గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Apr 12, 2020 , 01:32:01

రాజ్యాంగం కోసం.. ఓ డిజైనర్‌!

రాజ్యాంగం కోసం.. ఓ డిజైనర్‌!

ఆమె ఒక డిజైనర్‌. కొత్త మోడల్స్‌ ఏంటి? ప్రమోషన్స్‌ ఎలా? ...తదితర   విషయాలే ఆలోచించాలి. కానీ.. వృత్తి కన్నా బాధ్యత గొప్పది అంటూ... పాలిటిక్స్‌పై ప్రాజెక్ట్‌ రూపొందించింది. తన్యా బల్లాల్‌ బెంగళూరుకు చెందిన డిజైనింగ్‌ స్టూడెంట్‌. సృష్టి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ డిజైనింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఫైనలియర్‌ చదువుతున్నది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అంటే ప్రాణం. ఆ రంగంలో రాణించాలనేది లక్ష్యం. అంతకన్నా మించి రాజకీయాల పట్ల ఆసక్తి. 

రాజకీయం అంటే? 

రాజకీయాలు అంటే ఓట్లు కొనుక్కుని గెలిచి, డబ్బు సంపాదించే వ్యాపారం కాదు. సమాజానికి ఏం చేశాం? రాజ్యాంగానికి ఎంత విలువ ఇచ్చాం? అని ఆలోచించే స్వభావం ఆమెది. కాబట్టే, కోర్సులో భాగంగా... ఓ ప్రాజెక్ట్‌గా  పాలిటిక్స్‌నే ఎంచుకుంది. తనకు తెలిసినవాళ్లెవరూ రాజకీయాల్లో లేరు.  తనది రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీయే కాదు. కానీ పాలిటిక్స్‌ అంటే ఇష్టం. వాస్తవానికి ఇష్టం కంటే.. బాధ్యత అంటే బాగుంటుందేమో. నేపథ్యం లేదని ఎవరికి వారు రాజకీయాల గురించి పట్టించుకోకపోవడం వల్లే పాలిటిక్స్‌కు అర్థం మారిపోతుందని తన్యా అభిప్రాయం. 

పొలిటికల్‌ వర్క్‌షాప్స్‌

తన్యా ఆలోచన ఒక్కటే. ఎవరి వృత్తిలో వాళ్లు అద్భుతంగా రాణిస్తుండొచ్చు. కానీ దేశం గురించి పట్టించుకునేది ఎవరు? రాజ్యాంగం గురించి ఆలోచించేది ఎవరు? అందుకే డిజైనింగ్‌ పాఠాలు బట్టీపట్టాల్సిన ఆమె.. లీడర్‌ ఎలా ఉండాలి? ఓటర్లు ఎవర్ని ఎన్నుకోవాలి? అసలు ఓటెందుకు వేయాలి? రాజ్యాంగానికి ఎలా గౌరవం ఇవ్వాలి? అంటూ సరికొత్త పాఠాలు చెప్తున్నది. పాలిటిక్స్‌ గురించి ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ అందరిలో అవగాహన కల్పిస్తున్నది. 

పాఠశాల దశ నుంచే 

రాజనీతి శాస్త్రం.. పౌరశాస్త్రం హైస్కూల్‌ స్థాయిలోనే ఉంటాయి. కానీ మనం వాటిని  పరీక్షల్లో పాస్‌ అవ్వడం కోసమే చదువుతాం. కానీ నిజమైన రాజనీతి శాస్ర్తాన్ని పాఠశాల స్థాయి నుంచీ పిల్లలతో చదివించాలి. అలా చేస్తేనే ఎలాంటి వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవచ్చు? సమాజాభివృద్ధికి వారు ఎంతగా ఉపయోగపడతారనే విషయం తెలుస్తుందని తన వర్క్‌షాప్స్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నది. దీనివల్ల బెదిరింపులనూ ఎదుర్కొంది తన్యా. 

మిచిగాన్‌ సందర్శన 

తన ప్రాజెక్ట్‌లో భాగంగా తన్య మిచిగాన్‌ యూనివర్సిటీని సందర్శించింది. సార్వత్రిక ఎన్నికలు.. విద్యార్థుల పాత్ర.. ఓటర్ల నమోదు.. అభ్యర్థుల అర్హతలు వంటి అంశాలపై  అధ్యయనం చేసింది. అక్కడి రాజకీయ వ్యవస్థను పరిశీలించింది. భారత రాజకీయ వ్యవస్థకు.. అక్కడి వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు గ్రహించిన తన్యా ఒక నివేదిక తయారుచేసింది.  ఆ విశ్లేషణ చూసి పెద్దపెద్ద మేధావులు కూడా ఫిదా అయిపోయారు. 

మార్పు ఎందుకు లేదు? 

మిచిగాన్‌ పర్యటనలో ఉండగానే ఆన్‌లైన్‌ వేదికగా యువతకు ఎన్నికల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తన్యా. విదేశాల్లో ఉన్న భారతీయులు భారత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి? అందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలేంటి? వంటి అంశాలను వారికి చెప్పింది. అదే సమయంలో భారత్‌లో ఉన్న యువతకు కూడా ఇదే సందేశాన్ని ఇచ్చింది. అప్పటివరకు స్పందన బాగానే వచ్చింది. కానీ ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత తన్యా ఓటింగ్‌ సరళిని.. ఎన్నారై ఓటింగ్‌ను.. స్థానిక యువత ఓటింగ్‌ను విశ్లేషించింది. కానీ ఎవరిలోనూ పెద్ద మార్పు కనిపించలేదు. దీంతో నిరాశ చెందింది.

ఆసక్తి ఉండాలి 

ఆర్నెల్ల ప్రాజెక్ట్‌ రూపకల్పనలో భాగంగా ఆమెకు అర్థమైన విషయం ఏమిటంటే... ఇండియాలో 46% యువతకు అసలు పాలిటిక్స్‌పై ఆసక్తే లేదు.  జాబ్‌ పట్ల.. వ్యాపారం పట్ల మాత్రమే మక్కువ. ముందు యువత ఆలోచనల్ని మార్చాలని అనుకుంది. రాజకీయం, డబ్బు  మాత్రమే ఉన్నవాళ్లు నిర్వహించాల్సిన వ్యవహారం కాదనీ.. అది రాజ్యాంగం తెలిసినవాళ్లు చేయాల్సిన పని అని వర్క్‌షాప్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నది. దేశ భవిష్యత్తును మార్చేదే యువత..  అలాంటప్పుడు వారికి రాజకీయాల్లో ఆసక్తి లేకపోవడమేంటి? అన్న చైతన్యం తీసుకొస్తున్నది. రాజకీయాన్ని కాపాడితే.. రాజ్యాంగాన్ని కాపాడినట్లే అనే సోయి యువతలో వచ్చేలా కృషి చేస్తున్నది తన్యా బల్లాల్‌. రాజకీయాలు పెద్దలకేనా? 

 రాజకీయాలు పెద్దల కంటే పిల్లలకే ఎక్కువ తెలియాలి అనేది తన్యా ఉద్దేశం. “నాన్నా ఈ సారి ఎలక్షన్‌లో ఎవరు నిలబడుతున్నారు? ఏ పార్టీ అభ్యర్థికి ఓటేద్దాం?’ అని అడిగాను. ‘ఎందుకు నీకు? రాజకీయాల గురించి నీకు అవసరమా? బుద్ధిగా చదువకొమ్మంటే..  ఏమిటీ ఆలోచనలు?’ అని మా నాన్న తిట్టారు. నాకు ఆశ్చర్యమేసింది. రేపటి పౌరులం కదా మేము?  రాజకీయాలు మేం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు?’ అనిపించింది. ‘చూడండి నాన్నా.. రాజకీయం అనేది ప్రతీ ఒక్కరికీ సంబంధించిన అంశం. అది మన హక్కు. రాజకీయం తెలిస్తేనే కదా మెరుగైన సమాజాన్ని నిర్మించుకునేది’ అని స్థిరంగా చెప్పాను” అంటున్నది తన్యా.  


logo