార్పొరేట్‌ కాలేజీ యానివర్సరీకి ఫుడ్‌ ఆర్డర్‌ వచ్చింది. తీసుకెళ్లా.యాంకర్‌.. ఎక్స్‌ట్రా కరిక్యులమ్‌ యాక్టివిటీస్‌ గురించి మాట్లాడింది. ఎవరికైనా ఆసక్తి ఉంటే రండి.. అని పిలిచింది. స్టూడెంట్స్‌ పర్ఫార్మెన్స్‌ అయిపోయాక.. బతిమిలాడుకొని నేనొక ప్రదర్శన ఇచ్చా. అందరూ ఫిదా అయ్యారు. అదే నన్ను ‘మాటీవీ’ ఆడిషన్స్‌ వరకూ తీసుకెళ్లింది.  రెండు నిమిషాలు మాట్లాడమన్నారు. నాకొచ్చిన కళనంతా రెండు నిమిషాల్లో రకరకాల హావభావాలతో చూపించాను.  రెండు నిమిషాల ప్రదర్శన రెండు గంటలకు పొడిగించారు. చాలా సంతోషం అనిపించింది. నాపై నాకు నమ్మకం కుదిరింది. ఇక మళ్లీ ఖాళీ చేతులతో ఊరికి వెళ్లననే ఆత్మవిశ్వాసం ఏర్పడింది. ఫలితంగా ఓ రియాలిటీ షోకు ఎంపికయ్యాను. కట్‌చేస్తే.. 6టీవీ, 10 టీవీ, టీవీ9లో ఎన్నో కార్యక్రమాలకు ఆఫర్లు వచ్చాయి. అన్నింటిలో మెప్పించాను. టీవీల్లో చేస్తున్నప్పుడు పటాస్‌ షో ఆడిషన్స్‌కి వెళ్లాను. జబర్దస్త్‌ ఫేం వెంకీని పరిచయం చేసుకొన్నా. రోజూ వెంకీ వెంటపడేవాడిని. నా బాధ చూడలేక జబర్దస్త్‌లో అవకాశం కల్పించాడు. లేడీ గెటప్‌. అంతకుముందు టీవీల్లో లేడీగెటప్‌ ద్వారానే మెప్పించాను కాబట్టి, నామోషీగా అనిపించలేదు. తర్వాత చమ్మక్‌చంద్ర, ఆర్పీ దగ్గర పనిచేస్తున్నాను. అలాగే కొమ్రక్కగా కనిపించి అందరికీ రోజూ మంచి ముచ్చట్లు అందిస్తున్నాను.  సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 

జబర్దస్త్‌గానీ.. దండోరాగానీ.. కొమ్రక్క టీవీగానీ ఇలా అన్నింట్లోనూ నేను వేసేవి లేడీ గెటప్సే. ఇది చూసి కొందరు నేను నిజంగానే అమ్మాయిననే అనుకునేవారు. ఇప్పటికీ నన్ను కొమ్రక్కగానే సంబోధిస్తారు. ఎవరూ కొమురం అని పిలవరు. ఇది కొన్నిసార్లు ఇబ్బంది కలిగిస్తుండొచ్చు. కానీ కొమ్రక్క పాత్రకు ఉన్న క్రేజ్‌ ఏంటో తెలుసుకుని చాలా సంతోషం కలుగుతుంది. కొన్నిసార్లు బయట ఈవెంట్స్‌కి వెళ్లినప్పుడు కొందరు నన్ను అమ్మాయి అనుకొని తాకడం.. మీద పడటం వంటి పిచ్చి పనులు చేస్తుంటారు. అలాంటి వాళ్లందరికీ నేను అప్పటికప్పుడు నా పద్ధతిలో సమాధానం ఇచ్చి బుద్ధి చెప్తుంటాను. ఎంత ఎదిగినా ఆ క్రెడిట్‌ అంతా తనకు కళా వారసత్వాన్ని ప్రసాదించిన అమ్మానాన్నలకు.. స్వేచ్ఛగా నా పని చేసుకోనిస్తున్న తన భార్యకే దక్కుతుందని చెప్తున్నాడు కొమురం. వారి చొరవ లేకపోతే తన లైఫ్‌ జర్నీలో సక్సెస్‌ మాట లేనేలేదనేది తన అభిప్రాయం. నిజమే. ఇంట గెలిచి.. రచ్చ గెలవాల్సిందే కదా? 

-దాయి శ్రీశైలం


logo