గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Apr 12, 2020 , 01:36:02

ది రింగ్‌

ది రింగ్‌

నేను భోజనం చేస్తూంటే, దానికి అడ్డు వచ్చిన అతన్ని తలెత్తి చూసాను. పొడుగ్గా ఉన్న అతని వీపు కొద్దిగా వంగి ఉంది. మద్యనిషేధ సమయంలో కార్టూన్స్‌లోని మొహాలని అతని పొడుగాటి మొహం గుర్తు చేసింది. అతను తన విజిటింగ్‌ కార్డ్‌ని ఇచ్చాడు. పేరు అర్విడ్‌ హెడెన్‌. ఆ పేరు నా జ్ఞాపకాల్లో లీలగా మెదిలింది. 

“కూర్చోండి.”

“థాంక్‌ యు.” చెప్పి అతను నా ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు.

నాతో అతనికి బాగా పరిచయం లేకపోయినా, మేం మాట్లాడుకునేది ఎవరూ వినకూడదు అన్నట్లుగా కుర్చీని నా పక్కకి దగ్గరగా జరుపుకున్నాడు. తర్వాత ముందుకి వంగి చెప్పాడు.

“మీకు పాత వస్తువులంటే ఆసక్తి అనుకుంటాను?”

“లేదు.”

“కాని మీరు రెండు గంటల క్రితం సెల్‌బింజెర్‌ ఆక్షన్‌ హాల్లో ఓ అరుదైన ఉంగరాన్ని కొన్నారు?”

“అవును. ఐతే?” అడిగాను.

“దయచేసి దాన్ని నాకు అమ్ముతారా?” అర్థించాడు.

“నాకు అది కావాలని కోరి కొన్నాను”

“మీకు వెయ్యి డాలర్లు ఇస్తాను. అంటే మీరు కొన్న దాని కన్నా రెట్టింపు.” అతను చెప్పాడు.

“సారీ!”

“ఐదు వేలు?”

“ఊహు” నేను పట్టుదలగా చెప్పాను.

“పది వేలు. అది ఆఖరి మాట. దయచేసి దాన్ని నాకు అమ్మండి” అతను కోరాడు.

“సారీ”

“ఆలోచించండి. ఆ ఉంగరానికి అది చాలా పెద్ద మొత్తం అని మీకు తెలుసు.”

“నేను దాన్ని లాభాన్ని ఆశించి కాక ఇష్టపడి, కావాలని కొన్నాను” మా సంభాషణ ముగిసిందన్నట్లుగా చెప్పి, మళ్ళీ భోజనం చేయడం ఆరంభించాను.

అతను లేచి వెళ్తాడు అనుకున్నాను. కానీ వెళ్ళలేదు. కొద్ది క్షణాలు అలాగే కదలకుండా కూర్చున్నాడు. తర్వాత కుర్చీని నా వైపు ఇంకాస్త జరుపుకుని చెప్పాడు.

“మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అది దురదృష్టపు ఉంగరం. మీరు దాన్ని ధరిస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ మరణం తథ్యం.”

“బెదిరింపా?” నేను అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాను.

“లేదు. లేదు. నన్ను అపార్థం చేసుకోకండి. ఆ ఉంగరం ప్రాణాంతకమైంది. దాన్ని ఎవరు ధరిస్తే వారికి మరణం తప్పదు.”

“చదువుకున్న వాళ్ళల్లో మూఢ నమ్మకాలు ఉండవు.”

“అప్పుడు కామన్‌సెన్స్‌ని ఉపయోగించాలి. మీరు ఎప్పుడైనా అర్విడ్‌ హెడెన్‌ ఆర్కలాజికల్‌ ఎక్స్‌పెడిషన్‌ గురించి విన్నారా? కొన్నేళ్ళ క్రితం ఈజిప్ట్‌లోని నైలునదీ ప్రాంతంలో ఆ బృందం కొన్నిటిని కనుక్కొంది.”

“వినలేదు.”

“నేనా బృందానికి నాయకుడ్ని. అనేకంతో పాటు రామ్‌సేస్‌-2 సమాధిని మేం కనుక్కున్నాం. అందులో నాకా ఉంగరం దొరికింది. దాని వయసు మూడు వేల ఏళ్ళకి పైగా. దాన్ని చాలామంది ఇటీవల ధరించారు. నేనా ఉంగరాన్ని తేకుండా ఉండాల్సింది అని వాళ్ళ గురించి తెలిసాక అనిపిస్తున్నది. దాన్ని మిగిలిన వాటితో పాటుగా బ్రిటీష్‌ మ్యూజియంకి ఇచ్చేసి ఉండాల్సింది. దాని చరిత్ర మీకు చెప్పాలి. రామ్‌సేస్‌-2 తన తమ్ముడ్ని చంపాలని ఆ ఉంగరాన్ని తయారు చేయించాడు. ప్రీస్ట్‌ దాన్ని ధరించిన వారు మరణించే శాపాన్ని పెట్టాడు.”

“అది మీకెలా తెలుసు?” అపనమ్మకంగా నవ్వుతూ అడిగాను.

“పేపరస్‌ కాగితం మీద హైరోగ్లిఫిక్స్‌లో రాసింది చదివితే తెలిసింది. అదీ ఆ సమాధిలోనే ఉంది. కాని ఆ శాపం ఇంతకాలం ఉంటుందని నేను అనుకోలేదు. ఇంటికి తెచ్చాక దాన్ని తొడుక్కుంటే పట్టలేదు. దాంతో నా చెల్లెలు పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చాను” అతని గొంతు గద్గదమైంది.

“ఏమైంది?” అడిగాను.

“ఆ మధ్యాహ్నం వీధిని దాటుతూంటే రోడ్‌మీది వాహనం గుద్ది మరణించింది” చెప్తుంటే అతని కళ్ళు తడయ్యాయి.

“ఆ ఉంగరం మళ్ళీ నా చేతికి వచ్చింది. నా తమ్ముడు దాన్ని అడిగితే నిరాకరించి దాన్ని నా బల్లలోని రహస్య సొరుగులో దాచాను. ఓ రోజు నాకు తెలీకుండా దాన్ని వాడు దొంగిలించాడు. వాడు మరపడవలో వెళ్తుంటే తీవ్రంగా వీచిన గాలికి నీళ్ళల్లో పడి మరణించాడు. చాలామంది గుమిగూడారు. థేమ్స్‌ నదిలోంచి అతని శవాన్ని బయటకి తీసాక నేను మొదటగా గమనించింది, వాడి వేలికి ఉంగరం ఉండటం. నేను దాని గురించి మర్చిపోయాను. ఎవరో దాన్ని దొంగిలించారు. తర్వాత చూస్తే అది మాయమైంది. నేను కొన్ని వారాలు లండన్‌ లోని అన్ని బంగారు తాకట్టు దుకాణాలు తిరుగుతూ ఆ ఉంగరం కోసం వెదికాను. చివరికి ఫొటోలోని ఉంగరాన్ని గుర్తు పట్టిన వైట్‌ ఛాపెల్‌ ఏరియాలోని ఓ దుకాణం యజమాని అది తన దగ్గరకి వచ్చిందని, కాని దాన్ని ఎవరికో అమ్మేసానని చెప్పాడు. ఎవరికి అమ్మాడో వారి చిరునామా అతని దగ్గర లేదు.”

“తర్వాత?” అతను చెప్పేది నేను నమ్మకపోయినా ఆసక్తిగా అడిగాను.

“రోజూ దినపత్రికల్లో ప్రతీ హింసాత్మక మరణవార్తలని, అంటే ప్రమాదకర మరణాలు, ఆత్మహత్యలు, హత్యలు లాంటివన్నీ చదివి వారి బంధువులని కలవసాగాను. చివరకి అది ఓ యువచిత్రకారుడి దగ్గర ఉందని తెలుసుకుని ప్యారిస్‌కి వెళ్ళాను. మిమ్మల్ని హెచ్చరించినట్లుగానే అతన్నీ హెచ్చరించి దాన్ని నాకు అమ్మమని కోరాను. కాని అతను నన్ను నమ్మకపోగా చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. మర్నాడు అతని మరణవార్త దినపత్రికలో చదివాను. ఒంటరిగా అతను లిఫ్ట్‌లో వెళ్తూంటే, అది కూలి మరణించాడు. నేను కొద్దిగా ఆలస్యంగా వెళ్ళడంతో అతని బంధువులు ఆ ఉంగరాన్ని అతని అంత్యక్రియల కోసం అమ్మేసామని చెప్పారు. ఆ తర్వాత చాలా నెలలు దాని ఉనికి నాకు తెలీలేదు.

“యూరప్‌, అమెరికాల్లోని ఆక్షన్‌ హాల్స్‌లో అమ్మకానికున్న కేటలాగ్స్‌ అన్నీ నాకు అందుతూంటాయి. ఇక్కడ న్యూయార్క్‌లోని సెల్‌బింగర్లో దాన్ని ఆక్షన్‌ చేస్తున్నారని తెలిసి వచ్చాను. న్యూయార్క్‌ ట్రాఫిక్‌ గురించి నాకు తెలీకపోవడంతో ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. ఆ సరికి మీరు దాన్ని కొనేసారు. నేను ఆక్షన్‌ హాల్‌నించి మీ పేరు, చిరునామా తీసుకుని, మిమ్మల్ని అనుసరించి విశ్రాంతిగా ఇక్కడ మాట్లాడవచ్చని వచ్చాను.”

అతని ఆవేదన చూస్తే అతను చెప్పేదంతా నిజం అనిపించింది. లేదా అతను గొప్ప నటుడై ఉండాలని కూడా అనిపించింది.

“మిమ్మల్ని నాకా ఉంగరం అమ్మమని బతిమాలుతున్నాను. దాన్ని మీ వేలుకి ఉంచుకున్నా, జేబులో ఉంచుకున్నా సరే, అది మీ ప్రాణాలు తీసి తీరుతుంది. నా పాపానికి నిష్కృతిగా దాన్ని కొని నాశనం చేయాలని చాలా నెలలుగా ప్రయత్నిస్తున్నాను కాని అది నాకు చిక్కడం లేదు.”

“మీరు నన్ను కలిసి హెచ్చరించినందుకు థాంక్స్‌. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. దాన్ని మీకు అమ్మలేను. సారీ అండ్‌ గుడ్‌ బై.”

అతని మొహంలోని ఆవేదన రెట్టింపైంది. చిన్నగా నిట్టూర్చి లేస్తూ చెప్పాడు.

“గుడ్‌ బై. న్యూయార్క్‌లో నేను ఎక్కువ కాలం ఉండను. ఇది నా తాత్కాలిక చిరునామా” ఓ కాగితం నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు.

అతను చెప్పింది నమ్మదగ్గదో, కాదో నిర్ణయించుకోలేకపోయాను.

నేను బయటకి వచ్చేసరికి చీకటిగా ఉండి వర్షం పడుతున్నది. నేను టేక్సీ కోసం చూస్తూ నడవసాగాను. ఆ ఉంగరం ఆధునిక డిజైన్‌లో లేదు కాబట్టే దాన్ని కొన్నాను. ఇరవై రెండు కేరట్ల బంగారమని గ్రహించాను. అకస్మాత్తుగా నా కాలు తడి పేవ్‌మెంట్‌ మీద జారి రోడ్డు మీదకి తూలాను. తక్షణం ఎవరో నా చేతిని పట్టుకుని అవతలికి తోయడంతో ఓ వ్యాన్‌ నన్ను దాటుకుని వెళ్ళింది. నాకు కీచుమన్న బ్రేక్‌ చప్పుడు వినిపించింది. దాని డ్రైవర్‌ వ్యాన్‌ దిగి రోడ్‌మీద పడ్డ నా దగ్గరకి కంగారుగా పరిగెత్తుకు వచ్చి ఆదుర్దాగా అడిగాడు.

“మీకేం కాలేదుగా?”

“లేదు.” 

నేను లేవడానికి అనేక చేతులు సహాయం చేసాయి. అందరికీ థాంక్స్‌ చెప్పి పేవ్‌మెంట్‌ మీద ముందుకి నడిచాను. నాకు అలా జరగడానికి ఆ ఉంగరం ప్రభావం ఏం లేదని, కేవలం తడికి కాళ్ళు జారడం సాధారణంగా జరిగేదని అనుకున్నాను. ఆ ఉంగరం ప్రమాదకరమైందైతే, ఎవరూ నన్ను రక్షించలేరని కూడా నాకు అనిపించింది. అలా ఆలోచిస్తూ ధైర్యం తెచ్చుకుని మా ఇంటి వైపు సాగాను. 

నేను ఆట్టే దూరం వెళ్ళకుండానే కొత్తగా నిర్మించే ఓ బహుళ అంతస్థుల భవంతి పక్క నించి వెళ్తూంటే నాకు పైనించి పెద్ద చప్పుడు వినిపించింది. ఉంగరం గురించే ఆలోచిస్తూండటంతో నేను తక్షణం మెరుపులా వెనక్కి గెంతి, వెనక్కి తిరిగి పరిగెత్తాను. తిరిగి చూస్తే, నేను ఇందాక ఆఖరుగా ఉన్న చోట పైనించి పెద్ద ఇటుకల గోడ భాగం కూలి పేవ్‌మెంట్‌ మీద పడింది.

“రాత్రింబగళ్ళు పనివాళ్ళు దాన్ని నిద్రకి తూగుతూ నిర్మిస్తున్నారు. ఇంక నాణ్యతగా ఎలా నిర్మించగలరు?” ఒకరు నాతో చెప్పారు.

చుట్టు పక్కల వాళ్ళు నా అదృష్టాన్ని అభినందించారు.

కొద్ది నిమిషాల తేడాతో రెండుసార్లు నాకు ప్రాణాంతక ప్రమాదాలు జరగడం కాకతాళీయం కాదు కాబట్టి బాగా డిస్టర్బ్‌ అయ్యాను. ఆ ఉంగరంలోని శాపం నిజంగా నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నదా? లేదా ఆ ఆలోచన నాలో సబ్‌కాన్షస్‌గా ఉండటం వల్ల అలా అనిపిస్తున్నదా? మూఢనమ్మకాలు లేని, ఏదైనా తార్కికంగా ఆలోచించే నేను ఆ రెండు ప్రమాదాలు కాకతాళీయాలుగా కొట్టి పారేసాను. నేనా ఉంగరాన్ని తీసి, ఎందుకైనా మంచిదని షర్ట్‌ జేబులో వేసుకున్నానని చెప్పడానికి సిగ్గు పడను.


ఎవరి ఇల్లయినా, ముఖ్యంగా పడకగది కోటలా భద్రతని ఇస్తుందని ఎక్కడో చదివాను. లేదా విన్నాను. నేను నా అపార్ట్‌మెంట్‌కి వెళ్ళి, నా భార్యని గ్రీట్‌ చేసి చెప్పాను.

“బయట తిన్నాను. అలసిపోయాను. పడుకుంటాను.”

“సరే.”

ఏదో జరిగిందని ఆమె గ్రహించిందని మర్నాడు ఉదయం ఏం జరిగిందని నన్ను ప్రశ్నిస్తుందనీ నాకు తెలుసు. మా ఆవిడకి మూఢనమ్మకాలు ఎక్కువ. విషయం తెలిస్తే తక్షణం ఆ ఉంగరాన్ని టాయ్‌లెట్‌ పేన్‌లో వేసి ఫ్లష్‌ చేస్తుందని కూడా నాకు తెలుసు.

అతను నాకు హిప్నోటిక్‌ సజెషన్‌ లాంటిది చేసాడని, ఫలితంగా ఆ ప్రమాదాలు జరిగాయని నేను శాంతంగా ఆలోచిస్తే తోచింది. అవును. అంతే అయుండచ్చు.

మర్నాడు ఉదయం నేను నిద్ర లేచాక గోడగడియారం వంక చూసాను. అది నా దగ్గరకి వచ్చి పదిహేడు గంటలు దాటింది. ఇంకొక్క ఏడు గంటలే మిగిలింది. ఆ ఏడు గంటలు నేను అప్రమత్తంగా ఉన్నాక నేను అర్విడ్‌ హెడెన్‌ ఇచ్చిన చిరునామాకి వెళ్లి నాకేం కాలేదని చెప్పాలని నిశ్చయించుకున్నాను. ఏడు గంటల పాటు ఇంట్లోంచి బయటకి వెళ్ళకూడదని కూడా నిర్ణయించుకున్నాను.

“సరుకులు తెస్తారా? ముఖ్యంగా కాఫీ, ఉప్పు అయిపొయ్యాయి” మా ఆవిడ మర్నాడు ఉదయం అడిగింది.

“కొద్దిసేపాగి... లేదా జేమ్స్‌ని పంపించు.”

జేమ్స్‌ నా బావమరిది. మా ఇంట్లో ఉంటూ చదువుకునే విద్యార్థి.

“వాడు కాలేజీకి వెళ్ళిపోయాడు” చెప్పింది.

“సరే. నేనే వెళ్ళొస్తాను.” 

“నిన్న రాత్రి సంగతి చెప్పండి. దేనికో మీరు అప్‌సెట్‌ అయినట్లు కనిపించారు” అడిగింది.

ఫోన్‌ మోగింది. కాలేజీ నించి. 

“సారీ! జేమ్స్‌ క్యాంపస్‌లోని ఈతకొలనులో మరణించాడు.”

నేను తృళ్ళిపడ్డాను.

“వెంటనే రండి.” అవతల నించి జేమ్స్‌ మిత్రుడి కంఠం విషాదంగా చెప్పింది.

“వస్తున్నాం.” 

మా ఆవిడకి అది చెప్పగానే నివ్వెరపోయింది. వెంటనే ఏడవసాగింది. నేను ఆమె తల్లిదండ్రులకి ఫోన్‌ చేసి ఆ చావు వార్తని చెప్పాను. వెంటనే బయలుదేరుతున్నామని చెప్పారు.

మేం కార్లో కాలేజీకి వెళ్తూంటే మా ఆవిడ వెక్కుతూ చెప్పింది.

“ఛ! మీ షర్ట్‌ అచ్చొచ్చిందని, పరీక్ష బాగా రాస్తాడని వేసుకెళ్ళమన్నాను. అది దురదృష్టపు చొక్కా అని తెలీదు.”

“షర్ట్‌కి, అతని మరణానికి ఎలాంటి సంబంధం ఉండ...”

ఆ షర్ట్‌ జేబులో గత రాత్రి నేను ఆ ఉంగరాన్ని వేలు నించి తీసి వేసానన్న సంగతి నాకు గుర్తొచ్చింది. కాలేజీకి చేరుకున్నాక వెదికితే జేమ్స్‌ ధరించిన నా చొక్కా జేబులో ఆ ఉంగరం కనిపించింది.

అక్కడి తతంగం ముగిసేలోగా వస్తానని చెప్పి నేను వేగంగా కారులో అర్విడ్‌ హెడెన్‌ బస చేసిన హోటల్‌కి చేరుకున్నాను. అతను అరగంట క్రితమే గది ఖాళీ చేసి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళారని రిసెప్షన్‌లో చెప్పారు. నేను తక్షణం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, లండన్‌ వెళ్ళే విమానం క్యూ దగ్గరకి చేరుకున్నాను. చేతిలో బోర్డింగ్‌ కార్డ్‌తో ఉన్న అర్విడ్‌ నన్ను చూసి నా దగ్గరకి పరిగెత్తుకు వచ్చాడు. నేను మౌనంగా ఆ ఉంగరాన్ని అతని చేతిలో ఉంచాను.

“ఇది ప్రాణాంతక ఉంగరం. మీరు చెప్పింది విశ్వసిస్తున్నాను” చెప్పాను.

అతను నోరు తెరచి ఏదో అడగబోయి తమాయించుకుని మింగేసాడు.

“థాంక్స్‌. మీకు ఎంతివ్వాలి?” అడిగాడు.

తల అడ్డంగా ఊపాను.

అతను వెంటనే బాత్‌రూంలోకి వెళ్ళాడు.

త్వరలోనే అది న్యూయార్క్‌ సీవరేజ్‌లో కలిసిపోతుందని నాకు తెలుసు.

( జె.ఎం. ఫ్రై కథకి స్వేచ్ఛానువాదం) 

మల్లాది వెంకట కృష్ణమూర్తి

తాజావార్తలు


logo