మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Apr 12, 2020 , 01:21:59

శునకాల ‘బ్యూటీపార్లర్‌'

శునకాల ‘బ్యూటీపార్లర్‌'

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘శుభ్రత’ మంత్రమే వినిపిస్తున్నది. పెంపుడు జంతువులు, పక్షుల వల్ల కూడా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందనే వదంతు ఉండనే ఉంది. ఇందులోనిజం లేకపోయినా మన పెంపుడు జంతువులను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. ‘అబ్బా! వాటికి స్నానం చేయించడం  పే.. ద్ద పని. అంత తీరిక ఎక్కడిది?’ అంటారా! అందుకే మీకోసం వచ్చేసింది పెట్‌గల్లీ- గ్రూమింగ్‌ ఆన్‌ వీల్స్‌.  ఇక మీరు బేఫికర్‌గా ఉండవచ్చు. అదెలా? అంటారా, అయితే చదవండి.   

హిమగౌరికి పెంపుడు జంతువుల గురించి తెలుసు. వాటిని సంరక్షించడంలో ఇబ్బందులనూ చూసింది. వాటి  గ్రూమింగ్‌  విషయంలో యజమానులు పడుతున్న ఇబ్బందుల గురించీ విన్నది. ఇలాంటి సమస్యలు పరిష్కరించేందుకు ‘నేనేమైనా చేయగలనా?’ అనుకున్నది. అప్పుడే, ఒక ఐడియా వచ్చింది. ‘ఆ పనులన్నీ నేనే చేస్తే.. చేయిస్తే..’  ఆ ఐడియా క్రమంగా బిజినెస్‌ ప్లాన్‌గా రూపుదిద్దుకుంది. దాన్ని ముందేసుకుంటే, స్టార్టప్‌ మొదలు పెట్టగలననే ధైర్యం కలిగింది. పేరూ ఖరారైంది - పెట్‌గల్లీ.. టాగ్‌లైన్‌ః గ్రూమింగ్‌ ఆన్‌ వీల్స్‌. ఇందుకోసం తన ప్రయివేటు ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. భర్త దీపక్‌కుమార్‌తో కలిసి ‘పెట్‌గల్లీ’ ప్రారంభించింది. 

ఏమిటీ పెట్‌గల్లీ: పెంపుడు జంతువులను చాలామంది ఇష్టపడతారు. కానీ వాటికి స్నానం చేయించడం, జుట్టు పెరిగితే కత్తిరించడం.. మొదలైన పనులు మాత్రం చేయాలనుకోరు. చేయాలని ఉన్నా తీరిక ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి సేవలు అందించేందుకు పెట్‌గల్లీ రూపుదిద్దుకున్నది. యాప్‌లో గానీ, వెబ్‌సైట్‌ ద్వారా గానీ స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారి ఇంటి ముందుకి పెట్‌గల్లీ వ్యాన్‌ వస్తుంది. అందులో పెంపుడు జంతువుల సంరక్షణకు సంబంధించిన అన్ని వసతులూ ఉంటాయి. మీ ఇంటి వద్దే మీ టామీనో, రాణీనో శుభ్రంగా తయారుచేసి వెళ్తారు పెట్‌గల్లీ సిబ్బంది. శునక జాతిని బట్టి, సేవల్ని బట్టి ఫీజు వసూలు చేస్తారు? 

ఏమేం చేస్తారు: పెట్‌గల్లీ వ్యాన్‌లోనే అన్ని సదుపాయలు ఉంటాయి. పెట్‌ కేరింగ్‌లో శిక్షణ పొందిన వ్యక్తి కూడా వెంటవస్తాడు. ఇతడు పప్పీకి స్నానం చేయించడమే కాకుండా& గోర్లు తీయడం, జుట్టు కత్తిరించడం, పండ్లు శుభ్రం చేయడం, ముక్కులో, చెవుల్లో డ్రాప్స్‌ వేయడం.. ఇలాంటి పనులన్నీ చేస్తాడు. 

ఎలా నడుస్తున్నది: హైదరాబాద్‌లో ఇలాంటి సేవలు అందించే స్టార్టప్‌లు పెద్దగా లేవు. సో.. పెట్‌గల్లీ బాగానే నడుస్తున్నది. మొదట్లో రోజూ ఒక్క ఆర్డర్‌ కూడా వచ్చేదికాదు. మూడు నెలలు ఓపికతో ఎదురు చూసింది హిమగౌరి. ఏ స్టార్టప్‌లో అయినా రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు కదా! ఎదురు చూడాలి. ప్రచారం చేయాలి. గౌరి అదే పని చేసింది. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పెటగల్లీ వ్యాన్‌ నగరమంతా బిజీ బిజీగా తిరుగుతున్నది. ఇప్పటివరకు వేల సంఖ్యలో పెట్స్‌కు సేవలను అందించింది.  

డే కేర్‌ సెంటర్లు కూడా

మా సిబ్బంది సుశిక్షితులు. నైపుణ్యం ఉన్నవాళ్లు. అన్ని జాతుల కుక్కల్నీ సులభంగా హ్యాండిల్‌ చేస్తారు. అన్ని పనులూ చేయగరు. భార్యాభర్తలు... ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునే కుటుంబాల్లో పెంపుడు జంతువుల సంరక్షణ ఓ పెద్ద సమస్య. కాబట్టే, పెట్స్‌ కోసం డే కేర్‌ సెంటర్లు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. మా సేవల్ని ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు కూడా విస్తరించాలని అనుకుంటున్నాం.   

- హిమగౌరి, పెట్‌గల్లీ వ్యవస్థాపకురాలు-పడమటింటి రవికుమార్‌

-చిన్నయాదగిరిగౌడ్‌


logo