బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Apr 12, 2020 , 01:38:40

నా దారి.. మూడోదారి!

నా దారి.. మూడోదారి!

ఏదైనా సమస్య వచ్చినప్పుడు... మూడు రకాల పరిష్కారాలు ఉంటాయి. మొదటి పరిష్కారం- నీ దారి. రెండో పరిష్కారం- నా దారి. ఈ రెండు మార్గాల్లోనూ ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడిపోతారు. ‘సెవెన్‌ హ్యాబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫెక్టివ్‌ పీపుల్‌' పుస్తకంతో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన స్టీఫెన్‌ కవే మాత్రం- ఈ రెండూ కాకుండా మూడో ప్రత్యామ్నాయాన్ని చూచిస్తారు తన ‘థర్డ్‌ ఆల్టర్నేటివ్‌' పుస్తకంలో. ఆ పుస్తక సారం సంక్షిప్తంగా...

ఏదో ఓ విషయంలో ఎ- అనే వ్యక్తి, బి- అనే వ్యక్తి గొడవ పడతారు. సహజంగానే ఎ - తాను గెలవాలనుకుంటాడు. బి- కూడా దాదాపుగా ఇదే పద్ధతిలో ఆలోచిస్తాడు. అంటే, ఒకటో పరిష్కారం.. ‘ఎ-గెలుపు’, రెండో పరిష్కారం ‘బి-గెలుపు’! ఇద్దర్లో ఒకరు సంతోషంగా ఇంటికి వెళ్తారు. మరొకరు బాధపడుతూ తిరుగుముఖం పడతారు. ఎప్పుడూ ఇలానే ఎందుకు జరగాలి? ఎ-గెలుపు, బి-గెలుపు& కాకుండా, ఎ,బి-ల గెలుపు సాధ్యం కాదా? అవుతుందనే అంటారు కవే. అదంతా జరగాలంటే& నీ సమస్య+నా సమస్య= మన సమస్య అన్న ఫార్ములాను అనుసరించాలి. 

మనిషి ‘మెంటల్‌ మ్యాపింగ్‌' మీద ఆధారపడతాడు. మనం ఓ సమస్య గురించి ఆలోచించడం మొదలుపెట్టగానే మెదడు ఓ ఊహాచిత్రాన్ని గీసేసుకుంటుంది. ఇదే సమస్య గురించి మన ప్రత్యర్థి కూడా ఓ మెంటల్‌ మ్యాప్‌ గీసుకుంటాడు. అంటే ఓ చిత్రానికి సంబంధించి ఒక ముక్క మన దగ్గర ఉంటే, మరో ముక్క ప్రత్యర్థి దగ్గర ఉంటుంది. రెండు ముక్కల్నీ కలిపితే... సమగ్ర చిత్రం తయారవుతుంది.  స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ ఎంచుకున్నది కూడా మూడో ప్రత్యామ్నాయాన్నే. శత్రువు మీద దాడి చేయడం ఒక మార్గం. మౌనంగా తలవంచుకుని బతకడం రెండో మార్గం. గాంధీజీ రెండూ చేయలేదు. అహింసామార్గమనే... మూడో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నాడు.

మూడో ప్రత్యామ్నాయానికి స్ఫూర్తి ప్రకృతే. ఎర్ర చందనం చెట్టు చాలా ఎత్తుకు పెరుగుతుంది. దీంతో పెనుగాలికి ఇట్టే కూలిపోతుంది. కూలుతూ కూలుతూ పక్కనున్న చెట్టు మీద వాలిపోతుంది. ఆ దెబ్బకు ఇంకోచెట్టూ కూలుతుంది. ఆ రెండింటి దెబ్బకు మూడోది కూడా. ఆ ప్రకారంగా అడవి సర్వనాశనం కావాలి. కానీ అలా ఏం జరగడం లేదు. కారణం... ఎర్రచందనం చెట్లు ఎంచుకున్న మూడో ప్రత్యామ్నాయమే. ఎర్రచందనం చెట్ల వేళ్లు... ఒక దానితో ఒకటి పెనవేసుకుంటాయి. దీంతో మూలాల దగ్గర బలం పెరుగుతుంది. సమష్ఠి శక్తి కారణంగా... ఏ పెనుగాలీ వాటిని ఏమీ చేయలేదు.  

వ్యాపారంలోనూ అంతే. ఏ సంస్థ బోర్డురూమ్‌లో అయినా, అందరూ ఒకేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే... ఆ కంపెనీకి త్వరలోనే కష్టాలు రాబోతున్నట్టు అర్థం. భిన్నాభిప్రాయాలు ఆలోచనా వైవిధ్యానికి సంకేతం. పదిమందీ ఒకేలా ఆలోచిస్తున్నారంటే.. అక్కడ పదిమంది ఉండాల్సిన అవసరమే లేదని అర్థం. ఒకరు సరిపోతారు. ఎటూ మిగిలిన తొమ్మిదిమందీ కార్బన్‌ కాపీలే కదా! 

ఏ సమస్యకూ ‘రాజీ’ అనేది శాశ్వత పరిష్కారం కాదు. రాజీలో ఇద్దరు వ్యక్తులూ ఎంతోకొంత కోల్పోతారు. దీంతో ఇద్దర్లోనూ అసంతృప్తి రాజుకుంటూనే ఉంటుంది. ఏదో ఒకరోజు అది బయటికి వస్తుంది. మళ్లీ గొడవలు మొదలవుతాయి. ఇద్దరిలోనూ ఎక్కువ అసంతృప్తికి లోనైనవారు... అందరికంటే ముందు రాజీ ఫార్ములాను ధిక్కరిస్తారు. 

కుటుంబ సమస్యల పరిష్కారానికి కూడా మూడో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చు. అతనికి శాకాహారం ఇష్టం. ఆమెకు మాంసాహారం ప్రాణం. ఇంట్లో నాన్‌వెజ్‌ వద్దంటాడు అతడు. వండితీరాల్సిందే అంటుంది ఆమె. ఎంతకాలమని ఇలా గొడవపడుతూ కూర్చుంటారు? మూడో ప్రత్యామ్నాయంగా... వారంలో మూడురోజులు శాకాహారం, మూడురోజులు మాంసాహారం వండుకునేలా ఓ తీర్మానానికి రావచ్చు. ఆదివారం మాత్రం.. రెండురకాల విందులూ సిద్ధం చేసుకోవచ్చు. 


logo