శనివారం 11 జూలై 2020
Sunday - Apr 05, 2020 , 20:44:59

తెలంగాణ పిజ్జా సర్వపిండి!

తెలంగాణ పిజ్జా సర్వపిండి!

ఏ పలారం చేసినా నూనె గుమ్మరించాలి.. కానీ తక్కువ నూనెతో చేసే.. సక్కని వంటకం ఏదంటే..‘సర్వపిండి’ అని ఠక్కున చెబుతారు తెలంగాణవాసులు..చల్లని సాయంత్రాన.. టైంపాస్‌ పలారం సర్వపిండే! అంతా ఇష్టంగా తినే ఈ వంటకాన్ని తెలంగాణ  పిజ్జాగా అభివర్ణించవచ్చు.

 • నల్లగొండలో తపాలాచెక్క, వరంగల్‌లో గిన్నప్ప.. మరికొన్నిచోట్ల సర్వప్ప, గంజుపిండి.. ఇలా వివిధ పేర్లతో సర్వపిండిని పిలుస్తారు. పిలుపు ఏదైనా రుచి ఒక్కటే.
 • వరంగల్‌లో చల్లా అనసూయ అనే ఆవిడ పొద్దుపోక ఏదైనా కొత్తగా చేయాలని అనుకుందట. చినుకులు పడిన సాయంత్రాన ఇంట్లోని బియ్యంపిండితో ఈ సర్వపిండి చేసిందని ఒక కథనం. 
 • తెలంగాణ సంప్రదాయ వంటల్లో సర్వపిండిది ప్రత్యేక స్థానం. సర్వ అంటే.. లోతైన గిన్నె. అందులో పిండి వేసి  తయారు చేస్తారు కాబట్టి, ఈ రెండింటీని కలిపి ఆ పేరు పెట్టినట్టున్నారు పెద్దలు.
 • ఇంగ్లిష్‌లో పాన్‌కేక్‌ తయారీ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. కర్ణాటక వారు చేసే అక్కీరొట్టి కూడా ఇలాంటిదే. కాకపోతే వాళ్లు ఉల్లి ఆకును చేర్చుతారు.
 • పూర్వం ఉదయమే పొలం పనులకు వెళ్లేవాళ్ల్లు  రెండు తపాలా చెక్కలు మూటగట్టుకు వెళ్లేవారు. పచ్చడి, పెరుగు కాంబినేషన్‌లో ఒక్కటి తిన్నా కడుపు నిండిపోతుంది.
 • ఒకప్పుడు బియ్యంపిండితో మాత్రమే సర్వపిండి చేసేవాళ్లు. ఇప్పుడు గోధుమపిండి, రాగుల పిండి... ఇలా చాలా రకాలుగా చేస్తున్నారు.
 •  పల్లీల వల్ల .. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పల్లీల్లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి సెరటోనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దీంతో డిప్రెషన్‌, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. అల్జీమర్స్‌కి కూడా ఇది చక్కని విరుగుడు. 
 • తక్కువ నూనెతో తయారు చేస్తాం కాబట్టి, కొలెస్ట్రాల్‌ సమస్య ఉండదు. పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, బియ్యంపిండి దీని ప్రధాన దినుసులు. ఇవికాకుండా కొందరు నువ్వులు వేస్తారు. కూరగాయలు అంటే.. ఆనపకాయ, క్యారెట్‌, పాలకూర& ఇలా రకరకాల పదార్థాలను కలుపుతారు.
 • రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ తగ్గించే శక్తి కరివేపాకుకు ఉంది. కరివేపాకులో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్ల్లమేటరీ గుణాలు అపారం. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. ఇందులో ఉండే ఇనుము, ఫోలిక్‌ యాసిడ్ల వల్ల రక్తహీనత రాదు. జీర్ణ సమస్యల నుంచి విముక్తి 
 • కలుగుతుంది. 
 • శనగ పప్పులో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది. ఒకటేమిటి, సర్వపిండిలో సర్వపోషకాలూ ఉంటాయి. కాబట్టే సర్వజనులకూ నచ్చింది. 


logo