సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Apr 12, 2020 , 00:36:18

వాస్తు

వాస్తు

వాస్తు చెప్పే వాళ్లే ఆస్తులు లేకుండా తిరుగుతుంటారు. వాళ్లు చెప్పినట్టు చేస్తే మార్పులు వస్తాయా?-అనంతకృష్ణ, మల్యాల

ఇది కాస్త గిల్లినట్లుగా ఉండే ప్రశ్నే. అయినా శాస్త్రం ఈ విషయాన్ని మినహాయించలేదు. నిజానికి శాస్త్రం చెప్పేవారు దరిద్రులుగా ఉండరాదు. అలాగని కోటీశ్వరులు కానక్కర్లేదు. శాంత చిత్తులై జీవించే వారుగా ఉండాలి. అంటే డాక్టర్లకు చర్మవ్యాధి ఉండి తాను చర్మరోగాలు తగ్గిస్తా అని బోర్డు పెట్టుకుంటే ఎవరువస్తారు? అలా శాస్త్రవేత్త ఎవరైనా ఉండవద్దు. తాను ఆపాదించుకొని ఆ ఫలితాలు పొందుతూ చెప్పడం రాణిస్తుంది శోభిస్తుంది. జీవితం విలువ డబ్బుకాదు. సుఖాన్ని, దుఃఖాన్ని సమంగా స్వీకరించగలిగే అద్భుత జ్ఞానం. అది డబ్బుతోనో, అధికారంతోనో రాదు. వివేకంతో వస్తుంది. ఆవివేక బీజం శాస్త్రగృహంలో లభిస్తుంది. అది శాస్త్రవేత్త తప్పక పొంది ఉంటాడు. లేకపోతే ఇతరులకు న్యాయం చేయలేడు. అయితే ఎవరికర్మ ఫలాలు వారు తప్పక అనుభవిస్తారు. కానీ వాటి తీవ్ర ఫలితాలు వారిని బాధించవు. గృహ శాస్త్రం మనుషులను డబ్బులతో ముంచెత్తుతుంది అనుకోవడం మూర్ఖత్వం. శాస్త్ర గృహం శాంతిని, తృప్తిని ఇస్తుంది. అదే నిజమైన సంపద.

పడమర భాగం అంతా బెడ్‌రూము చేసుకున్నాము. దానికి బాల్కనీ ఎటువైపు ఇవ్వాలి?-మహ్మద్‌ అబ్జల్‌, చంపాపేట్‌

ఈ మధ్య అందరూ పడకగదులకు బాల్కనీలు పెడుతున్నారు. నైరుతి గదిని పడకగదిగా వాడటం గొప్ప విషయమే. కానీ దానికి బాల్కనీ పెట్టడం మాత్రం తప్పు అంటే, ఆ బాల్కనీలోని ద్వారం ఇవ్వడం దోషం అవుతుంది. పడమర భాగమంతా బెడ్‌రూము చేసుకున్నప్పుడు బెడ్‌రూము పడమర కొలతలో మూడవ భాగం అంటే బెడ్‌రూము సైజు మందంలో ఆ పడక గదికి వాయవ్యం బాల్కనీ ఇచ్చుకొని దానిలోకి తలుపు పెట్టుకోవాలి. మొత్తంగా చూస్తే ఇంటి పడమర వాయవ్యంలో బాల్కనీ రావాలి, అంతే తప్ప సగభాగం నుండి బాల్కనీలోకి ద్వారం పెట్టకూడదు. అంటే నేరుగా పడక గదినుండి ద్వారం రావద్దు. అది నైరుతి ద్వారం అవుతుంది. ఇది కూడా పడమర అంతా బెడ్‌రూము చేసుకొని దానిలోపల పడకగది వేరుగా చేసి డ్రెస్సింగ్‌ సెపరేటుగా అమర్చి అందులోనుండి ద్వారం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇదంతా తెలిసిన వారిచేత ప్రాక్టికల్‌గా గోడలు బాల్కనీ విభాగం చేసుకోవాలి. లేదంటే లోపంతో కూడిన ఇల్లు అవుతుంది.

తూర్పు సైడు ఎదుటివాళ్ల ఇల్లు ఉంది. మా ఇంటికి తూర్పు కాంపౌండు కట్టాలా? అవసరం లేదా?-సీతామహాలక్ష్మి, మాదన్నపేట

మీ ఇంటికి పడమర వీధి వచ్చినప్పుడు మీకు తూర్పులో పొరుగువాళ్ల ఇల్లు ఉంటుంది. అంతేకాదు ఒకే వీధి ఉంది కాబట్టి పడమర తప్ప మూడు వైపులా ఇతరుల ఇండ్లే ఉంటాయి. ఇతరుల ఇండ్లు ఉన్నా వాళ్ల కాంపౌండ్లు ఉన్నా మనం కట్టే ఇంటికి చుట్టూ ప్రహరీ కట్టాలా వద్దా అనేది మీ సందేహం. ఎవరి ప్యాంటు వాళ్లు వేసుకోవాలి అన్నట్టు ఎవరి ఇంటి ప్రహరీ వాళ్లు తప్పక కట్టుకోవాలి. మన గృహం హద్దు మన ఇంటికే పనిచేస్తుంది. అది మన కొలతలతో మనం నిర్దేశించే ఎత్తు మందం ఎలివేషన్‌తో కూడుకొని ఉంటుంది. ప్రధానంగా మన ఇంటికి కట్టే ప్రహరీ పునాది మనదే అవుతుంది. ఇతరుల పునాదులు మనకోసం కట్టినవి కాదు కదా! కాబట్టి మీ గృహం ప్రహరీ అది ఎటువైపు అయినా మీదే. మీకు నాలుగు దిక్కులను స్ధిరపరుస్తూ తొంబై డిగ్రీలకు (మెట్నకు) కట్టుకోండి. ఇతరులవి, పక్కనే ఉన్నా అవి మీవి కావు మీది మీకే బలం ఇస్తుంది.

వాటర్‌ ట్యాంక్‌ ఇంటి గోడ కింద వస్తుంది. అలా రావచ్చా? అది ఈశాన్యమే?-వి.శ్రీరామ్‌, వనస్థలిపురం

నీళ్ల సంపు సహజంగా గోడల కిందకు రాదు. బహుశా మీరు నీటి సంపు మీదకు గదిని జరుపుతున్నారు. చాలా ఇండ్లల్లో ఇంటికి ఈశాన్యమే అని స్లాబ్‌ కింద ఈశాన్యంలో నీళ్ల సంపు కడతారు. కానీ దానిని పార్కింగ్‌ ప్లేస్‌గా వదులుతారు. సహజంగా ఈ విధానం విల్లాస్‌లలో చేస్తుంటారు. అవసరం కోసమో వాస్తు కోసమో ఈశాన్యం గది వేసినప్పుడు అది ఇంటిలోనికి వస్తుంది. అలా రావడం మంచిది కాదు. ముందు మీరు మీ సంపును ఇంటి పరిధి నుండి బయటకు తీసుకొనిపోండి. ఇంటి ఆవరణ బయట, ప్రహరీ ఆవరణంలో ఇంటి సింహద్వారం పడని ప్లేస్‌ ఏర్పాటు చేసి దానిని నీటిసంపుగా వాడుకోండి. మీరు చెప్పినట్టు ఈశాన్యం అయినా నీటి సంపుమీద ఇంటి గోడ రావద్దు. గోడ జరుపలేము కాబట్టి కొత్త నీటి సంపు బయట కట్టుకోండి. ఉన్నదానిని అడ్జెస్ట్‌ చేయవద్దు.

సుద్దాల సుధాకర్‌ తేజ

[email protected]

Cell: 7993467678


logo