గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Apr 12, 2020 , 01:25:09

అమాయక చెల్లింపు

అమాయక చెల్లింపు

యాభై రెండు సంవత్సరాల కిందటి ముచ్చట. గప్పటి ఆదిలాబాద్‌ జిల్లాలున్న ఖానాపూర్ల వారంకి రెండు సార్లు అంగల్లు అయితుండే. ఒకటి ఆదివారమైతే రెండోది బుధవారం. ఆదివారమంగడేమో పెద్దది. అందరికి తాతీల్‌ గదా! బగ్గ మంది అమ్మెతందుకు కొనేందుకు అస్తరు. సుట్టు పక్కలూరోల్లు గంపలనిండ కూరగాయలతోటి కోసులకొద్ది నడుసుకుంటా అస్తుండ్రి. బాదనకుర్తి ఉరోళ్లైతే గంగ (గోదావరి నదిని గంగ అంటరు) దాటి అస్తరు. అన్నీ దొరుకుతుండే. కోళ్ళు, రొయ్య పొట్టు, పూసలోళ్ళు, రెడీమేడ్‌ బట్టలు, ప్యాలపుండలు.... చోటా మోటా వ్యాపారపొల్లు కూడ కనవడ్తరు. ఎట్ల వుట్టిందో ఏమో గని అన్ని ఉర్లల్ల ఒక్క అంగడే ఉంటే మా ఊర్లే రెండు. నాలుగు నెల్ల కింద నమస్తే తెలంగాణ పేపరోళ్ళు ఖానాపూర్ల రెండంగళ్లమీద పెద్ద కతనే రాసిండ్రు. ఇంక గట్లనే నడుస్తున్నదని, మరలేదని మంచిగ రాసిండ్రు. నా చిన్నప్పటి కతలు బగ్గ యాదికచ్చినయ్‌. మస్తు ఖుషయ్యింది. అయితె ఒక్కటి ఇప్పటికీ మర్వలేదు. ఇంక యాదికస్తది. గారడాటోని కత. 

ఆయన్ని మంత్రాల బాలయ్య అంటుండ్రి. చెంపలదాకా ఒత్తుగా గుబురు మీసాలు. మంత్రాలు జేస్తడో చెయ్యడో మా పొల్లగాళ్లకు ఏంతెలుసు గని? మా లెక్కంతా ఆయన సూపిచ్చే గారడాట మీదనే. యాడాదికి ఒక నెల అస్తుండెనట. గిట్ల యాడాదంతా ఊళ్ళు తిరుక్కుంటా నాలుగు పైసలు సంపాదించుకొంటుండే. బాలయ్య గారడాటంటే బగ్గమంది జమైతుండ్రి. అక్కడోళ్ళకు అంగడంటే ఒక నుమాయిష్‌ లెక్క. ఒక ఆదివారం నేను మా అన్న ఆ నుమాయిష్‌ సూసుకుంటా అంగళ్ళ తిరుక్కుంటా గారడాట దగ్గరికి చేరినం. మేము మొదటిసారిగా ఆట సూసుడు. 

జనాలని తాను సూపే ఆటదిక్కు మళ్లించేందుకు బాలయ్య పిల్లంగోయితోని పాటవాడుతుండు. బుడ్డర్‌ ఖాన్‌ ఏషంల ఒక పొల్లడు డమరుకం తిప్పుతుండు. రెండుకలిసి పాట అయ్యేటప్పటికి మస్తుమంది జమయ్యిండ్రు.  బాలయ్య పిల్లంగోయి ఊదుకుంటనే ఒక రౌండ్‌ కొట్టి అందర్నీ గుండ్రంగా నిల్చునేటట్టు చేసిండు. బుడ్డర్‌ ఖాన్‌ పొల్లగాళ్లను ముందర  కూసోమన్నడు. మంచిగా గనవడ్తదన్నడు. ఆల్లెనక పెద్దోల్లు నిల్సున్నరు. అల్లాటకు కావల్సినంత జాగ చేసుకున్నరు. నడమల ఒక పెద్ద మ్యాదరి బుట్ట ఉండె. రెండు పావురాలు కనవడుతున్నయ్‌. భూమిలకు కొట్టిన చిన్న సలాకకు ముంగీసను కట్టిండు. అది అటుఇటు తిరంలేకుండా తిరుగుతుంది. కొంచెం దూరంల పాము బుట్ట కూడా మాకు కనవడ్డది. ఇంకేమో సామాను అక్కడున్నది. గిట్ల కొంచెంసేపు నడిసింది. ఆటకు కావల్సిన మంది జమకాంగనే గారడి షురయ్యింది. బాలయ్య బుడ్డర్‌ ఖాన్ని పిలిసిండు. పెద్ద బుట్టలకు దూరుమన్నడు. పొల్లడు సటుక్కన దూరిండు. పోయినవా బిడ్డ అని బాలయ్య అడిగిండు. ఆడు పోయిన అన్నడు. బాలయ్య ఒక రౌండ్‌ గొట్టి బాగ సూడుండ్రి అని బుట్టదిక్కు ఇషార చేసిండు. ఒక పెద్ద చద్దర్ని బుట్టపై కప్పిండు. ఏమైతదో... ఏమైతదో... అందరి మొఖాలల్ల గుబులు కనవడేటట్టు చేసిండు. మంత్రాలు సదివిండు. మల్లోక్క రౌండ్‌ కొట్టిండు. ఒక్కసారే బుట్ట దగ్గరికి ఉరికి లటుక్కన బట్ట దీసి బుట్టను పట్టుకొని అందరికి సూపిచ్చిండు. బుడ్డర్‌ ఖాన్‌ మాయమైండు. సప్పట్లే సప్పట్లు! ఇంకా కొట్టుండ్రి... బాలయ్య సుగ సప్పట్లు కొట్టుకుంటా అందరితోని ఇంకా కొట్టి పిచ్చిండు. బుడ్డర్‌ ఖాన్‌ ఎట్ల మాయమయ్యిండు? యాడికి వొయిండు. అందరూ సోంచుల వడ్డరు.  ఎటు వోకుండ్రి. గిసుంటియి ఇంక బగ్గున్నయ్‌. సూడుండ్రి. ఆఖిర్కి ముంగిస నాగుంబాముల నడుమ పెద్ద జగడముంటది. అందరు అఖిరి దాకా ఉండేట్టు చేసిండు బాలయ్య. 

తెల్ల పావురాలని తీసిండు. ఒక డబ్బల వెట్టిండు. మూతవెట్టి మూసిండు. మంత్రాలు వలికిండు. మూత తీసి ఖాళీ డబ్బని అందరికి ఒక రౌండ్‌ గొట్టి సూపిండు. పావురాలు మాయం. సప్పట్లు... సప్పట్లు... అందరితోని సప్పట్లు బగ్గ సేపు కొట్టిచ్చిండు. మూడు పొడుగ్గున్న కత్తుల్ని సూపించిండు. కోసే కత్తులు గావవి. పొడుగ్గా పట్రీల తీరుగా పత్లగా, మొండిగా ఉన్నయ్‌. గారడాటయట. బాలయ్య నడుమ నిల్సున్నడు. ఒక కత్తి తీసి పొడువు సూపించిండు. నోట్లే వెట్టి, గొంతులకు మెల్లగా నూకిండు. తల పైకెత్తిండు. కత్తి నిల్సున్నది. కత్తి హాండిల్‌ ఊగుతున్నది. నిల్సున్నదగ్గర్నే మెల్లగా గుండ్రంగా తిరిగిండు. సప్పట్లు గొట్టుమని తనే గొట్టి సూపిండు. సప్పట్లే సప్పట్లు. కత్తిని ఇంక కడుపులదాకా మెల్లగా జరిపిండు. హాండిలే నోటి బయట కనవడుతున్నది. మల్ల సప్పట్లు. రెండో కత్తి తీసిండు. మొదటిదాని తీర్గనే దాన్ని కుడ నోట్లే వెట్టుకొని కడుపులదాకా జరుపుకున్నడు. మొదటి హాండిల్‌ పక్కకే రెండో హాండిల్‌. మల్ల సప్పట్లు. మూడో కత్తి తీసిండు. రెండు కత్తుల లెక్కనే నోట్లే వెట్టుకొని కడుపులదాకా, హా... హూ... అనుకుంట నూక్కున్నడు. రెండు హాండిళ్ళ పక్కకే మూడో హాండిల్‌. మూడు హాండిల్లు నోట్లెకెళ్లి మొలిసినట్టు మస్తుగా గనవడుతుండే! బాలయ్య తల పైకే ఉన్నది. కత్తుల్తోని నిటారుగయ్యింది. ఇంక సప్పట్లు గొట్టుండ్రి, గట్టిగా గొట్టుండ్రి గొట్టుండ్రి ఇషార ఇచ్చుకుంట మరో రౌండ్‌ గొట్టిండు. అంగడంతా సప్పట్లే సప్పట్లు. నేను మా అన్న గారడాటని గుడ్లప్పగిచ్చి సూసుకుంటనే ఉన్నం.  ఎట్ల వెట్టుకున్నడో అట్లనే ఒక్కొక్క కత్తిని నోట్లెకెళ్లి మెల్లగ తీసిండు. ఒక్కటి, రెండు, మూడు. అందరి కండ్లు బాలయ్య నోటిమీదనే. అబ్బ... అమ్మయ్య అనుకున్నరు. ఏంగాలేదు గదా బాలయ్యకనుకున్నరు. బాలయ్య వంగిండు. మోకాళ్లమీద చేతులువెట్టుకుని ఉమ్మిండు. మూడుకత్తుల్ని తాకిన ఉమ్మంతా తీగల్లెక్క సాగుకుంటా బయటవడ్డది.  

బుడ్డర్‌ ఖాన్‌ వాపసచ్చిండు. పావురాలుసుగ వాపసచ్చినయ్‌. మూడు గారడాటలు అయిపోయినయ్‌. డ్రామా జేసుడెక్క. సప్పట్లు కొట్టించుడు ఇంకా ఎక్క. గంటకెక్కువే అయ్యింది గారడాట షురు అయ్యి. ఇప్పుడే వోకుండ్రి. ముంగిస పాము జబర్దస్త్‌ పోట్లాట ఉన్నదింకా... పోయేటొళ్ళంతా ఆగిండ్రు. అచ్చినోళ్లను ఆట అఖిరిదాకా ఎట్ల ఉంచుడో బాలయ్యకు బగ్గ ఎరుక. ఎన్నో ఆటలు జేసిండుమరి.  ఇప్పడిదాకా మీరు సూసిన గారడాట మంచిగనిపిస్తే మీరేమన్న ఇయ్యుండ్రి. రూపాయి, ఆఠాణ, చారాణ, పదికొత్తలు... ఇయ్యక వోకుండ్రి.  బుడ్డర్‌ ఖాన్‌ ఒక ప్లేట్‌ వట్టుకొని అందరి దగ్గరకి ఆగుకుంటా మెల్లగా పోవుడు మొదలువెట్టిండు. పైసల్‌ వడుతున్నయ్‌. అల్యూమినియం ప్లేటు పైసల్‌ వడ్డప్పుడల్లా ఠన్‌ ఠన్‌ మని సప్పుడు. 

ఒక రౌండ్‌ పూర్తయ్యింది. ప్లేట్ల మస్తుగనే పైసల్‌ వడ్డయ్‌. ముంగిస స్థిరం లేక తిరుగుతనే ఉన్నది.  నా దగ్గర గాని, మా అన్న దగ్గర ఒక్క కొత్త లేదు. నిక్కర్ల జేబులు ఖాళీ. మేమేం ఇయ్యలేదు మరి.బుడ్డర్‌ ఖాన్‌ ఇంకో రౌండ్‌ గొట్టిండు. మొదటి రౌండ్ల ఇయ్యనోళ్ళు ఏసిండ్రు. బాలయ్యకి తెలిసింది. ఇగ పైసల్‌ వడయని. ఇచ్చినోళ్లకు దండాలు. ఆళ్లకు సప్పట్లు గొట్టుండ్రి. ఇయ్యనోళ్లకు గూడ సప్పట్లు గొట్టుండ్రి. బాలయ్యనే మొదలు గట్టిగా గొట్టుడు మొదలువెట్టిండు. అందరు గొట్టిండ్రు. బాలయ్య అప్పుడు పైసలియ్యనోళ్ళకు మాటలతో మంత్రమేసిండు. గారడాట పుక్యంగ సూసి పైసలియ్యక పోయెటోళ్ళకు కడుపునొప్పి అస్తది. ఈ మాటలినంగనే పైసలియ్యనోళ్ల మొఖాలపై పరేషాన్‌! కడుపునొప్పి ఎంటనే శురయినట్టు మొఖాలు వెట్టిండ్రు. బాలయ్య ఇషారని తెలుసుకొని బుడ్డర్‌ ఖాన్‌ ప్లేటు వట్టుకొని ఇంకొక రౌండ్‌ కొట్టిండు. మల్ల గొన్ని పైసలు వడ్డయ్‌. బాలయ్య మొఖంలో ఖుషీ...ఖుషీ...  నేను మా అన్న ఒకల్ల మొఖాలు ఒకల్లం పరేషన్‌ తోటి సూసుకొన్నమ్‌. ఇద్దరిదగ్గర పైసల్లేవ్‌. బాలయ్య ‘కడుపు నొప్పి’ మాటలు బగ్గ గుర్తుకచ్చినయ్‌. కొన్ని నిమిషాల్లో నొప్పి మొదలైతదేమోనన్న ఫికరు పట్టుకుంది.  బాలయ్య ఆట అయిపోయిందని అన్నడు. ముంగిస అట్లనే తిరుగుతున్నది. పాము బుట్టలో ఉందో లేదో కూడ తెలియదు. దాన్ని సూపనే లేదు. 

నేను, మా అన్న ఇంటికి ఒకటే ఉరుకుడు. దమ్ము దమ్ముతో ఇంటికి చేరుకొన్నం. మమ్మల్ని చూసి మా అమ్మ పరేషాన్‌. ఏమయిందిరా అని అడిగింది. మా అన్న కతంతా చెప్పిండు. మా అమ్మ ఎంబడే ఆఠాణ బిళ్ళ నా చేతిల వెట్టింది. వెనకనుండి మా అన్నగట్టిగా అన్న మాటలు నా చెవుల వడ్డయ్‌ బాలయ్యకు జెప్పు. ఈ ఆఠాణ మనిద్దరి చెరి చారాణ అని. ఆ ఆఠాణ బిళ్లని గట్టిగా వట్టుకొని నేను అంగడికి ఉరుకుడే ఉరుకుడు. బాలయ్య అంగడి నుండి వోకముందే ఆయన చేతిల పెట్టాల గద మరి.  

జీవితంలో ఎన్నో మలుపులుంటాయి. ప్రతీ మలుపు ఒక మరుపురాని యాది. దాని చుట్టూ అల్లుకొని అనేకానేక కథలు.. వ్యథలు.. ప్రకృతితో, పరిస్థితులతో పెనవేసుకున్న మానవ సంబంధాలు ఉంటాయి. ఏమో.. అవన్నీ కథా వస్తువులే కావచ్చు. మనిషి సర్వ సాధారణమైన ఊహలు.. భావనలు.. పరిశీలనలు.. జీవన వైవిధ్యాల చుట్టూ అల్లుకున్న అలాంటి కథలకు ‘బతుకమ్మ’ స్వాగతం పలుకుతున్నది. కథనంలో కొత్తదనం.. సరళత.. సంక్షిప్తత ఉండాలి. చేతిరాత అయితే నాలుగు పేజీలు, డీటీపీ అయితే రెండు పేజీలు మించకూడదు.

మీ కథలు పంపాల్సిన చిరునామా.. 

బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్‌-10, 

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-500034. ఈ-మెయిల్‌: [email protected]

డా. టి. సంపత్‌ కుమార్‌, సెల్‌: 9810402895