సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Apr 05, 2020 , 00:49:13

నా స్వరందేవుడిచ్చిన వరం

నా స్వరందేవుడిచ్చిన వరం

శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని ఓ సామెత. తనను కూడా ఆ శివయ్యే నడిపిస్తున్నాడంటున్నారు జగిత్యాలకు చెందిన భళ్లమూడి రాంప్రసాద్‌ శర్మ. చిన్నతనం నుండీ భజనలు, భక్తి గీతాలు పాడుతూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రాంప్రసాద్‌, గత పదేళ్లుగా ప్రతి శివరాత్రికీ సంగీతంలో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ  లిమ్కాబుక్‌ సహా 20 రికార్డులలో తన పేరు నమోదు చేసుకున్నాడు. గత శివరాత్రికి  ‘శివయ్య స్వరయాత్ర’ పేరుతో రెండున్నర కిలోమీటర్లు మోకాళ్లపై నడుస్తూనే భక్తి గీతాలు ఆలపించి మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు.

భళ్లమూడి రాంప్రసాద్‌శర్మ వృత్తిరీత్యా కామర్స్‌ లెక్చరర్‌. ప్రవృత్తి గేయాలాపన, సాహిత్యసేవ. అయితే, అందరిలా పాడితే ఆయన గురించి అంతగా చెప్పుకోవడానికి  ఏముంటుంది?శివుడిపై తన భక్తిని చాటుకోవడానికి ఆయన ఎంచుకున్న గానం వైవిధ్యమైంది. ప్రతి శివరాత్రికి ఒక్కో ప్రయోగం చేస్తూ జగిత్యాల పట్టణ ప్రజలను భక్తిరసంలో ఓలలాడిస్తున్నారు. బాల్యం నుండే భజన గీతాలు, భక్తి పాటలు పాడటంలో ప్రవేశం ఉన్న రాంప్రసాద్‌ జగిత్యాలలోని పలు దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో పాటలు పాడేవాడు. ఆ స్వర మాధుర్యం తక్కువ సమయంలోనే జిల్లాలో ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టింది. శివరాత్రి, వినాయకచవితి, అయ్యప్ప పడిపూజ తదితర సందర్బాలలో భక్తి కచేరీలు పెట్టించి ప్రోత్సహించారు. అయినా, ఇంకా ఏదో సాధించాలనే పట్టుదల ఆయన పాటల్లో ప్రయోగాల వైపు నడిపించింది.

పదేండ్లుగా ప్రయోగాలు

2010లో తొలిసారి స్వరార్చన  పేరుతో 30 గంటల నిర్విరామ గానంతో గ్లోబల్‌  వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. 2011లో 36 గంటల మహాస్వరార్చనతో ఇండియా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు, 2012లో శివోహం సంగీతంలో అవధాన ప్రక్రియతో ఇండియా బుక్‌లో మరోసారి చోటు దక్కించుకున్నాడు. 2013లో ‘త్రినేత్రం 108’ పేరుతో భక్తి సంగీత స్వరవిన్యాసంతో 108 పాటలు పాడి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. 2014లో తొమ్మిది అడుగుల అగ్ని గుండంలో 27 సార్లు నడిచి మొత్తం 75 అడుగుల్లో 18 భక్తిగీతాలను విరామం లేకుండా ఆలపించి  ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగు, తెలంగాణ బుక్‌  ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. గత ఏడాది  ‘అష్టాదశం సర్వం శివమయం’ పేరుతో ఒక్కో ఆలయం లో 45 నిమిషాల పాటు 24 గంటల్లో 18 ఆలయాల్లో భక్తి సంగీత విభావరి నిర్వహించి ప్రతిష్టాత్మక లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.  ఈ మహాశివరాత్రి పురస్కరించుకుని జగిత్యాలలోని వాణీనగర్‌లోగల ధర్మశాల నుంచి కొత్త బస్టాండ్‌, యావర్‌ రోడ్డు మీదుగా భక్త మార్కండేయ, విశ్వేశ్వర ఆలయాల మీదుగా బ్రాహ్మణ వాడలో ఉన్న శివాలయం వరకు మోకాళ్లపై నడుచుకుంటూ శివయ్య స్వరయాత్ర పేరుతో సాగించిన గాన ప్రస్తానం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

సాహిత్యంలోనూ..

రాంప్రసాద్‌ తను పాడే భక్తి గీతాలను స్వయంగా  రాసుకుంటాడు. భక్తి పాటలే కాకుండా తెలంగాణ సంప్రదాయ పాటలు, సామాజిక గీతాలు రాసి పాడటం ఆయన ప్రత్యేకత. అనేక కవితలు ఆయన కలం నుండి జాలువారాయి. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ‘తెలుగు సౌరభాలు’ పేరుతోప్రత్యేక గీతాలను ఆవిష్కరించారు. ‘నాపాట’,‘సాయి గానామృతం’ పేరుతో పాటల పుస్తకాలు వెలువరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు వేదికలపై ఉద్యమ పాటలు పాడారు. ‘వన్స్‌మోర్‌ ఫ్లీజ్‌', ‘రచ్చబండ’, ‘వాదం-ప్రతివాదం’ వంటి టెలివిజన్‌ కార్యక్రమాల్లోనూ తన ప్రతిభను ప్రదర్శించిన రాంప్రసాద్‌ వచ్చే ఏడు శివరాత్రికి మరో అరుదైన ప్రయోగంతో ముందుకు వస్తానంటున్నాడు.‘ ఈ స్వరం దేవుడిచ్చిన వరం ఆ దేవుడికే అంకితం అంటాడు తను.

ప్రసాద్‌  పాటల్లో కొన్ని చరణాలు...

‘వేదం మా జీవననాదం

అమరం మా ఆత్మనినాదం

ప్రణవం మా ప్రాణదీపం

గలగలగల గోదారి కదిలే సంగీత ఝరి

కలియుగ వైకుంఠపురి లలిత లావణ్యపురి

ధర్మపురి ఇది ధర్మపురి ధర్మపురి 

ఇది ధర్మపురి&. 

అంటూ జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్ర 

మహిమను కీర్తిస్తాడు.


అక్షరమా వందనం తెలుగక్షరమా నీకు వందనం

అక్షరమా వందనం తెలుగక్షరమా 

నీకు వందనం తెలగు మహాసభల సందర్భంగా 

రాసిన తెలుగువెలుగులలో అక్షరం 

అని గొప్పతనాన్ని వర్ణిస్తాడు.

అనురాగానికి అసలు పేరు అమ్మ

మమకారానికి మారుపేరు అమ్మ

త్యాగానికి చిరునామా అమ్మ

స్వార్థమెరుగని రూపము 

అమ్మ-అమ్మ-అమ్మ అమ్మ 

అని మాతృమూర్తి గొప్పతనాన్ని వివరిస్తాడు.


కులము కులమంటారు కులమంటే ఏమిటి సారు

తెలియక నేనడుగుతున్నా తెలిసుంటే 

చెప్పండి మీరు ?

అంటూ కులాన్ని గురించి ధిక్కారంతో

ప్రశ్నిస్తాడు రాంప్రసాద్‌.logo