శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Apr 05, 2020 , 00:52:48

ఊళ్లోనే ఐటీ కంపెనీ!

ఊళ్లోనే ఐటీ కంపెనీ!

ఎక్కడో చదువుకుంటారు. మరెక్కడో ఉద్యోగం చేస్తారు. ఉపాధి కోసం ఖండాంతరాలు పోతారు. ఉన్నతి కోసం ఉన్న ఊరిని, కన్నవారినీ విడిచి వెళ్లక తప్పని పరిస్థితి. కానీ మనసుంటే మార్గముంటది. ఆలోచిస్తే దారి దొరుకుతది. బీటెక్‌ చేసిన ప్రతి ఒక్కరూ నగరాల బాట పట్టడమేనా? ఐటీ కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేయడమేనా? ఊళ్లోనే తామే ఓ ఐటీ కంపెనీ పెట్టొచ్చు కదా? సరిగ్గా అలాగే ఆలోచించారు వాళ్లు. పైసా పెట్టుబడి లేకుండా చిన్న స్టార్టప్‌ ప్రారంభించారు. తాము ఉపాధి పొందుతున్నారు. తమలాంటి  ఎందరికో ఉపాధినిస్తున్నారు.

‘మంచిర్యాలలో ఐటీ కంపెనీ పెడతావా? పిచ్చి పట్టిందా నీకు? ఐటీ అంటేనే హైదరాబాద్‌. అక్కడ పెడితేనే క్రేజ్‌, బిజినెస్‌. నీలాంటోళ్లు వందల మంది హైదరబాద్‌ల ఉంటరు. నువ్వు కూడా వెళ్లి వాళ్లతో కలిసి నాలుగు డబ్బులు సంపాదించవచ్చు.. ఇది ఎంఎన్‌సీలో మంచి హోదాలో ఉన్న ఓ మిత్రుడి సలహా.

‘కంపెనీ పెట్టాలనుకుంటున్నాం. కానీ డబ్బులు సంపాదించడానికి మాత్రమే కాదు. మా లక్ష్యాలు వేరు. మంచిర్యాలలో కంపెనీ ఎందుకు పెట్టకూడదు? ఉద్యోగం కావాలంటూ జనం హైదరాబాద్‌ నుంచి వచ్చేలా చేస్తాను చూడ్రా..’ 

‘పోపోవోయ్‌.. నీలాంటోళ్లను వందలమందిని చూశాం’. ఇది 2016 నాటి ముచ్చట. నాలుగేళ్లు గడిచాయి. అలా నిరుత్సాహపర్చిన వ్యక్తి ఉద్యోగం ఊస్ట్‌. ‘ఏదైనా ఉద్యోగముంటే చూడ్రా.. ఊళ్లోనే హ్యాపీగా చేసుకుంటా’ అని మిత్రునికి ఫోన్‌ కాల్‌.  

డబ్బే ముఖ్యం కాదు: డబ్బు సంపాదించడమే ముఖ్యమైతే అనేక మార్గాలున్నాయి. కానీ ఆ స్నేహితులకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. ‘గ్రామీణ యువతకు అవగాహన కల్పించాలి. జిల్లా కేంద్రాల్లో, గ్రామాల్లో ఐటీ కంపెనీలు ప్రారంభించాలి. ఇక్కడి యువతకు ఉపాధినివ్వాలి... ఇలాంటి ఎన్నో ఆలోచనలు అఖిల్‌, శ్రీజను నగరాలకు వెళ్లనివ్వలేదు. ఉన్న ఊళ్లోని ఉపాధిని సృష్టించుకునేలా చేశాయి. మంచిర్యాల జిల్లాకేంద్రంలో 2016 డిసెంబర్‌లో ‘స్విఫ్ట్‌ సేఫ్‌' అనే ఐటీ కంపెనీని ప్రారంభించేలా చేశాయి. ఆ ఒక్క ఐడియా పదిమందికి ఉపాధినిస్తున్నది.

జీరో బడ్జెట్‌: శ్రీజ, అఖిల్‌ మంచిర్యాల సమీపంలోని గర్మిళ్లలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో క్లాస్‌మేట్స్‌. అఖిల్‌ది మంచిర్యాల జిల్లాలోని  భీమారం. శ్రీజది మంచిర్యాల పట్టణం. తమకొచ్చిన ఐడియాను ఆచరణలో పెట్టాలనుకున్నారు. అదీ రూపాయి బడ్జెట్‌ లేకుండానే.. కానీ కంపెనీ పెట్టాలంటే మంచి ఆఫీస్‌, ఆకట్టుకునే ఇంటీరియర్‌, కంప్యూటర్స్‌, సిబ్బంది ఇవన్నీ అవసరం. వాళ్ల ఆలోచన వేరు. ‘జీరో బడ్జెట్‌తో ఇవేవీ లేకుండానూ కంపెనీని ప్రారంభించాలి’. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించారు. ఎవరి ఇంటి దగ్గర వారే పనిచేస్తూ కంపెనీని నడపాలనుకున్నారు. అలా 2016 డిసెంబర్‌లో కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలు ఇంటి వద్దనుంచే మొదలుపెట్టారు. ల్యాప్‌టాప్‌ ద్వారానే పనులు చేసేవారు.ఆర్నెల్ల్లు ఖాళీగానే: స్విఫ్ట్‌ సేఫ్‌  అనేది సైబర్‌ సెక్యురిటీ సొల్యూషన్‌ కంపెనీ. సెక్యురిటీ రిలేటెడ్‌ ప్రాజెక్ట్స్‌ తయారు చేస్తారు. వివిధ కంపెనీల వెబ్‌సైట్స్‌ హ్యాక్‌ అవకుండా చూస్తారు. కంపెనీల డేటా చోరీ కాకుండా తగిన ఏర్పాట్లు   చేస్తారు. సైబర్‌ సెక్యురిటీ రిలేటెడ్‌ యాప్స్‌, వెబ్‌సైట్స్‌ డిజైన్‌ చేస్తారు. కంపెనీని ప్రారంభించిన ఆరు నెలల వరకు ఒక్క ప్రాజెక్ట్‌ కూడా రాలేదు. దీంతో నిరాశలో మునిగిపోయారు. కానీ తాము డబ్బుకోసం కంపెనీని ప్రారంభించలేదనే ఒకే ఒక్క కారణంతో ఆశావాదంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఆర్నెల్ల తర్వాత మొదటిసారిగా ఓ అవకాశం వచ్చింది. 

మొదటి ఛాన్స్‌: స్విఫ్ట్‌సేఫ్‌ కంపెనీ గురించి తెలుసుకున్న ఓ మిత్రుడు తాను చేయబోయే చిరువ్యాపారానికి యాప్‌ తయారు చేయమని కోరాడు. అఖిల్‌, శ్రీజ రెండ్రోజుల వ్యవధిలో ‘Quick Order’ అనే అప్లికేషన్‌ను తయారు చేశారు. స్థానికంగా ఆ యాప్‌కు మంచి పేరు రావడంతో ప్రాజెక్ట్స్‌ పెరిగాయి. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా విదేశాల నుంచి సైతం సైబర్‌ యాప్స్‌ కాంట్రాక్టులు వచ్చాయి. అలా మొదటిసారి 2017లో ఇజ్రాయిల్‌ నుంచి బర్లేవ్‌ అనే పారిశ్రామిక వేత్త తమ సంస్థకు సైబర్‌ సెక్యురిటీ కల్పించాలంటూ స్విఫ్ట్‌సేఫ్‌ను సంప్రదించారు. యాంటీ మొబైల్‌ థెఫ్ట్‌, ఎడ్యుకేషన్‌ యాప్స్‌, హెల్త్‌ యాప్స్‌, వెబ్‌సైట్స్‌ తయారు చేస్తూనే కంపెనీలకు సైబర్‌ సెక్యురిటీని అందిస్తున్నది స్విఫ్ట్‌సేఫ్‌. 13 మంది సిబ్బంది కూడా ఇంటినుంచే పనిచేస్తున్నారు. ఈ సంస్థకు ప్రత్యేకంగా కార్యాలయం అంటూ లేదు.

చైతన్యం కోసం: ‘స్విఫ్ట్‌ సేఫ్‌' సంస్థ నాలుగేళ్లలో 40 మంది క్లయింట్స్‌ను సంపాదించుకున్నది. దేశ, విదేశీ కంపెనీల కస్టమర్లకు సైబర్‌ సెక్యురిటీ అందిస్తున్నది. డబ్బు సంపాదించడమే ప్రధానం కాదనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లోని కళాశాలల్లో సైబర్‌ నేరాలపై చైతన్యం తీసుకొస్తున్నది.మరింత విస్తరిస్తాం..

జీరో బడ్జెట్‌తో కంపెనీని ప్రారంభించాం. ప్రస్తుతం దాదాపు పదిహేను మందికి ఉపాధినిస్తున్నాం. గ్రామీణ యువత బుర్రల్లో ఇన్నోవేటివ్‌ ఐడియాలున్నాయి. కానీ వాటిని ఆచరణలోకి తేవడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించాలి. అలాంటివారికి ఆర్థికంగా సహాయం అందించాలి. ప్రస్తుతం మా సేవల్ని విస్తరించాలనుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న కంపెనీలకు ఏడాది పాటు ఉచితంగా మా సర్వీసులు అందించాలనుకుంటున్నాం. 

- రాపెల్లి అఖిల్‌, ఎథికల్‌ హ్యాకర్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌


-పడమటింటి రవికుమార్‌