గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Apr 12, 2020 , 01:20:00

తొలి తెలుగు కంద పద్యాల జినవల్లభుడు

తొలి తెలుగు కంద పద్యాల జినవల్లభుడు

సకల కళా ప్రవీణుడు.. భవ్య రత్నాకరుడు.. గుణ పక్షపాతి.. వాగ్వధూవర వల్లభుడు.. చతుర కవిత్వ రచనా సిద్ధుడు.. బహుకావ్య నిర్మాత,.. కవితాతత్త శోధకుడు.. శ్రావ్య గాయకుడు.. సంగీత శాస్త్రజ్ఞుడు.. జినవల్లభుడు. తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా తెచ్చి పెట్టిన తొలి కంద పద్యాలు రాసిన కవి జినవల్లభుడు చిరస్మరణీయుడు. 

దక్షిణ భారతదేశాన్ని క్రీ.శ. 6-12 శతాబ్దాల మధ్య చాళుక్య రాజులు పరిపాలించారు. వీరిలో వినయాదిత్య యుద్ధమల్లుడు వేములవాడ చాళుక్య రాజ్యాన్ని క్రీ.శ. 750లో స్థాపించి రాష్ట్రకూటులకు సామంతునిగా పాలించాడు. వినయాదిత్యుని తర్వాత అతని వారసులు క్రీ.శ. 973 వరకు రాజ్యపాలన చేశారు. వీరు మొదట బోధన్‌ను, తర్వాత వేములవాడను రాజధానిగా చేసుకుని సపాదలక్ష  (నేటి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల ప్రాంతం) రాజ్యం చేశారు. గోదావరి నదికి దక్షిణానగల మంజీరా నది నుంచి కాళేశ్వరం వరకు వ్యాపించి ఉన్న భూభాగాన్నే పోదనపాడు అంటారు. దీనినే సపాదలక్ష దేశం అని కూడా అనేవారు. 

సుమారు రెండు శతాబ్దాల పాటు పాలన చేసిన వేములవాడ చాళుక్యుల్లో రెండో అరికేసరి (క్రీ.శ. 930 నుంచి 955) ఒకడు. వేములవాడ రాజధానిగా పాలించిన ఇతడు రాజనీతిజుడు, విద్యావిశారదుడు, కవిపండిత పోషకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన ఆస్థానంలోని పంప మహాకవి, కన్నడ కవిత్రయంలో ఒకడు. రెండో అరికేసరిని అర్జునుడితో పోలుస్తూ.. పంపకవి రాసిన విక్రమార్జున విజయం.. ‘పంప మహాభారతం’గా ప్రసిద్ధి చెందింది. ఈ పంప మహాకవి తమ్ముడే జినవల్లభుడు. జైనమతాభివృద్ధి కోసం విశేష కృషి చేసిన ఈ జినవల్లభుడు ఆదికవిగా చెప్పుకొంటున్న నన్నయ్యకు అన్నయ్యలాంటివాడు. 

కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో వృషభగిరి ఉంది. బొమ్మలమ్మ గుట్ట అనే ఈ గిరిపై జినవల్లభుడు ఒక శాసనం చెక్కించాడు. ఈ గుట్ట గుండ్లపై వృషభనాధుడి పాదముద్రలు, భరతుడు, బాహుబలి, దిగంబర విగ్రహాలు, ఇద్దరు చెలికత్తెలతో పాటు ఆరుగురు అంగరక్షకులతో కొలువు దీరిన యక్షిణి విగ్రహాలు చెక్కి ఉన్నాయి. ఇవి తెలంగాణ  విశిష్ఠ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకలు. వీటి కింద 20 అడుగుల వెడల్పుతో, పదకొండు వరుసల త్రిభాషా (తెలుగు, కన్నడ, సంస్కృత) శాసనం ఉంది. ఇందులో 3 సంస్కృత పద్యాలు, 6 కన్నడ వృత్తాలు, 3 తెలుగు కంద పద్యాలు చెక్కి ఉన్నాయి. ఈ శాసనం తెలుగు భాష పరిపక్వతను, లిపి పరిణామక్రమాన్ని తెలియజేస్తున్నది. జినవల్లభుని బహుభాషాభిమానం, ఛందోబద్ధమైన భాషాపటిమ, యతిప్రాస నియమాలను బట్టి వెయ్యేండ్ల క్రితమే తెలుగు భాష ఎంత పరిణతి చెందిందో ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది. ఈ మూడు తెలుగు కందపద్యాలు చెక్కు చెదరని చరిత్రకు సాక్ష్యాలే కాదు, తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి బండ గుద్దిన ఆధారాలు. నన్నయ్య (క్రీ.శ. 1051)కు వందేళ్ల ముందే ఇక్కడ తెలుగులో సాహిత్యం వచ్చిందనటానికి ఆధారంగా ఈ శాసనాన్ని చూపొచ్చు. ఈ శాసనంలో జినవల్లభుని వంశవృక్షం, సోదరుడైన పంప మహాకవికి రెండో అరికేసరి ధర్మపురం అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చిన విషయం, పంపకవి అరికేసరిని కీర్తిస్తూ రాసిన విక్రమార్జున విజయం ప్రస్తావనలు ఉన్నాయి.

క్రీ.శ. 945లో జినవల్లభుడు కురిక్యాల శాసనాన్ని వేయించాడు. 1195లో కరీంనగర్‌ జిల్లాకు చెందిన సుప్రసిద్ధ కవి, డాక్టర్‌ మలయశ్రీ రచించిన పరిశోధనాత్మక గ్రంథం ‘కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర’ ద్వారా బొమ్మలమ్మ గుట్టపై ఉన్న త్రిభాషా శాసనం గురించి విస్తృతమైన, వివరణాత్మక సాహిత్య విశేషాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత ఈ శాసనాన్ని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ బిరుదురాజు రామరాజు గుర్తించారు. ప్రభుత్వ పురావస్తు శాఖాధికారి డాక్టర్‌ నేలటూరి వెంకటరమణయ్య శాసన లిపిని పరిష్కరించారు. ఈ పరిశోధనలతో ఇవి తెలుగు భాషలోనే మొట్టమొదటి కంద పద్యాలు అని ప్రపంచానికి తెలిసింది. ఆ తరువాతి కాలంలో తమిళంలాగే తెలుగుకూ ప్రాచీన భాష హోదా కల్పించాలనే ఉద్యమం బయలుదేరింది. అంతకుముందు రాష్ట్ర సర్కారు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా సరైన ఆధారాల్లేక కేంద్ర ప్రభుత్వం ససేమిరా అన్నది. అలాంటి సమయంలో బొమ్మలమ్మ గుట్టపై ఉన్న కందపద్యాలు కీలకమయ్యాయి. చివరికి వీటి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పించింది. 

జినవల్లభునికి వాచకా భరణుడు అనే బిరుదు కూడా ఉన్నట్లు మల్లియ రేచన చెప్పాడు. జినవల్లభుడు మహావీరస్వామి స్తోత్రం అనే మరో సంస్కృత రచన కూడా చేశాడు. జినవల్లభుడు బొమ్మలమ్మగుట్ట సమీపంలో త్రిభువన తిలకం అనే జైన భసది, మదన విలాసం అనే తోట, కవిత గుణ వర్ణవము అనే పేరుతో చెరువును తవ్వించాడు. వేములవాడ చాళుక్యుల కాలంలో బొమ్మలమ్మ గుట్ట ఒక పెద్ద జైనమత విద్యా, సాహిత్య క్షేత్రంగా వెలుగొందింది. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా, నిత్యాన్నదానాలతో, సాహితీ చర్చాగోష్ఠులతో వెలుగొందింది. మూడు (సంస్కృతం, కన్నడం, తెలుగు) ప్రాచీన భాషల సాహిత్య సంగమ ప్రదేశంగా పేరొందినది. 


logo